హైదరాబాదు స్టేషను లో రైలు ఆగగానే తోటి ప్రయాణికుల తో పాటు ఫ్లాటు ఫారం మీద పాదం మోపిన కళ్యాణి కాళ్ళు ఒక్కసారి వణికాయి. గుండెలు జలదరించినట్ల యింది. ఈ మహానగరం లో -- పుట్టిన వూరు వదిలి ఎక్కడికీ వెళ్ళని తను-- వంటరిగా ఎలా బ్రతుకుతుంది, ఎక్కడ తల దాచుకుంటుంది అనే ఆలోచన వచ్చి ఒక్క క్షణం మనస్సంతా ఎలాగో అయిపొయింది. మిగిలిన ప్రయాణికు లంతా హడావిడిగా కూలీల నెత్తిన సామాను పెట్టి ఫ్లాటు ఫారం దాటి బయటకు వెళ్లి పోవటానికి ఆతృత పడిపోతున్నారు. కొంతమంది తమని రిసీవ్ చేసుకోవటానికి వచ్చిన వాళ్లతో సంతోషంగా కుశల ప్రశ్నలు వేసి గలగల కబుర్లు చెప్పేసు కుంటున్నారు.
'వీళ్ళంతా ఎంత అదృష్ట వంతులు !-- తమ రాకకోసం ఎదురు చూస్తున్న ఆప్తులు ఇలా వచ్చి పలకరించడం ఎంత అందంగా వుంటుంది ! అదుగో ఆ వెళ్తున్న వాళ్ళ కోసం ఎవరూ వచ్చినట్లు లేరు. అయినా వాళ్ళు ఏ రిక్షా నొ మాట్లాడుకుని ఇల్లు చేరుకుంటారు, అక్కడ వీళ్ళని ఆప్యాయంగా పలకరించి ఆదరంగా లోపలికి తీసుకువెళ్ళే బంధువులూ, అయిన వాళ్ళూ అంతా వుంటారు-- ఎవ్వరూ లేకపోయినా కేవలం సరదాగా పట్టణం చూడటానికి వచ్చేవాళ్ళూ ఇక్కడ పని వుండి వచ్చే వాళ్ళూ ఏ హోటల్లో నొ దిగి సరదాగా నాలుగు రోజులు వుండి పోతారు -- నేను ఒక్కదాన్ని ....' అని బెంబేలు పడిపోబోతున్న మనస్సుని ఒక్క క్షణం లోనే అదుపులోకి తెచ్చుకుని 'ఛ, ఏమిటీ బేల తనం? అందులోనూ ఇలాంటి సమయంలో....నాకు వచ్చిన భయం ఏమీ లేదు-- చేతిలో వున్న డబ్బు అయిపోయే లోపుని ఏదో వో వుద్యోగం దొరక్క పోదు. ఇంత మహాపట్నం లో నేను తలదాచు కోటానికి కనీసం ఒక గది అయినా దొరక్క పోదు. నువ్వు మాత్రం నా ధైర్యాన్ని దిగ తొడకు' అని మనస్సుని మందలించి, సూటు కేసు చేత్తో పట్టుకుని గబగబ అడుగులు వేసుకుంటూ స్టేషను దాటి బయటికి వచ్చింది.
'రిక్షా కావాలా అమ్మా' అని అడిగిన వాడితో గీసి గీసి బేరం చెయ్యకుండా తిన్నగా వో హోటలు కు తీసుకు వెళ్ళమని చెప్పింది. రిక్షా దిగి లోపలికి వెళ్లి కడుపు నిండా టిఫిన్ తిని కాఫీ తాగి పెట్టె చేత్తో పట్టుకుని బయటికి వచ్చేసరికి ఇందాకటి రిక్షా అబ్బి ఎదురుగా కనిపించాడు. అతనికి మరే బేరం దొరకలేదులా వుంది మిగిలిన రిక్షా వాళ్లతో బాతాఖానీ కొడుతున్నాడు. కళ్యాణి ని చూడగానే ఖబుర్లాపి "రిక్షా కావాలా' అన్నట్లు చూశాడు.
కళ్యాణి మాట్లాడకుండా యెక్కి కూర్చుని 'హిమాయత్ నగర్ పోనీ' అంది. రిక్షా నాలుగడుగులు వెళ్ళాక ' చూడు-- కొంచెం ఆలస్యం అయినా తొందర చెయ్యకు-- నీ కష్టం వుంచుకొను-- హిమాయత్ నగర్ లో కానీ ఆ చుట్టూపక్కల గాని నాకు వో చిన్న యిల్లు కావాలి-- సరే ఏదీ దొరక్కపోతే ఇవాల్టి కి ఏ సత్రవు లోనో వుండి పోతాలే-- నువ్వు మాత్రం కాస్త వోపిగ్గా నాలుగు పేటలూ చూపించాలి .' అంది-- హోటల్లో టిఫిన్ తీసుకుంటున్నప్పుడు ప్రక్కనున్న వాళ్లతో మెల్లిగా మాటలు కలిపి ఇక్కడి పేటల పేర్లూ బజార్ల పేర్లూ అవీ తెసుకుంది.
