Next Page 
ఎలమావితోట! పేజి 1

               
                                           ఎలమావితోట!
                                                                                      -----యామిని సరస్వతి
    
                                                               

                                   

   

    "స్వప్నా! స్వప్నా!"
    మృదువుగా పిలుస్తూ తిట్టి లేపింది అమ్మమ్మ.
    "ఊఁ"
    మూలుగుతూ వొళ్ళు విరుచుకుని మళ్ళీ దుప్పటి బిగించి అటు తిరిగి పడుకుంది స్వప్న. నైలాన్ దోమతెర పూర్తిగా ఎత్తేసింది అమ్మమ్మ. కప్పుకున్న నీలి వెల్వెట్ దుప్పటి లాగేసింది. స్వప్న కొద్దిగా కళ్ళు తెరిచి "ఏమిటి అమ్మమ్మా?" అంది గారాంగా ముద్దులు కురుస్తూ. అలవోకగా తెరిచి చూసి "పొద్దున్నే నిన్నే చూశాను.....చూడు." అంది మళ్ళీ మూస్తూ....
    "స్వప్నా! ఈ రోజే పరీక్షలు ప్ర్రారంభం. మరిచి పోయావా?"
    "వెధవ పరీక్షలు....ఎప్పుడూ వస్తూనే వుంటాయి. మంచి నిద్ర మళ్ళీ మళ్ళీ వస్తుందా? ఆ అంది బరువుగా రెప్పలు పై కెత్తుతూ అమ్మమ్మ నవ్వేసింది ఆ మాటలకి.
    "అటు చూడు!"
    తల తిప్పింది స్వప్న "యిక నిద్దరేముంది" అంటూ. అటు తల తిప్పగానే నల్లచేప రౌండ్ టేబిల్ పై మూడడుగుల కృష్ణ విగ్రహం! నల్లగా నిగ నిగ లాడుతూ వుంది. అప్పటికే అమ్మమ్మగారు స్వామి మెడలో గులాబీల దండ వేశారు. ఎప్పుడూ వుండే రత్నాలహారం, ముద్దుటుంగరం, నెమలి పింఛం మెరుస్తున్నాయి పట్టు పీతాంబరం తళ తళ లాడుతోంది.
    "కృష్ణుడిని చూసినా, కృష్ణవేణమ్మని చూసినా ఒకటే! కళ్ళు తెరుస్తూనే నిన్ను చూశానుగా. ఇంకేం, పరీక్షలు దంచిపారేస్తాను!" అంది నవ్వుతూ.
    స్వప్న మాటలకి మురిసిపోయింది అమ్మమ్మ! "లేమ్మా! తెల్లగా తెల్లారిపోయింది!" అంది నీలిబల్భు ఆర్పేస్తూ. ఆ గదంతా నీలి మయం.....గోడలకి నీలి డిస్టెంబర్ రంగులు, నేల మీద నీలి తివాచీ..... ద్వారాలకి, కిటికీలకి నీలి కర్టెన్లు, నీలి కవర్ బెడ్, పిల్లోస్ కి నీలిరంగు కవర్లు, నీలి కర్టెన్......ప్రతి శుక్రవారం నీలి వర్ణం ధరిస్తుంది స్వప్న. అందుకే ఆమె క్లాస్ మేట్ స్వప్నని "కృష్ణ సుందరీ!" అని పిలుస్తుందానాడు. దానికి బదులుగా నవ్వేస్తుంది స్వప్న.
    ముఖం కడుక్కుని, అమ్మమ్మ స్వయంగా తలంటుపోస్తే పోయించుకుని, ధూపంతో తలారబెట్టుకుంది స్వప్న. నీట్ గా తయారై అమ్మమ్మ పాదాలకి ముందు, తర్వాత ఇలవేల్పు, యింటి దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి తర్వాత నమస్కరించింది స్వప్న. పూజా మందిరంలో నాలు గడుగు లెత్తున స్వామిని చూసినప్పుడల్లా స్వప్న మనస్సు పరవశంతో తేలిపోతుంది.
    "వెళ్ళొస్తా అమ్మమ్మా!"
    "మంచిదమ్మా.....బాగా రాసిరా!" అంది అమ్మమ్మ నవ్వుతూ. కార్లో అడుగు పెడుతూ "అవును మణీ! పరీక్ష నేను బాగా రాయకపోతే యింక యీ కాలేజీలో బాగా రాసేవాళ్ళెవరు?" అంది మృదు దరహాసంతో.
    అమ్మమ్మగారి శిక్షణలో సేవలో తల పండిపోయిన మణి తలూపేడు అదే నిజమన్నట్టుగా.
    "టా! టా! అమ్మమ్మా!" చిలిపిగా చెయ్యూపింది స్వప్న.
    అమ్మమ్మ కూడా చెయ్యూపింది బదులుగా కారు కదిలి పోర్టికో దాటి, గేట్ దాటి మెయిన్ రోడ్డెక్కింది. అమ్మమ్మగారు బరువుగా నిట్టూర్చి వెనుదిరిగింది. సరిగ్గా ఆ సమయానికే గేటు ముందు నించున్నాడు ఓ యువకుడు. అతని వెంట ఓ పన్నెండేళ్ళ అమ్మాయి.......గూర్ఖా ఆపేశాడు వాళ్ళని.
    "నానమ్మా!" గట్టిగా కేకేశాడా యువకుడు.
    వెనుదిరిగి లోపలికి వెళ్ళబోతున్నదల్లా ఆగి తిరిగి చూసింది. దూరంగా గేట్లో నుంచున్న యువకుడు కవ్వించాడు. అతన్ని లోపలికి పంపమన్నట్టుగా చేయి విసిరిందామె. గూర్ఖా గేటు తెరిచి ఆ యిద్దర్నీ లోపలకు పంపేడు.
    ఆ సమయంలో అతని ముఖంలో ఎంతో అసంతృప్తి! తోటలో పూలు దొంగలించుకుని వెళతారో, హాల్లో అందంగా అలంకరించిన సామాన్లలో దేన్నయినా తీసికెళతారో, మరేదయినా ముఖ్యమైన వస్తువునే ఆవహించుకుని వెడతారో అన్నట్టుగా చూశాడు.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS