Previous Page Next Page 
పేక మేడలు పేజి 11


    'ఓహో! ఇక తమరు ఉద్యోగాలు చెలాయించటం ఒక్కటే తక్కువైంది. ఏ డాక్టర్నో, యాక్టర్నో పెళ్ళాడి ఉంటే నీ సుఖాలూ, దర్జాలూ.....'
    ఛీ! అసలు నాది బుద్ధితక్కువ,  నిండు నెలలతో ఉన్న ఒక ఆడదాని మీద కనీసం జాలి కూడా లేని వ్యక్తిని మనిషిగా ఎంచి మాట్లాడే నేను-నేను పశువుని.
    నెలలు నిండేవరకూ నేను ఇక్కడ చాకిరీ చెయ్యటానికే ఉండిపోవలసి వచ్చింది. బాబుని చూసుకొన్న సమయంలో నా మనసు ఎంత ఆనందంతో పొర్లిపోయిందో, ఎంత ధైర్యం వచ్చిపడిందో ఎలా చెప్పను? నాకు కొడుకు పుట్టాడు. వాణ్ణి చూస్తే ఆయన తప్పక మారిపోతారు. నా కష్ట సుఖాలు అర్ధం చేసుకుంటారు. ఆశాసౌధాలలో తేలిపోతూ మూడు నెలల బాబుని ఎత్తుకొచ్చాను.
    కొడుకుని చూసి తండ్రి సంతోషపడిన మాట నిజమే. కాని అది నాకు సంతృప్తి నిచ్చేంతటి సంతోషంకాదు. నా భవిష్యత్తు మారిపోతుందని నమ్మేంత ఆనందం కాదు. నా యాతనలన్నీ ఎక్కువయ్యాయి గానీ వీసమెత్తు తగ్గలేదు. ఆయనకు కొత్త చిరాకు ఒకటి వచ్చిపడింది. 'అస్తమానూ పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఇంట్లోకి రావటమే అసహ్యంగా ఉంటోంది'-అనేవారు. రాత్రులు వాడి పక్కబట్టలు మార్చవలసివస్తే అది నేను ఒక్కదాన్నే చేసుకోవాలి. వాణ్ణి తుడిచి వేరే పడుకోబెట్టి పక్కబట్టలు మార్చేలోపుగా వాడు ఏడుస్తాడు.
    'ఛీ! ఛీ! ఇది సత్రవులా ఉందిగాని ఇల్లులా లేదు. పగలంతా దర్జాగా పడుకొని అర్ధరాత్రులు లేచి మేళం పెట్టుకు కూర్చుంటావు. నన్ను రాత్రులు నిద్రేపోనివ్వటం లేదు. నన్ను ఉండమంటావా? పొమ్మంటావా? ఏమిటి నీ ఉద్దేశ్యం?'
    మూర్ఖుడికి ఎందుకు జవాబు చెప్పాలి? ఇదే నా ఉద్దేశ్యం. ఎన్ని తిట్టినా సరే, వింటూ పసిబాబుని గుండెలకు హత్తుకొని పడుకొంటే ఏమిటో తృప్తి! హాయి! చాలు. వాడికోసం ఏదైనా భరిస్తాను."
    భాను అదే ధోరణిలో జ్ఞాపకం వచ్చిన సంఘటనలన్నీ చెప్పుకు పోతూంది. వింటూన్న కొద్దీ నామతీ పోతూంది. భాను దాంపత్యం ఇంత అధ్వాన్నంగా సాగుతూందా? భాను ఇంత వేదన భరిస్తూందా?
    "అన్నయ్యా, నా కష్టసుఖాలకు నా భర్త ఉన్నాడనే నమ్మకం ఏనాడో పోయింది. కానీ ఆయనకు బాబుమీద ప్రేమ ఉన్నా, నాకు తృప్తిగా ఉండేది."
    "భానూ!" చెమర్చిన ఆ కళ్ళలోకి తదేకంగా చూడసాగాను. భాను మాట్లాడలేదు.
    "నువ్వు చాలా మారిపోయావు భానూ."
    భాను అదొకరకంగా నవ్వింది. "మారటం కాదు. ఆ భాను ఇకలేదు. ఆ అతిశయాలూ, ఆ గర్వాలూ, మొండి నమ్మకాలూ, పట్టుదలలూ, -ఏమీలేవు."
    నిజమేనని కాబోలు గడియారం రెండుసార్లు పలికింది.    
    "పోనీ కొంత ఊరటగా ఉంటుంది. ఏదైనా సినిమాకి వెళ్దామా?"
    భాను కొంతసేపు ఊరుకొని అంది: "నేను సినిమాలు చూడటం మానేశాను. ఎనిమిది నెలలైంది." భగవంతుడా, దీనికీ ఏదో పూర్వ కథ ఉందేమిటి కర్మ.
    'ఎందుకని?' అన్నట్టు చూశాను ఆశ్చర్యపడి.
    "నేను బావ కూడా వెళ్ళి ఆయన్ని సిగ్గుపరచటం ఇష్టంలేక మానేశాను."
    "ఏమైంది భానూ?"
    "అవటానికేం లేదనుకో. ఆమధ్య ఏదో ఇంగ్లీషు సినిమా వచ్చింది. చాలా గొప్పగా ఉందని చదివాను. 'వెళ్దామా?' అన్నాను. ఆ నవల నేను చదవటంచేత సినిమా చూడాలనిపించింది.
    ఆయన తేలిగ్గా నవ్వేస్తూ, 'నీ మొహం! ఇంగ్లీషు సినిమా అంటే మజాకా అనుకొన్నా వేమిటి? మావంటి వాళ్ళకే తాతలు దిగివస్తారు' అన్నారు.
    'పోనీ నా కర్ధంకాని చోట మీరు చెప్పకూడదా?'
    'ఇక బాగానే ఉంటుంది. నీలాంటి అప్పమ్మని తీసికెళ్ళి చెప్తూ కూర్చుంటే నాకు సిగ్గుచేటు.'
    సిగ్గుతో నా తల వాలిపోయిందంటే నమ్ము. తర్వాత నేను ఏ సినిమాకీ వెళ్ళలేదు. వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్ళటం చాలా అరుదు. ఆయన ఎప్పుడూ స్నేహితులతోనే చూస్తూంటారు. నేను ఏ పక్కింటి బామ్మగారితోనో వెళ్ళాలి. అంతమాత్రానికి ఆ సినిమాలు చూడకపోతే నష్టమేమొచ్చింది? ఎవరికి కావాలి?మానేశాను."
    "నీకు ఇంగ్లీషు వచ్చని బావకి తెలీదా?"
    "నాకు తెలిసింది చాలా తక్కువే అనుకో. అయినా ఆమాత్రం కూడా ఆయనకి తెలీదు. నా సంగతి తెలిస్తే నిద్రపట్టదు. ఎన్నడైనా ఇంగ్లీషు ముక్క మాటల్లో దొర్లితే, 'అబ్బో! లండన్ లో పుట్టి ఇండియాకి వచ్చినట్టే ఉంది సుమండీ! ఏ కాన్వెంటులోనండీ మీరు చదివిందీ?' అంటూ హాస్యాలు. కొత్తలో నేను గ్రహించక పోయినా క్రమంగా ఆ వ్యంగ్యం అర్ధం చేసుకున్నాను. ఆయన కళ్ళముందు ఎన్నడూ ఇంగ్లీషు పుస్తకం చదవలేదు. ఇక్కడి కొచ్చిన కొత్తలో ఎన్నో ఇంగ్లీషు పుస్తకాలు చదవాలనీ, ఇంగ్లీషు సినిమాలు చూడాలనీ, ఆ భాషాజ్ఞానం అభివృద్ధి చేసుకోవాలనీ, అన్నిటికీ ఆయన ప్రోత్సాహం ఉంటుందనీ-ఎంత పిచ్చిదాన్నో ఇప్పుడు తెలుస్తోంది.
    స్నేహితులు ఎవరైనా అప్పుడప్పుడు వస్తూంటారనుకో. ఏవో కబుర్లు వస్తాయి. వాటిమధ్య కలగజేసుకొని నా ఉద్దేశ్యాలేమైనా చెప్పామా అంటే భంగపడవలసిందే!
    ఎక్కువగా వాళ్ళంతా మాట్లాడుకొనే దేమి టంటావు? 'భగవంతు డున్నాడా? లేడా? లేడు. ఎలా చెప్పగలవు? కంటికి కన్పించటం లేదు కాబట్టి. గాలి కన్పించకపోయినా శరీరానికి తగులుతోంది. వాసన ముక్కుకు తెలుస్తోంది. ఏ విధంగానూ అనుభవంలేని ఆ దేవుడికి లక్షలకు లక్షలు తగలబెట్టకపోతే మరోవిధంగా ప్రజలు సుఖపడకూడదు?' ఇదీవరస, నిజమే. ఊరుకి మరో నాలుగు క్లబ్బులు కట్టించకూడదూ? సిగరెట్లు ఉచితంగా సరఫరా చెయ్యకూడదూ? ఉద్యోగాలు లేకుండా జీతాలివ్వకూడదూ? సినిమా తారలతో ఇంటర్వ్యూలు ఏర్పాటు చెయ్యకూడదూ? ఇంకా విను. 'పిచ్చి గవర్నమెంటోయ్ మనది. ఈ నెహ్రూ పోయి ఏ హిట్లర్ లాంటి వాడో వస్తే గానీ....'
    ఈ జల్సారాయుళ్ళ గతి తెలిసేది మరి! దేవుడిమీది నుంచి పురాణాలమీదికి మళ్ళుతుంది.    
    'ఆ భారం ఏమిటయ్యా! మాట మాట్లాడితే శాపాలూ దీవెనలూ, చెవుల్లోంచి పిల్లలు పుట్టడాలూ.' 'అంతా వట్టి బూటకం. ద్రౌపది మాత్రం అదృష్టవంతురాలు.'
    'అసలు కుంతీ ద్రౌపదీ పతివ్రతలెలా అయ్యారయ్యా?'    
    'ఆ రోజుల్లో ఎంతమంది మొగుళ్ళంటే ఆడది అంత పతివ్రతయ్యా!'
    'అహ్హహ్హహ్హ'....బ్రహ్మాండంగా కేరింతలు.
    శివశివా! మనవంటివాళ్ళు చెవులు మూసుకోవటం తప్పితే గత్యంతరంలేదు. ఎంత తుచ్చ మైన వ్యక్తులు ఉన్నారు! మన పురాణ గ్రంథాలనీ, మన సంస్కృతినీ, ఇంత-ఇంత చులకన చేసి నవ్వుకొంటే వీళ్ళకి ఒరిగేదేమిటి?        
    తర్వాత సినిమాలు.
    వాళ్ళ సంభాషణ ఎంత అధ్వాన్నంగా సాగుతుందో వినేవాళ్ళకే అర్ధమౌతుంది. తీరా జూస్తే అంతా గ్రాడ్యుయేట్లూ, పోస్ట్ గ్రాడ్యుయేట్లూనూ. దిగ్రీలకీ సంస్కారానికీ సంబంధంలేదని నిర్ణయించుకోవాలి మరి.
    'మీరంతా చదువుకున్న వాళ్ళు గదా? ప్రతి విషయాన్నీ అంత తప్పుగా ఎందుకు విమర్శిస్తారు?' అంటే-
    'నీ అమూల్యాభిప్రాయాలెవడూ అడగలేదు గాని వెళ్ళు' అనేశారు బావ ఒకసారి. నేను వాళ్ళందరికీ కాఫీ లనీ ఇస్తాను. కొంత పరిచయం ఉంది గనుక ఎప్పుడైనా చనువుగా మాట్లాడుతాను, అందుకే ఏదైనా కలగజేసుకొని నా ఉద్దేశ్యాలు చెప్తే అంతమందిలోనూ తేలిగ్గా తీసిపారేస్తారు. ఒకటి రెండుసార్లు అయ్యాక న జాగ్రత్తలో నేను ఉన్నాను.
    అసలు ఆ స్నేహితుల మీద ఆయనకే సదప్రాయం లేదు. వాళ్ళతో నేను అధికంగా మాట్లాడకూడదు. వాళ్ళు నన్ను పలకరిస్తారు. ఏదో జవాబు చెప్పి రెండుమాటలు మాట్లాడక పోతే బావుంటుందా?"
    "అసలు వాళ్ళనెందుకు తీసుకు రావాలి?"
    "గొప్పకి, ఒక్కోసారి వాళ్ళకై వాళ్ళే వచ్చి కూర్చుంటారు. మరి ఎవరి స్నేహితులు? వీళ్ళంతా ఒకటికాదా?"
    "బావ ఎవరింటికీ వెళ్ళరా? అక్కడ ఆడవాళ్ళతో మాట్లాడరా?"
    "నువ్వు పరాయి ఆడవాళ్ళని నవ్వుతూ పలకరించవచ్చు. కావలసినంతసేపు కబుర్లు చెప్పవచ్చు. కారణం నువ్వు నిప్పు కణికవు. మరి నీ భార్యని పోతుటీగ కూడా స్పర్శించకూడదు. పరపురుషుడు కన్నెత్తి చూడకూడదు. ఏమో ఎవడు ఎలాంటివాడో! ఇంతకీ నీ భార్యమీద, నువ్వు తపించిపోయే ఆ స్నేహితులమీద నమ్మకం ఏదీ? నీ భార్యకీ వ్యక్తిత్వం ఉందనే జ్ఞానం ఏదీ? నిన్నూ నీ స్నేహితులు అసహ్యించుకుంటారనే అనుమానమేదీ?"
    "అయితే ఏ ప్రత్యేకతా చూడనప్పుడు చదువుకున్న భార్య కావాలని పెళ్ళి చేసుకున్న దెందుకని?"
    "గొప్పకి. పదిమందిలోనూ తనకు ఒక కారూ, ఒక అల్సేషియన్ కుక్కా ఉన్నాయని చెప్పుకున్నట్టు చదువుకున్న భార్య ఉందని చెప్పుకోవటానికి. పెళ్ళికి ముందు చదువుకున్న అమ్మాయిలమీద అదో మోజు. ఉపన్యాసాలలో స్త్రీకి స్వాతంత్ర్యం ఇచ్చెయ్యటం, చచ్చి స్వర్గాన ఉన్నవాళ్ళని దుయ్యబట్టటం, స్త్రీజాతిమీద అపారమైన సానుభూతి కురిపించటం-అన్నీ ఆ వేడిలోనే జరిగిపోతాయి. పెళ్ళి అయి సంసారం పెట్టేసరికి ఆవేశాలూ, ఉద్రేకాలూ, వీరకంకణాలూ-అన్నీ ఆఖరు. భార్యా భర్తా, ఆడా మగా మిగులు. ఇక ఆ భేదాలు అలా సాగవలసిందే.
    ఒక అమ్మాయితనకు భార్య అయ్యాక ఆ వ్యక్తికి ఎంతవరకు న్యాయం చేస్తున్నారో ఆలోచించేది ఎంతమంది? ఆవిడకు అభిప్రాయాలుంటాయి, కోరికలుంటాయి, నిర్ణయాలుంటాయి, అన్నిటినీమించి మనసు ఉంటుంది-అవన్నీ అంగీకరించేది ఎంతమంది?
    భార్య అయ్యాక ఆ చదవుమీద చిన్న చూపు! ఒక్కోచోట అసూయ కూడా. ఆడది స్వతంత్రంగా ఆలోచిస్తే, చేసిన తప్పు ఎత్తిచెపితే, మాటకు తగ్గ జవాబు ఇస్తే-అటువంటివన్నీ చదువువల్లే పట్టుపడిన గర్వాలు. తర్కిస్తుంది. వాదానికి దిగుతుంది. మగవాడి విలువే మరిచి పోతుంది.
    అమ్మాయి లేమో చూపులకోసం నవ నాగరకంగా చక్కగా సినిమా తారలను మరిపించేట్టూ, స్వర్గాల్లో తేలించేట్టూ తయారు కావాలి. కానీ మనోభావాలూ, అలవాట్లూ, పనిపాటలూ, నడవడికలూ పురాణ స్త్రీలతో పోటీ చెయ్యాలి. ఆనాటి అమ్మమ్మలా కొప్పు పెట్టుకొని గోచీ పోసి చీరకట్టుకొంటే ఏ మగవాడు ఇష్టపడతాడు? వేషభాషల్లో నాగరికతకోరే వ్యక్తి ఆడదాన్ని మానసికంగా కూడా ఎందుకు పెరగనివ్వడు? అమ్మమ్మ లక్షణాలు లేనికాలంలో అమ్మమ్మ భావాలూ ఉండవు. అది ఎందుకు అంగీకరించడు?"
    "భానూ, కొంతమంది చేసే నేరాన్ని మొత్తం జాతికి అంటకడతావా?"
    "నేను ఎప్పుడూ అలా దారి తప్పి మాట్లాడను. కాని ఆ కొంతమంది మాట ఏమిటి?"
    "అంత సంకుచితమైన దృక్పథం కలవాళ్ళు ఉంటారని నేను అనుకోను."
    "ఉన్నారు. నీ జాత్యభిమానం విడిచి చూడు. ఆడదాన్ని తనతో సమానంగా భావించటంలేదు. ఆడది ఏదో తక్కువ. పురుషుడు శాసించాలి. నేను పుస్తకాలు చదువకూడదు. ఇంగ్లీషు సినిమాలు చూడకూడదు. వీధి గుమ్మంలో నిలబడకూడదు. పరాయి మగవాళ్ళతో మాట్లాడకూడదు. మాట్లాడినా ఆ సమయాలలో నవ్వకూడదు. చాలా? నన్ను ఒక వస్తువులా జాగ్రత్త పరచాలనే తాపత్రయం కాకపోతే ఇదంతా ఏమిటి? నేనూ కొన్ని మంచి చెడ్డలు తెలుసుకోగలనని నన్ను నమ్మి నా బాధ్యతలు నా కెందుకు వదలకూడదు?"
    నేనేమీ మాట్లాడలేదు.
    "ఒక రచయిత పుస్తకాలు చదువుతాం. అతని ధోరణి నచ్చకపోతే మానేస్తాం. కొన్ని రకాల సినిమాలు చూస్తాం. నచ్చనివాటికి మరో సారి ప్రయత్నించం. కొంతమంది మగవాళ్ళతో మాట్లాడుతాం. వాళ్ళని అర్ధంచేసుకొని మన జాగ్రత్తలో మనం ఉంటాం. నేను చెప్పే ఆ కొంతమందీ చాలా పెరగాలి. ఎప్పుడో!
    "ఇటువంటి కబుర్లు వింటూ కూర్చుంటే నీకు దండుగ. అవునా?" అంది నవ్వుతూ చటుక్కున.    
    "భానూ, నువ్వు చాలా మూర్ఖంగా మాట్లాడటం నేర్చుకున్నావు."
    "నిజమే. అదె అవసరమవుతోంది" అంటూ లేచివెళ్ళింది. కాఫీచేసి తెచ్చింది. తను వంట చేస్తూంటే నేను పుస్తకం తెరుచుకు కూర్చున్నాను. నా కళ్ళకు అక్షరాలేమీ కన్పించటంలేదు. పుస్తకంలో అక్షరాలన్నీ చకచకా మారి భాను మాట్లాడిన మాటలన్నీ పేరుకొంటున్నాయి. వెక్కి వెక్కి ఏడుస్తూన్న భాను మొహమే ప్రతిపేజీమీదా సాక్షాత్కరిస్తూంది. అన్నీ నాకు చెప్పి హృదయభారం తగ్గించుకొని కాబోలు భాను తేలిగ్గా తిరుగుతూంది. కానీ ప్రతి రోజూ ప్రతి గంటా అనుభవిస్తూన్న ఈ నరకం ఎప్పటికి అంతం కావాలి? చదువుసంధ్యలూ, అందచందాలూ, తెలివితేటలూ అన్నీ ఉన్న భాను భర్తకు ఎందుకు అయిష్టమవుతూంది? సుఖ శాంతులతో తులతూగవలసిన సంసారాన్ని ఎందుకతను దుఃఖమయం చేసుకొంటున్నాడు? భాను దాంపత్యం ఆనందప్రదం కావాలంటే నేనేం చెయ్యాలి? అన్నీ ప్రశ్నలే. జవాబులు లేవు. నా ప్రియమైన చెల్లి, ప్రాణ స్నేహితురాలు- భాను ఇంత నికృష్టమైన జీవితం గడుపుతూందనుకొంటే ఆ బాధ వెల్లడించే శక్తి నాకు లేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS