నాకు కోపం ముంచుకు వచ్చింది. ఇంటికి వచ్చీరాగానే నా చెల్లెలి మీద నాకు ఫిర్యాదు చేస్తాడా?
చాల క్లుప్తంగా అన్నాను : "ఏం చేసింది?"
"చాలా చాలా ఘనకార్యం చేసింది లెండి! అది మీరు విని మెచ్చుకోవటం ఒక్కటే తరువాయి!"
అతని ధోరణికి నాకు అసహ్యం వేసింది.
"దీనికి కళ్ళు పోతే ఆ చాకలి వెధవ కీ పోయాయా? గుడ్డి వెధవలు! నిన్న సాయంత్రమేనండీ, పార్టీకి వేసుకున్నాను సరికొత్త పేంటు. రాగానే విప్పి స్టాండుమీద పడేశాను. మధ్యాహ్నం నిద్ర లేచి చూసేసరికి మాసిన బట్టలతో పాటు అదీ మూట కట్టేస్తున్నాడు వాడు! ఎదురుగా నిలబడి చోద్యం చూస్తున్నది ఈవిడ! మల్లె పువ్వులా తెల్లగా మడత నలగని పేంటు కళ్ళకి కన్పించలేదూ?"
నేను విస్తుపోయాను.. ఏమిటీ మనిషి! ఇంత చిన్న విషయానికి....
"ఏం రావుగారూ! మాట్లాడరూ?"
"ఎందుకు మాట్లాడనూ? అసలు మీ రా తెల్లటి పేంటు హేంగర్ కు తగిలించక స్టాండు మీ దెందుకు వేశారు?"
"ఓహో! లా మాట్లాడి మరీ చెల్లెల్ని గెలిపించాలనుకొంటున్నారేమిటి? అలామాత్రం ఎన్నడూ ప్రయత్నించకండి. నేను నా యిష్టం వచ్చినట్టు చేస్తాను. అది తన యిష్టం వచ్చి నట్టూ చేస్తుందా?"
"బావగారూ! మీరు ప్రతి విషయానికీ అపార్ధాలుతియ్యకండి. ఇందులో ఇష్టంవచ్చినట్టూ చేసింది ఏముంది? సాధారణంగా మీ యింట్లో మాసిన బట్టలు స్టాండు మీదే ఉంటాయి. అక్కడే పేంటు ఉంటే అన్నీ కలిపి వేసేసి ఉంటుంది. ఏమాత్రం శ్రద్దగా చూసినా అది సూసింది కాదని తెలియనే తెలిసేది."
"అవును. దానికి శ్రద్ధ పట్టవలసిన అవసరమేముంది?"
"అవసరం ఎందుకు లేదు? లేక కాదు. పొరపాటు జరిగింది. ఒక వారం రోజుల్లో తిరిగి ఇస్త్రీలో వస్తుంది. ఓ బేడ ఎక్కువౌతుంది. అంతేనా? ఇంత చిన్న విషయానికి చాకలివాడి ఎదుట అంత మోటుగా, నీచంగా తిడతారా? అది ఎవరికి చిన్నతనమో గ్రహించారా?"
అతను కొంచెం అదిరాడు-ఆ తిట్లన్నీ నేను విన్నానని కాబోలు! నేను మళ్ళా అన్నాను- "తెల్లటి బట్ట పొరపాటున చాకలికి వేయటమనేది క్షమించలేని నేరమంటారా?"
అతను మొహం చిట్లించాడు. "పొరపాట్లూ, క్షమాపణలూ అంటే నాకు అసహ్యం! ఇంత చిన్న పని సక్రమంగా చేయలేకపోయినందుకు సిగ్గుపడాలి."
"కావచ్చు! కాని మందలించడంలో కూడా అందం ఉంది."
"ఓహూ! మీరు తిడితే సున్నితంగా, నైస్ గా, ఆనందంగా ఉంటుంది కాబోలు!"
"తిట్లు ఎప్పుడూ ఆనందాన్ని కలిగించవు. కానీ ఎదుటివారి అభిమానం దెబ్బతినేంత తీవ్రంగా మాత్రం ఉండకూడదు బావగారూ! మీరు నోటికి వచ్చినట్టూ తిడుతూ ఉంటే భాను ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించారా?"
"అవసరం లేదు. మీ రంతటి అభిమాన ధనులైనప్పుడు మీ చెల్లాయికి పెళ్ళీ పెడాకులూ లేకుండా అట్టే పెట్టుకోవలసింది."
"అంటే మీ ఉద్దేశ్యం? పెళ్ళి చేసుకున్న ఆడది వ్యక్తిత్వం నిలుపుకోలేదనా?"
అతను ఫకాళించి నవ్వటం ప్రారంభించాడు. నేను తెల్లబోయాను.
"హు! వ్యక్తిత్వం! కడుపుకూటికి ఒకడి మీద ఆధారపడి బ్రతికే ఆడదానికి వ్యక్తిత్వం! ఏం గొప్పగా మాట్లాడుతున్నారండీ! ఆకలి వేస్తే అన్నం సంపాదించుకోలేని ఆడదానికి వ్యక్తిత్వ, స్వతంత్రం, ఆశయాలూ, ఆదర్శాలూ...."
నేను మ్రాన్పడిపోయాను. అతను చెప్పుకు పోతున్నాడు- "ఆడదాన్ని పోషించవలసింది మగవాడు. ఆడదాన్ని రక్షించవలసింది మగవాడు! ఆడదాన్ని పాలించవలసింది మగవాడు! ఈ పనులన్నీ మగవాడిపట్ల ఆడది చెయ్యగలదేమో చెప్పండి. ప్రకృతే ఆడదాన్ని అణిచి పెట్టిందే! ఇక ఎవరిచ్చే స్వతంత్రం ఏమిటయ్యా? ఈ ఆడవాళ్ళ స్వతంత్రాలూ, వ్యక్తిత్వాలూ, అభ్యుదయాలూ-అన్నీ ఉపన్యాస లిచ్చేందుకే సరిపోతాయి గానీ ఆచరణల పెట్టాలంటే ఎవడికి సాధ్యం? మగవాడికి ప్రాముఖ్యం లేనప్పుడిక ఆడా మగ భేద మెక్కడ? సరే! మీరేమాత్రం పెళ్ళాన్ని మందలించకుండా వ్యక్తిత్వాలు నిలబెడతారో నేను చూడకపోతానా?"
ఆశ్చర్యంతో నేను అలాగే నిలబడ్డాను. అతనేమిటో పూర్తిగా అర్ధమయ్యాడు. భానువంటి అభ్యుదయవాదినికీ, ఇటువంటి సనాతన పురుషుడికీ జత పడింది. ఎంత విచిత్రం! భాను సున్నిత హృదయం ఈ కర్కశత్వానికి విరిగి ముక్క చెక్కలైపోతున్నది, పరిష్కారం లేని దారుణం!
అతనితో ఏదో వాదించాలనీ, ఏదో ఒప్పించాలనీ ఆవేశం పొంగులెత్తుతున్నది. కాని, ఒక మూర్ఖుడిని మార్చగలిగేంతటి శక్తి నాలోలేదు. మూర్ఖుడు ఒక్కడే మూర్ఖుడు కాడు. వాడితో వాదించే వాళ్ళంతా మూర్ఖులే! అతను వెళ్ళిపోయాడు. నేను వీధి తలుపులు వేసి లోపలికి నడిచాను. వంట గది గడపలో మోకాళ్ళమీద తల పెట్టుకొని కూర్చంది భాను. నిశ్శబ్దంగా దగ్గర కూర్చుని తలమీద చెయ్యి వేశాను. తల ఎత్తి చూసింది. కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉన్నాయి. చటుక్కున మొహానికి చేతులు అడ్డం పెట్టుకొన్నది. నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఎప్పటిలా ఏడవవద్దని ఓదార్చలేకపోయాను. శాంతం వహించమని నీతులు చెప్పలేకపోయాను. నీ సంసారం మారుతుందని జోస్యం చదవలేకపోయాను. మౌనంగా కూర్చున్నాను. ఉన్నట్లుండి అన్నాను: "నువ్వు మరీ నోరు మూసుకు ఊరుకొంటావేం? ఆమాత్రం జవాబు చెప్పలేకపోయావా?" కోపం కొద్దీ "మోటు మనుషులతో సున్నితంగా ప్రవర్తించి ప్రయోజనంలేదు" అన్నాను. భాను కళ్ళు తుడుచుకొంది. "చాకలివాడి ఎదట తన్నులు కూడా తినాలంటావా?"
నిజమే! తన వీరత్వానికి ఒకఆడది అడ్డు పడితే ఆ మనిషి ఎంత నైచ్యానికైనా దిగిపోతాడు.
"నేను మాటకు మాట జవాబు చెప్తే ఈ స్థితిలో ఎన్నడూ ఉండగలిగేదాన్ని కాదు."
"కాని భానూ, ఇంత చిన్న చిన్న విషయాలకు ఎందుకంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడు?" అన్నాను కొంతసేపయ్యాక. భాను కొంతసేపు మాట్లాడలేదు. "ఇది చిన్న విషయమే గానీ దానికి పూర్వ రంగమంతా పొద్దుటే జరిగింది. నిన్నసాయంత్రం ఆయన పెన్ను పార్టీలో జారిపోయిందట, అది మాత్రం నేను నమ్మను. ఏ ప్రాణ స్నేహితుడో చెక్కేసి ఉంటాడు. యాభై రూపాయల పెన్ను."
"అది పోయిందా? నిజం?"
"నువ్వు పెళ్ళిలో ప్రెజెంట్ చేసిందే-పోయింది. పొద్దుట ఆఫీసుకు వెళ్ళేముందు నా పెన్ను అడిగితే పాళీ వేయించటానికి నీ కిచ్చిన సంగతి చెప్పాను. దానిని గురించి వచ్చింది తగువు. నిన్నూ నన్నూ ఇష్టం వచ్చినట్టూ తిట్టారు. నాకు అద్దె అన్నగారొకడు దొరికాడట. వాణ్ణి చూసుకొని మురిసిపోతూ మొగుణ్ణి లెక్కచెయ్యకుండా తిరుగుతున్నావట. 'ఆ పెన్నుమాట నా కెందుకు చెప్పలేదు? నేను పాళీ వేయించనా? నాకన్నా నీకు వాడెక్కువా? మీరిద్దరూ కలిసి నన్ను వెర్రివాణ్ణి చెయ్యాలని చూస్తున్నారా? నా అవసరం లేకుండా అన్నిపనులూ వాడితో జరిపించు కుంటావా? వాడే నిన్ను పోషిస్తాడా?' ఇదీ ధోరణి. చూడు, నేను పెన్నుమాట తనకు చెప్పలేదని నామీద అభియోగం. తప్పు అని నిర్ణయిస్తే తప్పే. కాని నేను అలా ఎందుకు చేశావో నేనే చెప్పాను. 'నేను ఏది అడిగినా మీరు వినిపించుకోలేదు. లైబ్రరీనుంచి పుస్తకాలు తెచ్చిపెట్టమన్నాను. వినలేదు. రంగు దారాలు కొనివ్వమన్నాను. కొనలేదు. ఉత్తరం రాసుకోటానికి కార్డు ముక్కయినా ఇంట్లో లేదంటే చెవిన పెట్టలేదు. నేను ఎప్పుడేది అడిగినా జరగలేదు. ఇక ఏ నమ్మకంతో పెన్ను సంగతి మీకు చెప్పాలంటారు? మీరు చెయ్యరని తెలిసినప్పుడు మా అన్నయ్యకి ఇస్తే తప్పేమిటి?'
'నోర్ముయ్! రాస్కెల్! ముండమోపి స్కూలు చదువు వెలగబెట్టి చమత్కారం గుమ్మరిస్తున్నావ్! నాకు వీలుంటే చేస్తాను. లేకపోతే లేదు. నువ్వు పౌరుషం వెలగబెట్టుకొంటావా? నీకు సలాంలు కొడుతూ చెప్పిందల్లా చెయ్యటానికి నువ్వేం మహారాణివా?' చూశావా? నేను మహారాణి నెలా అవుతాను? మహారాణివైతే ఇలా నీముందు ఎందుకు తలదించుకుంటాడు? మహారాణీ నీకు నీ భార్యకన్నా ఎక్కువా?"
"నువ్వు మహారాజువైతే నేను మహారాణినయ్యేదాన్ని అనవలసింది" అన్నాను నేను కోపంగా.
"నే నలా మాటకు మాట పెంచను. నాకు అసహ్యంగా తోచిన విషయాలకు నేను జవాబే చెప్పను. నాకు ఏమీ మాట్లాడటానికి ఇష్టంలేక తలదించుకు కూర్చున్నాను.
'నువ్వు ఆడదానివని గుర్తుపెట్టుకో! మగవాడిని నేను. నీకు మొగున్నే గానీ నౌఖర్నిగాను. తెలిసిందా భానుమతీ దేవీ!' భగవాన్! అడుగడుగునా ఈ వెటకారాలూ, ఈ అపహాస్యాలూ, ఈ దౌర్జన్యం, నరకం, నేను.....నేను భరించలేను అంటూ ఏడ్చాను. ఆడుకొని వచ్చిన బాబు న మెడచుట్టూ చేతులువేసి మీదపడేవరకూ ఏడుస్తూ కూర్చున్నాను. బాబు చిట్టి చేతులతో కళ్ళు తుడుచుకొంటే..."
బావుంది భానూ! ఇక నేను నా రాకపోకలు విరమించుకోవటం మంచిదనుకుంటాను."
"అన్నయ్యా! నువ్వు రాకపోతే బాబూ, నేనూ..."
"నీకు సానుభూతి చూపించే పరిస్థితి కూడా నాకు లేకుండా పోతున్నది భానూ! నాకు ఎంతో దిగులు ముంచుకు వచ్చింది."
చాలాసేపు మౌనంగా కూర్చుండిపోయాము.
"సరే! లేచి మొహం కడుక్కురా భానూ" అన్నాను. భాను వెంటనే లేచి వెళ్ళింది. సంచీ బోర్లించి అన్నీ పీటమీద ఎత్తిపెట్టాను. నానిగాడు బిస్కట్ల పొట్లం వచ్చేవరకూ కాసుక్కూర్చుని అది కాస్తా పట్టుకు పరిగెత్తాడు వీధిలోకి.
"ఒరేయ్! ఒరేయ్!" అంటూంటే, "మళ్ళీ వత్తాను మామయ్యా!" అంటూ మాయమయ్యాడు.
"వెధవకి మాట లొస్తున్నాయి" అంది భాను, అన్నం పెట్టుకొంటూ. నేను దగ్గర కూర్చున్నాడు. "భానూ!"
తలఎత్తి చూసింది.
"నువ్వేమీ అనుకోకు గానీ ఇందాక ఆ తిట్లన్నీ వింటే బావమీద నాకు ఎంత కోపం వచ్చేసిందో తెలుసా? నేనెప్పుడూ అంత తొందరపడలేదు. ఆ క్షణంలో వచ్చేసి ఎడా పెడా కొట్టేద్దామనుకున్నాను. ఎందుకో ఆగిపోయాను."
భాను ఆశ్చర్యంగా చూసింది. "ఎంత తొందర పడ్డావు! నువ్వు ఆయన్ని చెయ్యెత్తి ఒక్క దెబ్బ వేస్తే ఇంకేమైనా ఉందా? ఎంత అపహాస్యంగా ఉంటుంది! జీవితాంతాలవరకూ గుర్తు ఉండి పోయే పనులు. ఇంకెప్పుడూ అలా ఆలోచించకు సుమా. అది నాకుమాత్రం సిగ్గుచేటుకాదా? పోనీ! ఎవరి పాపం వాళ్ళదే. భార్య అయినా, భర్త అయినా, తల్లి అయినా, బిడ్డ అయినా ఎవరు చేసిన దానికి వాళ్ళే అనుభవిస్తారు. ఆ శిక్ష భగవంతుడే విధించాలి గానీ మనంకాదు. బావమీద నీకు బాగా అసహ్యం వేసింది కదూ?"
"లేదు భానూ! కోపం వచ్చినమాట నిజమే కానీ ఏమీ అనుకోకు" అన్నాను సిగ్గుపడి.
భాను అన్నం తినటం చూస్తే నా కేమిటో బాధ కలిగింది. భార్యకు అన్నం పెడుతున్నావని గర్వపడే భర్త దగ్గర అనుక్షణమూ జీవిస్తూన్న భాను, అప్రయత్నంగా నా కళ్ళలోకి చూసింది. నేను కళ్ళు మరల్చుకోవటానికి ప్రయత్నించలేదు.
భాను అంది: "నన్ను ఒకరు పోషిస్తున్నారనే ఈ కృతజ్ఞతభావం ఎన్నాళ్ళు కాపరం చేయనిస్తుందంటావు?"
నేను మాట్లాడలేదు.
"పొద్దుటినుంచీ అన్నంతిన బుద్ధి గాక ఊరు కున్నాను. ఇప్పుడూ నాకు సహించటంలేదు" అంటూ నీళ్ళ గ్లాసు చేతిలోకి తీసుకొంది.
"భానూ! ఏమి టది?" అనేసరికే చేతిమీద నీళ్ళు పోసేసుకున్నది. "క్షమించన్నయ్యా! రేపు లేచి పనిచెయ్యటానికి ఈ తిన్నది చాలు."
* * *
