Previous Page Next Page 
పేక మేడలు పేజి 15


    "సరేలే! నేను తెస్తూంటాను గానీ నువ్వు కొంచెం రహస్యంగా ఉంచు. బావ కళ్ళ పడనివ్వకు. అంతే!"
    భాను బాధగా నవ్వింది- "ఎంత దొంగ బ్రతుకు!"
    "అన్నట్టు డాక్టర్ గిరీ చెలాయించటం అంటాడేమిటి?" అన్నాను గుర్తు వచ్చి.
    "ఆ మనిషి ఎత్తిపొడుపుల కన్నిటికీ నేనేం అర్ధాలు చెప్పను? ఒకసారి ఏదో మామూలుగా ఉన్నప్పుడు నోరుజారి అన్నాను, ఖర్మ! 'నేను కాలేజీలో జేరిఉంటే ఈ సరికి డాక్టర్ అయ్యేదాన్ని' అని! అదే మాటిమాటికీ దెప్పటం. సరదాగా అనుకొనే మాటలని ఎత్తి పొడిస్తే మనసు విప్పి మాట్లాడగలమా?"
    నేనేం మాట్లాడలేదు. కాస్సేపటికి భాను లేచి పళ్ళెం తీసింది. భాను చటుక్కున జ్ఞాపకం వచ్చినట్టు- "నీకు చెప్పానా? బామ్మగారి కూతురు చచ్చిపోయింది" అంది.
    "చచ్చిపోయిందా?" అన్నాను, ఆశ్చర్యపడి "అవును బామ్మగారి మొహం నేను చూడలేకపోయాను. ఆవిడకు ఆ ఆధారం కూడా పోయింది. పది రోజులైంది."
     "ఏం జబ్బు చేసింది?"
    "జబ్బూ లేదు, ఏమీ లేదు. ఆవిడకు నెలలు నిండుతూ ఉంటే కడుపులో నొప్పి వస్తుందట. అలాగే బాధఅది ముగ్గురు పిల్లల్ని కన్నది. ఆవిడకి గర్భం వస్తే చాల ప్రమాదమౌతుందని డాక్టర్ కచ్చితంగా చెప్పాడట. అయినా ఆ మహానుభావుడు ఆపరేషన్ చేయించుకోలేదు. పోయేవి తన ప్రాణాలు కావుగా? ఆవిడకు మళ్ళీ కడుపు వచ్చింది. చావూ వచ్చింది. పోనిద్దూ! అతనికి ఎంచక్కా కొత్త పెళ్ళాం వస్తుంది."
    "ఛ! బొత్తిగా అంత ఇదిగా మాట్లాడకు భానూ! అతను నిర్లక్ష్యం చేసి ఉంటాడు. ఇంతలో ఇలా జరుగుతుందని..."
    "అదే అతని ప్రాణాలకు ముప్పు జరుగుతుందంటే ఆ నిర్లక్ష్యం చేస్తాడా అని?"
    "అటువంటి మూర్ఖుడు చేస్తే చేస్తాడు కూడాను. చాలామంది చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకుంటారు."
    "ఈ సమర్ధన నేను ఒప్పను. అతనికి భార్య చచ్చిపోతూందేమోనన్న భయం లేదు. ఏమాత్రం జంకు ఉన్నా అంత నిర్లక్ష్యంగా ఉండలేడు. ఆవిణ్ణి ఏదోవిధంగా కాపాడుకోటానికి ప్రయత్నిస్తాడు."
    ఆలోచిస్తే అది నిజమే అనిపించింది. "తనని నమ్మి తనవాళ్ళనందర్నీ విడిచి వచ్చి సర్వస్వం అర్పించుకొనే భార్య ప్రాణాలను అతి తేలిగ్గా చూడగలిగే మగవాళ్ళు ఉన్నారంటే అతశయోక్తి కాదు. భర్తను విషం పెట్టి చంపిన భార్యలూ ఉన్నారు. ఒక కథలో కాబోలు భర్త పేర వేలాది రూపాయలకు ఇన్స్యూర్ చేసి తర్వాత అతన్ని చంపటానికి ప్రయత్నిస్తుంది. ఇటువంటి కేసులు చాల అరుదనుకో. అయినా మనం నిర్ణయించలేం భానూ! చెడ్డతనం అనేది ఒక జాతికే పరిమితం కాదు."
    "వీళ్ళు చేసినప్పుడు వాళ్ళు చేశారా లేదా అనేదికాదు ప్రశ్న. భర్తని నిర్లక్ష్యం చేసిన భార్యకి లోకంలో ఎంత సత్కారం లభిస్తుందో తెలుసా? అదే తప్పుచేసిన మగవాడికి ఆ శిక్ష లేదే! దై వేచ్చ! లేకపోతే దాని ఖర్మ! అంతే! వాడు పదిమందిలో మహారాజులా తిరుగుతాడు. అపరాధి ఎవరుకానీ, ఒకే శిక్ష అనుభవిస్తే అది న్యాయ మౌతుంది."
    "అబ్బ! నీతో మాట్లాడుతూ కూర్చో టానికి చాలా ఓపిక ఉండాలి. నేను ఒక్కటి చెప్తున్నాను విను, నువ్వు లోకాన్ని తీర్చి దిద్దలేవు. నీ సంసారాన్నే నువ్వు దిద్దుకోలేవు. తామరాకు మీద మిలమిలలాడే నీటిబొట్టు మనకో పాఠం చెబుతుంది. దేన్నీ మనం పట్టించు కోకూడదు. అలా ఆలోచిస్తూ కూర్చుంటే సుఖం ఉండదు. అన్నీ సమస్యలే! అన్నీ ప్రశ్నలే! దానివల్ల మనం చేయగలిగిందీ ఏమీ లేదు. మధ్య మన బుర్ర లెందుకు పగలగొట్టుకోవాలి? లోకం ఎలా పోతుందో, పోనీ! దానితోపాటే నువ్వూ వెళ్ళు. నేనూ వస్తాను. అంతేగాని మన వెనకలోకం రాదు."
    భాను నవ్వింది. "ఎప్పుడండీ మీ రింత గొప్ప వేదాంతులయ్యారు?"
    "అహ! ఇప్పుడిప్పుడేనండీ! మీరు మా శిష్యురాలుగా చేరుతారేమిటి?" అన్నాను నేనూ నవ్వుతూ.
    "అవశ్యం! అంతకన్నానా? ఈ ఆలోచన లేవీ రాకుండా ఈ బుర్ర మార్చిపెట్టండి."    
    "శివోహం! ఏవీ ఓ డజను అరటిపళ్ళూ...హారతి కర్పూరం....టెంకాయలూ.."
    
                                 *    *    *

    తర్వాత నాలుగైదు వారాలవరకూ ఏమీ జరిగినట్టు లేదు. చిన్నచిన్న విషయాలు ఉన్నా అవి అనుభవించటానికే గానీ ఎత్తి చెప్పుకోటం సిగ్గుచేటు, భాను అభిమానం కొన్నిటిని మరుగుపరుస్తుంది కూడా. నేను అప్పుడప్పుడూ బావ వైఖరి గమనిస్తూనే ఉన్నాను. అతను నా విషయంలో కొంత ముభావంగా ఉంటున్నాడు. ఎక్కువగా మాట్లాడటం లేదు. మొత్తానికి కాలం ప్రశాంతంగా సాగిపోతూన్నట్లు ఉంది. ఈ ప్రశాంతత ప్రళయానికి కాదుగదా అనిపించింది. భాను పెన్ను పాళీవిరిగిందట. కొత్తది వేయించమని ఇచ్చింది ఒకసారి. వారం రోజులు బద్ధకించినా మంచి పాళీ వేయించాను. భానుకి ఖర్జూరం చాల ఇష్టం. రెండు వీశెల ఖర్జూరం, ఓ వంద చామంతులూ. సరే! అల్లుడికి బిస్కట్ల కట్నం ఉండనే ఉంది. అన్నీ కొత్త సంచీలో సర్ది బయల్దేరాను హుషారుగా, కొత్తగా కొన్న సైకిలుమీద.
    వీధి తలుపులు దగ్గరికి వేసి ఉన్నాయి. నా కెందుకో గుండెలు కొట్టుకున్నాయి. బావ గారి గొంతు తారస్థాయిలో విన్పిస్తున్నది. ఏవో కేకలు వేస్తున్నాడు. "అయినా నీకీ మధ్య గర్వం ఎక్కువైందిలే. నాకు తెలుసు. నీ మిడిసిపాటూ, నువ్వూ నీకు ఇల్లూ, సంసారం, మొగుడూ, మొద్ధులూ ఏం కావాలి?"
    సైకిల్ స్టాండు వేసి వీధి అరుగు మీద నిలబడ్డాను.
    "నీ అవసరాలు తీర్చేవాళ్ళు, నీకు కావలసిన వన్నీ సప్లై చేసేవాళ్ళూ వేరే ఉంటే మొగుడనే వెధవని ఖాతరు చెయ్యమని ఎక్కడ ఉంది? ముండా!"
    త్రుళ్ళిపడ్డాను. ఎంత మోటుగా తిడుతున్నాడు! అది పూర్తిగా నా మీద కోపం. ఇక నేను రాకుండా ఉండనా? "కాస్త ఒళ్ళు దగ్గిర పెట్టుకు మరీ తిరగమనీ, నీ డాక్టర్ గొప్పలు వెలగబెట్టవద్దనీ ఎన్నిసార్లు నీకు చెప్పింది? ఎప్పుడు నీకు తెలిసేది? నీ కళ్ళేం కన్పించకుండా పోయాయా? బద్ధకం బలిసిపోతున్నదా? నీకు సంసారి కుండవలసిన లక్షణాలు ఏవిటున్నాయని? నిన్ను చేసుకొని నేనేం సుఖపడుతున్నాను? నీ కసలు పెళ్లెందుకు చేశాడో నీ బాబుకే తెలియాలి."
    కోపంతో క్రింది పెదవి పళ్ళకింద నలిగిపోతున్నది. ఈనాడుఒక హీనుడు కూడా పెళ్ళాన్ని తిట్టుకోని తిట్లు తిడుతున్నాడు. "నీకు సరైన ఈడుకి పెళ్ళిచేస్తే నలుగురు పిల్లల్ని కనేదానివి. గాడిదలా పెంచి నాకు అంటగట్టారు. నేనో గుడ్డి వెధవని కాకపోతే నిన్నెలా కట్టుకుంటాను? నా ఖర్మ కాలింది. అంతే! ఆడముండవని ఆలోచిస్తూన్న కొద్దీ నెత్తి నెక్కుతున్నావ్. నాలుగు తన్ని వీధిలోకి ఈడ్చేస్తే నీ బాబే అడ్డు వస్తాడో, నీ అన్నే అడ్డు వస్తాడో....."
    'బద్మాష్!' నా శరీరం కంపిస్తున్నది. పిడికెళ్ళు బిగుసుకొంటున్నాయి. పళ్ళు పటపట నలిగిపోతున్నాయి. రౌడీరాస్కెల్! ఆ తన్ను లేవో ఇప్పుడు నీకు తినిపిస్తే నీ బా బెవడు అడ్డు వస్తాడో నేను చూస్తాను. రైలు పొగలా ఊపిరి వస్తున్నది. కాళ్ళు ముందుకు తీసుకు వెళ్తున్నాయి. ఒక్క నిమిషంలో....
    'ఆగు.' గర్జించింది హృదయం.
    'ఆవేశపడకు.' హెచ్చరించింది తిరిగీ.
    అవును. నిట్టూర్చాను. తొందర పడి అతనితో ఘర్షణపడితే ప్రయోజనం లేదు. నా కోపతాపాలకు ఇది సమయం కాదు. భానును ఇప్పట్లో బయటికి తీసుకువెళ్ళి ఏమీ చెయ్యలేను. ఈ చెర దానికి తప్పదు.
    నన్ను నేను నిగ్రహించుకున్నాను. ఒక్క క్షణం నించున్నాను. వెళ్ళిపోదామనిపించింది. కాని భాను ఎంత బాధ పడుతున్నదో! ఒక్కసారి ఓదార్చి వెళ్ళితే...
    తలుపులు తెరుచుకున్నాయి. భుజంమీద బట్ట మూటతో చాకలి కాబోలు బయటికి వచ్చాడు. నిర్ఘాంతపోయాను. వాడు నాకేసి చూసి తలదించుకొని వెళ్ళిపోయాడు. ఒక చాకలి వాడి ఎదుట సభ్యలోకంలోని ఒక వ్యక్తి భార్యను హీనంగా, నీచంగా, ఊహించలేని విధంగా తిట్టగలడనే విషయాన్ని నేను చూసి ఉండకపోతే ఎంతమాత్రమూ నమ్మను. ఆడది ఎంత అబిమానవతి కానీ నోరెత్తి జవాబు చెప్పకుండా సహించవలసి వచ్చింది. ఏమిటీ దౌర్భాగ్యం?
    ఆక్షణంలో ఒక్క విషయానికేబాధపడ్డాను. భగవంతుని తిట్టాను-నేనూ భానూ ఒకే తల్లి కడుపున పుట్టనందుకు;భానుకు అన్నయ్యలే లేనందుకు. నేనే భాను స్వంత అన్నయ్య నైతే అప్పటి న హోదా వేరు. నా శక్తి వేరు. నా హక్కు వేరు. వాడి మాటమాటకూ లెంపలు పగలగొట్టి ఒళ్ళు హూనం చేసి చెల్లిని తీసుకువెళ్ళి అమ్మకు అప్పగించేవాణ్ణి. అది ఆ నరకంలో ఎన్ని దౌర్జన్యాలు అనుభవిస్తున్నదో ఏకరువు పెట్టేవాణ్ణి. కాని....కాని.... నేను భాను అన్నయ్యను కాదు. ఏవిధంగానూ భానును నేను అడ్డుకోలేను. నేను దూరంగానే ఉండాలి.
    మళ్ళా వెనక్కు వెళ్ళిపోవాలనిపించింది. కాని నెమ్మదిగా లోపల అడుగు పెట్టాను. బావ...ఛీ! బావ అని పిలవటానికి నా మనసు అంగీకరించటం లేదు. అతను అద్దం ముందు నిలబడి తల దువ్వుకొంటున్నాడు. గిరుక్కున వెనక్కు తిరిగి నన్ను చూస్తూనే చలించినట్టయి తమాయించుకున్నాడు. "వచ్చారా? మీ చెల్లెలు చాల తెలివైంది కాబోలు. ఏం నిర్వాకం చేసిందో చూశారా?"    


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS