"నే నిప్పుడెం చేశానక్కా!"
"........"
"అక్కా! దేవదాసు పిక్చర్ మార్నింగ్ షో ఆడుతోంది . నేను వెళ్లిరానా?"
అరుంధతి చిన్నగా శబ్దం చేస్తూ నవ్వింది. "కలలో కూడా మరిచిపోవు ఆ అభాగ్యుడిని. అక్కడికి వెళ్లి స్క్రీను ముందు కూర్చుని వేళాకోళం ఆడతావా?'
"వినిపించదు కదా?"
"గట్టిగా మాట్లాడు."
"అలాగే అక్కా. రేపు స్క్రీను ఇంట్లోనే క్రియేట్ చేస్తాను. నువ్వూ బావా కూడా సిద్దంగా ఉండండి. మరి నేను అలా గుళ్ళో కి వెళ్లొస్తాను. నేను వచ్చేక నువ్వు వేడుడువు గాని?" శ్యామల చెప్పులు టకటకలాడుతున్న శబ్దం హరికృష్ణ కి వినిపించింది. 'క్షణం' ఎవరీ దేవదాసు అని ప్రశ్నించు కున్నాడు.
పది గంటలు కాకముందే ఆ పిల్ల గుడికి వెళ్లి పోయింది.
"గిరిజ ఏం చేస్తున్నదో? బహుశా పిల్లా పాపలతో పండుగ జరుపుకుంటూ ఉంటుంది కాబోలు" హరి కృష్ణ మనసు వశం తప్పి కన్నుల్లో నీరు చిలికింది.
హరికృష్ణ చటుక్కున లేచి కూర్చుని పుస్తకాన్ని షెల్ఫు లోకి తోసేసి బట్టలు మార్చుకుని చెప్పుల్లో కాలు పెట్టి బయటికి వెళ్లిపోయేడు.
గంట గడిచేక శ్యామల ఇల్లు చేరుకున్నది. అప్పటికి అరుంధతి చిట్టి బాబుకి స్నానం చేయించి బట్టలు వేయసాగింది. చెల్లెల్ని చూశాక ఏదో గుర్తుకు వచ్చిన దానిలా కుడిచేతి చూపుడు వేలు మధ్య వేలు క్షణం ముక్కు దగ్గర ఆడించి, "చూడు, చిట్టి బాబూ! ఈ రెండు వేళ్ళలో నీకు ఏది కావాలి?' అని అడిగింది.
చిట్టి బాబు చూపుడు వేలు పట్టుకోగానే వాడిని ముద్దుల్లో ముంచెత్తింది.
"ఎమిటక్కా కోరుకున్నావు? ఆడపిల్లా, మగపిల్లాడా అనా!' శ్యామల నవ్వుతూ అడిగింది.
అరుంధతి చిరాకుగా మొహం పెట్టి , "నీ మొహం! అదేం కాదు. కాయా పండా అనుకున్నాను. పండు అన్నాడు చిట్టి బాబు. చిట్టి బాబు పసివాడు. వాడన్నది నిజం అవుతుంది. ఆ నమ్మాకం నాకుంది." అన్నది గంబీరంగా మారిపోయి.
"అక్కా! అతను తలుపు గొళ్ళెం పెట్టి వెళ్ళాడు. బహుశా చంద్రముఖి ఇంటికేమో!" అన్నది అరుంధతి కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోతూ.
సాయంత్రం నాలుగు గంటల వరకూ మెడ మీద తనగదిలో చదువుకుంటూనే ఉంది. హరికృష్ణ వస్తాడేమో మాటల్లో పడేసి గేలి చేయవచ్చునని ఆశిస్తూ క్షణ క్షణం కిటికీ గుండా వీధి వాకిలి వైపు చూడసాగింది. కానీ అతని జాడ జవాబే లేదు. ఎనిమిది గంటల వరకూ రాడని నిర్ణయించు కున్నాక మేడ దిగి కాఫీ తాగి చిట్టి బాబుని సైకిలు మీద కూర్చో బెట్టుకుని ఆవరణ చుట్టూ తిరగ సాగింది. దృష్టి సైకిలు మీదా, పిల్లాడి మీదా ఉన్నా ఆలోచనలు అందుకు భిన్నంగా ఉన్నాయి. చిట్టి బాబు ఉన్నట్టుండి "పిన్నీ! మామయ్య అడుగో" అన్నాడు గేటు వైపు చూపిస్తూ. ఉలిక్కిపడి చూసేసరికి సూర్యనారాయణ, విజయ కుమార్ కారు దిగి గేట్లోంచి రా సాగారు. సైకిలు ఆపి ఆలోచిస్తూ రమ్మనాలో, లేదో తేలక నిలబడి పోయింది.
"హరి ఉన్నాడా అమ్మా?' సూర్యనారాయణ అడిగేడు.
"లేరండి" అన్నది తలెత్తి.
"ఎక్కడికి వెళ్ళాడో తెలుసాండీ?' విజయ కుమార్ అడిగేడు.
"లేదండీ."
"వస్తే మేము వచ్చినట్లు చెప్పండి. జగన్నాధానికి ఫోన్ చేస్తాం. పద, సూర్యం" అన్నాడు వేను తిరుగుతూ.
సైకిలు ఆపేసి లోపలికి తీసుకు వెళ్ళిపోయింది చిట్టి బాబుని.
"అక్కా, అతను రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏమో" అన్నది బెంగగా.
అరుంధతి తీక్షణంగా చూస్తూ తమాయించుకుని అన్నది: "నీకేం పిచ్చా శ్యామలా! బయటికి వెళ్ళిన వాడు రాకుండా ఉండదు. కాకపోతే కొంచెం ఆలస్యం అవచ్చును. నువ్వు చదువుకోకుండా ప్రోద్దంతా ఈ ధోరణి నాకేం నచ్చలేదు.
నిన్న కాక మొన్న వచ్చిన వాడు అతని పట్ల నీకేదో ఆసక్తి ఉందని కాదు నేను అనేది. ఏ వాదు వచ్చినా ముందది శంఖుస్థాపన ఇంట్లోంచి ప్రారంభం అయి సౌధాలు లేచేందుకు అంకురార్పణ అవుతుంది.
"మంచి చెడుల గురించి పెద్దదాన్నో, అక్కనో ఏదో విధంగా నీకు చెప్పవలసిన బాధ్యత నాపై ఉన్నది. మనం నిరుపేదలం. అయన దయా బిక్ష తో బ్రతుకుతున్న వాళ్ళం. కాలం కూడి రాకపోతే కర్ర పామై కాటేసే ప్రమాదం ఉంది. మన గతాన్ని అలోచించి ప్రస్తుతానికి సమన్వయం చేసి నడుచుకుంటే అందరికీ మంచిది. వాగి చేడేది ఆడదే, శ్యామలా!"
"అక్కా!"
"నా ఇంట నువ్వుంటున్నావని అధికారం చెలాయిస్తున్నా ననుకోకు. మనం జాగాన్నాధం గారి ఇంట ఉంటున్నామనే ధోరణి లోనే ఉన్నాను. ఒక రక్తం పంచుకు పుట్టినందుకు నాకీ బాధ."
"అక్కా! అయితే నేను హద్దు మీరి ప్రవర్తిస్తున్నాననే అనుకుంటున్నావా?"
"అదేం లేదు. ఈ గోడలకి చెవులతో బాటు వేల కొలది కళ్ళు ఉన్నా బాగుండి పోయేది. కానీ, అదేమీ జరగలేదు. ఇంట తిన్న నౌఖర్లె మనల్ని మాటలనే ప్రమాదం ఉంది." అరుంధతి కళ్ళ నీళ్ళ చెరువు లయేయి. " నా గురించి , నా జీవితం గురించీ నేనెన్నడూ బాధపడలేదు, శ్యామూ. నాకు భగవంతుడు ఇంతే ప్రసాదించాడని సరిపెట్టు కున్నాను. ఈడూ జోడూ గల దాంపత్యం తప్ప స్త్రీ ఈ ప్రపంచంలో మరొకటి కోరుకుంటుందనుకోకు. అదే మృగ్యం అయిపోతే బ్రతుకంతా వేదాంత మయంగా కనిపిస్తుంది. అయితే, అక్కా, ఈ అలంకరణ లూ, క్లబ్బు సమావేశాలూ ఇవన్నీ నువ్వు ఆనందించకుండానే చేస్తున్నావా? అని అడుగుతావేమో . యజమాని సంతృప్తి కోసం దాసీ చాలా చాలా చేయాలి. నీకు అడుగడుగునా హితబోధ చేయడం నామీద నాకే అసహ్యం వేస్తున్నది. అయినా తప్పదు పసివాడు ఎర్రగా కాలే ఇనప ముక్కని చూసి అట వస్తువని భ్రమిస్తాడు. చూస్తూ చూస్తూ వాడి ఆనందం కోసం అవి ముట్టుకోనివ్వలెం కద!"
"అక్కా!" అంటూ శ్యామల కౌగలించు కుంది. శ్యామల గొంతులో అప్పటికే మార్పు వచ్చేసింది. "నన్ను నమ్ము అక్కా! అతని త్రాగుడు చూస్తె నీకు జాలి వేయడం లేదూ?"
"పిచ్చి శ్యాము! ఎవరు రగుల్చు కున్న కట్టే వాళ్ళతో బాటే దగ్ధం అవుతుంది. మనం సంస్కరించాలనుకోవడం వెర్రి పని. సమాజం చాలా పెద్దది. ఇటువంటి మనుషులు వేలల్లో ఉన్నారని తెలిసినా ఆశ్చర్య పడ నవసరం లేదు. పరాదికారం పైన బెట్టుకుని ఒండ్ర బెట్టిన గాడిద సామెత కాకూడదు. ఏది ఉచితమో, ఏది అనుచితమో ఆలోచించే జ్ఞానము వయసూ భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి."
"నన్ను నమ్ము అక్కా, అతన్ని బాగుచేయాలని తప్ప నాకు మరో ఊహే లేదు. నేనసలా ....ఛ! నువ్వెంత అపార్ధం చేసుకున్నావు నన్ను!" అన్నది కౌగిలి లోంచి దూరంగా జరిగి కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ.
అరుంధతి మరి మాట్లాడలేదు. "అమ్మా, ఆకలేస్తున్నది.' అంటూ వచ్చేడు చిట్టి బాబు. వాడిని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. చీకటి పడిపోయింది. వీధిలో దీపాలు వెలిగి చాలా సేపే అయింది. నౌకర్లు దీపాలు వెలిగించారు. ఏడున్నర వరకూ లైట్లు రాలేదు కరెంట్ లేకపోవడం వల్ల. ఎనిమిది గంటలు దాటుతుంటే హరికృష్ణ రెండు కాళ్ళ మీద బలాన్ని సమానంగా ఉపయోగించి తూలబోతూ నిలదొక్కుకుంటూ లోపలికి వచ్చేడు. అతను వచ్చీ రావడం తోనే గదిలోకి దూరి తలుపులు బిడాయించు కున్నాడు.
శ్యామల అక్కతో బాటు ఫలహారం చేసి పైకి వెళ్లి పోయింది. పది గంటలకి జగన్నాధం వస్తూనే "హరీ!' అని కేక పెట్టాడు.
"అతను ప్రొద్దు టి నుంచీ ఇంట లేడు. ఇప్పుడే వచ్చేడు. మీరు బట్టలు మార్చుకోండి. తరవాత వెళ్లి పిలుద్దురు గాని" అన్నది అరుంధతి అతని కోటు విప్పుతూ.
"అలాగా!' అన్నాడు జగన్నాధం తల పంకించి. కోటు విప్పి భార్య చేతికి అందించి, హరికృష్ణ గది దగ్గరిగా వెళ్లి రెండు మూడు సార్లు పిలిచేడు. కానీ, ప్రయోజనం లేకపోయింది. తలుపు నెట్టినా లాభం లేకపోయింది. ఆఫీసు రూమ్ లోంచి లోపలికి ఉన్న ద్వారాన్ని హరికృష్ణ మైకం లో బిగించడం మరిచి పోయేడు. జగన్నాధం లోపలికి ప్రవేశించి ముడుచుకు పడుకున్న అతడిని తట్టి లేపి, "హరీ, భోజనం చేశావా?" అని ప్రశ్నించేడు.
హరికృష్ణ కళ్ళు తెరిచి చిత్రంగా నవ్వి, "హరి...ఇంకెక్కడి హరి? హరీ మన్నాడు వాడేప్పుడో. నువ్వింతకీ అడదానివా? మగాడివా? మరేం లేదు . ఈవేళ రోజు చాలా మంచిది. పెద్ద డయల్ దొరికింది. నువ్వు మగాడివే. బ్రదర్ , వింటున్నావా?!" అన్నాడు.
జగన్నాధం లేవదీసేందుకు ప్రయత్నించి విఫలు డయేడు.
"నాంపల్లి వెళ్ళేను. ఎందుకని అడక్కు. నేను చెప్పేది విన్న వాళ్ళంతా నా బ్రదర్స్. మీరు చెప్పేది వినమంటే మాత్రం నాకు చిర్రెత్తుకు వస్తుంది.చిరాహోగల్లి దగ్గిర....చాలాసేపు కాలేదు. ఇప్పుడే ఐ మీన్ వన్ అవర్ బేక్. రిక్షా లో వస్తున్నాను. నా పక్క నుంచి మరో రిక్షా దూసుకు పోయింది. అందులో ఆడది నన్ను పిలిచింది. తెలిసిన మనిషేమో అనుకున్నాను. ఎక్కేశాను. జేబులో ఎంతుందో చూడు!"
ఖాళీ జేబులు నవ్వుతున్నాయి వెకిలిగా. జగన్నాధం మాట్లాడలేదు. హరికృష్ణ చెప్పేది వివరంగా లేకపోయినా అర్ధం చేసుకో గలిగెడు. అతని మాట చాలా ముద్దగా ఉంది. "కొంచెం మజ్జిగ తాగుతావా?" అని అడిగాడు లేస్తూ.
"నో, అదంటే ఎలర్జీ నాకు, నన్ను డిస్టర్బ్ చేయవద్దు. స్వర్గ లోకంలో ఉన్నానోయ్. నరకం లోకి ఈడ్చేయకు నన్ను!" హరికృష్ణ మాట్లాడలేదు ఆ తరవాత. గోడ వైపుకి తిరిగి కటికి నేలమీద పడుక్కున్నాడు. జగన్నాధం గది బయటికి వచ్చేసి దీర్ఘంగా నిట్టూర్చి అరుంధతి ని పాలు తెమ్మని కేకవేసి తను లోపలికి వెళ్లి పడుకున్నాడు.
పదిహేను రోజులు ఈ విధంగా గడిచి పోయేయి. హరికృష్ణ లో మార్పు వస్తుందని ఆశపడ్డ జగన్నాధానికి నిరాశ ఎదురైంది. మరో నెల రోజులు గడిచే సరికి శ్యామల పరీక్షలు కూడా పూర్తయేయి. ఈ మధ్య కాలంలో శ్యామల ఉన్న జాడయే తెలియలేదు.
