ఫేము కుర్చీలు వేయించి తను అపురూపంగా పెంచుకుంటున్న ఇంటి ఆవరణ తోటలో ఈశ్వర చంద్రుడిని కూర్చోబెట్టి 'టీ' అందిస్తున్న ఇల్లాలిని పరిచయం చేశాడు.
"ఇది, మావయ్యా, జరిగిన సంగతి. నేను తప్పు చేశానంటారా?" అని ప్రశ్నించేడు. టూకీగా తనకీ సౌదామిని కి జరిగిన పరిచయాన్ని, తండ్రికీ తనకీ మధ్య కలిగిన వైషమ్యాన్ని చెబుతూ.
పూర్తిగా విని ఈశ్వర చంద్రుడు తేలికగా నవ్వి, "ఆ కాలంలో -- అంటే ఇరవై ఏళ్ళ క్రితం నేను గౌరిని చేసుకున్నప్పుడే ఇటువంటి ఆంక్షలు ఎక్కడో కాని ఎదురయ్యేవి కావు. అయినా నువ్వేమైనా కాని పని చేశావు కనకనా నిన్ను దుయ్య బట్టేందుకు? ఈ లోకం అంతే, రమేష్. స్వార్ధాని కున్నంత ప్రాముఖ్యం మంచికీ, మనిషికీ ఇవ్వరు. నీకన్నా సతీష్ బాగా చూస్తాడను కుంటున్నాడేమో మీ నాన్న? సమయం వస్తే ఆయనే నీ దగ్గరికి వస్తాడు. నువ్వు చెడు చేశావని వివేకంగా ఆలోచించే వాడు ఒక్కడూ అనలేడు అని, 'అన్నట్లు పిలిచావట. దేనికి?" అని ప్రశ్నించేడు.
"గిరిజ ఇంటరు ఫస్టున పసయిందని విన్నాను. నీ ఉద్దేశ్యం తెలుసుకోవాలనుంది , మావయ్యా. చదివిస్తావా, ఉద్యోగం చేయిస్తావా? అదీ కాకపోతే పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తావా?"
రమేష్ అలా అదిగాక ఈశ్వర చంద్రుడి మొహం మీద శుష్క హాసం ఒకటి కొద్ది సేపు దోబూచు లాడింది. చెక్కు చెదరని వాడిలా కూర్చుని అన్నాడాయన: "ఇందులో ఏదీ చేసేందుకూ చేయించేందు కూ కూడా స్తోమత లేదు ఈశ్వరిడుకి. భగవంతుడు ఒక్కగానొక్క దాన్ని ఇచ్చి చివరికి ఆర్ధికంగా చిక్కుల్లో పెట్టి లక్ష్మీ సరస్వతుల లాంటి నా బిడ్డకి ఎంతో అన్యాయం చేశాడనుకుంటాను ఒక్కోసారి. కానీ, దైవాన్ని దూషిస్తే ఏమిటి ప్రయోజనం? పురాకృత కర్మఫలం అని సరిపెట్టుకుంటే అదే తృప్తి. ఫస్టున పాసయినా ఏం లాభం...."
"నేను ఒక నిర్ణయానికి వచ్చెను, మావయ్యా. ఇందుకు మీరు అంగీకరించాలి."
రమేష్ వైపు ప్రశ్నార్ధకంగా చూశాడతను.
"మిమ్మల్ని కించపరచాలనే ఉద్దేశ్యం నాకు లేదు. పేద పిల్లలెందరో ఉన్నారీ కలకత్తా లో . అందర్నీ ఉద్దరించాలనే ఊహతో నడుం కట్టి విరగొట్టుకోలేను. నా స్నేహితుడోకతను గిరిజ ని చూశాడట. అతను ప్రత్యక్షంగా చూడకపోయినా ఊహించి చెప్పేడు. అతనిలో స్వార్ధం లేదు. ధనికుడు. నాకు కావలసిన వాడు. మెడిసిన్ చెప్పిస్తానని, మిమ్మాల్ని కనుక్కోమని చెప్పేడు. మీరిందుకు తప్పకుండా అంగీకరించాలి."
"ఏమిటి, రమేష్ , ఇది!!" ఈశ్వర చంద్రుడు నమ్మలేక పోయేడు క్షణం. తను కలగంటున్నట్లు భ్రమ పడ్డాడు కూడా ఆ సమయంలో. రెట్టించి మరోసారి అడిగేడు: "నువ్వనేది నిజమేనా? చదువు చెప్పించడం నాకూ ఇస్జ్తమే కానీ, ఇలా పరుల సొమ్ముతో ఐదారేళ్ళు పై చదువుకీ హౌస్ సర్జన్ కి ఆయె ఖర్చులు అదనంగా వస్తున్నాయని ఎలా ఖర్చు పెట్టించగలను? నా మనసు అంగీకరించడం లేదు."
"మావయ్యా నా మీద మీకు నమ్మకం ఉందా?"
"ఎంతమాట! నీమీద నమ్మకమే లేకపోతె నువ్వు పిలిచేవనగానే వస్తానా, రమేష్?"
"ఏ పరిస్థితి లోనైనా అవాంతరం ఏర్పడితే నేను....నేను చదివిస్తాను, మావయ్యా!"
ఈశ్వర చంద్రుడి కళ్ళు చెమర్చాయి. ఒక మంచి కబురు అందుకునేందుకు పొద్దుటే ఎవరి మొహం తప్పు చూశాడో గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. అతనికి తనకీ అవగాహన కాలేదు. మంచితనం మనుషుల్లో కాకుండా గుండెల్లో కనిపిస్తుంటే కదిలి పోసాగాడు. అతని హృదయంతర్భాగాల్లో ఎక్కడో తలుపులు తడుతూ 'వద్దు,' 'వీల్లేదు' అంటుంది ఏదో అంతశ్శక్తి . టీ కప్పు కింద ఉంచి నెమ్మదిగా తల పైకి ఎత్తి రమేష్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు: "వద్దు, రమేష్. ఈ చదువులూ సంధ్యలూ వల్ల ప్రయోజనం గురించి, సంపదల గురించీ నన్ను ఆలోచించేటట్లు చేసి ప్రలోభం లోకి పడిపోనీయకు. ఆడపిల్లకి కావలసిన చదువుంది. చాలు నాకీ తృప్తి. పెళ్లి చేసి అత్తవారింటికి పంపితే ధన్యుడి నే అవుతాను. ఉచితంగా ఈ ధనాన్ని తీసుకోవాలని లేదు. అది ధర్మం కాదు."
నవ్వాడు రమేష్. "మీరీ సమయంలో ధర్మం, అధర్మం , న్యాయం, అన్యాయం అంటూ సమయాన్ని వృధా చెయ్యడం అదంత సమంజసం కాదు.'
'ధర్మం, న్యాయం డబ్బుకి దూరంగా ఉంటె రాణిస్తాయి, రమేష్!"
"కావచ్చును. కానీ ఈ రోజుల్లో డబ్బు వాటిని మూట గట్టుతుంది. మా దగ్గిర కావలసినంత -- అసలు అఖ్హర్లేనంత అనచ్చు అంత డబ్బుంది. మీ దగ్గర అది లేదు. మీ అవసరాలకి మా డబ్బు ఉపయోగ పడుతుందంటే అది మాకు తృప్తి నివ్వదంటారా?"
"ఒకవిధంగా ఇది యాచన అవుతుంది. బ్రాహ్మణుడు యాచించవచ్చుననే ధర్మ సూత్రాల పట్ల నాకు కొద్ది నమ్మకం ఉన్నా నేను.... చేయి చాచి దిగజారి పోవడం భరించలేను."
"మీరు చేయి చాచే అవకాశం మేము కల్పించ లేదు. పిల్ల యోగ్యురాలు, తెలివైనది. మేము చదివించాలను కుంటున్నాం. ప్రభుత్వం స్కాలర్ షిప్పులు ఇస్తున్నదంటే అది ఉచితమైన డబ్బనీ, ఒక విధమైన యాచన కి ప్రతిఫలం అనీ మీరు అంటారా?"
"ఉహు. అది పారితోషకం అంటాను."
"దీన్ని అలా సమర్ధించు కోలేరా?"
"ఎలా అవుతుంది? నేను సమర్చిందుకోలేక పోతున్నాను."
రమేష్ కొంచెం ఆగాడు. అతనికి ఏ విధంగా నచ్చ చెప్పాలో అర్ధం అవలేదు. చిన్నగా విశ్వసిస్తూ అన్నాడు: "సిరి దానంతట అది వస్తానంటే కాదనకండి. మావయ్యా. ఈడేరిన పిల్లకి పెళ్లి చేయాలి, ఉద్యోగం చేయించాలి. లేదా చదివించాలి. వట్టినే ఇంట్లో ఉంచుకుంటే లేనిపోని మాట లంటుంది ఈ లోకం. ఆ మాటలన్నింటిని భరించేందుకు కనలేదు కద గిరిజ ను మీరు!"
ఈశ్వర చంద్రుడు ప్రతిఘటించలేదు. తన బిడ్డ మొహాన చదువుకునే గీత ఉండగా ఆటంక పరచడం ఈ సమయంలో ఉచితంగా అనిపించలేదు. 'ఊ" అని లేచి నిలుచున్నాడు.
కారు. ఆగింది. మహలు లాంటి ఆ ఇంట్లోకి ముగ్గురూ హరికృష్ణ తో ప్రవేశించారు. కారు హరన్ విని శ్యామల వచ్చి గేటు వైపు చూసింది. "చూడు , శ్యామూ . నువ్వు వెళ్లి కొద్దిగా పక్క వేస్తావా అమ్మా ఇతనికి?" అన్నాడు జగన్నాధం.
శ్యామల పైన వేసవి గాలికి చల్లగా వీచే వేపచెట్టు నీడలో అతనికి పక్క పరిచింది. అరుంధతి భర్తని అడిగింది ఏదైనా తింటారేమో అని. అతను బుర్ర ఊపాడు అడ్డంగా అక్కార్లేదన్నట్లు. హరికృష్ణ కలవరింత లూ, మగత నిద్ర మధ్య ముగ్గురు ఆసరా కాగా మంచం మీద మెనూ వాల్చేడు.
విజయ కుమార్ , సూర్య నారాయణ సెలవు తీసుకున్నారు. శ్యామాల కి బావ అంటే మంచి గౌరవాభిమానాలు ఉన్నాయి. అక్క అరుంధతి కన్న ఆవిడకి ఒక విధంగా చనువు ఎక్కువ. అతను కోటు విప్పి అరుంధతికి అందిస్తుంటే శ్యామల అడిగింది. "ఏం, బావా, ఈ దేవదాసు ఏ పార్కులో దొరికేడు. చార్ మినార్ దగ్గిర చంద్రముఖి ఇంట్లో నేమిటి?"
అరుంధతి కోపంగా చూసింది. "ఏమిటి శ్యామలా, అది?' వేళాకోళనికి కూడా సమయా సమయాలు ఉంటాయి. నువ్వెళ్ళి పడుకో."
"అరుంధతి భుజం చుట్టూ చేతులు వేసింది శ్యామల. "వేళాకోళం కాదక్కా, పాపం! మగత లో కలవరిస్తున్నాడు గిరీ గిరీ అని. అది నా చెవులకు పారూ, పారూ లా వినిపించింది. అయినా శరత్ బాబు ఆ నవల వ్రాసి వీధికో దేవదాసు ని సృష్టిస్తున్నాడు."
అటువైపు చూసింది అరుంధతి. చెల్లెలు నవ్వుతుంది.
'సాహిత్యాన్ని చులకన చేయడం మంచిది కాదు, శ్యామూ. నువ్వతన్ని ఏ పేరు పెట్టి పిలిచినా నాకు అభ్యంతరం లేదు. కానీ , వీధికో దేవదాసు సృష్టించడం అనేది....కొంచెం అలోచించి మాట్లాడాలి."
"అక్క అలాగే అంటుంది, బావా! శరత్ బాబు నా కెంత ప్రాణమో ఇప్పుడు నేను లేక్చరిస్తూ కూర్చుంటే తెల్లవారిపోతుంది. మీరు చెప్పండి -- ఇతను ఎక్కడ దొరికాడు?"
జగన్నాధం ముసిముసి నవ్వులు కురిపించి, "రేపు ప్రొద్దుటి వరకూ ఆగితే అతనే చెబుతాడు. ఎక్కడికి వెళ్ళడు. అతను మనింట్లోనే ఉంటాడు. కనుక్కుందువుగాని. అన్నట్లు బాబెడీ?" అన్నాడు. మాట మరిపించేందుకు.
"నాకు తెలుసు. ఇక్కడి నుండి గుడ్ నైట్ చెప్పలేక బాబెడీ అంటున్నారు. వాడు ఎక్కడుంటాడో మీకు తెలీదా? గుడ్ నైట్, బావా! అక్కా, గుడ్ నైట్!" అంది మెడ మెట్లు ఎక్కిపోతూ.
శ్యామల పక్క మీద పడుకున్నదే కానీ రకరకాల ఆలోచనలు మెదడు లో పుతుగులా దోలుస్తున్నాయి. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు అట పట్టించుదామా అని ఒక విధంగా రాత్రంతా జాగరణ చేస్త్గూనే ఉంది.
తెల్లవారి నాయర్ కాఫీ సిద్దం చేసినట్లు వంట ఇంట్లోంచి ఘుప్పున వాసన రాగానే దిగ్గున లేచి కూర్చుని "హమ్మయ్య ' అనుకుంది. ఆరుగంట లయె సరికి వెలుగు పూర్తిగా వచ్చేసింది. జగన్నాధం ఎంత ఆధునిక యుగంతో పాశ్చాత్య పద్ధతుల్ని అవలంబిస్తున్నా ప్రొద్దుటే ఐదు న్నరకి టంచనుగా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవడం లో మాత్రం పూర్వ సంప్రదాయాన్ని వదిలి పెట్టలేదు. అతను లేచి అప్పటికే స్నానం ముగించి మెట్ల మీద ఆవలిస్తూ వస్తున్న శ్యామల్ని పలకరింపుగా "గుడ్ మార్నింగ్" అన్నాడు.
