అసలు తను వింటున్నదేమిటో జరుగుతున్న దేమిటో అర్ధం చేసుకోలేని దానిలా గుడ్లు అప్పగించి చూస్తూ వుండిపోయిన కళ్యాణి కొద్ది క్షణాల తరువాత తేరుకుని, 'పాపం, ఇందుకే కాబోలు ఆవిడ ఇవాళ ఎలాగో వుంది-- సంవత్సరం పైగా పని చేస్తున్న మనిషిని ఇంక రేపటి నుంచి మీ అవసరం మాకు లేదు అని చెప్పటం కష్టమే మరి-- ఈ మాట చెప్పటానికి ఆవిడ ఎంత బాధ పడిందో ఆవిడ మొహమే చెప్తోంది ....స్కూలు టీచరు అయితే పిల్లలకీ అన్ని విధాలా బాగుంటుంది. నేనేమీ అనుకోను అని ఏదో నాలుగు మాటలు చెప్పాలి వీళ్ళ పాఠం అయిపోయాక .' అనుకుంది డబ్బు తీసుకుని పర్సు లో పెట్టుకుని మళ్లీ రోహిణీ కంపోజిషన్ దిద్దటంలో మునిగిపోయింది.
మరో అయిదు నిమిషాలు గడిచాయి. అనసూయమ్మ మళ్లీ గదిలోకి వచ్చి, 'పాపా తలుపులూ అవీ జాగ్రత్తగా వేసుకోండి.' అని కూతురికి, 'నేను , పనిమీద వెళ్తున్నాను.' అని కళ్యాణి ని వుద్దేశించి అన్నట్లు గానూ అనేసి బయటికి వెళ్లి పోయింది-- వరండా లో జోళ్ళ చప్పుడు ఆ తరువాత గేటు తెరిచి మళ్లీ వేసిన చప్పుడూ అన్నీ స్పష్టంగా తెలిశాయి.
కళ్యాణి మనస్సు చివుక్కుమంది. అసలే నాకు ఆదాయం అంతంత మాత్రం -- ఇంక ఈ ట్యూషన్ కూడా పోయిందంటే నేను చాలా ఇబ్బంది పడిపోతాను-- మీరు ఎలాగైనా నాకీ ఉపకారం చేసి పెట్టాలి.' అని కాళ్ళా వెళ్ళా పడి బ్రతిమాలు కుంటానని భయపడి అలాంటి అవకాశం నాకు ఇవ్వకూడదనే వెళ్లి పోయిందా అనిపించింది వోసారి.
'ఛ-- అలా ఎందు కనుకోవాలి-- ఆవిడ నిజంగానే అర్జెంటు పనేదైనా వుండి వెళ్ళిందే మో.' అని తనకి తనే నచ్చ చెప్పుకుంది ఆ వెంటనే........
ఏమైనా కళ్యాణి ఆవేళ రోజులా ఉత్సాహంగా చదువు చెప్పలేక పోయింది. -- ఆ పిల్లలు అంతకన్నా మన్ను తిన్న పాముల్లా కూర్చున్నారు. ఎలాగో పాఠం పూర్తయిందని పించింది.
పుస్తకాలు సంచీ లో సర్దుకుంటున్న రవి 'టీచర్ రేపటి నుంచీ మీరు రారా?' అన్నాడు బిక్క మొహం వేసుకుని.
'నేను రాను బాబూ -- మీకింకో టీచరు చెప్తాడు. మీరిద్దరూ బాగా చదువుకుని మంచి మార్కులతో ప్యాసవాలి.' అంది కళ్యాణి, ఇంకా పసితనం అయినా వదలని వాడి మెత్తటి బుగ్గలని ఆపేక్షగా నిమురుతూ.
'అలాగే టీచర్ -- నమస్తే' అని చెప్పి వాడు లోపలికి వెళ్ళిపోయాడు.
వాడు అక్కడ్నించి వెళ్ళిపోవటం కోసమే ఇందాకటి నుంచి కనిపెట్టుకుని కూర్చున్నట్లు రోహిణి అంది మెల్లిగా 'టీచర్ నేనో మాట చెప్పనా?'
లేవబోయిన కళ్యాణి ఆ మాటలు వింటూ మళ్లీ కూర్చుంది విస్మయంగా ఆ పిల్ల వంక చూస్తూ.
'నాలుగు రోజుల నుంచి, మా అమ్మా నాన్నా అస్తమానూ పోట్లాడుకో టమే-- అమ్మ ఏదేదో అరుస్తుంది, నాన్న ఇంకా కోపంగా కేక వేస్తాడు. ఆఖరికి నిన్న సాయంత్రం అమ్మని నాన్న కొట్టారు.' అంది రోహిణి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా.
కళ్యాణి అయోమయంగా చూసింది. 'ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ దంపతుల మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి? ఒకవేళ ఏ విషయం లోనయినా బేధాభిప్రాయాలు వస్తే మాత్రం భార్య మీద చెయ్యి చేసుకుంటాడా అతను ? ఏమో ఏమిటో ఆ కారణం -- అయినా సంసారం లోని లోటు పాట్లని ఇలా ఇంకొకరి ముందు వెల్లడించు కోకూడదని ఈ పదకొండేళ్ళ పసిడానికి ఎలా తెలుస్తుంది...'
'టీచర్ ' రోహిణి పిలుపుతో కళ్యాణి ఆలోచనలు తెగిపోయాయి.
'మరేమో , అమ్మ అంది....నాన్నగారు అస్తమాను మీతో ఖబుర్లు చెప్తూ కూర్చుంటారు ట. మీరు కూడా పాఠం చెప్పటం మానేసి నాన్నగారితో నవ్వుతూ మాట్లాడు తారుట-- మీ కులమే అలాంటిదిట...'
బుస్సలు కొడుతున్న తాచుపాము పై నుంచి జారి వచ్చి తన వడిలో పడినంత గా హడిలి పోతూ ఒక్క ఉదుటున లేచి నిలబడి 'ఇస్, ఇంక చెప్పకు పాపా, సరే, నే వెళ్ళిపోతున్నా' అంటూనే గబగబ బైటికి వచ్చేసింది కళ్యాణి.
అలా ఎవరో తరుముకు వస్తున్నట్లు హడావిడిగా నడుస్తున్న కళ్యాణికి ఒక్క సందేహం వచ్చింది. 'ఈవిడకి, మొగుడి మీద ఈ అనుమానం మొదటి నుంచీ వుందా? ఉంటె ఇన్నాళ్ళూ ఎందుకు వూరుకుంది .' అని.
'ఉహు మొదటి నుంచీ వుండి వుండదు.' అని తన కితనే సమాధానం చెప్పుకుంది. -- 'సాయంకాలం నేను పాఠం చెప్పటానికి వెళ్లేసరికి అయన ఇంట్లో వుండటం తటస్థించి మరి వేరే హడావిడి పనులు ఏమీ లేకపోతె ఒక్కోసారి పిల్లలు చదువు కుంటున్న దగ్గరికి వచ్చి ఏమండీ టీచరు గారు మా వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా వుంది అంటూ వాళ్ళ చదువుని గురించే ఏదైనా అడిగేవారు . నేనూ ఏదో సమాధానం చెప్పేదాన్ని -- అప్పట్లో ఆవిడకి ఆ సంభాషణ సహజమే అనిపించేదేమో -- కాని నేను ఫలానా అని తెలిశాక ఏనాడైనా నా బుద్ది వక్రించ వచ్చు ననే అనుమానంతో పాటు భర్త మీద కూడ అపనమ్మకం కలగటం ప్రారంభించి వుండవచ్చు ' ఆలోచిస్తున్న కళ్యాణి ఒళ్ళు కలదరించింది. 'ఛీ-- ఏం మనుష్యులు?' అనుకుంది కసిగా.
కొద్దిరోజులు గడిచి పోయాయి.
వో సాయంకాలం పార్వతమ్మ గారి పిల్లలకి పాఠం చెప్పి ఇంటికి తిరిగి వచ్చి, తలుపు తాళం తీసుకుని గుమ్మం లో అడుగు పెట్టబోయిన కళ్యాణి ఎదురుగా పడివున్న వుత్తరం తీసుకుని ఆత్రంగా చదువు కుంది.....
