Previous Page Next Page 
పేక మేడలు పేజి 13


    "ఏమోనండీ!"
    చటుక్కున భాను ముఖం వివర్ణమైంది. దీర్ఘంగా నా ముఖంలోకి చూడసాగింది. "నిజంగా అలా మారిపోతావా?"
    భానూ! అది నీ అంతరాత్మను అడుగు. జవాబు వస్తుంది."
    భాను నవ్వింది. భాను చెయ్యి పట్టుకొని విడిచి అల్లుణ్ణి ఎత్తుకు దించి వీధిలోకి నడిచాను.

                               *    *    *

    భాను ఆలోచనలే పట్టి నన్ను సదా వేధిస్తున్నాయి. భానుకైతే దైర్యం చెప్పాను గానీ నిజానికి నేను నమ్మింది జరుగుతుందా? అతనిలో పరివర్తన వస్తుందా? ఏనాటికైనా భర్త అనురాగం పొంది భాను సుఖిస్తుందా? ఎలానమ్మటం? భాను సుఖపడాలంటే నేనేం చెయ్యాలి? క్రమంగా బావతో స్నేహంచేసి ప్రాణానికి ప్రాణంలా తయారై అతని తప్పొప్పులు విప్పిచెపితే...? అప్పుడు అతడే నాకు నూరిపొయ్యడు కదా? నా ఆలోచనలకు ఒక దారిలేదు. భానును ఎప్పుడు చూడాలనిపించినా చూసి వస్తున్నాను. ఒకసారి భాను అడిగింది-"నీకు లైబ్రరీ పుస్తకాలు తెచ్చిపెట్టటానికి వీలుంటుందా అన్నయ్యా?" అని నేను భాను కళ్ళల్లోకి చూశాను. ఆ కళ్ళు నాకు ఎంతో చరిత్ర చెప్పాయి. భానుకు చదవాలనే కాంక్ష అత్యధికం. మనం తెలుసుకోవలసింది ఎంతో ఉంది. అది తెలియకుండా ఉండిపోవటం దురదృష్టం. కనీసం తెలుసుకోవటానికి ప్రయత్నమైనా చెయ్యకపోవటం అవివేకం! భాను అభిరుచులనుబట్టి చూస్తే ఒకనాటికి భాను పెద్ద రచయిత్రి అవుతుందేమో అనుకొంటూ ఉండే వాడిని నేను. భానుకు అవకాశాలు కల్పించి పోత్సహిస్తే ఫలితం ఉంటుంది.
    "ఇక్కడికి వచ్చిన దగ్గరినుంచీ ఎన్నో పుస్తకాలు చదువుదా మనుకున్నాను. మన టౌన్ లైబరీలో చాల పుస్తకాలు లేవు. కాని, ఎవరు తెచ్చి పెడతారు?"
    "పోనిద్దూ! ఇకనుంచి నేను తెస్తాను. సరేనా? నీ ఓపిక అంచనా వేసుకో. చూస్తాను, ఎన్ని చదువుతావో!"        భాను నన్ను ఒక సహాయం కోరిందంటే ఎంతో సంతోషంగా ఉంది. ఉత్త కబుర్లు గాక అన్నయ్యగా క్రియారూపంలో నేను భానుకు ఉపయోగ పడాలి. ఆ మర్నాడే సెంట్రల్ లైబ్రరీలో రెండు పేర్లతో సభ్యుడుగా చేరాను. ఒక్కొక్కసారే నాలుగేసి పుస్తకాలు తీసుకోవచ్చు. మొట్టమొదట చలం 'స్త్రీ' ఒక్కటే తీసుకు వెళ్ళాను. అది చూసి భాను అంది-"ఇది నా దగ్గిర ఉందిరా! దీన్ని గురించే మా ఇద్దరికీ ఘర్షణ జరిగింది" అని.
    "పుస్తకం గురించి ఘర్షణేమిటి?"
    "మరేవిటనుకున్నావు? ఈ ఇంట్లో తగువు పెట్టగలిగే శక్తి చీపురు పుల్లకికూడా ఉంది. అది గాని నానిగాడు ఏ గదిలోకొ తెచ్చి పడేస్తే ఆరోజు చిన్న యుద్ధం! సరే! పుస్తకం అంటావా? ఈ 'స్త్రీ' నేను చదవటం చూసి బావగారు మండిపడ్డారు. 'చలం పుస్తకాలు నువ్వు చదవటానికి వీల్లేదు?' అన్నారు.
    'ఎందుకని?' అన్నాను.    
    'అవి ఉత్త చెత్త! వాటిలో ఏమీ లేదు.'
    'ఆ సంగతి చదివితే కదా మీకు తెలిసింది?'
    'అక్కర్లేదు. నేను చెప్తున్నాను. ఆ పుస్తకాలన్నీ చెత్త!'
    'కావచ్చు! ఆ సంగతి స్వయంగా నన్నే తెలుసుకోనిస్తే మంచిది.'
    'నోర్ముయ్! నేను చెప్తూంటే వాదించకు. నువ్వు మనిషివా? పశువ్వా?'
    'మనుషులకు మనిషిని! పశువులకు పశువుని!'
    'ఈ చెంపలు ఇంత బండబారిపోవటానికి కారణం అటువంటి సంఘటనలూ, అటువంటి సంభాషణలే! కోపంతో పళ్ళు పటపట కొరుకుతూ నా చేతిలో పుస్తకం లాక్కుని ముక్కలు ముక్కలుగా చించిపారేశారు. నా హృదయం భగ్గుమంది. నేను మనఊరు వెళ్ళినప్పుడు పట్టుదలగా చలం పుస్తకాలన్నీ దొరికినంతవరకూ కొని దాచాను. తప్పంటావా? అధికారంతో ఎవరైనా ఎవరినైనా మార్చగలిగినట్టు విన్నావా?"
    నాకు చాల విచిత్ర మనిపించింది. అతను మగవాడే కావచ్చు; భర్తే కావచ్చు; అంతమాత్రాన ఒక పుస్తకం చదివే విషయంలో తన అధికారం చెలాయిస్తే ఒక వ్యక్తికి తనకు కావలసిన పుస్తకం చదువుకునే స్వేచ్చ లేకపోతే...?    
    "ఛీ! ఏమిటంత మూర్ఖత్వం?"    
    "మూర్ఖత్వమేమీ కాదు-ముందుచూపు! చలం పుస్తకాలు చదివితే స్త్రీకి నిజం తెలుస్తుంది. తిరుగుబాటు తత్వం అలవడుతుంది. అది జరిగినా, మానినా పురుషుడికి ఆ భయం ఉంటుంది."
    నేను కొంతసేపు మౌనంగా ఉండి అడిగాను: "చలంమీద నీ అభిప్రాయం?"
    "చలం వాదం న్యాయమైనది. అంతవరకే. అనుసరించటానికి వీలైంది కాదు."
    "న్యాయాన్ని ఎందుకు అనుసరించకూడదు?"
    "ఈనాడు న్యాయాన్ని అనుసరించి బ్రతుకులు సాగటం లేదు గనక. ఆ న్యాయం పది మందీ ఆమోదించరు గనక... ఒక పుస్తకం చదవటానికి కూడా స్వేచ్చలేకపోతే ఎలా?- అంటున్నావు గానీ దానిలో స్వార్ధమో మరొకటో కొంత అర్ధమైనా ఉంది. మా అమ్మకి నేను ఉత్తరం రాసుకోటానికి కూడా ఆ వ్యక్తి ఆజ్ఞ కావాలంటే నమ్ముతావా? ఒకసారి ఈయన మన ఊరు పండక్కి వస్తే వాళ్ళు చేసిన మర్యాద చాలలేదట. మరోసారి లంఖణాలుపడి లేస్తే వాళ్ళు చూడటానికి రాలేదట. వాళ్ళకి ఉత్తరాలు రాయటానికి వీల్లేదని ఆజ్ఞాపించారు. నిజమే. ఏదో కారణంగా ఆయనకి కష్టం తోస్తే తోచవచ్చు. మధ్య నన్ను ఉపయోగించుకోవటం ఏమిటీ? ని నా ప్రశ్న."
    "నీ ప్రశ్నలకీ, మీ ఆయనకీ తలో నమస్కారం గాని నువ్వు నిశ్చింతగా కూర్చో! మర్యాద చెయ్యకపోటానికి వాళ్ళేం పిచ్చివాళ్ళా? వందలమైళ్ళ ప్రయాణంచేసి చీటికీ మాటికీ రావాలంటే మాటలా?"
    "మే మిద్దరం పండుగకి వెళ్తున్నప్పుడు స్టేషన్ కెవళ్ళూ రాలేదురా! అదీ గొడవ. ఇంటికి వెళ్తూనే అలిగి పడుకున్నారు. పదిమందిలో నా పరువు తియ్యద్దని కాళ్ళావేళ్ళా పడి బ్రతిమాలాను. వినలేదు. చేసేదిలేక అమ్మతో అన్నాను. అమ్మ తప్పు ఒప్పుకొని ప్రాధేయపడితే లేచి టిఫిన్లు ఆరగించారు."
    "ఎక్కడి కక్కడ ఇలా తప్పులుంచుతూంటే...."
    దొడ్డి తలుపు చప్పుడైతే భాను లేచివెళ్ళింది. ఐదు నిమిషాల్లో తిరిగివస్తూ-"నీ దగ్గర రెండు రూపాయలున్నాయేమిటి?" అంది.
    "ఐదు రూపాయల నోట్లు ఉన్నట్టున్నాయి. చిల్లర లేదు. ఎందుకు?"
    "చెప్తానుగానీ అదేదె ఒకటి ఇవ్వు."
    పర్స్ తీసి ఒక నోటు ఇస్తే దొడ్డివేపుకు తీసుకు వెళ్ళింది. ఎవరో పక్కింటావిడ వచ్చినట్టుంది. కొంచెం మాటలు వినిపిస్తున్నాయి. "ఐదు రూపాయలెందుకమ్మా! తీసుకోగానే సరా? ఒక్క రూపాయిన్నర..."
    "ఫర్వాలేదు తీసుకోండి బామ్మగారూ! మీరు తీర్చనూ వద్దు. ఏమీ వద్దు. ఓ పదిరోజుల్లో వచ్చేసెయ్యండి, ఎప్పుడూ ఉండే గొడవలేకదా?"
    "అమ్మా! నీకు తెలియంది ఏమీలేదు. బ్రతుకు ఎంత నవ్వులపాలయిందో చూశావా? నా మాట కేంగానీ నువ్వు జాగ్రత్త! చీటికీ మాటికీ బెంగ పెట్టుకోకు! పిల్లాణ్ణి జాగ్రత్తగా చూసుకో. అన్నట్టు రాజుని కాస్త కనిపెట్టి ఉండు తల్లీ-మీ అన్నయ్యకి డబ్బు ఇవ్వకపోతే..." ఆవిడ గొంతు ధ్వని భారంగా ఉంది.
    "మరేం ఫర్వాలేదండీ! వాడి డబ్బూ నా డబ్బూ వేరు వేరు కాదు."
    "మరి వెళ్తాను."
    "మంచిది బామ్మగారూ! మళ్ళా మీరు వచ్చే వరకూ నాకు ఏదో వెల్తిగా ఉంటుంది."
    భాను లోపలికి వచ్చింది, నిట్టూరుస్తూ. పక్కన కూర్చుంది.
    "ఏమిటో అన్నయ్యా! ఈ మనుషుల్నీ, ఈ జీవితాలనీ తల్చుకుంటే ప్రశ్నలే మిగుల్తాయి. పాపం బామ్మగారు కూతురింటికి వెళ్ళిపోతున్నది. అదంతా కోడలి ప్రయోజకత్వం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడ ఆ ఇంటికి నియంత! భర్తనీ, అత్తగార్నీ కోపం వస్తే ఎండలో కూడా నిలబెట్టగలిగే శక్తి మంతురాలు! అత్తగారిమీద ఏ క్షణంలో దయతప్పితే ఆ క్షణంలోనే ఇంట్లో నుంచి తరిమివెయ్యగలిగే సాహసవంతురాలు! ఇంకా చెప్పేదేముంది? ఆ ఉన్న ఒక్క ఆడబిడ్డనీ ఏడాదికోసారి కూడా ఇంటికి పిలిపించదు. ఇంకా స్కూల్లో చదువుతున్న మరిది ఒకడున్నాడు. అతనే రాజు. అతను ఆ ఇంట్లో నౌకరు! ఆవిడ అపురూపంగా చూసుకొనే కన్నపిల్లలు ఇద్దరున్నారు. వాళ్ళ సంరక్షణంతా బామ్మగారే చూస్తుంది. వంటపని చేస్తుంది. వెట్టిచాకిరీ అంతా చేస్తుంది. రాజు నూతి నీళ్లన్నీ తోడి పోస్తాడు. బజారు పనులు చూస్తాడు. పిల్లల నిద్ధర్నీ షైరు తిప్పుతాడు."
    "ఇక ఆ రాణీగారేం చేస్తుంది?"
    "వినరా! రాణీగారు మొగుడుగారితో పేకాడుతుంది. సినిమాలు చూస్తుంది. షికార్లు చేస్తుంది. పిక్నిక్ లకి వెళ్తుంది. పరిచితులను మిత్రులను కలుసుకుంటుంది. మహిళా సమాజాలకూ, లేడీస్ క్లబ్బులకూ తిరుగుతుంది. ఈ డ్యూటీలన్నీ చాలవూ? ఎంత బిజీగా ఉంటుందనీ! ఇంకా ఖాళీ మిగిలిపోతే అత్తగారితో దెబ్బలాడుతుంది. మరిదిని తిట్టి పోస్తుంది. మొగుణ్ణి బెదిరిస్తుంది. అక్కడితో అలిసిపోతుంది-ఆవిడ కలవారి కూతురు. చాలా సంపద తెచ్చుకుందట. అగ్గి పెట్టెతోసహా వెండి దేను. అందుకే మిడిసిపాటు. మంచి చెడ్డలు విస్మరించింది. ఒకసారి ఆవిడ ఏదో కూర వండమని హుకుంచేస్తే బామ్మగారు కూరలు ముదిరి పోయాయి కదా అని పులుసు పెట్టిందట. తీరా రాణీగారు భోజనానికి వచ్చేసరికి నానా భాగోతం అయింది. అత్తగారిని నానా మాటలంది. ఆ పులుసు ముట్టుకోటానికైనా వీల్లేదని మొగుడుగార్ని ఆజ్ఞాపించింది. అతను తలదించుకు మరోకూరతో అన్నం తినేస్తున్నాడు. బామ్మగారికి దుఃఖం వచ్చింది. 'నాయనా! నేను చేసింది తప్పుపనట్రా? అంతమాత్రానికి అది నన్ను నానా మాటలంటే నువ్వు వింటూ కూడా...' 'పోనీ అమ్మా! దాని మాటలకేంగానీ అది చెప్పినట్టే చేస్తే పోయేదికదూ?' అన్నాడట. చూశావా? ఎంత చిత్రమైన విషయమో!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS