
"అన్నయ్యా! లక్ష్మి అత్తయ్య గురించి నువ్వు ఎరుగుదువా?"
"నాకు అంతగా తెలీదుగానీ ఏదో మొక్కుకొని చచ్చిపోయిందంటారు. ఆ అత్తయ్యే కదూ?"
"అవును భగవంతుని ప్రార్ధించి కోరి జబ్బు తెచ్చుకొని చచ్చిపోయిన అత్తయ్య! అదృష్ట వంతురాలు!
రాత్రుళ్ళు వాకిట్లో పడుకున్నప్పుడు అత్తయ్య గురించి నాయనమ్మ చెప్తోంటే ఏ రోజు కారోజు కొత్తగా వుండేది. వింటూన్నకొద్దీ ఏమిటో తెలీని ఆవేశం ముంచుకొచ్చేది."
"అత్తయ్య విషయాలు నీకు బాగా తెలుసనుకుంటాను. అత్తవారింట్లో చాలా యాతనలు పడిందట కదూ?"
"అత్తయ్య పడింది యాతన కాదు. నరకం! నాయనమ్మ చెప్తూ చెప్తూ ఆపుకోలేకుండా ఏడి చేది. అప్పుడు నే నెంతో పెద్దదాన్నయినట్టు నాయనమ్మ కళ్ళు తుడుచి ఓదార్చబోయేదాన్ని. నేనంటే నాయనమ్మకి ప్రాణం. అత్తయ్య పోలికలునాకు వచ్చాయనేది. నన్ను చూస్తోంటే అత్తయ్య గుర్తు వస్తోందనేది.
ఒక్కగానొక్క కూతురని అల్లారు ముద్దుగా పెంచి దగ్గర ఊళ్ళో మంచి ఆస్తిపరుల్ని చూసి పెళ్ళి చేశారు. అత్తయ్య అందం గురించి నాయనమ్మ చెప్తోంటే అతిశయోక్తేమో అనిపించేది. ఏది అబద్ధమైనా అత్తయ్య అందం అబద్ధం కాదు. శిరస్సునుంచి కాలి చిటికెనవేలివరకూ మేలిమి బంగారు ఛాయతో, తీర్చిదిద్దిన అంగ సౌష్ఠవంతో, పోతపోసిన విగ్రహంలా మెరిసిపోయే దట. కారు నలుపుగా, దట్టంగా, విశేషంగా ఉండే జుట్టు జడ వేసుకోలేక ముడిపెట్టుకొంటే ఆ ముడి వెనుక భాగమంతా ఆవరించి చంద్రబింబాన్ని కప్పిపెట్టే కారుమేఘాలను జ్ఞప్తి తెచ్చేదట. అతి విశాలమైన ఆ కన్నులు విప్పి చూస్తే పద్మాలు పూర్తిగా వికసించినట్టే భ్రాంతి కొల్పేదట. సహజమైన ఎర్రని పెదవుల పైన తమలపాకుల వర్ణం అంటిందో లేదో అర్ధమయ్యేది కాదట. కాలి గోరుకూడా తామర రేకులా మృదువుగా పరిశుభ్రంగా ప్రకాశించేదట. అత్తయ్య మంచినీళ్ళు తాగితే కంఠంలో కన్పించేవట. ఎదుటివాళ్ళ రూపులన్నీ చెక్కిళ్ళలో ప్రతి బింబించేవట. ఆ సోయగం చూసి చంద్రుడుచిన్నబోయేవాడట, అత్తయ్య అపురూప సౌందర్య ఖని! బంగారువన్నె శరీరానికి ముదురు వర్ణం చీర గోచీ పోసి కట్టి, ముడిలో పూలు ధరించి, హారతి పళ్ళెం చేత పట్టుకొని, ప్రతి ఉదయం గుడికి వెళ్ళి పూజచేసి వస్తూండేదట. సంధ్యా సమయాలలో మధురమైన కంఠం ఎత్తి పురాణ గ్రంథాలు పఠిస్తోంటే వినేవారికి మైమరుపు కలిగేదట.
అత్తయ్య దేవతా స్త్రీ! కాని శాపగ్రస్తురాలు!
అపురూప సౌందర్యవతి! అతి దౌర్భాగ్యురాలు!
అత్తయ్యని భర్త కన్నెత్తి చూడలేదు. అత్తయ్య సౌఖ్యం అంతా వివాహంతో హరించి పోయింది. పెళ్ళికూతురై నరకంలో కాలు పెట్టింది.
మామయ్య లక్షణాలు వేరు. కోరికలు వేరు. వ్యసనాలు వేరు. ఆ విషయం తాతయ్యకు ముందే తెలీదా? అంటే తెలుసు. పూర్తిగా తెలుసు. కానీ ఆ కాలం వేరు. ఆ మనుషులు వేరు. మగవాడికి నిషేధ మనేది లేదు. మగవాడికి అపవిత్రత అంటదు. అందుకే అత్తయ్య ఒక నీతిలేనివాడికి భార్య అయింది.
కానీ మామయ్య వ్యసనంలో ఏకాగ్రత వుంది. అత్తయ్య సౌందర్యం శక్తివిహీనమై పోయింది.
మామయ్య రాత్రి పడేసరికి ఇస్తీ మల్లు పంచె కట్టి, అల్పాకా కోటుపైన జరీ కండువా సర్ది, వాసన నూనె రాసిన గిరజాలు నున్నగా దువ్వి, బుగ్గన సుగంధ భరిత తాంబూలం బిగించి, పదివేళ్ళ ఉంగరాలు నక్షత్రాల్లా మెరిసిపోతోంటే, ధగధగలాడే వెండి బెత్తం ఊగించుకొంటూ, ఇంగ్లీషు చెప్పుల టకటకలమీద రాజఠీవితో నడిచి వెళ్తూవుండేవాడట. ఎక్కడికి? సాని వీధికి మితిమీరిన మోజుతో తన సర్వస్వం అర్పించుకొని సామల సన్నిధికి. ఏ తెల్లవారు ఝాముకో అలంకారాలన్నీ చెదిరిపోగా, సానివాళ్ళు చేతులకు కట్టిన పూలమాలలు నలిగిపోగా, వివిధ రకములైన సువాసనలతో గుబాళిస్తూ, ఇంటికి చేరి ఆరు బయట పరువు వేయించుకొని నిద్రపోయేవాడట.
ఈ దౌర్భాగ్యానికి అత్తయ్య బాధ పడిందో లేదో, అసలేమైనా అనుకొందో లేదో నాయనమ్మకి కూడా అంతు చిక్కలేదు. ఏ క్షణమూ అత్తయ్య వదనంమీద చెదిరిపోని ఆ చిరునవ్వు ఎన్ని వ్యథలనైనా కప్పివేస్తుంది. అత్తయ్య ఏనాడైనా సాహసించి భర్త గదిలోకి వెడితే తిరిగి వచ్చే సరికి మృదువైన చెక్కిళ్ళపైన ఏర్పడే నల్లని చారలు జరిగిన సంఘటన చెప్పక చెప్పేవి. శరీరంలో ప్రవహించే రక్తమంతా కోపగించి బుగ్గలమీది చారలలో గడ్డకట్టి రోజుల తరబడి నిలిచిపోయేది. అదీ దాంపత్య సౌఖ్యం!
ఇక సంసార విషయం. సామాన్యంగా ఆనాడు అత్త ఎదుట కోడలు పులిముందు మేకపిల్ల! కర్కశత్వానికీ, దౌర్జన్యానికీ రూపకల్పన అత్తయ్య అత్తగారే! ఏ పూటా అత్తయ్యకి ఆకలి తీరా అన్నం లేదు. పక్షం రోజులకైనా జుట్టుకు గొరెడు నూనె లేదు. అత్తయ్యకి ఊహ తెలిసిన నాటినుంచీ ప్రాణప్రదమైన దైవప్రార్ధనా, గ్రంథ పఠనమూ మరి ముందుకు సాగలేదు. రోజంతా చాకిరీ! అత్తగారు కల్పించి ఆజ్ఞాపించే అర్ధంలేని వెట్టిచాకిరీ! కొడుకు ఇంటికి వచ్చే సరికి కోడలిమీద ఏదో అభియోగం. ఫలితం దండన. అత్తయ్య బయట చేరిననాడు ఆ పట్టెడన్నానికి కూడా నోచుకోదు. 'ఊళ్ళో కోడళ్ళంతా ముచ్చటగా బిడ్డల్ని కంటూంటే నువ్వు తిని కూర్చుంటావుటే? గొడ్డుముండకి కూడెందుకే?' అని తిట్టిపోసి ఆ రోజు పూర్తిగా పస్తు ఉంచేదట అత్తగారు. ఇంటినిండా ఎన్ని మంచాలు ఉన్నా అత్తయ్య ఎప్పుడూ పడుకోవలసింది నేల మీదే ఎంత లేసి పాలు పెరుగులున్నా అత్తయ్య తాగవలసింది గంజినీళ్ళే!
అత్తయ్యకు ఎవరి ఆదరణా లేదు. ఎవరి ఆప్యాయతా లేదు. అయినా తన కష్ట సుఖాలు ఎన్నడూ కన్నతల్లితో కూడా చెప్పుకోలేదు. ఎవరి ద్వారానైనా కూతురి విషయాలు తెలిసి నప్పుడు నాయనమ్మ సహించలేక ఏడ్చేదట. అత్తయ్యని చూడాలని వాళ్ళ వూరు వెళ్తే బండి దిగీ దిగగానే వియ్యపురాలు రుసరుస లాడుతూ ఎదురుపడి, 'ఏవమ్మా! కూతుర్ని కష్టాలు పెడుతున్నామని చూడటానికి వచ్చావా?'అని నిలదీసి అడిగేదట. నాయనమ్మకు కోపం ముంచుకొచ్చినా ఓర్చుకొని, 'అదేమిటి వదినా! దానికి కష్టా లేమివుంటాయి? ఏదో బిడ్డని చూడాలని మనసైతే..' అని చెప్పబోతూంటే, 'చాల్లే వూరుకోవమ్మా! నువ్వొక్కదానివే కూతుర్ని కన్నావు. అదేం పాలు తాగుతోందా? మాటి మాటికీ పరిగెత్తు కొస్తావు?' అని కసిరికొట్టేదట.
నాయనమ్మ ఏమీ జవాబు చెప్పేది కాదు. చెప్తే సంవత్సరానికోసారైనా కూతుర్ని చూసుకొనే అవకాశం వుండదు. నాయనమ్మ వున్నంత సేపూ వియ్యపురాలు ఆ పరిసరాల్లోనే తారట్లాడేదట. ఇక నాయనమ్మకి ఏమీ మాట్లాడటానికి వీలయ్యేది కాదు. కూతుర్ని కొంతసేపు కళ్ళతో మాత్రం చూసి వెంటనే బండి కట్టించుకొని వచ్చేసేదట. వియ్యపురాలు భోజనాలకు కూడా ఏర్పాటు చేసేది కాదట.
ఏడాది కోసారి ఏ పండుగ సాకుతోనో అత్తయ్యని పుట్టింటికి తీసుకొస్తే తాతయ్యకూ నాయనమ్మకూ ఆ రోజు మహా పర్వదినం.
ఒకనాటి సాయంకాలం తాతయ్య పొలాల మధ్య నడుస్తూండగా కూతుర్ని చూడాలని బుద్ది పుట్టిందట. వెంటనే కండువా దులిపి భుజాన వేసుకొని పొన్నుగర్ర తాటిస్తూ అల్లుడిగారి ఊరివైపు బయల్దేరాడు.
ఇంటి ముందుకు వెళ్ళేసరికి బాగా చీకటి పడింది. అల్లుడుగారు కచేరీ గదిలో మిత్ర బృందంతో ఇష్టాగోష్ఠి జరుపుతున్నాడు. వీధి వాకిట్లో నిలబడివున్న మామగార్ని చూసి కూడా పలకరించలేదు. తాతయ్యకు తలతీసినంత పనైంది. అయినా సంభాళించుకొని అల్లుణ్ణి పేరుపెట్టి పిలిచాడు. అతను బయటికి రాకుండానే, 'ఎవరు నువ్వు?' అన్నాడట. తాతయ్యకు పౌరుషం ముంచుకొచ్చింది. 'నన్ను ఎరగనట్టు నటిస్తున్నావటయ్యా? నేను అగ్రహారం రామయ్యని.'
