నువ్వేమనుకుంటావోననీ, వారంతా నీకోసం పడిన శ్రమకు ప్రతి కాలం అడిగినట్లుంటుందేమోనని తప్పనిసరిగా అంగీకరిస్తావేమోనని ఎవరికి వారు మౌనం దాల్చాడు. ఇక ఈ విషయం దాచడం మంచిది కాదని నేను తెగించాను......ప్రేమా ఆలోచించుకో. నువ్వు ఎంత త్వరగా పెళ్ళాడితే అంత మంచిది. ప్రేమ అయోమయంగా చూస్తూండిపోయింది.
గీత హృదయం తేలికపడింది. ఆమె టేబిల్ లాంప్ స్విచ్ ఆన్ చేసింది. లేత నీలిరంగుకాంతి గదిలో అందంగా వ్యాపించింది. ఆమె ఆ దీపంకేసి తదేకంగా కొన్నిక్షణాలు చూచింది. "ప్రేమా....ఆలస్య మైంది. వెళ్ళొస్తాను"...
ప్రేమ మాట్లాడలేదు. ఆమె హృదయం భారంగా వుంది.
గీత మందహాసం చేసింది. "కాలేజీలో కలుద్దాం"
గీత వెళ్ళిపోయిన కొద్దిక్షణాలకు ప్రేమ తేరుకుని పరుగుల మీద వెళ్ళి గీతను కలుసుకుంది. గీత అప్పటికే మెట్లుదిగి నెమ్మదిగా వెళ్తోంది.
"గీతా-గీతా?" వగర్చుతూ కేకే సింది. గీత ఆశ్చర్యపోతూ వెనక్కి తిరిగింది ప్రేమ వస్తున్నది. "గీతా! నిజమా! నువ్వు నిజంగా నిరంజన్ మీ.... ప్రేమించడంలేదా? అదంతా నటననా? నీ కతడు సోదరి తుల్యుడేనా?" అని అడుగుతుంది. వ్యర్ధ హాసం మొగాన పోసుకుని ఆ ప్రశ్ననుంచి తప్పించుకుని చేతితో టాటా చెప్పింది గీత. అలాగే త్వరగా వెళ్ళిపోయింది. ప్రేమ వెనుదిరిగి పోయింది. ప్రేమ అడగవలసిన ప్రశ్నలు తన్ను తానడుగుతోంది గీత..... నిజమా? .... అదంతా నటనేనా? తనకు నిరంజన్ సోదరుతుల్యుడేనా! భగవంతుడా ఇదేమి పరీక్ష!
గీత హృదయం బ్రద్దలైంది. తిన్నగా యింటికెళ్ళి మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడ్పింది.
15
పరీక్షలు వ్రాసి విద్యార్ధులంతా తీరిగ్గా యింట్లో వున్నారు. అందరితోపాటు ప్రేమకూడా పరీక్ష వ్రాసింది.
ఆమె సుధాకర్ ను అంత త్వరగా మర్చిపోలేక పోయింది. కానీ అతడు జ్ఞాపకం రాగానే ఆ సంఘటన యథాలాపంగా ముందుకొచ్చి నిలవటంతో అసహ్యం క్రోధం ఆవహించి ఆ స్మృతిని వెనక్కు నెట్టే సేది. క్రమక్రమంగా చదువు ధ్యాసలో పడి ఆమె శాంతిని సాధించింది. ఆమెకు తోడుగా గీత ఎప్పుడు వుండేది.
ఆరోజు సాయంత్రం ప్రేమ తోటలో కూచుని నవల చదువుకుంటోంది. వాతావరణం చల్లబడింది. పుష్పించిన మామిడి వృక్షాల కింద కూచుటే మనసు హాయి గొల్పుతోంది. తండ్రి ఆవేపుగా రావటం ఆమె గమనించలేదు. అంత దీక్షగా చదువుతోంది. ఆయన సమీపంగా వచ్చారు. ప్రేమ పుస్తకం మీదనుంచి దృష్టి మళ్ళించింది. ఆయన చాపమీద కూచున్నారు. ప్రేమ తండ్రి వాలకం చూసి ఏదో అయిందని సందేహంపడింది-కూర్చుని కూర్చోకముందే జేబులోంచి కవరుతీసి ఆమూలాగ్రం ఓమాటు చదివారు. మౌనంగా చదవడంవల్ల అందులోని సారాంశము ప్రేమకు తెలియలేదు. కాని రాత అన్నయ్యదని గ్రహించుకుంది. ఆయన ఆ లేఖను మడిచి ఆ మడతలు మీద గోర్లతో గీరుతూ క్షణంమౌనం దాల్పారు.
"ఏం తల్లీ ...పరీక్ష లయిపోయాయి. ఇక నీకు సంబంధాలు చూస్తున్నాము చూడమని రాయగానే మీ అన్నయ్యేం జేశాడో చూశావా?"
ప్రేమ గుండెలు దడదడ లాడాయి.
"ఇంతవరకు చదువుతున్నావని వూరుకున్నాము. ఇక ఆలస్యం దేనికి?"
"ఇప్పుడేం తొందర నాన్నా? రిజల్ట్స్ రానివ్వండి!"
"నువ్వలాగే అంటావులే తల్లీ....నిన్ను పంపటం మాకుమాత్రం ఇష్టమనుకున్నావా? ఇది తప్పదు. ఆ బాధలోనే ఆనందమూ వుందమ్మా" అంటూ తల్లి వచ్చింది.
ఆమె గ్లాసునిండా మజ్జిగ తెచ్చి కూతురి కందిస్తూ అంది "ఎంతో సేపటినించి చదువు తున్నావు. ఇదికాస్త త్రాగు.
ప్రేమ నవ్వింది "నేను కష్టపడి చదివేది పాఠాలు కాదు కదమ్మా"
"ఏవైతే నేంలే - ముందు త్రాగు"
ప్రేమ గ్లాసునందుకుని సిప్ చేస్తూ కూచుంది.
"చూడండి ఆ గుంటూరు సంబంధం తాలూకు వివరాలన్నీ చెప్పండి."
"అబ్బాయి కేమని జవాబు రాస్తాము."
"వాడి ఉన్నది ఒక్కత్తి- మంచి కలవారింటికి స్తే సుఖపడుతుంది - నాకు తెలుసు. రేవతే యిలా రాయించింది.
ఆమె ముఖం క్రోధంతో కందగడ్డలా అయింది. ఆ వుత్తరంలోని సారాంశం ప్రేమ కవగాహనం అయింది.
"అబ్బాయి మంచివాడే. కుటంబం మంచిదే తెలిసిన కుటుంబం ఇదేవూరు...ఏమంటావు?"
"అన్నీ మంచివే ననుకోండి. కాని వాళ్ళకేముంది. అంతంత మాత్రం బతుకులు. ప్రేమకు అంతకన్నా గొప్ప సంబంధం తేలేనూ!
"మన మాటలకెం.ముందు ప్రేమ నడుగుదాం...ఏం తల్లీ ఇదిగో ఉత్తరం చదువుకుని నీ అభిప్రాయం చెప్పు."
"దాని అభిప్రాయం దేనికి" అనవసరంగా దాని మనసు పాడు చేయడం దేనికి?"
అతను నవ్వేశాడు. "నీకు చాలా కోపంగా వున్నట్లుందే!"
"కోపంగాక మరేమిటి? ఆమె ముఖం చిటపట లాడింది.
"అది సహజమే కదే! మంచి పిల్ల వుంటే అందరికీ ఆశగానే వుంటుంది. అందులో తెలిసిన వాళ్ళు.
"నాకీ అనుమానం ముందునుంచీ ఉన్నదేసుమా? ఈ పరీక్ష పాసై ఇతడు వెలగబెట్టింది లెక్చరర్ ఉద్యోగమేగా? ఆ మాత్రం ప్రేమ సంపాదించలేదూ? మనమేం కట్నం ఇవ్వలేదూ" పిల్లకేం తక్కువని తక్కువకు పోవాలి!
"నీవన్నది అక్షరాల నిజమే. నే కాదనను.." ఐనా ప్రేమను అడిగితే పోలా...
ప్రేమ గ్లాసుపెట్టి వచ్చే నెపంతో నెమ్మదిగా జారుకుంది. తన భావాలు ముఖంలో స్పష్టమౌతాయేమోనని భయపడింది.
తల్లిదండ్రులిద్దరూ తన వివాహం సంగతి తీవ్రంగా చర్చించు కుంటున్నారు. కాసేపటికి ప్రేమ తిరిగి తోటలోకి రావటంతో ఆయన అన్నారు. "గుంటూరు వాళ్ళను నిన్ను చూడటానికి రమ్మని రాస్తానమ్మా. అబ్బాయి తండ్రి ఇన్ కమ్ టాక్స్ ఆఫీసరుట. అబ్బాయొక్కడే కొడుకు. ప్రేమకు ఆ వివరాలన్నీ తెలిసికోవాలని కోరికలేదు. కాని కుతూహలం వుంది. అన్నయ్య ఉత్తరాన్ని యిమ్మని అడగటానికి ఆ కుతూహలం చాలదు. ఏమౌతుందో - తన భావి జీవితం ఎవరి సహచర్యంలో ధన్యమౌతుంది? అదేరోజు ఎవరిదో పెళ్ళి ఆహ్వానపత్రిక వచ్చింది. చిరాకుగా అరచింది - ప్రేమ ఆ రెండుపేర్లు ఆమె హృదయంపై సమ్మెట పోట్లయ్యాయి. అతడిపేరు కన్నా ఆమెపేరు ఆమె హృదయాన్ని కలవర పర్చింది. జాలితో హృదయం నిండిపోయింది. "పాపం- దుర్గ - ఆమెని చూడలేదుగానీ-ఎందుకో చిరపరిచితురాలిలా అనిపిస్తుంది. సుధాకర్ ఇప్పటికైనా చంచల స్వభావంమాని ప్రేమతో దుర్గను చూసుకొంటే బాగుండును." అనుకుంది ప్రేమ ఆనాడు వారంతా అనుకున్నట్లే జరుగుతోంది.
పెళ్ళికాకముందు ఏదో చపలత్వం - పిల్లకాయతనం- కాని వివాహానంతరం భార్యను అన్ని విధాల సంతోషపెట్టడమే కాకుండా ప్రేమిస్తోడని దుర్గ తల్లిదండ్రులనుకున్నారు. చాటు చాటుని లక్షకు బేరం చేసి దుర్గను అతడి చేతిలో పెట్టి హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ సంబంధం వారికెంతో తృప్తికరంగా వుంది. స్త్రీకోరే ప్రతిలక్షణం సుధాకర్ లో వుంది. దుర్గ ఆనందానికి అంతులేదు. మీ జీవితం మూడుపువ్వులారు కాయలుగా వర్దిల్లగలదని అందరూ ఊహిస్తున్నారు.
ప్రేమ మరోసారి కార్డు చదువుకొని పరీక్షగా చూచి వివాహం నిన్ననే అయిపోయిందని తెలుసుకొంది. కవరుమీది దస్తూరి క్రొత్తగా వుంది. సుధాకర్ ఎవరిచేతనో వ్రాయించాడు! ఆ దస్తూరీ సుధాకర్ ది అయినా తాను యిలాగే అనుభూతి పొందేది ఆమె మనసంతా దుర్గమీద సానుభూతితో నిండిపోయింది.
దుర్గ జీవితం సుఖమయం కావాలి.
సుధాకర్ తనకు శుభలేఖ పంపుతూ నవ్వుకొని వుంటాడు. విజయగర్వంతో విర్రవీగిపోయి వుంటాడు దుర్గలో ప్రేమ అంత అందం. సౌకుమార్యం - మార్దవం - విద్య లేకపోవచ్చుగాని - ధనలక్ష్మీ కటాక్షం వుంది. అందం క్షణికం - ఎవరో కవి అన్నట్లు కేవలం చర్మపు లోతు మాత్రమే. చీకట్లో అందానికేం విలువ వుంది. డబ్బుంటే అందానికి అందం వస్తుంది. లేని అందాన్ని కొనించు కోవచ్చు. ప్రపంచంలోని కంటికింపైన వన్నీ మూటగట్టి తెచ్చి కళ్ళకెదురుగా పెట్టుకోవచ్చు ప్రేమ ఆ శుభలేఖను సొరుగులో పడేసింది, ఆమె ఎంత క్షోభిల్లకూడదనుకున్నా హృదయంలో ఎక్కడో ఒకమూల సన్నటి బాధ. అది సహజం కాదా?
అన్నకు లేఖ వ్రాయాలి ఏమి వ్రాయాలో? ఈ రోజు ఏమీ జరగలేదు. ఆ శుభలేఖ ఇలా వస్తుందని ఎన్నడో తెలుసు అయినా ఇదికంట బడేసరికి హృదయంలో శాంతి దూరమైంది. పరధ్యాన్నంగా కూర్చున్న సమయంలో గీత వచ్చింది.
గీత రావటంతో ప్రేమ మొహాన సంతోషరేఖ మెరిసింది.
"అమ్మయ్య బ్రతికాను అన్నది గీత! నిట్టూర్పు విడిచి.
"ఏం?" అన్నది ప్రేమ ఏమీ ఎరుగనట్లు.
'ఇలా వుంటావనుకోలేదు. ఏదో దిగులుగా. విచారంగా ఉంటాడని హడలిపొయ్యాను."
"ఎందుకు?" కనుబొమ లెరగవేసింది ప్రేమ.
"సరేలే ఏమీ ఎరగనట్లు!"పరిహాసం చేసింది గీత ఓ గంట క్రితం సుధాకర్ గారి పెండ్లి శుభలేఖ వచ్చింది........... నీకూ వచ్చి వుండాలే - ఎట్లాగో - పెండ్లి అయిపోయాక అందేటట్లు వేశాడు మనకూ మంచిదే గ్రీటింగ్స్ అయినా పంప సవసరం లేదు-....ఈ శుభలేఖ చూచి తట్టుకున్నాడో లేదోనని పరుగెత్తుకొచ్చాను.
ప్రేమ పకపకా నవ్వింది.
"బాగానే తట్టుకోగల్గాను....కానీ దుర్గను తలంచుకుంటే జాలేస్తుంది"
ప్రేమ కళ్ళు వాల్చేసింది.
గీత స్నేహితురాలి ముఖంలోకి కొన్ని క్షణాలు తదేకంగా చూసింది ఆమె కంఠంలోని జీర ముఖంలో కదులుతున్న చీకటి ఛాయలను గమనించి దగ్గరగా జరిగి భుజం మీద చేయి వేసింది.
"ప్రేమా! ఏమిటిది" అని మందలించింది ప్రేమ జవాబుచెప్పలేదు.
నిమిషాలకు నిమిషాలే దొర్లిపోయాయి.
ఉన్నట్లుండి ప్రేమ అడిగింది "నువ్వు మరొకందుకు కూడా వచ్చానన్నావు. ఏమిటా విశేషం?
* * *
