"ఇందులో నీచత్వం ఏముంది?"
"ఇంకా వుంది!" అంటూ చెప్పసాగింది, సుజాత గత దినం నాగరాజు చెప్పిన విషయాలన్నీ వివరంగా చెప్పింది. సాక్ష్యాదారాలతో సహా రుజువు చేస్తానంది.
"సరే! మీతోపాటు నేనూ రేపు చూస్తాను! మీ మాటే నిజమయితే ఆడగా పడిన చెల్లి కన్నీరు తుడుచి ఆమె బ్రతుకు చక్కబరుస్తాను!"
"థాంక్స్!" అంటూ లేచారిద్దరూ!
* * * *
ఆ రోజు ఆదివారం!
ఉదయం నించీ సుజాత మనసు మన్సులో లేదు. ఎప్పుడెప్పుడు సాయంకాలం అవుతుందా అని ఎదురుచూడసాగింది. ప్రొద్దు గడిచేకొద్దీ అందోళన, ఆరాటం ఎక్కువ కాసాగాయి. ఆవిడ ఎవరు? ఇతనికీ ఆమెకీ సంబంధం ఏమిటి? తప్పకుండా తీసుకవస్తానన్నాడు? ఒక వేళ రాకపోతే! అతనెవరో! అడ్రసు కూడా తెలుసుకోలేదు. పేరయినా అడగలేదు. పోనీ జానికమ్మగారిని అడిగితె! అతనా యింటికి వచ్చినట్టున్నాడు. ఆవిడకయినా తెలుసో తెలియదో!
"ఉహూం అతను తప్పకుండా వస్తాడు ఆమాటల్లో సిన్సియారిటీ అలావుంది. ఆమెని చూడాలి మాటాడాలి. తర్వాతే వుంది! ఆ పిల్లని ఆవిడకి అప్పగించాలి. అంతే!"
ఆ వూహ రాగానే వులికిపడింది. చప్పున అటు చూసింది. హాయిగా కేరింతలు కొడుతూ ఆడుకుంటూ౦ది బెలూన్ తో ! ఎప్పటి ఋణమో యిది. తీరిపోతోంది!"
"సుజాతా!"
పిన్నిగారు వచ్చారు. సాయంకాలంఅందరూ సినిమాకి బయలుదేరుతున్నారు. అంచేత యింటికి తాళం వేసుక్ని వచ్చేసిందామె.
"నువ్వేక్కడికయినా వెళుతున్నావామ్మా!"
"అవును పిన్నీ __ అయితే సినిమాకి కాదు. అలా బజార్లో కొంత పనివుంది."
"ఆదివారం నాడు బజార్లో పనేమిటమ్మా!"
నవ్వింది సుజాత. నేనే మీవద్దకి వ్కాహ్హి పాపని యిచ్చి వెళదామనుకున్నాను. అంతలో మీరే వచ్చారు! "అంతలో ఆమె మనస్సులో ఏదో వూహా తళుక్కుమంది. పిన్నిగారూ! మీరు ప్రకాశం పార్కుదాకా వస్తారా?"
తెల్లబోయిందామె "అదేంటమ్మా? పార్కుకి నేనేందుకు యీ వూరోచ్చి ఇన్నేళ్ళయింది ఏనాడూ పార్కు ఎరగను!"
"లేదు పిన్నిగారూ! మీరు తప్పక రావాలి! పదండి వెళదాం! నా జీవితంలో ఈ సాయంకాలానికి చాలా ప్రాముఖ్యత వుంది. మీరు తప్పకుండా రావాలి!" బ్రతిమాలుతూ అంది.
"సరే పదమ్మా!" అందామె మల్లేశ్వరిని ఎత్తుకుంటూ, జానికమ్మగారిని అనుసరించింది సుజాత.
ఇద్దరూ పార్కు చేరేసరికి బాగా ఆరు గంటలైంది. ఇంకా చిరుచీకట్లయినా కమ్ముకోలేదు. "మీరిక్కడ కూర్చోండి! ఒక్కక్షణంలో వస్తాను!" అని ఓ రాతిబల్ల మీద కూర్చోపేట్టి మరో గేటువైపు నడిచింది.
అక్కడ ఆ వ్యక్తి నుంచుని వున్నాడు.
"హమ్మయ్య వచ్చారా?" అన్నాడు. అతని ముఖంలో ఎంతో అనందం, తృప్తి కనిపించాయి.
తలూపింది సుజాత.
"ఒక్కరే వచ్చారా?" "అం" చిన్న అబద్దం ఆడేసింది.
"అయితే పదండి! ఆవిడ అక్కడ పోడక్రింద కూర్చుంది. వెళదాం!" అన్నాడు. ఇద్దరూ మెల్లిగా నడుస్తూ దట్టంగా వున్న అపోడ దగ్గరకి వచ్చారు. ఆ పోడకి అటువైపున బల్లమీదే జానికమ్మగారు కూర్చుని వున్నారు. అక్కడే అంతదాకా జీవితకాలమంతా నిరీక్షణలో, దిగులుతో గడుపుతోన్న వ్యక్తిలా వున్న ఓ యువతి కూర్చుని వుంది.
ఇతన్ని చూడగానే, "వచ్చావా కళ్యాణ్!" అంటూ లేచింది.
"నమస్తే!" అంది సుజాత.
"వీరు సుజాతగారు! ఆ రోజు చెప్పనే రైల్వేస్టేషన్లో రైల్లో కనిపించిన వారు వీరే!"
ఆ మాటలు వినగానే ఆమె కళ్ళు మిలమిల మెరిశాయి. "పాప బావుందా?" అని అడిగింది. ఆమె ముఖంలో పాపని గురించి ఒక్క మాటయినా వింటే చాలు అన్నంత ఆరాటం కనిపిస్తోంది.
"మీరెవరు? పాపకి మీకూ ఏ సంబంధం?"
సుజాత ప్రశ్నకి ఆశ్చర్యపోయి "నువ్వు చేప్పలేదా కళ్యాణ్! ఏమండీ నా పాప కన్నకూతురండీ! నా కన్న కూతురు! తొమ్మిది నెలలు మోసి మూడు నెలలు పెంచి విడిచేశానండీ" అంది బాధగా.
"ఊం నేను నమ్మను! మీరే పాపా కన్నతల్లి అయితే అలా బిడ్డని వదిలేసుకుంటారా? అలా నిర్దాక్షణ్యంగాముక్కూ ముఖం తెలియని వారి చేతిలో వదిలేస్తారా?"
"కళ్యాణ్! నీవు వీరితో నా కధంతా చెప్పలేదా?"
లేదన్నట్టుగా తలూపెడతను అడ్డంగా.
"చాలా తప్పుచేశావు. ఆఖరికి ఇప్పుడైనా చెప్పివుండవలసింది. సుజాతగారూ ! మీరు ఎక్కడ వుండేది నాకు తెలుసు. అతనికీ తెలుసు, మీరు వూరికి వెళ్ళి తిరిగొచ్చే సమయంలో కళ్యాణ్ కాచుకుని పాపని అందచేశాడు. ఆ రోజు నేనూ ఆ స్టేషన్ లోనే వున్నాను. నా పాప భద్రంగా మీవద్ద పెరుగుతుందనే విశ్వాసంతోనే అలా విడిచేశాము"
అంతా ఆశ్చర్యంగా వుందామేకు. అయినా తెలిసి చేసిన కుట్రలా అనిపించి, "కానీ మీరు చేసిన అపనితో నేనేం కోల్పోయానో, నేను ఎంతగా అవమానలకీ, అనుమానలకీ గురయ్యానో మీకు తెలుసా? ఇప్పుడు మీపాప మీకు క్షేమంగా దక్కుతుంది. కానీ __ కానీ నాకు మళ్ళీ ఆ రోజులు వస్తాయా?" అంది కంపిస్తోన్న స్వరంతో.
"నిజమే! మీరు పరువు మర్యాద కోల్పోయారు. నలుగుర్లో నవ్వుల పాలయ్యారు కన్న తండ్రికి, ప్రేమించిన మనిషికీ దూరమయ్యారు మానసికంగా చిత్రహింస అనుభవించారు. కానీ అదంతా మీ మేలుకే జరిగింది! అందుకే ఆ మేలుకోసం మీ మేలు కోసం __ నా మేలుకోసం చేశాను!"
