
"రేవతి ఆయాస పడిపోతోంది. "ఎలా తెలుసు?
"గోవిందరాజు కొడుకు. ఆనర్స్ చదువుకున్నాడు. పేరు సుధాకర్. ఇంటిపేరు వీధి పేరు అన్నీ ఒకటే. మొదటేమో వచ్చే మంగళవారం నాడు పెళ్ళిచూపు లనుకున్నారుగానీ ఆ రోజు వాళ్ళకు ప్రయాణం వుందని మొన్న సాయంత్రమేవచ్చి చూచారు. ఏ సంగతి కబురు చేస్తామన్నారట. మొన్న బజారు కెళ్ళి వస్తూ వాళ్ళింట్లోకి వెళ్లాను. పెళ్ళివారొచ్చి పోయిన వాసనలు చాలా తగిలాయి దుర్గను ఏడిపించాలని ఆమె గదిలో కెళ్ళాను. కాబోయే భర్త ఫోటో పెట్టుకుని తీయటి కలలు కంటోంది.
* * *
పరీక్షగా చూస్తే ఫోటోలో వున్నది సుధాకర్.
వెంటనే నాకు షాక్ తగిలింది ఎంత అన్యాయం! నిన్నటి దాకా ప్రేమలతతో ప్రేమిస్తున్నాననీ చదువయ్యేదాకా ఆగమనీ అంటున్న సుధాకర్. ఇప్పుడు అదంతా మరచిపోయి దుర్గను చూచివెళ్ళడం ఏమాటా కబురు చేస్తాననడం: ఫోటో యివ్వడం '-'
రేవతి నిర్ఘాంతపోయింది. "ఏమో నాకింకా నమ్మకంలేదు నువ్వు ఫోటో సరిగ్గా చూచావా. అని నా సందేహం"
"సరేలే చూట్టం ఖర్మమేం తెచ్చానుకూడా!"
"ఫోటో తెచ్చావా!" అని మళ్ళీ రేవతి ఆశ్చర్యపడ్డది.
"పెద్ద ఘనకార్యం ఏముంది? బలే మంచి సంబంధం కుదిరింది దుర్గా నీకు అని కాసేపు పొంగవేసి, మీ అన్నయ్యగారికి చూపిస్తానని. లాక్కొచ్చాను."

రేవతి ఇంకా ఆశ్చర్యంలోంచి తేరుకోలేదు.
"ఇందులో మనకు అందరూ కావలసినవాళ్ళే ఎవరు చెడి పోయినా ఎవరికి అన్యాయం జరిగినా మనం అందరం బాధపడాలికదా. అందుకని" మనం అందరం వొకచోట చేరి ఆలోచించి ఈ గండం గడచేటట్లు చూడాలని నా ఉద్దేశం. అందుకే నిన్ను అర్జంటుగా టెలిగ్రాం యిచ్చి పిలిపించాను.
"మీ వారికి తెలుసా. సంగతి యిది అని" అని రేవతి సందేహంగా అడిగింది.
"ఆయనకు తెలియకుండా నెట్లా" అని నవ్వింది సరళ. "అసలిందులో స్కీమింగ్ అంతా మనం చేయగలంత తేలిగ్గా వుందా? నిరంజన్. గీతా అందర్నీ సాయంత్రం రమ్మన్నాను. మనం అందరం ఆలోచిద్దాం ఎలాచేస్తే బావుంటుందో!"
సాయంత్రం గీత రాగానే టేబిల్ క్లాత్ కిందినుండి ఫోటో తీసి చూపిస్తూ ఈ పురుష పుంగడెవరో తలుపా గీతా అన్నది సరళ.
"తెలుసు" అన్నది గీత. చప్పున చెప్పకుండా.
"ఎవరో?"
"మా క్లాస్ లో ఓ అబ్బాయి"
"పేరు తెలుసా?"
"భలే బాగా వుంది. మా క్లాసులో అరవైమంది వున్నారు. అందరి పేర్లూ నాకు గుర్తుంటాయా?" అన్నది గీత. పెంకెగా.
ఊఁహూఁ. ఈయన పేరు తెలియదు; ఈయన కథకూడా తెలియదా?"
"కథా? కథేమిటి? ఇతను కథలురాసి పత్రికలకి పంపుతాడా?"
రేవతి ఆ వ్యర్ధ సంభాషణ భరించలేకపోయింది. "ఇప్పుడు సుధాకర్ కాదా గీతా?"
గీత నవ్వుతున్నదల్లా బిగిసిపోయింది "అవును"
"మా ఆడపడుచు ప్రేమకీ ఇతనికీ ఏమైనా-"
గీత ఈ రహస్యం చెప్పమన్నట్లు మొహం ముడిచింది.
"అది కాదమ్మా ఇప్పుడు సమస్య వేరు. ఇతడు దుర్గ అని ఇంకో అమ్మాయిని పెండ్లి చేసికొంటాడట మొన్ననే పెళ్ళిచూపు లయ్యాయి. లక్షరూపాయలు కట్నం అదీ-"
గీత నిర్ఘాంతపోయింది. కాని ఎందుకో ఆమెకు సుధాకర్ అంతకి తగిన వాడెననిపించింది. కాని-కాని ప్రేమ అతనిమీదే ఆశలు పెంచుకొంది
సరిగ్గా ఆమె మనసులో మాట కనిపెట్టినట్లు-రేవతి అన్నది" అందుచేత-గీతా! ప్రేమ ని అతనివల్ల ఏమీ అన్యాయం జరక్కుండా చూడాలి. ప్రేమ అతనిమీద ఆశలెన్నో పెంచుకొంది అతను ఆమెను ఎక్కడకు రమ్మంటే అక్కడకు అనాలోచితంగా వెళ్ళిపోతుంది. ఏదైనా సమయం మించిపోక ముందే-"
సమయం మించిపోయిందేమోనని అప్పటికే గీతకు ఎక్కడో అనుమానం లేకపోలేదు. ఇప్పుడు ప్రేమకు అతనిమీద అభిప్రాయం ఏమిటో?- అతడు నీతిమాలినవాడని స్పష్టమైపోతోంది. ఏ విషయం ఏ కోణంలోంచి చూచినా, కాని ప్రేమకు అతడంటే వివేకాన్ని మించిన ఆవేశం. గుడ్డిగా అతన్ని నమ్ముతుంది.
"ప్రేమను కొంచెం కనిపెట్టి వుండాలి గీతా"
"అమ్మో?-" గుండెమీద చెయ్యివేసుకుంది గీత.
"నిరంజన్ కూడా వుంటాడు. సుధాకర్ కు ప్రేమను గురించి ఎలాంటి అభిప్రాయం వుందో - ఈ పెళ్ళి చూపులూ ఇవీ అయ్యాక అతని ప్రవర్తన ఎలా వుంటుందో మనం కనిపెట్టాలి కదా!"
నిరంజన్ చెప్పాడు! "నేను సరళ ఒక రాత్రంతా ఈ విషయం మీద చర్చించుకున్నాము, మాకు ఈ సమస్యలోని భయంకరమైన సత్యం చూసి గుండెలు గగుర్పొడిచాయి. సరళకు ఈ విషయంలో వున్న ఆదుర్దా చూసి ఆ రోజు నాకు భయంవేసింది. ఆ రాత్రి సరళ తెల్లవారు జామున మూడయ్యేవరకూ నిద్రపోలా."
"నేనిలా ఆదుర్దాపడడం కేవలం ఆమె నాకు బంధువని గాని. నా పెండ్లి విషయంలో ఆమె సహాయం చేసిందని కాని కానేకాదు కేవలం ఒక స్త్రీ ఇలాంటి జటిలసమస్యలో చిక్కుకొన్నదే అని నాదే నన్నల్లా చేసింది అన్నది సరళ.
అక్కడున్నవారందరికీ ఒక విషయంలోనే సందేహం. సుధాకర్ ప్రేమను పెళ్ళాడే ఉద్దేశంతో ప్రేమించడం లేదేమోనని- అలాంటి వ్యక్తి దుర్గను గాని. ప్రేమనుగాని మరి ఏ ఇతర స్త్రీనిగాని ప్రేమించలేడు సుఖ పెట్టలేడు. అటువంటి వ్యక్తిని సంఘపు పరిధిలోంచి తప్పించడం కష్టం అతని ప్రవర్తనను తెలుసుకోడం కూడా కష్టమే-
13
"అయితే-?" ప్రేమ తెల్ల మొహం వేసింది. "నే నిక్కడుంటే ఇక్కడ అక్కడికి వెళితే అక్కడ గీత, నిరంజన్ నా ప్రతిచర్య గమనిస్తున్నారన్న మాట.
రేవతి క్షమాపణ అడుగుతున్నట్లు మాట్లాడింది. అది ఆమె సహజ గుణం, ధోరణి.
"అవును, ఆ రోజు మేమంతా కలసి ఆలోచించుకున్న తర్వాత అలాగే జరిగింది. కాని ఇందులో నేను నీ తరపున అయితేనేమీ వారందరి తరఫున అయితేనేమి చెప్పవలసింది ఒకటున్నది- అదే-సుధాకర్ తన పెండ్లి చూపుల సమాచారం నీకు చెప్పకుండా నిన్ను ప్రేమిస్తున్నట్లు మాటలూ చేష్టలూ కలిగాయి. అందులో ఏదోకుట్ర ఉండవచ్చునని గాని, కల్మషం ఉంటుందనిగాని నీవు అనుకోలేదు. నిజానికి అతని తప్పేమీ లేకపోవచ్చు. ఉండవచ్చు అతడు తండ్రి చాటు బిడ్డ, తండ్రి బలవంతంపైనే పెండ్లి చూపులకు వచ్చి దుర్గను చూచి వుండవచ్చు. తరువాత అంటే చదువు పూర్తయ్యాక పెండ్లాడుతానని వాండ్లకు నచ్చజెప్ప సమయం వచ్చినప్పుడు నిన్ను తాను ప్రేమిస్తున్న అసలు సంగతి వాళ్ళకు చెప్పాలని చూచాడేమో అని మా కందరికీ అనిపించింది"
ప్రేమ మళ్ళీ ఖాళీగా చూచింది.
అతను మాకు ఎంత దుష్టుడిగా కనబడినప్పటికీ సవతినిమీద ఆశలు పెంచుకున్నావు కనుక నీ యిష్టాన్ని వ్యతిరేకించి అతనిపట్ల నీ మనసు పరిచే అవసరంగానీ అతన్ని నీతోబాటు మేమూ నమ్మి అతని చేష్టలకు నువ్వు ఎర అయిపోతూవుంటే చూస్తూ వూరుకొనే అవకాశంగానీ మాకులేదు ఈ రెండూ మేం అందరం నీ హితం కోరిన వాళ్ళం కావడం వల్లనే-"
"అవును-"
"కనుక గీతా నిరంజన్లను నిన్ను కనిపెట్టి వుండమని హెచ్చరించాము.
కాని, నాకొక చిన్న సందేహం వదినా"
"అడుగమ్మా."
"నాకు నాకు." ప్రేమ కంఠం రుద్ధమైంది. ఆమె ఏడవటం ప్రారంభించింది. ఆమె మనసులో హాలాహలం లాంటి అగ్ని ప్రవేశించింది. గుండెను కుతకుత ఉడక బెట్టింది. ఆ ప్రశ్న వేడిమి కన్నీరుగా బైటపడడమే సాధ్యంగాని. మాటల రూపంలో రాగలదా?- నన్ను అతడు ఏం చెయ్యబోయాడో మీ కందరికీ తెలుసా? అవి ఎలా అడగాలి? ఆ ప్రశ్న ఏ స్త్రీ అయినా తన వదినను అడగ గలుగుతుందా! వదినను కాదు- తల్లి నైనా అడగడం కష్టమైన ప్రశ్న- తల్లినే కాదు తనకు తాను ప్రశ్నించుకొని శోధించుకొనే సాహసం లేని ప్రశ్న అది! ఏమో అక్కడ ఏం జరిగిందని వీళ్ళంతా అనుకుంటున్నారో అసలు ఏం జరిగిందో తనకు ఏం తెలుసు, తనకు స్పృహ తప్పింది. తనకు గీత చెప్పినమాటలే ఆధారం.

"ఏడవకమ్మా నీ సందేహం నాకు తెలుసు-" అన్నది రేవతి.
ఏడవకు అనడం తేలికే కాని ఆ మాటవిని ఏడుపు ఆపడం అంత తేలిక కాదు. ఉపశమన వాక్యాలు దుఃఖాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. ప్రేమ పైట చెంగులో ముఖం దాచుకొని కుళ్ళి కుళ్ళి ఏడ్వసాగింది.
రేవతి కరగి పోయింది. నెమ్మదిగా లేచి ఆమె భుజం తట్టింది. "ఛా అదేమిటి ప్రేమా, చిన్న పిల్లలాగా-......."
"అక్కడ ...... అక్కడ.... ...." ఆ దుఃఖంలోంచి ఆ రెండు మాటలూ బైటపడే సరికి రెండు నిముషాలు పట్టింది. 'గీత నిన్ను నీడలాగ ఫాలో అయిందమ్మా....ఆమె లేకపోతే ఏమయ్యేదోగాని- నువ్వూ అతడూ విడిగా కొండచరియల్లోకి వెళ్ళిపోవడం. బండపైన అతడు నీ ప్రక్కన చీమ దూరేటంత సందుకూడా లేకుండా కూర్చోటం. అన్నీ చూచిందామె, ఆమెకు మీ ఎదుటపడితే ఏమో లేక పోతే ఏమో అని దై ధీభావం, మిక్కిలి భయం- ఆ భయం ఆడజన్మకు అలంకారం, సాటి స్త్రీ శీలం పోగొట్టుకుంటూ వుండగా చూడగల ధైర్యం ఏ స్త్రీకి ఉండదమ్మా ప్రేమా, అందుకే సమయం మించిపోకుండా అరచి అతణ్ణి తరిమి వేసి నిన్ను కాపాడగల్గింది......అదంతా వివరంగా దీర్ఘమైన లేఖ వ్రాసి ఏ ర్ మే ల్ బో ఇక్కడికి పంపిందమ్మా గీత- నువ్వు మద్రాసు ద్వారా ఇక్కడికి రావడానికి అయిదు రోజులు పట్టింది. ఆమె ఉత్తరం మూడవ రోజునే ఇక్కడ చేరింది"
ప్రేమ కళ్ళలో చిన్న వెలుగు చోటుచేసుకొంది. తాను ఏమీ నష్టపోనందుకు అభినందన కాంతి అది, కాని ఆ కాంతిలో తనకు కావలసిన వారందరూ తన ప్రవర్తన నెంత ఏహ్యంగా చూశారో అన్న సందేహానికి సమాధానం దొరకలేదు.
రేవతి ఆమె బాధ్యత పరిపూర్ణంగా స్వీకరించింది. "నువ్వు మద్రాస్ చేరే వేళకే బాగా అప్ సెట్ అయిపోతావని. అక్కడినుంచి నీకు సహాయం అవసరం అనీ చెప్పాలి మీ అన్నయ్యకు. అందువల్ల ఆయనకు అంతా చెప్పవలసే వచ్చింది. మీ అన్నయ్య మొదట నీ పైనా, సుధాకర్ పైనా చాలా ఆగ్రహించారు. కాని మా కందరికీ కావలసింది నీ -"
"మీరందరూ ఈ దురదృష్ట వంతురాలికోసం ఈ స్వార్ధ పరురాలి కోసం ఎంత శ్రమ పడ్డారు వదినా నేనీ గౌరవానికి ఈ శ్రద్ధకు తగను వదినా, తగను" అని ప్రేమ మళ్ళీ ఏడ్పు పర్యంతం అయింది.
"అలా అనకు ప్రేమా! - నువ్వు పరాయిదానవైనా సరే, ఆ మాత్రం శ్రద్ధ తీసికొనేవాండ్లమే. అందునా నీవు మా కందరికీ కావలసిన ప్రియతమురాలైన వ్యక్తిని అందుచేతనే. నీకు తెలిస్తే అవమానమని భావించే పనులకు కూడా సమకట్టి, నీ సంగతులు తెలుసుకునే భారాన్ని వహించవలసి వచ్చింది.
"అంతా మాయగా వుంది" అన్నది ప్రేమ.
అప్పటికి ప్రేమ మనోవేదన తగినట్టు రేవతికి స్ఫురించింది. పక్క నున్న రేడియో క్రిందనుండి ఒక పెద్ద లేఖ. దాదాపు పది కాగితాల లేఖ అది తీసింది ఆ లేఖవైపు ప్రేమ రెప్పవేయక చూసింది. తనకు ఇస్తుందేమో చదువుదామని అనుకొన్నది. రేవతి ఆ వుత్తరాన్ని ఈమెకు ఇవ్వలేదు. లేచివెళ్ళి పైగూట్లో అగ్గిపెట్టె తీసి, నిప్పుపుల్ల వెలిగించి. ఆ కాగితాలను ఒక్కటిగానే దగ్ధం చేయసాగింది.
