Previous Page Next Page 
పేక మేడలు పేజి 12


    పుస్తకం మూసి పచార్లు ప్రారంభించాను.
    చటుక్కున ఆగి, "భానూ, అగరవత్తుల చెట్టుకొన్నానన్నావ్ ఏది? ఎక్కడా కన్పించదేం?" అన్నాను.
    "అయ్యో! అది ఇన్నాళ్ళు ఉందా? ఎప్పుడో నామీద కోపం వచ్చింది. అది ముక్క ముక్క లైంది. ఎలాంటి వస్తువుగానీ నేలకేసి కొట్టటమే. నా చేతినుంచి కప్పుజారిపడితేనే ఒక యుద్ధం జరుగుతుంది. మరి తనకై తను కావాలని బద్దలు కొడితే అది అడిగేవాళ్ళు లేరు. అయినా సంపాదనపరులు. ఏది పగలగొట్టినా తిరిగి కొంటారు. నేనుపాడుచేస్తే ఎలాతేగలను?"
    భానుకు ఈ మానసిక బాధలవల్ల కొంత చాదస్తంగా మాట్లాడటం కూడా అలవాటై పట్టుంది.
    రాత్రి తొమ్మిది గంటలయింది, బావ వచ్చే సరికి. ఆ మొహంలో ఎన్నడూ లేని దౌర్జన్యం, కాఠిన్యం కొట్టవచ్చినట్టు కన్పిస్తున్నట్టు అనిపించింది నాకు.
    "ఏమిటండీ, అలా చూస్తున్నారు? భోజనాలయ్యాయా?" అని పలకరించేసరికి తేరుకొని, "ఆఁ ఆఁ నేను భోంచేశాను. భాను మీకోసం కాబోలు ఉండిపోయింది" అన్నాను.
    "ఓహ్! పతివ్రతాలక్షణం కాబోలు" అంటూ నవ్వి తువ్వాలు అందుకొని వెళ్ళిపోయాడు. అతను నోరువిప్పితేనే వ్యంగ్యం ధ్వనిస్తుందేమో అనిపించింది. కొందరి లక్షణమే అంత. వీధి అరుగు మీది కెళ్ళి నించున్నాను.
    బావ ఒక విపరీతమైన వ్యక్తి, కాని నాకు ఎక్కడో ఏదో నమ్మకం ఉంది. అతనిలో ఒక నాటికి పరివర్తన వస్తుంది. అన్నివిధాలా తన తప్పిదాలను తెలుసుకుంటాడు. ఆ కాఠిన్యం, దౌర్జన్యం-అన్నీ సమసిపోతాయి. మనిషి మనిషిగా మిగులుతాడు. అదిమాత్రం నిజం. దానికి వ్యవధి కావాలి. ఓర్పు వహించాలి. అదే మార్గం.

                                  * * *

                  

    మర్నాడు నేను వెళ్ళిపోయేముందు భాను ఏదో చెప్పాలనుకొంటున్నట్టు తటపటాయించింది. "అన్నయ్యా!" అని ఆగిపోయింది. ఏవిటన్నట్టు చూశాను.
    "అన్నయ్యా! ఇప్పుడు నీ ఎదుట నిలబడాలంటే నాకు సిగ్గువేస్తోంది. నా ఇంట్లోనే నాకు గౌరవం లేదని తెలిస్తే ఎవరైనా నన్ను గౌరవిస్తారా? తీగ కదిలితే డొంకంతా కదిలినట్టు నిన్న ఎందుకో అలా సోదెలా చెప్పుకుపోయాను. అన్నీమరిచిపో అన్నయ్యా! నీ దృష్టిలో మా ఇద్దర్నీ చులకన కానివ్వకు." దాదాపు భాను కళ్ళు నిండిపోయాయి. గొంతు రుద్ధమైంది. అదో మాదిరిగా నవ్వుతూనే ఉంది.
    భాను భుజంమీద చెయ్యి వేశాను. "అయిందా నీ ఉపన్యాసం? పిచ్చిభానూ! అన్నయ్యని ఇంత గొప్పగా అర్ధం చేసుకున్నావన్నమాట! నువ్వు ఎన్ని చెప్పినా బావని నేను అపార్ధం చేసుకోలేదు. ఒకవిధంగా ఆలోచిస్తే బావని క్షమించాలి. ఎన్ని తిట్లు తిట్టి ఎంత కోపంతో వెళ్ళిపోయినా ఇంటికి వచ్చేసరికి అన్నీ మరిచిపోయి తనంతట తాను పలకరిస్తాడు. అవునా?"
    "అవును. నాకు కోపం వచ్చినప్పుడు నా అంతట నేను ఎప్పుడూ మాట్లాడను. ఏదో విధంగా బావే మాట్లాడిస్తారు."
    "బావలో మంచితనం కూడా లేకపోలేదు భానూ! అది నువ్వు గ్రహించావా?"
    "కుండెడు విషంలో ఎంత అమృతం కలిపినా అది వృధా కావటం తప్పితే లాభం లేదన్నయ్యా! బావలో ఏదో మంచితనం ఉంటే ఉండచ్చు. అది నా అనుభవానికి మాత్రం రావటంలేదు. ఎదుటి వ్యక్తినుంచి మంచి పొందుదామనీ, సుఖ పడదామనేగదా ప్రయత్నిస్తాం? అదే జరగటం లేనప్పుడు ఏం చూచుకొని నన్ను సంతోషపడమంటావు? ఈ రోజు ఏదో కారణంగా ఒక గంట సంతోషంగా ఉన్నానంటే.... తర్వాత కొన్ని రోజుల వరకూ మరేదో కారణంగా ఈ సంతోషానికి శిక్ష అనుభవిస్తాను."
    "బావ అవివేకంగా ఉన్నాడు భానూ! నువ్వు మాత్రం ప్రతి విషయం ఆలోచిస్తూ మనసు పాడుచేసుకోకు. అతను కోపంలో అనే ప్రతి మాటా నిజమని బాధపడకు. ఒకనాటికి బావ పూర్తిగా మారిపోతాడు భానూ!"
    భాను మాట్లాడలేదు. నేను తిరిగి అన్నాను "బావ పెరిగిన పరిస్థితులే అంత కఠినంగా ఒంటెత్తు మనిషిగా తయారు చేశాయి. నవ్వు వచ్చేవరకూ అతను ఏవిధంగానూ స్త్రీ ప్రేమ ఎరుగడు. తల్లి అనురాగంతో, అక్కచెల్లెళ్ళ అభిమానాల మధ్య పెరిగితే ఆడవాళ్ళ కష్ట సుఖాలు అర్ధమయ్యేవి. కాని అతనికి మంచి చెడ్డలు చెప్పేవాళ్ళు లేరు. చేసిన తప్పుకి దండించే వాళ్ళు లేరు. గాలివాలుకి తిరిగి పెరిగిన వ్యక్తికి మంచి అలవాట్లు ఎలా వస్తాయి చెప్పు? మనం ఒక మనిషిని తొందరపడి విసర్జించ కూడదు. ఏదోవిధంగా అతన్ని మార్చటానికే నువ్వు ప్రయత్నం చెయ్యాలి. అదే చెయ్యటం లేదు నువ్వు. ఒక తప్పుపని చేశాడని విమర్శించటం, ఒక మాట అంటే బాధపడటం, అక్కడితో పంతం పట్టి కూర్చోటం-ఇదంతా ఏమిటిచెప్పు? నువ్వు నన్ను అపార్ధం చేసుకోవద్దు. నేను చెప్పింది సబబు కాదంటావా? ఆలోచించు భానూ!"
    "అన్నయ్యా! నామీద నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా నేను చెబుతున్నది నిజమని నమ్ముతావు, బావను మార్చటానికి నేను ప్రయత్నమే చెయ్యలేదంటున్నావు. అది మాత్రం నిజం కాదు. నేను ఎన్నో ఆశలు పెట్టుకొని కాపురానికి వచ్చాను కొన్నాళ్ళు-నేనేమీ తెలుసుకోలేనన్నాళ్ళు సుఖంగా గడిచింది. కానీ క్రమంగా బావ ఏమిటో అర్ధం కాసాగింది. రోజుకి అయిదు ప్యాకెట్ల సిగరెట్లు కాలుస్తూంటే, అర్ధరాత్రుళ్ళు దాటి ఇంటికివస్తూంటే, సెలవు రోజులు పూర్తిగా జాడ లేకుండా తిరుగుతూంటే, ఏమాత్రం పొరపాటు జరిగినా నిరభిమానంగా కేకలేస్తూంటే-కొత్తలో ఏం జరిగినా ఆశ్చర్యపడేదాన్ని. నాలో నేనే ఆలోచించుకొంటూ కూర్చునేదాన్ని. అప్పుడు నాకు నిజంగా బాధ అనిపించేదికాదు. నెమ్మదిగా చెప్తే ఆయనే వింటారు. సంసార బాధ్యతలు ఆయనకు లేవేమిటి? అనుకొన్నాను. మొట్టమొదట్లో ఆయన చేసిన ఏ చెడ్డపనిలోనూ నేను గట్టిగా కలగజేసుకోలేదు. ఎన్నో విధాల ఎంతో నెమ్మదిగా అడుగుతూ వచ్చాను.    
    'మీకు సిగరెట్లు చాలా ఇష్టంలా ఉంది'.
    'ఉత్త ఇష్టం కాదు. ప్రాణం.'
    'నెలకి మీ ప్రాణానికి ఎంతఅవుతుందేమిటి?'
    'ముఫ్ఫై పైన.'
    'అంత డబ్బు కాల్చి పారేసినట్టు అయిపోవటం లేదూ?'
    'నీకు తెలీదు భానూ! అవిలేకపోతే ఉండలేం.'
    'ఇప్పుడు మీ ఖర్చులు పెరిగాయి తెలుసా? మరి నేను కూడా ఉన్నాను.'
    'అయితే...'
    'చూడండి. పొగ అంతగా పీల్చటం ఆరోగ్యానికి కూడా మంచిది కాదంటారు. మీరు క్రమంగా తగ్గించుకుంటే బావుంటుంది కదూ?'
    'ఆఁ చూద్దాంలెద్దూ.'
    'అంతే! ఆ చూద్దాం-చూద్దాంలాగే ఉంది. తర్వాత మరోసారి అడిగితే ఏదో చెప్పారు. మరోసారి హెచ్చరిస్తే కోపం వచ్చింది. కొన్నాళ్ళు పోనిచ్చి మళ్ళా అడిగితే మండిపడ్డారు. అది నాకు అనవసరమన్నారు. ఆ మాట నేను ఎత్తటానికే వీల్లేదన్నారు. ఏంచెయ్యను? మిగిలిన వాటిలోనూ ఇలాగే అయింది. నా శాంతం, నమ్మకం అన్నీ వృధా అయ్యాయి. ఏమీ చెయ్యలేని పరిస్థితిలోకి వచ్చాను. అప్పటినుంచీ ఆయన పనులను విమర్శించటం, మాటకు మాట జవాబివ్వటం, కోపంవస్తే మాట్లాడటం మానెయ్యటం ప్రారంభించాను. నా సంసారాన్ని తీర్చి దిద్దుకుందామనీ, నా భర్తతో అందరిలా సంతోషం అనుభవిద్ధామనే నేను కోరుకున్నాను. అది దురాశో ఏమో అర్ధంకాదు. అయినా నా ప్రయత్నంలో లోటు ఉందని నువ్వు అంటున్నావు. అయితే ఇకనుంచి నా శక్తికొలదీ పయత్నిస్తాను. నమ్ముతావా?"
    "భానూ! ఏదోవిధంగా నీ దాంపత్యం సరిచెయ్యాలనే భావన తప్పితే నాకు మరో ఉద్దేశ్యం ఉందంటావా?"
    భాను నవ్వింది. "అన్నయ్యా! నేను ఇప్పుడు కర్మలనీ, పూర్వ జన్మలనీ, చేసుకున్న సుకృతాలనీ అన్నిటినీ నమ్ముతున్నాను."
    "అవి నిజమే కావచ్చు. కానీ కనిపించని ఆ నిజాలు నమ్మి, అనుభవిస్తున్న జీవితాలను నిర్లక్ష్యం చేసుకుంటామా? నీకు మళ్ళీ చెబుతున్నాను. బావ తప్పుచేస్తే క్షమించు. భర్త సుగుణాలు అనుభవించవలసింది భార్యే అయినప్పుడు దుర్గుణాలు కూడా అనుభవించవలసింది భార్యే అవుతుంది. నన్ను అపార్ధం చేసుకోక పోతే ఒక్క మాట-నువ్వు ఆడదానివి. ఆ భావం పురుషుడిలో ఎప్పుడూ ఉంటుంది. అరిటాకూ ముల్లూ సామెత నీకు తెలుసుగా?"
    "అవునన్నయ్యా! ఇల్లు నిలుపుకోవటానికి ఆడది ఒక్కతే ప్రయత్నం చెయ్యాలి. పవిత్ర భారతదేశంలో నేను పాటించవలసిన సలహాలు ఇవే మరి."
    నేను పర్సులోంచి పది రూపాయల నోటు తీసి ఇస్తూ, "ఉంచు భానూ! నీకేమైనా అవసరం ఉంటుంది" అన్నాను.    
    "వద్ధన్నయ్యా! మంచివాడివే! నాకేం ఖర్చులుంటాయి?" అన్నది నవ్వి.
    "నీకేం ఖర్చులుంటాయో నీకు తెలుసుగానీ ముందు తీసుకో. మరి నాకు కోపం వస్తుంది."
    "బావుంది. నీకు కోపం వస్తే రానీ!"
    "అయితే ఇక నేను మీ ఇంటికి రా నవసరం లేదన్న మాట!"
    "దానికీ దీనికీ ముడిపెట్టకన్నయ్యా!" అని -"సరే! తీసుకుంటాను" అంటూ తీసుకొంది, నా చేతిలో నోటు, "నీ దగ్గర డబ్బు తీసుకున్నందుకు కాదు. ఈ పరిస్థితి వచ్చినందుకు సిగ్గు పడుతున్నాను" అన్నది ఆ అభిమానవతి.
    "దానికేంగానీ మరేమీ అనుకోకు భానూ! నీకు చీర లున్నాయా?" అలా అడగటానికి నాకే సిగ్గువేసింది. భాను ఆశ్చర్యంగా చూసింది.
    "ఏం? కొంటావా?"
    "చెప్పు భానూ!"
    "ఉన్నాయి."
    "నిజం చెప్పు."
    "నిజమే అన్నయ్యా! అమ్మ కొంటూంది కదా?"
    "ఉంటే సరే! కానీ నన్ను నమ్ము భానూ! నాకు ప్రాణం అంటూ ఉంటే అది నువ్వే! నువ్వు బాధపడితే నాకు సుఖం ఉండదు. నీకేది కావలసినా నాకు చెప్పు. అన్నయ్య దగ్గర నీకు సిగ్గెందుకు?"
    "ఇక నాకేది కావలసినా నిన్నే అడుగుతాను. సరేనా?"
    "అలా ఉండాలి. భాను మంచిది. మరి వెళ్ళనా?"
    "ఒక్క అనుమానం రావుగారూ! నేనే మీ ప్రాణం అంటున్నారు కదా? అది ఎప్పటివరకండీ?" భాను నవ్వింది. భాను అంతరార్ధం నాకు తెలుసు. నేను నవ్వి అన్నానుమణి-
    "సుశీల వచ్చేవరకండీ!"
    "ఆ తర్వాత?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS