Previous Page Next Page 
మిధ్య పేజి 10


    "నువ్వన్నది నిజం అన్నయ్యా. డబ్బు గురించి నేను ఆలోచించక పోలేదు. మనలాగే ఇలాంటి చిక్కుల్లో పడి పైకి నవ్వు అభినయిస్తూ పొట్ట చేత్తో పట్టుకు వచ్చిన వాళ్ళు చాలామందే ఉన్నారు. మరి వాళ్ళ మాటేమిటి?"
    "దానికి మనమేం చేయగలం?"
    "తగిన సహాయం చేయాలి."
    "అదెలా?"
    "నేనున్నాను."
    "నువ్వా!"
    "ఈ విషయం నువ్వు మనసులోనే ఉంచు కోవాలన్నయ్యా?"
    "చెప్పు తమ్ముడూ!' కుతూహలంగా అడిగేడు.
    "నేను పోస్టాఫీసు లో నీ పేర మనియార్డరు మా ఫ్రెండ్ పేరిట చేయిస్తాను. గిరిజ ఇంటర్ ఫస్టు క్లాసు లో మంచి మార్కులతో పాసయిందిట. నువ్వా పిల్లని మెడిసిన్ చదివించాలి."
    రమేష్ కొంచెం కదిలి కుర్చీలో ముందుకు వంగి కూర్చుని తమ్ముడి వైపు నిశితంగా చూస్తూ అడిగాడు: "నువ్వు గిరిజ ని చూడలేదని అంటున్నావు. పైగా, ఆ పిల్ల గురించి ఇన్న భోగట్టాలు సంపాదించేవు. ఎందుకిలా చేస్తున్నావు? నువ్వు ఈ పనులన్నీ నిస్స్వార్ధం గానే చేస్తున్నావా?"
    "అంటే?" అర్ధం కాలేదు మన్మోహన్ కి.
    "ఒక పెదపిల్లని ఆర్ధికంగా ఆదుకుని పైకి తీసుకు రావడాన్ని నేను అభినందిస్తున్నాను , తమ్ముడూ. నువ్వు మనసులో ఏ ఆలోచనా పెట్టుకోకుండా ఇలాంటి వ్యవహారం లోకి దిగావంటే అదేమిటో తెలుసుకోవాలనే జిజ్ఞాస నాకు ఉండడంలో తప్పు లేదు కద?"
    "ఈశ్వర చంద్రుడి మావయ్య ని చూస్తె ఎవరైనా జాలిపదతా రన్నయ్యా. గిరిజను చూడకపోయినా బకిం రోడ్ లో అందరూ చెప్పుకుంటుంటే విన్నాను. ఆ పిల్ల అందచందాల గురించీ, గుణగుణాల గురించీ శ్యాం నగర్ వరకూ అందరికీ తెలిసిపోయింది. వజ్రం లాంటి ఆ పిల్లకి కొంత సాన పెట్టడం అవసరం. మనకులం వాళ్ళు. తప్పేముందీ ఇలా చేయడం లో?"
    'సౌదామిని కులం మనది కాదా , తమ్ముడూ?"
    కొంత తడవు ఆలోచనలో పడ్డాడు తమ్ముడు.
    "నువ్వు శ్రీహరి మామయ్య కూతురు అపర్ణ ని చేసుకోవాలనే సంగతి మర్చి పోతున్నావా?"    
    "ఏమిటన్నయ్యా నువ్వు అంటున్నది? అపర్ణ కీ గిరిజ కీ అసలు సంబంధం ఏముందీ?"
    'అక్కడే పోరాబడుతున్నావు . అవివాహిత పట్ల నువ్వు జాలి చూపించి ఓ మెట్టు కిందికి వచ్చేవు. అంటే మరో మెట్టు లో ఆరాధనా, తరవాత, ప్రేమా, ప్రణయం పెళ్ళీ లో మరీ మరీ కిందికి వచ్చేస్తున్నావు నాన్నగారి దృష్టి లో.
    "నా దృష్టి లో పైపైకి వస్తున్నట్లుంది. నువ్వు చేయదలుచుకున్న సహాయం ఏదో ఆ పిల్ల పెళ్లి నాడు చేయి, తమ్ముడూ . ఐదారేళ్ళ ఈ చదువులో ఎప్పుడు ఏ విధంగా జరుగుతుందో ఊహించలేం. కీడెంచి మేలెంచుతే నయం. అర్ధాంతరంగా ఆపిల్ల చదువు అదిపోతే అప్పుడు నువ్వు బాధ్యుడివి అవుతావు."
    అతని కళ్ళు తటతటలాడేయి. "పాపం అన్నయ్యా! చదువు మీద అభిలాష ఉన్నవాళ్ళ కి చెప్పించడం లో స్వార్ధానికి అవకాశం ఏముంటుంది? నీకు ఇష్టం లేదంటే విరమించు కుంటా నేనీ ప్రయత్నాన్ని."
    'ఛ! నేనలా అనలేదు, తమ్ముడూ. ఒక మంచి పనికి దేవుడి సహాయం వేయి రెట్లు ఉంటె మనిషి ఒక భాగమైనా చేయకపోతే జన్మకి అర్ధం కనిపించదు. అయ్యో! నేను మరిచే పోయెను. చీకటి పడబోతుంది. భోజనం చేసి వెళ్ళు, తమ్ముడూ!" అన్నాడు లేస్తూ.
    "వద్దన్నయ్యా. ఈసారి వస్తాను." అంటూ లేచాడు మన్మోహన్. సౌదామినీ టీ అందించింది. అతను సంధ్య చీకట్ల మధ్య మొదటి సారి ముగ్ధ మోహన రూపాన్ని పరికించి చూసి హటాత్తుగా వంగి నమస్కారం చేశాడు. ఆమె లేవనెత్తింది అతన్ని. దాదాపు ఎనిమిదేళ్ళు చిన్న అయిన మరిది కొడుకు అంబా ప్రసాద్ కి సరి ఈడుగా కనిపించేడు. మూడేళ్ళ పసివాడు అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి కొత్త వ్యక్తిని చూసి ఆగి మరుక్షణం అతని పాంటు ని ఆసరాగా చేసుకుని కాళ్ళకి చుట్టుకున్నాడు. ఎత్తుకుని ముద్దు పెట్టుకుని కిందికి దింపేసి అన్నావదిన దగ్గిర సెలవు తీసుకుని గరీఫా నుంచి రెండు వీధులు దాటి మేనమామ శ్రీహరి ఇంటి గుమ్మం ఎక్కెడు మన్మోహన్.
    బి.ఎ ఫైనలియర్ చదువుతున్న అపర్ణ కి మన్మోహన్ ని ఇచ్చి పెళ్లి చేయాలనే సంకల్పం శ్రీహరికి ఎప్పుడో కలిగింది. అతను ముప్పై నలభై వేల దాకా డాక్టరీ చదివి విదేశాల కు కూడా వీలైతే వెళ్ళగల స్తోమతు లో ఉన్న మేనల్లుడి ని కొనుక్కోవాలని ఉద్దేశ్యం పెట్టుకున్నాడు. ఒక్కగానొక్క కూతురు కంటికి దగ్గిరగా అష్టైశ్వర్యాల మద్య తులతూగుతుంటుందనే స్వార్ధం ఆయన్ని కౌగలించుకుంది. అతను అడపా తడపా కానుకల రూపంలో బావగారి చేతులు తడుపు తుంటాడు. అపర్ణ అపురూపంగా ముట్టుకుంటే మాసిపోతుందనే భ్రమ లో అందంగా, అధునాతన పద్దతిలో పెరుగుతున్న నవనాగరిక యువతి. మంచి పొడుగుతో కొద్దిగా సన్నగా గాలి వాటుకు ఊగిస లాడే మల్లె పందిరి లా ఉంటుంది. మన్మోహన్ ఆవిడ అందానికి కట్టుబడే వాడే కానీ ఆ పిల్ల తండ్రి చాటుగా లంచాల రూపం లో తన తండ్రిని వశం చేసుకోవడం వల్ల అతను ఆమె పట్ల ఉదాసీనంగా, చలన రహితంగా ఉండి పోయేడు.
