'రేపు ఈఇల్లు ఖాళీ చేసేస్తానని చెప్పాను-- తెల్లవారే లోగా మరో ఇల్లు ఎలా దొరుకుతుంది? అసలు ఇలాంటి మనుష్యుల మధ్య ఈ వూళ్ళో వుండడం కంటే మరో దగ్గరికి వెళ్లి పోతేనో . 'అనుకుంటున్న కళ్యాణి కళ్ళ ముందు సాయంకాలం వచ్చిన ఇంటర్య్వూ కార్డు మెదిలింది.' నాలుగురోజులలో ఇంటర్వ్యూ వుంది-- అదృష్టం బాగుంటే వెంటనే వుద్యోగం రావచ్చు .అది రాకపోయినా బ్రతుకు తెరువు కి లోటు లేకుండా చేతిలో ట్యూషన్లు వున్నాయి-- వీటన్నిటిని వదులుకుని మరో కొత్త చోటికి పొతే అక్కడా మొట్టమొదట బ్రతుకు తెరువు సమస్య రాదా. ఆ తరువాత అక్కడ మాత్రం ఈ అనసూయమ్మ వెంకటేశ్వర్లు లాంటి మనుష్యులుండరా-- ఒకరిద్దరికి భయపడి వూరే వదిలి పారిపోవటం వివేకం అనిపించుకుంటుందా.' కళ్యాణి ఆలోచనలు ఒకదరికి రాకుండానే భళ్ళున తెల్లవారింది-- ఇంక మరి ఆలోచించ టానికిది సమయం కాదనుకుని ఉన్న కాస్త సామాను సర్దుకుని రెండు రిక్షాలు మాట్లాడుకుని ముందు ఆ ఇల్లు ఖాళీ చేసి వో సత్రవుకి వెళ్ళిపోయింది -- తరువాత వో నిశ్చయానికి వచ్చి మరో ఇల్లు చూసుకుంది -- ఆ వెంటనే జరిగిన ఇంటర్వ్యూ లో సెలక్టయి వుద్యోగం కూడా దొరికింది.
ఆఫీసు కంతటి కీ ఆడదాన్ని ఒక్కతినే అయిపోతానేమో మళ్లీ ఎలాంటి సమస్యలు తల ఎత్తుతాయో అని మొదట భయం వేసినా తను, కాక మరో ఇద్దరమ్మాయి లు వున్నారని తెలిసి సంతోషించింది -- ఇంక జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో మనస్సు చేసిన గారిడీ కి లొంగిపోయి చిత్రమైన పరిస్థితులలో ఇరుక్కోక తప్పలేదు.
'కాని....కాని, మురళీ కూడ వాళ్ళందరి లాగే నా పుట్టుకని గూర్చి వినగానే ఇంతలా మారిపోతాడని నేను గట్టిగా నమ్మక పోవటమే ఇప్పుడీ దుఃఖానికి కారణం....అంతే.' అనుకుంది కళ్యాణి కళ్ళు ఒత్తుకుంటూ. 'ఎంతయినా -- అదివరకు ఎన్ని అనుభవాలు జరిగినా ఎంతటి నిరాదరణ లభించినా, ఇవాళ మురళీ ప్రవర్తన వల్ల నా గుండెలకి తగిలినంత లోతు గాయం అడివరకేప్పుడూ తగలలేదు........ఈ దెబ్బ నించి కోలుకోవాలంటే నా కెంత శక్తి కావాలో ఎన్ని రోజులు పడుతుందో ...' అనుకుంటూ ఒక్క నిట్టుర్పూ విడిచింది.
* * * *
తెల్లవారింది -- కళ్యాణి కి మంచం మీద నుంచి లేవాలని పించలేదు -- నిద్రలేక కళ్ళు మండుతున్నాయి, ఒళ్ళంతా బరువుగా భారంగా వుంది.
'ఉహు ఇవాళ ఆఫీసుకి వెళ్ళలేను' అనుకుంది.
'ఆఫీసు-- ఆఫీసుని తలుచు కుంటేనే తన మనస్సు ఎలాగో అయోపోతోంది -- అక్కడ మురళీ కనిపిస్తాడు అన్న ఆలోచనే తన మనస్సుని చిత్రిక పట్టేస్తోంది-- ఆఫీసులో తన సీటులో కూర్చుని తల వంచుకుని పని చేసుకుంటూ చేసుకుంటూ మధ్యలో యధాలాపంగా నొ, కావాలనో తలఎత్తి చూసేసరికి మురళీ నవ్వు మొహం కనిపిస్తే మనస్సంతా పులకించి పోయేది-- కాని, ఇవాళ అతని మొహంలో ఎలాంటి భావాలు వ్యక్తం అవుతాయి? అసలు అదివరకులా తలతిప్పి అతను తల వంక ఎందుకు చూస్తాడు? అతడు విన్నది అతనిలోనే వుంచు కుంటాడా లేకపొతే ఆఫీసులో అందరికి చాటించి చెప్పెస్తాడా? అదే జరిగితే వాళ్ళందరి కీ అదివరకు లా తమ పాటి ఉద్యోగిని అనే గౌరవం వుంటుందా తన మీద? లేకపోతె ఒకవిధమైన తేలిక భావంతో చూస్తారా? పరిహసిస్తున్నట్లు నలుగురూ తన వంక చూస్తె ఆ చూపులని తను తట్టుకోగలదా-- ఆలోచిస్తుంటే నే కళ్యాణి కి ఒళ్ళంతా కంపరం పెడుతోంది.
ఏపనీ లేకుండా అలా పడుకుంటే ఆలోచనలతో మనస్సు మరీ వేగిపోతోంది-- పోనీ నిద్ర పట్టించు కుందామని బలవంతాన కళ్ళు మూసుకుంటే కళ్ళు మండుతున్నాయే కాని నిద్ర రావటం లేదు. లేచి మొహం కడుక్కుని స్నానం చేసింది-- కాఫీ ఆ తరువాత వంట ఎలానో చేశాననిపించి, అయిష్టంగానే నాలుగు మెతుకులు తిని మళ్లీ వెళ్లి పడుకుంది -- మెల్లిగా మధ్యాహ్నం గడిచి రాత్రయింది . '
మళ్లీ తెల్లావారింది.
'ఉహు-- ఇదేం బాగుండలేదు-- ఎన్నాళ్ళ ని యిలా తప్పించుకు తిరుగుతాను-- ఏమైనా సరే ఇవాళ ఆఫీసుకు వెళ్తాను. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చినా సరే ధైర్యంగా నిలబదతాను -- మరి తట్టుకోలేని అవమానమే జరిగితే ఈ వుద్యోగానికి రాజీనామా ఇచ్చేసి మరోటి చూసుకుంటాను.' అని మనస్సుని దిటవు పరచుకొని లేచి కూర్చుంది.
పదిగంటల వేళ బస్సు దిగి అరఫర్లాంగు దూరం నడిచి ఆపీసు గేటులో అడుగు పెడుతుంటే కళ్యాణి గుండెలు దడదడ లాడాయి. ఉదయం నుండీ తనకు తను నూరి పోసుకున్న ధైర్యం అంతా ఒక్కసారి దిగజారి పోయి కాళ్ళు గజగజ వణకటం మొదలు పెట్టాయి. తప్పు చేసిన వాడు పోలీసుల పేరు చెప్తే వణికి పోయినట్లుగా వుంది ఆమె పరిస్థితి-- అలాగే మెల్లిగా లోపలికి వెళ్లి తన సీటులో కూర్చోబోతూ ఆ ప్రయత్నంగానే తలఎత్తి మురళీ సీటు వంక చూసింది. అది ఖాళీగా వుంది.
;ఇంకా రాలేదులా వుంది.' అనుకుంటూ డ్రాయరు తెరిచింది-- కొన్ని పేపర్లు టైపు చెయ్యాల్సినవి వుండి పోయాయి . అవి కరస్పాండేన్సు కాదు. అంత అర్జెంటూ కాదు. అందుకే రేపు చెయ్యొచ్చు అని లోపల పడేసింది మొన్న వ్యవధి లేక-- నిన్న తను రాలేదు. ఇవాళైనా ఈ పనీ పూర్తీ చెయ్యాలి అనుకుంటూ టైప్ మిషన్ కి కాగితం బిగుస్తుంటే,
'నిన్న రాలేదేం' అని పలకరించింది అప్పుడే వచ్చిన తార.
'తలనొప్పిగా వుండి ....' నసిగేసింది కళ్యాణి.......
'నిన్న అర్జెంటుగా డిస్పాచ్ కావాల్సిన లెటర్స్ ఏవో వున్నాయిట -- చెప్పా పెట్టకుండా నువ్వు ఇంట్లో వుండి పోయావు-- బాస్ చిందులు తొక్కేశారనుకో. మురళీధర రావు గారుంటే అంత బాధ లేకపోను.. ఆయనకి టైపు వచ్చుగా ...కాని నిన్న ఉదయం అయన రాలేదు. తనకి వంట్లో బాగుండలేదనీ ఊరు వెళ్తున్నా ననీ పదిరోజులు శలవ కావాలనీ చెప్పటానికి వచ్చారు నిన్న మధ్యాహ్నం . సరే, అప్పుడే ఆయన్ని కూర్చో పెట్టి ఆ నాలుగు లెటర్స్ టైప్ చేయించారనుకో....' ఆ చివరి వాక్యాలు చెప్పేటప్పుడు తార గొంతు అదోలా పలికింది. కళ్ళు చిత్రంగా చలించాయి.
'నా వెర్రి గాని మురళీ సంగతి నీకు తెలియకుండా వుంటుందా, నేను క్రొత్తగా నీకు చెప్పటం ఎందుకు?' అన్న భావం తార ధోరణి లో వ్యక్తం అయింది కాని కళ్యాణి మనస్సు వాటిని పట్టించుకునే స్థితిలో లేదు--
తను చెప్పదలచు కున్నది కాస్తా చెప్పేసి వెళ్లి తన సీటులో కూర్చుని తన పనిలో మునిగిపోయింది తార.
కళ్యాణి ఆలోచిస్తున్నది ఒక్క విషయం గురించే 'మురళీ ఊరికీ వెళ్లాడన్న మాట -- అతను నిన్న ఉదయం ఆఫీసుకి రాకపోవటానికి కారణం నిజంగా ఒంట్లో బాగుండక పోవటమో లేక నాలాగే మనస్సు బాగుండక పోవటమో -- ఏదైనా కావచ్చు-- కాని ఊరికి వెళ్ళటానికి మాత్రం కారణం ఒక్కటే వాళ్ళ అమ్మా నాన్నా ఉత్తరం లో వ్రాసి నట్లుగా పెళ్లి చూపులు జరిగిపోతాయి-- వాళ్ళు అంతగా వ్రాశారు కనుక ఆ సంబంధానికి ఎలాంటి వంకా ఉండి వుండదు. మురళీ కూడా తన అంగీకారం తెలియ జేస్తాడు-- కొద్ది రోజులలోనే పెళ్లి జరిగిపోతుంది.....' కళ్యాణి చేతులు టైపు చేస్తున్నా ఆలోచనలు సాగిపోతున్నాయి. అవి అలా యింకా ఎంతదూరం సాగిపోయేవో కాని ఇంతలో మేనజరు రావటం, కళ్యాణికి పిలుపు రావటంతో పనికీ, ఆలోచనలకి కూడా అంతరాయం కలిగింది.
గట్టిగా వార్నింగు ఇవ్వాలని పిలిపించిన ఆఫీసరు కళ్యాణి మొహం చూస్తూనే మెత్త బడి పోయారు 'అయ్యో పాపం' అనిపించింది.
'ఏమ్మా, అలా వున్నావు? వంట్లో బాగుందలేదా?' అని కుశల ప్రశ్నలు వేశాడు.
'నిన్నటి నుండి ఒకటే తలనొప్పి -- నిన్న మీకు చాలా ఇబ్బంది కలిగించాను.' అని కళ్యాణి వినయంగా చెప్పుకోబోతుంటే.
'దానిదే ముందమ్మా -- ఫరవాలేదు-- మనుష్యులు అన్నాక అనారోగ్యాలూ, జబ్బులూ రాకుండా వుంటాయా? ఇవాళ పోస్టు చూశాక అర్జెంటు లెటర్స్ ఏమైనా వుంటే చేసేసి ఆ పని అయిపోగానే యింటికి వెళ్ళిపో' అన్నాడు వాత్సల్యం వుట్టి పడుతుండగా.
'ఇప్పుడంత బాధగా ఏం లేదు లెండి-- కొంత మేటరు మొన్నటి నుండి అలాగే వుండిపోయింది. అంతా పూర్తీ చేసే వెళ్తాను.' అంది. ఇంటికి వెళ్ళితే మనస్సుకి క్షణం విశ్రాంతి వుండక పోవటమే కాక, ఆ వంటరి తనం మరీ వేర్రిత్తించేస్తుందని.
'సరే నీ యిష్టం' అన్నాడు ఆఫీసరు. ఇవతలకి వచ్చి తన సీటులో కూర్చుంటూ అనుకుంది కళ్యాణి మురళీ తన గురించి ఎవ్వరికీ ఏమీ చెప్పినట్లు లేదూ అని-- 'లేకపోతె వీళ్ళంతా , ముఖ్యంగా ఇందాక అంతసేపు మాట్లాడిన తార తనని గురించి ఏ ప్రశ్నలూ వెయ్యకుండా వదులుతుందా !' అన్న వూహ , ఆ నమ్మకం కళ్యాణి కి ఏదో తృప్తి లాంటిది కలిగించింది. మనస్సుకి కొంత రిలీఫ్ దొరికింది.