కళ్యాణి పెట్టిన అప్లికేషన్ సమాధానంగా ఒక కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కి వచ్చిన వుత్తరం అది. కళ్యాణి పొంగి పోయింది. 'దాదాపు రెండు సంవత్సరాల పాటు పేపర్లో ప్రకటించిన ప్రతి ఉద్యోగానికి అప్లై చెయ్యగా చెయ్యగా ఈనాటికి ఇంటర్వ్యూ అంటూ ఒకటి వచ్చింది. ఇందులో ప్యాసై ఈ వుద్యోగం అంటూ దొరికితే ఇంక తన సమస్య తీరిపోయినట్లే -- ఊరికి ఉత్తరాన ఒకటి దక్షిణాన ఒకటీ అన్నట్లుగా వున్న యిళ్ళ కి వురుకులూ, పరుగులూ మీద వెళ్లినట్లు వెళ్లి పాఠాలు చెప్పక్కర్లేదు . హాయిగా ఉదయం పదిగంటల కి వెళ్లి సాయంకాలం అయిదు గంటలకి వచ్చేయ్యోచ్చు. కావలసినంత తీరిక, విశ్రాంతి, ఏదైనా చదువు కోవచ్చు. పరీక్షలకి కట్టొచ్చు-- ట్యూషన్లు చెప్తూ కూడ ఎలాగో టైము చూసుకుని ఆ టైపు నేర్చుకుంది కనక ఈ ఉద్యోగానికి అప్లి చేసే అర్హత వచ్చింది -- అసలు టైపు నేర్చుకోమని సలహా ఇచ్చింది ఆ పార్వతమ్మ గారే- 'రేపు వెళ్ళగానే ఈ ఇంటర్వ్యూ సంగతి ముందుగా ఆవిడికి చెప్పాలి....' ఉద్యోగం దొరికిపోయింది అన్నంత సంతోషంగా వున్న కళ్యాణి కి ఆ పూట ఏపనీ చెయ్య బుద్ది కాలేదు-- ఏదో వండుకున్నాను అనిపించి, తిన్న శాస్త్రం అయిందని పించి వంట గది సర్దేసుకుని వెళ్లి గదిలో కుర్చీలో కూర్చుని ఆవాళ పార్వతమ్మ గారి యింటి నుంచి తెచ్చుకున్న నవల తెరిచింది -- కొంచెం సేపు గడిచిందో లేదో తలుపు తడుతున్న చప్పుడయి ఆ వెంటనే అవి బార్లా తెరుచుకున్నాయి--
ఇంకా నిద్ర వేళ కాకపోవటం చేతా, కాస్త చల్లటి గాలయినా వస్తుంది అనే ఉద్దేశ్యంతో నూ తలుపులు వోరగా వేసి వుంచింది -- ఇప్పుడు అవి పూర్తిగా తెరుచుకుని లోపలికి రాబోతున్నది పిల్లలెవరో అయి వుంటా రనుకుని , 'ఎవరూ?' అంటూ కుర్చీలోంచి లేచి కాస్త యివతలకి వచ్చింది. అప్పటికే ఆ వ్యక్తీ గడపదాటి గదిలోకి వచ్చి నిలబడ్డాడు. అతను ఇంటి యజమాని వెంకటేశ్వర్లు.
'ఏం చేస్తున్నావు కళ్యాణి?' అన్నాడతను -- గతుక్కుమంది కళ్యాణి -- అసలు వెంకటేశ్వర్లు ఆమె మాట్లాడుకున్న సందర్భాలు చాలా తక్కువ. ఇంటి అద్దె అదీ అయన భార్య కాంతమ్మ గారే తీసుకుంటుంది -- ఎప్పుడైనా ఎదురు పడితే ఏదో మాట వరసకి 'కళ్యాణి గారూ-- బాగున్నారా?' అంటూ ఎంతో మర్యాదగా పలకరించేవాడు. ఇప్పుడు ఈ ఏకవచన ప్రయోగం. ఆ మాట్లాడుతున్నప్పుడు అతని గొంతులో ధ్వనించిన చిత్రమైన నవ్వూ, అతను నోరు తెరవగానే గుప్పున మొహం మీదికి కొట్టిన వెగటు వాసనా కళ్యాణి మనస్సు అతని పట్ల జుగుప్సతో నిండిపోయేలా చేశాయి -- అంతలోనే హటాత్తుగా గుర్తు వచ్చింది, కాంతమ్మ గారూ పిల్లలూ ఆ సాయంకాలం వూరికి వెళ్తున్నాం అని చెప్పిన సంగతి-- కళ్యాణి వెన్ను జలదరించింది. భయంతో కాళ్ళూ చేతులూ గజగజా వణక సాగాయి-- ఏం మాట్లాడాలన్నా నోరు పెగలలేదు....ఆమె మౌనంతో మరికాస్త ధైర్యం తెచ్చుకున్న అతను 'ఇంటికి వచ్చిన పెద్ద మనిషిని లోపలికి రమ్మనీ, కూర్చోమనీ చెప్పకుండా నిలబెట్టేయడం మర్యాద కాదు.' అంటూ వెకిలి నవ్వు నవ్వుతూ రెండడుగులు ముందుకు వేశాడు.
అతను తనకి మరీ దగ్గరగా వస్తాడేమో తనని తాకుతాడేమో అన్న భయంతో ఒక్క అడుగు వెనక్కి వేస్తూ ఏదో అనబోయింది కళ్యాణి-- ఆమెని మాట్లాడనివ్వకుండానే అతనన్నాడు.
"ఇన్నాళ్ళూ నువ్వు సంసారుల పిల్లవే అనుకున్నాను-- ఆ మధ్య చంద్రశేఖరం చెప్పాడు నువ్వు ఫలానా -- అని -- అతను నీ వలలో ఎక్కడ పడిపోతాడో నన్న భయంతో వాళ్ళావిడ నానా గొడవ చేసి చివరికి నీ ట్యూషను మానిపించేసిందటగా....మా ఆవిడా అలాంటి దేలె. నీ సంగతి తెలిస్తే ఇల్లే ఖాళీ చెయ్య మంటుంది నిన్ను-- అందుకే దానికి చెప్పలేదు. ఆ రాక్షసి ఇంట్లో ఉండగా నాకు అవకాశం దొరికింది కాదు. ఇన్నాళ్ళ కి అదీ పిల్లలూ శని విరగడ యినట్లు వూరికి వెళ్ళారు....నేను అందంగా లేననుకో-- అయినా మీ కులం వాళ్ళకి......'
'షటప్....ఇంతసేపూ ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియని దానిలా రాయిలా బిగుసుకు పోయినట్లు నిలబడిపోయిన కళ్యాణి ఒక్కసారి నోరు పెగల్చుకుని శక్తి కొద్దీ అరిచింది.
ఒక్క క్షణం బిత్తర పోయాడు వెంకటేశ్వర్లు. కాని అంతలోనే మళ్లీ ధైర్యాన్ని పుంజుకుని, 'ఈ బడాయి కబుర్లకేం లే -- భోగం బిడ్డవి, పాతివ్రత్యం చేస్తానంటే ఎవరైనా నమ్ముతారా-- నీక్కావలసినంత డబ్బిస్తాను .' అన్నాడు.
కళ్యాణి లో కోపమూ దుఖమూ పెల్లుబికి వస్త్గున్నాయి.
'మీరు నా తండ్రి లాంటి వారనుకున్నాను-- మీలో ఇలాంటి నీచ పుటూహాలు వుండటానికి ఆస్కారం వుందనే అనుమానమైనా రాలేదు నాకు....వెళ్ళిపొండి -- ఊ'-- అపర కాళికావతారం లా వున్న కళ్యాణి అజ్ఞాపిస్తుంటే ఇంకా అక్కడ ఒక్క క్షణం కూడా నిలవలేక పోయాడు వెంకటేశ్వర్లు. అతను గుమ్మం దాటి వెళ్తూ వెళ్తూ ఓ మాట మాత్రం అన్నాడు.
'సరే-- ఇవాళ తప్పించు కున్నావు . నా యింట్లో వుంటూ నాకు లొంగకుందా ఎక్కడికి పోతావో నేనూ చూస్తాను.'
'నేను రేపే ఇల్లు ఖాళీ చేస్తున్నాను.' అని భళ్ళున తలుపు వేసేసుకుంది.
'అబ్బ-- ఎంత భయంకరమైన రోజు.... గోముఖ వ్యాఘ్రాల లాంటి ఈ మనుష్యుల మనస్సులలో ఏముందో తెలుసుకోటం ఆ బ్రహ్మతరం కూడా కాదేమో.' అదిరి పోతున్న గుండెలతో నిలబడటానికి కూడ వోపిక లేనట్లు అక్కడే అలాగే నేలమీద కూలబడి పోయింది.