    మన్మోహన్ రాగానే మొహం నిండా సంతోషాన్ని పులుముకుని ఆహ్వానించెడు శ్రీహరి. ఆయన్ని చాలా మంది శ్రీహరి అని రెట్టించి మరీ పలుకుతుంటారు. శ్రీని హరించే వాడనీ, శ్రీని దిగ మింగే వాడనీ, తల్లీ తండ్రి శ్రీహరి అని శివుడి పేరు పెట్టుకున్నారు. శ్రీ కంటే విషం కనక దాన్ని హరాయించుకున్నాడని వారి ఉద్దేశ్యం. కానీ ఈశ్రీహరి ఆడపిల్లలంటే అమితంగా మోజుపడే వ్యక్తీ. శ్రీహరి భార్య అన్నపూర్ణ. కుయుక్తూలూ, కల్మషాలు తెలీని నవనాగరిక యుగంలో పుట్టి, అమాయకత్వాన్ని , పతి భక్తీ ని మూట గట్టుకున్న ఉత్తమ సాద్వీమణీ. ఎరను చూపించి చేపలు పట్టే విధానం తెలిసిన మనుషుల్లో శ్రీహరి జమ అయితే అందుకు  కళనళపడటం ఆవిడ వంతు. లోకం తీరుతెన్నులు తెలియకపోయినా గుప్పుమనే సంఘం తాలింపు వాసనకి కళ్ళు బైర్లు కమ్మి ముక్కుమ్మట నీళ్ళు కారుతుంటే అటు అన్న స్వభావపు ఘాటుకీ, ఇటు భర్త తత్త్వానికి విలవిల్లాడి పోయేది ఒడ్డు మీది చేప పిల్ల మాదిరి. రెండు జడలు వేసుకుని, పంజాబీ డ్రెస్సు లో నుదుటికి గీతలా పొడుగు బొట్టుతో, కనిపించీ కనిపించని పెదాల రంగుతో, ఎత్తు బూట్ల తో చేతిలో తాళం చేతుల గొలుసు తిప్పుకుంటూ వెళ్ళే కూతుర్ని చూసి దీర్ఘంగా నిట్టుర్సు విడిచి తన వైపు చూసుకుంటుంది. అబ్బరాల ముద్దు గుమ్మగా పుట్టినా, విదేశీ వాతావరణాన్ని జీర్ణించుకుని సంఘం లో పుష్కలంగా పరుపు ప్రతిష్టలుండి వినోదాలు, విలాసాలకీ లోటు లేని తండ్రి సంరక్షణ లో పెరిగినా ఏమిటో తను ఆ వాతారణానికి లొంగలేక పోయింది. ఈ కూతురికి ఎవరి పోలికలో? అనుకుని మాతృసంప్రదాయం మా ప్రారబ్ధం అనుకుని మరోసారి నిశ్వాసం విడుస్తుంది అన్నని తలుచుకుని. ఆ అన్నకి అక్షరాల మేనకోడలు. అందుకే ఈ పోలికలు. పోగాలం దాపురించినప్పుడు వెర్రి కోటి రూపాల్తో ప్రవేశించి చిచ్చు పెట్టక ఏం చేస్తుంది?
    టీ తీసుకు వచ్చి మేనల్లుడికి ఇచ్చి దూరంగా నిలుచుంది అన్నపూర్ణ.
    "ఇప్పుడేక్కడి నుంచోయ్ రావడం? ఇంత పొద్దు పోయిందెం ఈ వేళ?" అని ప్రశ్నించేడు శ్రీహరి.
    "రావడం త్వరగానే వచ్చెను, మామయ్యా. వస్తూ వస్తూ పెద్దమ్మ ఇంటికి వెళ్లాను. అక్కడ కొంచెం ఆలస్యం అయింది."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS