Previous Page Next Page 
పేక మేడలు పేజి 14


    "చిన్నవాళ్ళ ఇష్టప్రకారం పెద్దవాళ్ళు నడిచే రోజులు వచ్చాయి. తల్లికి ఆ ఇంట్లో విలువ లేనే లేదన్నమాట. కనీసం ఆవిడ వయస్సు కైనా మనం ప్రాముఖ్యం ఇవ్వాలి కదా? 'నేనే నా భార్య చెప్పినట్లు వింటున్నాను. ఇక నీ గతేమిటి?'-అని కాబోలు అతని ఉద్దేశ్యం! అప్పుడే ఆ ఘట్టం ముగిసిపోలేదు. 'పోనీ నాయనా! ఇకనుంచి మీ ఇష్టప్రకారమే చేస్తాను. ఈ సారికి మాత్రం కోపాలు పెట్టుకోకండి. ఒక్క గరిటెడు పులుసు వేసుకో. నువ్వు తింటే గాని నాకు తృప్తి ఉండదు' అంటూ బామ్మగారు ప్రాధేయపడిందట కొడుకుని. తల్లి హోదా నిలుపుకోవాలని ఆ హృదయం తహతహలాడుతున్నది మరి. అతను ఏమీ అనలేక - 'సరే. వెయ్యి' అన్నాడట. అతను అన్నం తిని లేచేసరికి కోడలు సూట్ కేస్ సర్దేసుకుంది. అత్తగారి మీద యుద్ధం ప్రకటించింది. 'నా భర్తనీ నన్నూ విడదీయటానికే నువ్వు ప్రయత్నిస్తున్నావు. నేను వద్దని చెప్పిన పని ఆయన్ని మభ్యపెట్టే కబుర్లు చెప్పి ఎందుకు చేయించాలి?' అంటూ తిట్టిపోసింది. తర్వాత భర్తతో 'నా మాటకి వీసమెత్తు విలువలేని ఈ యింట్లో నేను ఉండనవసరం లేదు. మీ అమ్మగారితోనే ఊరేగండి. వెళ్తున్నాను. ఇక రానేరాను' అని నిర్ణయం చెప్పేసి బయల్దేరింది. 'సరూ! సరూ!' అని వెనకబడితే రైలు ఎక్కించిరావటం తప్పితే ఫలితం లేకపోయింది. ఆ సరూ ఏం చదువుకుందో తెలుసా?"
    "నా మొహం! ఏమీ చదివి ఉండదు. చదివితే అలా ఎన్నడూ ప్రవర్తించదు."
    "అదే నీ పొరపాటు! ఆవిడ-సరోజాదేవి బి. ఎ. - క్లాసు తెచ్చుకొంది."
    "నిజం?" నాకు ఆశ్చర్యం వేసింది.
    "అక్షరాలా చిత్రంగా ఉంది కదూ?"
    "మరి ఆవిడ భర్త...? ఏం పని...?"
    "కాలేజీ లెక్చరర్! అతను ఉత్త దేవుడు-అంటే అంత మంచివాడని కాదు. దేవుడిలా నోరు విప్పి మాట్లాడలేనివాడు! ఎవరిమీద కరుణవస్తే వాళ్ళనే అందలం ఎక్కించగలవాడు! ఆ సరోజ సంగతి ఆలోచిస్తేనే నాకు బాధగా ఉంటుంది. ఆవిడకు ఒక స్త్రీ వాంఛించే సర్వసుఖాలూ ఉన్నాయి. స్వేచ్చ ఉంది. స్వతంత్రం ఉంది. ఆవిడ మాటకు ప్రాధాన్యం ఉంది. భర్త ఆధారాభిమానాలున్నాయి. ఒక వ్యక్తిగా బ్రతకగలిగే అదృష్టమూ ఉంది. అంతకన్నా కావలసిందేమిటి? కాని అన్నిటినీ దుర్వినియోగ పరుచుకొంటున్నది. భర్త తన మాట వింటాడు కదా అని తల్లినీ, కొడుకునూ వేరుచేస్తుందా? తనకి స్వేచ్చ ఉందని అర్ధంలేని తిరుగుళ్ళు తిరుగు తుందా? తనకి అధికారం ఉందని అత్తగారిమీద పెత్తనం చేస్తుందా? తమకు లభిస్తూన్న పదవ కాశాలను అనుభవించలేక దుర్వినియోగ పరుస్తున్నారనేకదూ ఈ చదువుకున్న ఆడవాళ్ళమీద లోకానికి చిన్నచూపు? తన ఇంటిని సంతచేసి మహిళా సంఘాలకు మెంబరై ఏవో హక్కులు కావాలని నినాదాలు చేస్తే మరి నలుగురూ నవ్వుకోరూ? ఎటువంటి ప్రగతీ చూడలేని వాళ్ళు అంధులుగానే పడిఉన్నారు. అవకాశాలు ఉన్నవారు వాటిని నాశనం చేసుకొంటున్నారు. అసలు లోపం ఎక్కడ ఉందంటావు?"
    "నా ఉద్దేశ్యం-ఈ విషయం తీసుకొంటే-బామ్మగారి కొడుకులోనే."
    "అదే నా ఉద్దేశ్యం కూడా. ఈ మగవాళ్ళలో ఉన్నది రెండే రకాలు! తల్లితండ్రుల్నీ, అక్క చెల్లెళ్ళనీ అపారంగా అభిమానిస్తూ తనకి ఒక భార్య ఉందనీ, ఆవిడ కష్టసుఖాలు తనమీదే ఉన్నాయనీ గుర్తు అయినా తెచ్చుకోనివారు. మూడు ముళ్ళూ వేసింది మొదలు భార్యామణి కొంగుకి దాసులై కీలుబొమ్మలై సర్వ ప్రపంచాన్నీ విస్మరించేవారు. వీళ్ళకి ఉన్నది ఒకే కన్ను! దీనితో వాళ్ళు ఒక్క భాగాన్నే చూడగలరు. లోకం అలాగే గడిచిపోతున్నది."
    "సరోజాదేవికీ నీకూ స్నేహం లేదేమిటి?"
    "ఆవిడకి నేను నచ్చను-అయినా బామ్మగారితో నేను మాట్లాడుతానని ఆవిడకు కోపం, పాపం బామ్మగారు చాలా మంచిది అన్నయ్యా! మీ విషయాలు ఆవిడకు కూడా తెలుసు. తన గొడవ లేవేవో చెప్పి నన్ను ఓదార్చుతూ ఉంటుంది. "అయినా ఆడదంటే మగవాడికి అంత చులకనెందుకండీ?' అని నేనంటే 'అయ్యో! పిచ్చితల్లీ!  ఇంకా ఈ రోజుల్లో ఏ ముంది? ఎక్కడో నీ మొగుడులాంటివాళ్ళు తప్ప అంతా పెళ్ళాలని నెత్తిమీదే పెట్టుకుంటారు. మా కాలంలో చూడాలి. ఒకసారి నేను సరదాపడి సినిమా చూడడానికి వెళ్ళానమ్మా! అప్పుడే సినిమాలు చూడడానికి వెళ్ళానమ్మా! అప్పుడే సినిమాలు కొత్తగా వచ్చిన రోజులు. సినిమాకి వెళ్ళటం అంటే ఆ రోజుల్లో తప్పుపనిలా ఉండేది. మీ తాతగారికి అసలు గిట్టేది కాదు. ఒక రోజున ఆయన పొరుగూరు వెళ్ళారు కదా అని నలుగురి తోపాటు నేనూ బయల్దేరాను. తీరా పట్టుమని పది బొమ్మలూ చూడలేదు. ఆయన ఊరునుంచి వచ్చి నాకోసం సినిమా డేరా దగ్గరికి వచ్చేశారు. నువ్వు నిజంగా నమ్మవు గానీ ఈ జుట్టుముడి పట్టుకొని పదిమందిలోంచీ ఈడ్చుకొచ్చి-'భోగం ఆటలు చూస్తావుటే ముండా!'- అంటూ వీధిపొడుగునా తన్నుకుంటూ తీసుకువచ్చారు. ఇంట్లో పెట్టి స్పృహ తప్పే వరకు కొట్టారు. ఆ భయంతో నేను పెద్ద కాయలా పడ్డాను'-అని బామ్మగారు అతిసునాయాసంగా చెప్పుతూ ఉంటే నా ఒళ్ళు జలదరించింది.
    'బామ్మగారూ! అంత అవమానం మీరు ఎలా భరించారు?'
    'అవమానాని కేముందే? మొగుడు పెళ్ళాన్ని కాకపోతే ఎవర్ని కొడతాడే?'

                                    * * *

                   

    'ఎవళ్ళనో ఒకళ్ళని కొట్టి తీరాలా ఏమిటండీ?'
    'కాదనుకో. ఏదో నేను తప్పు చేశాను. ఆయనికి గిట్టదని తెలిసికూడా వెళ్తాను. కోపంకొద్దీ నాలుగు వేశారు. పోనిద్దూ! ఏం పోయింది?' అనేసింది బామ్మగారు. చూశావా? ఆనాటి స్త్రీనీ, ఆ భావాలనీ!
    "బామ్మగారూ! మీరుచేసింది తప్పు కాదండీ!' అంటే ఆవిడ నమ్మదు. భర్త కిష్టంలేని పనిచేశాననీ, అది తప్పేననీ వాదిస్తుంది. బామ్మగారికీ నాకూ కొన్ని వందలరెట్లు తేడా ఉంది. మీ బావకి చలం పుస్తకాలు ఇష్టంలేదు. నన్ను కూడా చదవకూడదని శాసిస్తారు. నేను వినను. ఎదురుగా చదివే ధైర్యం లేకపోతే రహస్యంగా చదువుతాను. ఇప్పుడు వచ్చిన చిక్కేమిటంటే ఆడది ఆలోచించటం నేర్చుకొంది. కొన్ని స్వంత అభిప్రాయాలు ఏర్పరచుకుంటున్నది. నిరంకుశంగా పాలించే తాతగారి వంటి మగవాళ్ళు ఇంకా ఉన్నారుగానీ-ఆ పరిపాలన ఆమోదించే బామ్మగారి వంటి ఆడవాళ్ళు మిగిలి లేరు. అందుకే ఈనాటి కాపురాలు సనాతన పద్ధతులతోనూ గడవటంలేదు, అధునాతన భావాలతోనూ జరగటం లేదు."
    "అభిప్రాయాలు కలియని వ్యక్తులు జత పడ్డప్పుడే సమస్య వస్తుంది. సాధ్యమైనంత వరకూ ప్రయత్నించి ఇద్దరూ ఏకీభవించటానికి ప్రయత్నించాలి. అదే జరగటం లేదు, మీ సంసారంలో."
    "నాలో పొరపాటు లేదనే అనుకొంటున్నాను. నా శక్తి కొలదీ అది సరిదిద్దుకోవటానికే ప్రయత్నిస్తాను."
    "ఇంతకీ ఆ సరోజాదేవి మళ్ళా వచ్చిందా?"
    "నాలుగోనాడే భర్తగారు వెళ్ళి తీసుకువచ్చాడు. ప్రాణం లేకుండా శరీరం ఉంటుందా?"
    "అయితే ఇప్పుడు బామ్మగారు వెళ్ళిపోవటం దేనికి?"
    "బావుంది. ఈవిడ కదలకపోతే ఓ గంట చూసి ఆవిడ సూట్ కేసు సర్దుకోదూ? చదువులకీ సంస్కారానికీ సంబంధం లేదనేది జగ మెరిగిన సత్యం."

                               *    *    *

    ప్రతివారం మంచి మంచి పుస్తకాలు తీసుకెళ్ళి ఇచ్చి భానును చూసి వస్తున్నాను. ఎప్పటికప్పుడు విశేషాలన్నీ తెలుసుకొంటున్నాను. ఒకసారి నేను ముందుగదిలో కూర్చుని అల్లుడికి రంగు బొమ్మల పుస్తకం చూపిస్తున్నాను. భాను బావకు అన్నం వడ్డిస్తున్నది. రెండు నిమిషాల్లోనే అతనేదో కేకలేస్తున్నట్టు విన్పించింది. నేను త్రుళ్ళిపడ్డాను. "నీ ధ్యాస అసలు ఇంటి పనుల మీద ఉంటున్నదా? నీకు బాధ్యతలనేవి ఏమైనా వంట పడుతున్నాయా? ఇంత ఉడకేసి గుప్పెళ్ళకొద్దీ ఉప్పూ కారం పులిమేసి నా మొహాన్న తగలేస్తున్నావు! హోటల్ వాడు నయం. కమ్మగా కడుపునిండా పెడతాడు. ఒక్కపూట నువ్వు తృప్తిగా వంట చేశావా? నీకు సిగ్గు వెయ్యటంలేదూ? కట్టుకున్న వాడికి కడుపు నిండా అన్నం పెట్టలేకపోతే ఎందుకే నువ్విక్కడున్నదీ? సుష్టుగా తిని దొర్లటానికా? దర్జాగా పుస్తకాలు చదువుకోటానికా? అయినా నీ సరదాలు వేరే ఉంటే ఇల్లు నీకు కావాలా? నువ్వు డాక్టర్ గిరీ వెలగబెట్టాలిగానీ వెధవ వంట పని చేస్తావా? నన్నిలా ఎందు కేడిపిస్తావు? ఇక్కడ ఉండాలని లేకపోతే వెళ్ళి ఫో! నీ ఇష్టమైన వాడితో వెళ్ళిపో! డర్టీ రోగ్! నువ్వు ఆడదానివా? నాకు వెర్రిగాని......ఆడదానికి ఉండవలసిన వినయం, విధేయతా, అణకువా పాడూ...మచ్చుకైనా నీలో...."
    నేను నిర్ఘాంతపోయాను. భాను చెప్పటం తప్ప అతను తిట్టటం స్వయంగా నే నంతవరకూ ఎరగను. ఏం జరిగింది? భాను ఏమైనా చేసిందా? అతను బట్టలు వేసుకొని విసురుగా వెళ్ళి పోయాడు. నేను నానిగాన్ని భుజాన వేసుకొని లోపలికి  నడిచాను. పీట ముందు కంచంలో పెట్టిన అన్నం కెలికి వదిలేసినట్లు ఉంది. భాను ఎదురుగా తలదించుకు కూర్చుంది.
    "ఏమైంది భానూ?" అన్నాను.
    భాను తలఎత్తి చూసింది. జలజలా కన్నీళ్లు రాలిపడ్డాయి. ఏదో చెప్పాలనుకొని చెప్పలేక పోయింది.
    "అసలు ఏమైంది? కూరసరిగా వండలేదా?"
    "ఉప్పు ఎక్కువైంది. బాగానే ఏరాను మరి. అన్నంలో రాయి వచ్చింది" అంది నెమ్మదిగా.
    నాకు ఆశ్చర్యం వేసింది. "అయితే మాత్రం, దానికే అన్నితిట్లు తిట్టాలా? రాయితీసి అవతల పారేసి ఏ ఆవకాయో వేసుకు తింటే పోయే! ఎంత నేర్పుగా చేస్తే మాత్రం లోటు పాట్లు జరగక్కుండా ఉంటాయా? ప్రతీ చిన్న విషయానికీ మనసు బాధించే మాటలంటే..."
    కొంతసేపటికి భాను అంది :
    "కొత్తలో నా వంటమీద ఆయనకి చెడ్డ అభిప్రాయం పడిపోయింది. నిజానికి అప్పుడు నాకు ఏ పనీ చేతనయ్యేది కాదు ఆకలి కూడా తీర్చుకోలేనంత ఘోరంగా ఉండేది వంట! నాలుగైదు నెలలయ్యేసరికి అన్నీ నేర్చుకున్నాననుకో. ఇప్పుడు ఏదైనా చెయ్యగలుగుతున్నాను. అయినా ఆయన అభిప్రాయం మారలేదు. నేనేమీ చేతకానిదాన్ననీ, తనకి సుఖం లేకుండా పోయిందనీ ఆయన ఉద్దేశ్యం! ఇప్పుడు ఏనాడైనా నా పనుల్లో పొరపాటు జరిగితే ఆ పాత అభిప్రాయాలే బయటికి వస్తాయి. ఇష్టం వచ్చినట్టు తిడతారు. నేనేం చెయ్యను చెప్పు?"
    నా మొహం! నేనేం చెప్పను? ఏమీ మాట్లాడలేదు.
    "ఇవ్వాలిటి జగడానికి కారణం కూరలో ఉప్పు ఎక్కువవటం ఒక్కటే కాదులే. అది పైకి చూపించేది. కానీ నువ్వు నాకు పుస్తకాలు తెచ్చిపెడుతున్నావనీ, నేను సుఖంగా చదువుకొంటున్నాననీ-"
    నేను ఆశ్చర్యంగా చూశాను.
    "ఏం? ఆ తిట్లు నువ్వూ విన్నావు కదా? అర్ధంకాలేదా? అయినా ఆ గూఢార్ధాలు తెలుసుకోవాలంటే చాలా అనుభవం కావాలి."
    "అందుకేనా ఈ మధ్య నాతో సరిగా మాట్లాడటం లేదు?"
    భాను మాట్లాళ్ళేదు. నేను ఆలోచించాను. "అయితే భానూ! బావకి ఇష్టం లేని పని చేస్తే బావుంటుందా నేను? ఇంకా నేను పుస్తకాలు తెస్తూ ఉంటే... నువ్వూ ఆలోచించు."
    "అన్నయ్యా! నేను కడుపునిండా తిండితినటం కూడా ఆయనకి ఇష్టం లేదు. సుష్టుగా తిని, హాయిగా నిద్రపోతానని ఎన్నిసార్లు తిడుతూనే ఉంటారు. అయితే నన్ను తిండీ, నిద్రా మానెయ్యమంటావా? మనం చెయ్యకూడని పని చేస్తున్నామా? పుస్తకాలు చదవటం కూడా అన్నం తిన్నట్టు సామాన్యమైన విషయమే. అవి చదువుకొంటూ కూర్చుంటే నాకు శాంతిగా, హాయిగా ఉంటుంది. అవి తేవటం నువ్వు మానేస్తే.... సరే! నీ ఇష్టం!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS