Previous Page Next Page 
ఉన్నతశిఖరాలు పేజి 11


    గీత చటుక్కున మాటలు ఆపుజేసింది.
    నిరంజన్ తనకేసి వస్తున్నాడు.
    అతడి ముఖం అలసివుంది. కళ్ళు తీక్షణంగా చూస్తున్నాయి అతను ఏదో బాధ పడుతున్నాడని చూడగానే తెలుస్తోంది వారిద్దరూ తెల్లబోయారు.
    "ఎలా వుంది గీతా, ప్రేమకు?"
    "ఫరవాలేదు"
    నిరంజన్ కూర్చున్నాడు. "ఇప్పుడే ప్రొఫెసర్ దగ్గరకెళ్ళి మాట్లాడివస్తున్నాను ప్రేమా-మీరు ఇంటికి వెళ్ళిపోవటం మంచిది. మీ ఆరోగ్యం బాగా లేదని గీత చెప్పింది. మిమ్మల్ని పంపించకపోతే అత్తయ్య మామయ్య. అక్కయ్య అందరు నన్నంటారు. మీరుండి చేసేదేంలేదు. ఈ వాతావరణం మనకు అలవాటు లేదు"
    "ప్రొఫెసర్ గారితో చెప్పి వచ్చారన్న మాట"
    "అంతేకాదు మీకు బెర్త్ రిజర్వ్ చేయించి వచ్చాను"
    ప్రేమ నేల కేసిచూస్తూ కూర్చుంది "మిమ్మల్ని ఈ స్థితిలోనైనా ఇంటికి పంపించకపోతే రేవతి అక్క నన్ను క్షమించదు.... ఆమెకు మీ ఆరోగ్యం పై అతి శ్రద్ధ..."
    రేవతి అన్నశబ్దం వినగానే ప్రేమ కనుబొమలు మండిపడ్డాయి నిర్లక్ష్యంగా చూచింది.
    "ఏమంటారు?"
    ప్రేమ నోరు మెదపలేదు ఏమి చేయటానికి తోచటం లేదు.
    "నువ్వు వెళ్తేనే బాగుంటుంది ప్రేమా." అన్నది గీత, మౌనాన్ని భంగం చేస్తూ.
    "నీవన్నది నిజమే" అన్నట్లు కొన్ని క్షణాలు స్నేహితురాలివైపు రెప్పవాల్చకుండా చూచింది ప్రేమ. కాని నోటితో ఆమాట అనలేకపోయింది. మగవాళ్ళమధ్య ఈ కథ ఎలాంటి రూపం దాల్చిందో! ఎంత ప్రచారంలో కొచ్చిందో ? గీత నిరంజన్ వైపు తిరిగి మీరువెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసి రండి. నేను సామాను సర్ది సిద్దంగా వుంటాను.... అన్నట్లు ప్రేమవెళ్ళి ప్రొఫెసర్ గారికి చెప్పనవసరం లేదంటారా? నిరంజన్ లేచి నుంచున్నాడు ప్యాంట్ జేబుల్లో చేతులుంచుకుని ఎటో చూస్తూ క్షణం ఆగి "ఆయన మధ్యాహ్నం వస్తారు.... అప్పుడు మాట్లాడండి.... వస్తాను" అంటూ వెళ్ళిపోయాడు.
    అతడు వెళ్ళినవైపే చూస్తూ నిట్టూర్చింది గీత.

                                  10

    ఇంటికి చేరగానే అందరూ సానుభూతితో ఆశ్చర్యంతో పలుకరిస్తున్నారు ప్రేమను.
    ప్రేమకు చిరాగ్గా వుంది. ఆశ్చర్యం గా వుంది. ఆత్మహత్య చేసుకో చాలన్నంత విసుగ్గా వుంది. ప్రమాదంలోంచి బ్రతికి బైట పడ్డంత సంతోషంగా వుంది.
    అవును. తను ప్రమాదంలోంచి బైటపడ్డది.
    కాని తన నందరూ ఎంతో గౌరవంగా చూస్తున్నారు. ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. "ప్రేమ ప్రయాణంచేసి వచ్చింది. దాన్ని రెస్టుతీసుకోనివ్వండి." అని అన్నగారిపిల్లల్ని సహా దూరంగా వుంచుతున్నారు.
    తను ఇంట్లో వాళ్ళెవరికీ తెలియకుండా సుధాకర్ తో ప్రేమలో పడడం. అతడు తనను ఎవరితోనూ మాట్లాడవద్దని కట్టడిచేస్తూనే తన పైన రెండుసార్లు అత్యాచారానికి తలపడడం ఇవన్నీ అంత మర్యాదైన సంగతులు కావు. తన కుటుంబసభ్యులు ఎవరికి తెలిసినా వారు హర్షించ దగ్గ విషయాలు కావు. ఈబాధ తను ఎవరితోనైనా చెప్పుకుంటే చాలా బాధ. కాని చెప్పుకోక అంతకు మించిన బాధ పడుతున్నది ప్రేమ.
    ఊటీ నుంచి మద్రాసు ఎలా వచ్చిందో, మద్రాసులో అన్నగారు తనను రిసీవ్ చేసుకోడానికి వస్తే కూడా తానెలా మాట్లాడకుండా కాలక్షేపం చేసిందో, మద్రాసు నుంచి ఈ ఐదు వందలమైళ్ళూ ఎలా ప్రయాణం చేసిందో. ఇదంతా ఆగమ్యగోచరంగా నమ్మరాని కట్టుకథగా వుంది. జరిగిందేమిటని నొక్కరుకూడా తనని నిలదీసి అడగరు. పొడలో ఏదో చూసి బెదిరానంటే అందరూ నమ్మారు.
    
                            *    *    *

    సరళా వచ్చింది. బావను, అత్తను, పలకరించి గబగబ రేవతి దగ్గర కొచ్చింది.
    "ప్రేమ వచ్చిందా? ఎలా వుంది?"
    "ఇంకా అడుగుకున్నావా? పైమంది వెళ్ళిచూడు..."  సరళ పిల్లాడిని అక్కకందించి వెళ్ళబోయింది.....
    "సరళ....అక్కడ నా విషయం ఎత్తకు" తల ఆడిస్తూ సరళ మేడ మెట్లెక్కి వెళ్ళింది.
    ప్రేమ గది తలుపు జారవేసుంది సరళ నెమ్మదిగా తలుపు తోసింది. అడుగుల చప్పుడుకు ప్రేమ ఇటుతిరిగింది. ఆకస్మాత్తుగా సరళను చూచి చటుక్కున లేచికూచుంది.
    ప్రేమ వాలకము చూచి సరళ నిర్ఘాంత పోయింది.... బాబోయ్ ఆ పొదలో ఈమె ఏదో పిశాచిని చూచివుండాలి.....అనుకుంటూ మంచాన్ని సమీపించి ప్రక్కన కూచుంది. కూర్చున్న సరళ హఠాత్తుగా ఏమనుకుందో మళ్ళీ లేచివెళ్ళి తలుపు గడియ వేసివచ్చి కూచుంది. సరళా "బాగున్నారా అంతా" పొడిగా అంది ప్రేమ
    సరళ కళ్ళు పెద్దవిగా జేసి ప్రేమకేసి జాలిగా చూచింది.
    "మేం బాగానే వున్నాం. నీవు ఎలా వున్నావో చూట్టానికొచ్చాను...అయితే వదిన అన్నది నిజమే. నిన్ను గుర్తుపట్టలేనంత మారిపోయావు. ఏం జరిగింది ప్రేమా."
    "ఇంత త్వరగా మీకు కబురెలా అందింది?"
    "అదేమిటీ? నీకు తెలీదూ? అన్నయ్య ట్రంక్ కాల్ చేశాడు."
    ప్రేమ హృదయం గతుక్కుమంది. అక్కడినించి ట్రంక్ కాల్ చేశాడా? ఏమని? "ఏమని" అంది ప్రసన్నంగా.
    సరళ ఫకాల్న నవ్వింది "నీకు తెలీదూ?"
    "ఉహుఁ అంది కదలకుండానే ప్రేమ! లోపలి బెదురు కనబడనీక
    "తోటలో తిరుగుతూ ఏదో చూశావటగా."
    ప్రేమ ఖాళీగా చూసింది.
    "ఏం చూశావు! తోటలో నీకేం కనబడ్డది!"
    ఊఁహూఁ తోటలో నాకేడో కనబడ్డదని చెప్పినమనిషి ఏం కనబడ్డదో చెప్పలేదన్నమాట" అన్నది ప్రేమ గడుసుగా మాట్లాడుతున్నానని అనుకొని-
    "నువ్వు చూసింది మనిషినే కదా! ఆ మనిషి నీకు తెలుసుగా? అన్నది సరళ వక్రంగా చూస్తూ.
    ప్రేమ గుండె నిమిషానికి నూటయిరవై సార్లు కొట్టుకుంది.
    "సరళా ఏమిటి నీ వంటున్నది?"
    "ఓహో పేరూ అవీ చెప్పాలన్నమాట"
    క్షణంసేపు ప్రేమకు గుండె కొట్టుకోటం మానేసింది.
    నిశ్శబ్దం.
    ప్రేమా! చెప్పు. నిన్ను చూద్దామని వచ్చాను. నీకేదో కష్టం కలిగిందని విని వచ్చాను. నీకు కనిపించిందెవరు? .... నాకు తెలుసు నువ్వు మాట్లాడవు....కాని నేను వెళ్ళిపోవాలి ప్రేమా. నాకట్టే టైమ్ లేదు. మీ అన్నయ్య పన్నెండింటికి క్యాంప్ నుంచి వచ్చేస్తారు..... నాకు చెప్పు జరిగిందేమిటో - నీ వాలకం చూస్తూ వుంటే నే ననుకున్నంతా జరిగినట్టే వుంది..... చెప్పు. అతడు నిన్ను అన్యాయంగా నలిపి వెయ్యబోయాడు అంతేగా!....ఆగు- సగం తెరచిన నీ పెదవులు నాకు నిజం చెప్పాయి. ఎంత నిజం?- కాని నువ్విలా అనాఘ్రాత న్నంగా మిగిలిపోయావంటే అది. అది- నువ్వు- మీ వదినె రేవతికి థేంక్ చెయ్యాలి. ఆమె దేవత."
    క్రిందినుంచి ఎవరో పిలిచారు "సరళా. క్షణం, ప్రేమ గుండె కొట్టుకోటం మానేసింది! చాలాసేపు నిశ్శబ్దం కఠోరంగా వినిపించిన ఆ పిలుపుకు "వస్తున్నా" అని కేక పెట్టి సరళ లేచినుంచుంది. ప్రేమ చటుక్కున ఆమె చెయ్యి పట్టుకుంది "సరళా వెళ్ళకు- చెప్పు - నువ్వేమన్నావు! అంతా విశదీకరించి వెళ్ళు-ఇలా సగంలో నన్ను వదలి వెళ్ళకు ప్రాధేయపూర్వకంగా అంది.
    సరళ మంచంపట్టెమీద కూచుని ఆమె భుజంమీద చేయివేసింది. సరళ నిస్సహాయంగా చూచింది "వస్తా అక్కయ్యకు చాలా విషయాలు తెలుసును. ఆమె నడిగితే విపులంగా చెప్పగలదు... 'వదిన....వదినను అడగాలా" మెల్లగా అంది ఏదో గొణుక్కుంది ప్రేమ.
    "నేనింటి కెళ్ళాలి త్వరగా"
    "రేపొకమాటు మళ్ళీ వస్తాను" ప్రేమ చుబుకాన్ని మృదువుగతాకి వెళ్ళిపోతూ తలుపుదాకా వెళ్ళి సరళను ఓసారి చూసింది. సరళను సంబోదించిందామె వదినను ఒక మాటు రమ్మనమను..... అన్నది ప్రేమ నీరసంగా. "అలాగే" అంటూ సరళ - తలుపు దగ్గరగా చేరవేసి వెళ్ళి పోయింది.
    ప్రేమకు రక్తం చల్లబడిపోయినట్లైంది. మెదడు ఆ కాసేపూ ఆలోచించడం మానివేసింది. ఇంత నిస్సత్తువ ఎపుడైనా ఎరుగుదువా అని వ్రేలాడిపోయింది.
    సరళ మాటలు ఆమెకు జ్ఞాపకం వచ్చి కలవరపెట్టసాగాయి, ఆమె కెలా తెలిసింది జరిగిందేమిటో సరిగ్గా వూహించిందే! ఆమెకాశక్తి ఎక్కడిది? ట్రంక్ కాల్ చేసి చెప్పిన నిరంజన్ కి ఏం తెలుసు పైగా రేవతికి ఒదినకు అన్నీ తెలుసునన్నది. నేనిలా అనాఘ్రాతంగా మిగిలి పోవడానికి రేవతి వదినె కారణమట. ఏమిటి ఆ మాటలకర్ధం? ఎక్కడో ఊటీలోగాని. ఇక్కడ రమతోటలోగాని, సుధాకర్ తనని చెరచకుండా వుండేటందుకు ఆమె సాయం ఏమిటి? ఇదేదో అర్ధంలేనిమాట అయి వుంటుంది.
    కాదు కాదు, రేవతి ముందే అంతా పసికట్టింది. ఆనాడు తన గదిలో లేఖలు చూసినప్పుడే రేవతి తనకేదో ఉపదేశించబోయింది. తానామెను తూలనాడి నిర్లక్ష్యం చేసింది. అవమానించింది. ఇప్పుడు......ఇప్పుడు ఆమెవచ్చి తనను సముదాయించ వలసిన అవసరం కల్గిందా?"
    ఎవరూ సముదాయించ నక్కర్లేదు తనకేమీ అన్యాయం జరగలేదు. తాను శీలంపోగొట్టు కోలేదు. మొదటిసారి ధైర్యంగానే పరిస్థితిని ఎదుర్కొంది? రెండవసారికూడా స్పృహ వుంటే అతణ్ణి సులువుగా ప్రతిఘటించేదే. స్పృహ పోయిన నష్టమేమి లేదని గీత చెప్పిందిగా. సమయం మించిపోకముందే తాను వచ్చిందట.
    వదిన వస్తేనే బాగుండేది....హాయిగా ఏదైనా ఇంకేదైనా మాట్లాడితే తనకు ఈ క్షోభ తగ్గేది. ఎవరూ రారేం? రోడ్డుమీధపోయే బస్సుల గూర్చొ వాతావరణం గురించో సినిమాల గురించో మాట్లాడి తనని రక్షించరేం?
    ఆలోచనలో దాదాపు పది నిమిషాలు దాటివుంటాయి. మెట్లమీద చప్పుడు విని ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం ప్రారంభించింది. ఏదో పనిమీద వచ్చింది అమ్మ, పని చేసుకు వెళ్తూ మరోసారి ఓదార్చి కాసేపు బుజ్జగించి "పడుకొని నిద్రపోతల్లీ..కాస్త హాయిగా వుంటుంది. బాగా అలసి పోయావు" అన్నది.    
    వదినె వస్తుందా? అని నిరీక్షణా భావం ప్రవేశించింది ప్రేమలో వచ్చి ఆమె ఏం చేయగలదు? అన్న ప్రశ్న కూడా వుంది కానీ అందువల్ల లభించవలసినంత విశ్రాంతి లభించలేదు. ఆమె రావాలనే వుంది. ఏదో మాట్లాడాలనే వుంది. ఏం మాట్లాడాలి? ఆమెకు తన సంగతంతా తెలుసు. వెళ్ళి బ్రతిమలాడుకోవాలా ఎవరికీ చెప్పవద్దని.....సరస సంభాషణనుబట్టి ఆమెక్కూడా అంతా తెలీనట్లే వుంది ప్రేమను ఎక్కడ లేని నీరసం ఆవరించింది అను వదినను బతిమాలు కోవాలి....ఆమె అనుగ్రహించక     ప్రేమ హృదయం వేయి ముక్కలైంది. ఆనాటి తన ప్రవర్తనను ఆమెను క్షమించమని కోరాలి ఈ దుష్టిని తనకి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆమె నెమ్మదిగా వెళ్ళి తలుపు తెరచింది. అక్కడ రేవతి నిలచివుంది.

                                              *    *    *

                                 11

    "వదినా!" అన్నది ప్రేమ ఆమెకు ఆ మూడక్షరాలూ నోటంట రావడానికి గొంతు ఎంతో సేపు అడ్డం వచ్చింది.    
    "కూర్చో ప్రేమా!"
    అనుకోకుండా ఇద్దరూ కూర్చున్నారు.
    తనకు వదినెను ఏమీ తెలియదు. ఒక నీరస పడ్డ క్షణంలో ఆమెను తానెంతో అపార్ధం చేసుకున్నది.
    "ప్రేమా!" అన్నది రేవతి మెత్తగా.
    "నీ సంగతి నీకేమి తెలియదమ్మా ఆనాడు నేను సుధాకర్ ఎవరు అడిగితే కూడా మాట్లాడలేదు నీవు. అతని సంగతి నాకు పూర్తిగా తెలుసు."
    "నీకు సుధాకర్ ని తెలుసా!"
    "బాగా తెలుసు."
    "వదినెకు ఏం తెలుసు?"
    ఎంత తెలుసు.
    వదిన చెప్పే కథ ఏమిటి
    "అదంతా చాలా పెద్ద కథమ్మా ప్రేమా చెప్పరా?"
    "చెప్పు-"
    
                                    12

    హఠాత్తుగా సరళ యిచ్చిన టెలిగ్రాం చూచి పాపతో హైదరాబాద్ చేరింది రేవతి. జేవురించిన ముఖంలో కాంతి విహీనమైన నేత్రద్వయం అస్పష్టంగా కనబడుతున్న నుదుటిపై చారలు- తీసిపోయిన ముఖంతో ఎదురొచ్చిన సరళను చూచి కలవరపడిపోయింది రేవతి.
    పాపనందుకుని మౌనంగా లోపలికి నడచింది సరళ. ఆమె మౌనం ఆకారం చూచి రేవతికికూడా గొంతులో ఇనుపగుండు ఇరుక్కుపోయినట్లయింది. ఒక్కమాట పెకలిరాలేదు. మెల్లగా అంది "నీకేమైందో అని గాభరా పడిపోయాను. ఏమైందే?"
    సరళ నవ్వింది "నేను బాగానే వున్నాను. నా విషయం కాదు.... ముందు మొహం కడుక్కొని టిఫెన్ తిని కాఫీ త్రాగు. పాపకేం కావాలో చూడు. తర్వాత చెబుతాను."
    రేవతికి చికాకులో నవ్వు వచ్చింది. పనులయ్యాక సరళ మెల్లగా సంభాషణ దుర్గ మీదికి మళ్ళించింది. ఆమె విషయమే చెప్పడానికి టెలిగ్రాము ఇచ్చానన్నది.
    ముఖం చిట్లించింది రేవతి. దుర్గవిషయం తెల్పటానికా యింత హంగామా చేసింది. దుర్గ తన ప్రాణ స్నేహితురాలయితే మాత్రం తన నింత దూరం రప్పించి యిబ్బంది పెట్టడంలో అర్ధం?
    "దుర్గను గురించా" విసుక్కుంది రేవతి. "ఏమైంది దుర్గకిప్పుడు"
    "అదే... ఆమెకు పెళ్ళి నిశ్చయమైంది."
    "చంపేశావ్ ఇంతేనా!"
    రేవతి మనసులో బాధ తొలగగానే కళ్ళు విశాలమయ్యాయి.
    "ఇంతేనా అంటావు? ఎవరితోనో తెలుసా.....సుధాకర్ తో.
    "ఆఁ' అంటూ గాభరాగా సరళ కేసి చూచింది రేవతి ఆమె ముఖంలో మారుతున్న రంగులు చూచి నెమ్మదిగా అంది సరళ.
    "నాకు మొదటిసారి తెలిసినప్పుడు నా కాళ్ళక్రింద భూమి కదిలి పోయినట్లు ఆకాశంమీద పడ్డట్లు ఫీల్ అయ్యాను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS