18
ప్రేమ వ్రాసిన ఉత్తరం అందిన వెంటనే బయలుదేరాడు గోపాల్. ఉత్తరంలో ఎన్నో క్రొత్త విషయాలు వ్రాసింది ప్రేమ, అన్నింటికన్నా ఆ నీగ్రో పిల్లవాడినీ గూర్చిన విషయాలు తెలిసికోవాలన్న ఆత్రం ఎక్కువైంది.
కొడుకు రాకకు అమితానంద భరితులైపోయారు. ఇక గుంటూరు వాళ్ళు వస్తే ముహూర్తం నిమిషాల్లో కుదర్చవచ్చుననుకున్నారు. గోపాల్ వచ్చీ రాకముందే పెళ్ళి ప్రసక్తి ఎత్తాడు.
అన్ననుచూచి ఏనుగంత బలం వచ్చింది ప్రేమకు.
"ఒక్కగానొక్క ఆడపిల్ల గదా మనకు! గొప్పింటికి వస్తే సుఖపడుతుందని ఆశ. ఆ నిరంజన్ ఎవరో లింగు లింగుమంటూ లెక్చరే నటగా వచ్చే నాలుగురాళ్ళు పది రోజులకు చాలవు. ఎవరైనా ఆఫీసర్నుగా చూచి ఇద్దామని నా ఉద్దేశం" అని తల్లి పట్టుపట్టింది.
"బాగానే వుంది. మరి ప్రేమ అభిప్రాయం అడిగి చూచారా?" అని మందహాసం చేశాడు గోపాల్.
ఆ మందహాసంలో అతడు తల్లి అభిప్రాయాన్ని మందలించినట్టే వున్నది గాని వ్యతిరేకించినట్లు లేదు. అయితే తండ్రికూడా "మీ అమ్మ అభిప్రాయాలతో నేను ఈసారి ఏకీభవిస్తున్నాను" అని చెప్పడంతో ఈ వ్యవహారం పూర్తిగా గోపాల్ నెత్తిమీద పడిపోయింది. ప్రేమ మనస్సు ఆమె అభిరుచి ఆమె సుధాకర్ తో ప్రేమలో పడటం. అతడు తలపెట్టిన అత్యాచారాలు నిరంజన్ ఆమెకు నీడవలె వెన్నంటి కాపాడటం, ఆమె కేమీ అపరచారంజరగకుండా సంరక్షించుకోవడం అన్నీ చెప్పవలసిన బాధ్యత అతనివైపు బడింది. ఆ సంగతులన్నీ చెప్పేముందు నిరంజన్ అంటే తల్లిదండ్రుల కెట్టి అభిప్రాయం వున్నదీ తెలుసుకోవాలి కదా.
"ప్రేమకు మాత్రం పెద్ద ఇంటికి కోడలు కావాలని. సుఖపడాలని ఉండదా?" అన్నది తల్లి.
"ప్రేమకు అంత దురాశ లేదు."
"దురాశ అంటావేమిట్రా - ఆ మాత్రం కోరికలుండవనా నీఅభిప్రాయం" తల్లి విసుక్కుంది.
"నా "అభిప్రాయాలకేం మొచ్చిందిగానీ. ప్రేమ అభిప్రాయం కనుక్కోండి. నిరంజన్ ను చేసుకోవాలనే వుంది ...
"నాకు తెలుసురా - నీ భార్య మాటల్ని పొల్లు పోనివ్వకుండా శిరసావహిస్తానని? ఆ రేవతి అన్నీ మప్పి పంపింది ..... బిడ్డకుముందే నూరి పోసిందేమో అయినా ఒక్కమాటడుగుతాగునీ చెప్పు నిరంజన్ వాళ్ళకు ఏముందని ఇవ్వాలి? తల్లి ఉక్రోషంతో అనేసింది.
పిల్ల నివ్వటానికి పిల్లాడుంటే చాలదూ? ఇంకేం కావాలి"
"లాయర్ ననిపించుకున్నావు లేరా .... మీ అను మాటలకు సూటిగా జవాబు రాదేం" తండ్రి వెటకారంగా అన్నాడు!
"మీకందరికీ అతడంటే చాలా యిష్టమనుకున్నాను."
"ఇప్పటికీ యిష్టమే. బుద్దిమంతుడు వినయవిధేయలతో మితభాషియై అందర్నీ గౌరవించే నిరంజన్ అంటే -నరేంద్ర అంటే మాకెప్పుడూ దురభిప్రాయం లేదు. కానే అల్లుడిగా చేసుకునే తలంపు మాత్రం మాకెప్పుడూ కల్గలేదు?
"ఇక ఆ తలంపుకు చోటిస్తే మంచిది, ఎందుకంటే ప్రేమ నిరంజన్ నే తప్పక చేసుకోవాలి....
"ఆనాడు ఆ కొండల్లో నిరంజన్ లేకపోయినట్లయితే ప్రేమ ఏమైపోయేదో? ప్రేమ క్షేమంగా యిల్లు జేరిందంటే అది నిరంజన్ వల్ల జరిగిన పని.....అతనిపై ఎంతో కృతజ్ఞత కల్గివుంది ప్రేమ. మీరడగటం తడవ ఊ అనటానికి సిద్ధంగా వుంది. ఆమెను నిరాశపర్చకండి....అంతేకాదు అలాంటి అల్లుడు దొరుకుతున్నందుకు మీరు గర్వించవచ్చు.....ప్రేమా ప్రేమా" అంటూ పిల్చాడు.
తల్లి తండ్రీ ముఖంలో కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు. ఆమె ముఖం తెల్లగా పాలిపోయి వుంది, నిరుత్సాహంతో డీలాపడి కూర్చుండిపోయింది. తండ్రి తలపట్టుకుని కూచున్నాడు తడారిన గొంతుకలో గరళం పడ్డట్టు బాధపడసాగాడు.
చాటుగా వీరి సంభాషణ వింటున్న ప్రేమ అన్న పిలుపు నిన్న కొద్ది క్షణాలకు వారి దగ్గరకొచ్చింది.
అతను సూటిగా కూతుర్ని చూచి ప్రశ్నించాడు "ఏం తల్లీ నిరంజన్ ను చేసుకుంటావా? ఏదీ దాచకుండా నీ మనసులో మాట చెప్పమ్మా" "ముందే నాకెందుకు చెప్పలేదమ్మా నీ మాట కాదనేటంత కఠిన హృదయులమా?" ఆమె కంఠం బొంగురుపోయింది.
ప్రేమకు కన్నీరాగలేదు. "మీరంగీ! రించరేమోనని సంకోచించానమ్మా ఏవేవో అనుకుంటున్న మీకు చెప్పటానికి?!"
తల్లి ప్రేమను అక్కున జేర్చుకుంది. "పిచ్చితల్లి నీ సుఖం కోసం నీ సంతోషం కోసమే మా ప్రాకులాట తల్లీ! ప్రేమా నీ యిష్టం వచ్చినట్లే చేస్తామమ్మా.
అనుకున్నంతకంటే మలుపుగానే తల్లిదండ్రుల్ని ముఖ్యమైన విషయంపై ఒప్పించగల్గినా, దాటవలసిన అడ్డంకులు ఎన్నో-
ఆ యింటికి కోడలిగా ప్రేమ వెళ్ళవలసినట్లయితే ఆ నీగ్రో బాలుడి బాధ్యత వారితోబాటుగా ఆమెమీద పడుతుంది. నీగ్రో బాలుణ్ణి పెంచుకుంటున్న యింటికి కోడలుగా వెళ్ళడమనేది చాలా సాహసంతో జరగవలసిన పని.
"ఎవరా పిల్లడు ప్రేమా వీళ్ళెందుకు పెంచుకుంటున్నారు."
"నాకేమి తెలియదన్నయ్యా- వదిననే అడక్కపోయావూ?"
"తోచలేదు.... చివరి నిమిషంలో అడిగాను. కాని చెప్పలేదు. సరే ఇక్కడే నీ ద్వారా. లేదా నిరంజన్ ద్వారా తెలుసుకుందామనుకున్నాను.... అయితే నీకేమీ తెలియదన్నమాట ... ఊ ..." గడ్డాన్ని మునివ్రేళ్ళతో రాచుకుంటూ దీక్షగా ఏదో ఆలోచించాడు. ఏదో మెరుపు మెరిసినట్లు స్ఫురించింది గోపాల్ కు.
"ప్రేమా- త్వరగా తయారుకా సినిమా కెళ్దాం.
"అన్నయ్యా?" అంది ఆశ్చర్యంతో.
"కాదంతే- సరళ దగ్గర కెళ్దాం. ఏమైనా చెప్పగలదు."
ప్రేమ నిమిషంలో తయారై వచ్చింది. కుర్రాడికి చెప్పి ఇద్దరు బైట బడ్డారు.
సరళ ఇంటి కెళ్తే ఆమె అక్కడలేదు!
ఉసూరుమంటూ కొద్ది క్షణాలు అక్కడే నుంచుండిపోయారు.
"లాభంలేదు. ప్రేమా! నువ్వు సీత వాళ్ళింటి కెళ్ళు. నేను నిరంజన్ వాళ్ళింటి కెళ్ళి వస్తాను...
చెల్లిని రిక్షాఎక్కించి గోపాల్ తిన్నగా శ్రీనివాసరావింటి కెళ్ళాడు.
ఇల్లంతా హడావిడిగా వుంది. గుమ్మంలో అడుగుపెట్టగానే సరళ ఎదురొచ్చింది.
"బావగారొచ్చారు. అని లోపల వినబడేట్లు అని. ఇవతలికొచ్చింది.
"రండి. రండి. చాల రోజులైంది అక్కయ్యా. పిల్లలు క్షేమంగా వున్నారా?"
"ఆ అంతా బాగున్నారు..." అంటూ ఇంకా ఏదో చెప్పబోకుండగనే పెద్దవాళ్ళిద్దరు రావటం కుశల ప్రశ్నలు వేయటం జరిగిపోయింది.
"ఏం నాయనా? ఆశ్చర్యంగా వుందా..." అంటూ ఇల్లు కలియజూచారు గోపాల్ నవ్వేది అన్నాడు- 'ఇల్లు మారుతున్న లతా హడావిడిగా వుందే తానూ గొడవ గొడవగా వున్న ఇంట్లోకి చూచాడు.
ఔను...ఇల్లు మారుతున్నాం"
"ఎందుకని- ఇది మీ స్వంత యిల్లుకదా!"
ఆయన తేలికగా నవ్వేశారు. స్వంత ఇల్లేననుకో - నేను- మీ అత్తయ్య మాత్రమే మారుకున్నాం"
గోపాల్ హృదయంలో ఒక్క బాంబు ప్రేలినట్లైంది. ఎందుకు మారుతున్నారు? అబ్బాయిలకు పెళ్ళిళ్ళు కాకముందే వేరు కాపురాలు పెడుతున్నారా? ఎందుకు! నోటి మాటరాక. కంఠంలో గరళందిగబడినట్లు బిత్తరపోయి చూస్తున్నాడు గోపాల్.
సరళ కలకల నవ్వింది బావ ఏదేదో వూహించుకుంటున్నారల్లే వుందే.....నువ్వెప్పుడూ అంతే నాన్నా సరిగ్గా చెప్పరాదూ!" ఆయన తేలికగా నవ్వేరు. "గోపాల్- నీకు తెలిసిందో లేదోగాని మేమొక పిల్లవాడిని పెంచుకోబోతున్నాము ఆ వార్త విని గోపాల్ ఏమంటాడోనని ఆతృతతో ఎదురు చూచాడాయన.
"ఔను - విన్నాను..."
"అంతే కాదు....గీత చెల్లెలు ఓ అమ్మాయుంది. ఆ పిల్లను మా నరేన్ కు చేసుకుంటే బావుంటుందని మా అభిప్రాయం"
"అవును....గీత చెప్పింది"
"కోడళ్ళిద్దరూ వస్తారు. కొన్ని పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని తరువాత రోష్టు పడేకన్నా ముందే మేం వేరుపడితే మంచిదని నిర్ణయించాము" అన్నాడు చిన్నగా నవ్వుతూ నిరంజన్ తండ్రి.
"వాళ్ళెప్పుడో వస్తారు అంత మాత్రానికి మీరిల్లుమారటం దేనికి"
"ఎక్కడికో వేరే చోటికి వెళ్ళటం లేదుగా! మా ఔట్ హౌస్ మా ఇద్దరికీ సరిపోతుంది"
"కొన్నాళ్ళైనా ఉమ్మడిగా వుండొచ్చు కదా? ఇప్పటినించీ ఈ ప్రయత్నాలు దేనికి అయినా మీ కొడుకులు బుద్దిమంతులు. ఆ వచ్చే కోడళ్ళను అదుపులో పెట్టగల శక్తి వారికి ఉండదంటారా?"
"సరిగ్గా చెప్పావ్ నాయనా అత్తగార్ని అదుపులో పెట్టగల శక్తి నాకు మాత్రం లేదు బాబూ నిజం చెప్తున్నాను-" అంటూ ఓరగా భార్య వైపు చూచారు.
ఆమె నిండుగా నవ్వింది.
వారిద్దర్ని చూచి ఆనందిస్తూ తానూ నవ్వేశాడు.
"ఒక యింట్లో వుంటే- ఎన్నో ఇబ్బందులు- ఎన్నో సమస్యలు ఏదో వయసు మీరిన వాళ్ళం- మీ సరదాలు- మీ అలవాట్లు మాకు నచ్చక పోవచ్చు.... మావన్నీ పాతకాలపు అలవాట్లు- మీవన్నీ క్రొత్తవి. మీవి మాకు సరిపడవు. మావి మీకు సరిపడవు.......అంతే కాదు.......మా కుర్రవాళ్ళకు ఏ బాదర బందీ లేనప్పుడే మా సంసారాలు వేరనుకొని ఎవరైనా పిల్లనివ్వటానికి ఇష్టపడుతారు. ... అంతేకాదు. వాళ్ళకు పిల్లలు పుడ్తే ఆ సరదాలు కూడా తీరాలికదా. అందుకని దగ్గరగానే వుంటాము. సమయానికి అవశ్యకత ఏర్పడితే ఒకరికొకరం సాయపడొచ్చు ... ఇలారా గోపాల్..." అంటూ లోపలికి తీసుకెళ్ళాడు.
ఇల్లంతా రెండు భాగాలుగా విభజింపబడినట్లు మధ్యనున్న తలుపులు మూయబడి వున్నాయి. ఒక గదిని వంటిల్లుగా మార్చుతూ చిమ్నీ కడుతున్నారు. మరొకవైపు స్టోర్ రూమ్ ను బాత్ రూమ్ గా మారుస్తూ కుళాయి పెడ్తున్నారు.
"వాటాలు బాగున్నాయి కదూ?
"బాగున్నాయి" ఆయన తలుపులు తెరచి 'పెళ్ళయి' -----వచ్చిన మరుక్షణం ఈ రెండు తలుపులు మూసేస్తే రెండు వేరు వేరు ఇళ్లవుతాయి.
"ఎవరి సంసారం వారిది. ఎవరిగుట్టు వారిది." ఆమె గొణిగింది.
"పద బావా. ఆ ఇల్లుకూడా చూద్దువుగాని"
అవుట్ హౌస్ లో రెండు పెద్ద గదులున్నాయి ప్రక్కగా వంటింటికి బాత్ రూమ్ కు పునాదులు తీస్తున్నారు? ఆ గదుల్లో సామాను కొంత అమర్చి వున్నారు.
ఇల్లంతా ఒకసారి చూచివచ్చి హాల్లో కూర్చున్నారు.
సరళ, కాఫీ, వేయించిన జీడిపప్పు తెచ్చి పెట్టింది? ఉన్నట్లుండి గోపాల్ తినటం ఆపుచేసి మామగారికేసి చూచాడు.
"ప్రేమను నిరంజన్ కివ్వాలని మా కోరిక అన్నాడు- ఆయన తలమీద మంచుముక్కలు వేసినట్లైంది.
"గోపాల్ బాగా ఆలోచించుకునే అంటున్నావా?"
ఔనండీ- బాగానే ఆలోచించాము"
ఆ దంపతుల ఆశ్చర్యాని కంతులేదు. ఒకరినొకరు పరస్పరం చూచుకున్నారు.... ఆయన కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకున్నారు. "మీ అమ్మగారిని నాన్నగారినీ అడిగారా? .... తొందర పడొద్దు గోపాల్. మాకేముంది? ప్రేమ మీ ఇంట ఒక్కగానొక్క బిడ్డ ఎవరైనా సంపన్నుల ఇంట్లో ఇస్తే సుఖపడద్దూ? .....అంతేకాదు గోపాల్....మరొక విషయాన్ని గూర్చి తీవ్రంగా ఆలోచించవలసి వుంటుంది!"
"ఏమిటది?" కాఫీ గటగట త్రాగి ముందుకువంగి కూచున్నాడు.
"అదే....మేము....ఒక నీగ్రోపిల్లాడిని పెంచుకోబోతున్నాము...అది మన సంప్రదాయానికి విరుద్ధమైన పని... కొన్ని కారణాలవల్ల ఆ కుర్రాడిని ఇక్కడ వుంచవలసి వచ్చింది." ఆయన తలపట్టుకుని కూచుండిపోయారు.
"మావయ్యా అంతబాధపడేవారు ఈ పనికెందుకు పూనుకున్నారు? ఆ కుర్రాణ్ణి అక్కడే వుంచి డబ్బు పంపలేక పోయారా? ఈ దేశంలో ఉండ పెరిగినా ఆ పిల్లవాడు ఎన్నో అవమానాలకు లోనుకావలసి వస్తుంది ... ఎలా తెగించారు? మీరు ఎంతో ఆలోచించవలసింది."
"ఆలోచించటానికి టైం లేకపోయింది" ఇప్పుడు మాత్రం మించిపోయిందేముంది? ఎక్కడికైనా పంపండి.
ఆయన ముఖంలో అలముకున్న విషాదచ్చాయలు పటాపంచలైనై. ముఖం గంభీరమైంది ఒక స్థిరనిశ్చయానికి వచ్చినట్లు లేచినుంచున్నారు భార్యవైపు తిరిగి.
"ఏమంటావు.....పంపుదామా" అన్నారు.
వద్దు వద్దు" ఆమె సరళ ఒక్క మాటగా అన్నారు.
"చూచావా బాబూ వద్దంటున్నారు .... ఆలోచించటానికే వీల్లేదు గోపాల్. వాళ్ళమ్మ అడిగింది ఆమె మాటను త్రోసివేయటానికి మాకు చేతకాదు. ఆమె కోర్కె నిరాకరించగల కఠిన హృదయం మాకు లేదు.
"ఎందుకు?" ఆత్రంగా ప్రశ్నించాడు.
"అవును. ఎందుకు?" అని ఆయన గోడవైపు తిరిగి నుంచున్నాడు. మరుక్షణం గదంతా పచార్లు చేయసాగాడు.
ఆయన మనస్సులో నీ జ్ఞాపకాలు ఏ బాంధవ్యాలు, ఏ విధి నిర్వహణ సూత్రాలు తారట్లాడాయో!
* * *