ఆ రిక్షా అతను చాలా నేమ్మదైనా వాడు. ఈ పేట కాకపొతే మరో పేట మరో పేట అంటూ వోపిగ్గా నాలుగు చోట్లకీ తీసుకు వెళ్లాడు. చివరికి మధ్యాహ్నం అయేసరికి కాచిగూడా స్టేషన్ దగ్గరలోనే వో ఇంట్లో రెండు గదుల వాటా కుదిరింది.
'ఇంతవరకూ అదృష్ట వంతురాలినే -- ఇప్పటిదాకా ఈ ఇళ్ళు గల వాళ్ళందరూ వేసే యక్ష ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ప్రాణం పోయినట్లయింది -- వాళ్ళ ధోరణి చూస్తుంటే అసలు నాకు తలదాచుకోటానికి తావే దొరకదేమో అని భయం పుట్టింది -- వీళ్ళేవరో పాపం -- నాలుగు ప్రశ్నలు వేసినా నేను చెప్పిన సమాధానాలు నమ్మి ఇప్పటి కిప్పుడు నాకు ఇల్లు ఇవ్వటానికి ఒప్పుకున్నారు.' అని సంతోషిస్తూ, రిక్షా అతను అడిగిన దాని కంటే మరో రూపాయి ఎక్కువే ఇచ్చి పంపించింది.
ఇక మర్నాటి నుంచీ ఉద్యోగాన్వేషణ లో పడింది. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగింది. మరెన్నో ఆఫీసులకి అప్లికేషన్లు పంపించింది-- ఆ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు కాని నెల తిరిగేసరికి అయిదారు ఇళ్ళల్లో ట్యూషన్లు మాత్రం దొరికాయి.

4
రోజులు ఏదో గడిపోతున్నాయి -- పిల్లలు అల్లరి చేసినా పాఠాలు సరిగ్గా అప్పజేప్పక పోయినా వాళ్ళ మీద విసుక్కోకుండా కసురు కోకుండా ఎంతో వోపిగ్గా వాళ్ళ చేత చదివించి 'మా కళ్యాణి టీచర్ చాలా మంచిది.' అనిపించుకుంది.
పిల్లలతో కాని ఇంట్లో పెద్దలతో కాని కల్పించుకుని కబుర్లు చెప్పటం, అవసరం లేకపోయినా కాలక్షేపంగా సంభాషణ పెంచటం అదీ ఏమీ చెయ్యక పోవటం తో 'కళ్యాణమ్మా చాలా నేమ్మదైనది-- తన పనేమిటో చేసుకుపోవటమే కాని ఇంకొకరి జోలి తన కక్కర్లేదు ' అనే సర్టిఫికేటు కూడా ఇచ్చారు పెద్దవాళ్ళంతా.
కళ్యాణి కి నలుగురితో కలిసి మెలిసి తిరగాలని, సరదాగా కబుర్లు చెప్పాలనీ ఎప్పుడైనా అనిపించినా, ఏం మాట్లాడితే ఏ మోస్తుందో తన పుట్టు పూర్వోత్తరాలన్నీ ఎక్కడ వెల్లడయి పోతాయో నన్నట్లు అందరికీ కాస్త దూర దూరం గానే మసులు కోసాగింది.
కాని అనసూయమ్మ దగ్గర మాత్రం కాస్త చనువు ఏర్పడింది. ఆవిడ మొగుడు చంద్ర శేఖరం ప్లీడరు. వాళ్ళకి దోమల్ గూడా లో చక్కటి ఇల్లు వుంది. వాళ్ళ అమ్మాయి పదేళ్ళ రోహిణి కీ అబ్బాయి ఏడేళ్ళ రవికి ట్యూషన్ చెప్తోంది కళ్యాణి.
ఇంట్లో పనేమీ లేకపోతె, పిల్లల చదువు అయిపోయాక కాస్సేపు కళ్యాణి తో కబుర్లు చెప్తూ గడపటం ఆవిడకో సరదా -- అవతల మరే హడావిడి , త్వరగా వెళ్లి చెప్పాల్సిన ట్యూషన్లూ లేకపోతె కళ్యాణి కి కూడా ఆవిడతో కాస్సేపు మాట్లాడుతూ కూర్చోటం కాస్త రిలీఫ్ గానే అనిపిస్తుంది.
వోసారి ఆవిడ ఆల్బం తీసుకొచ్చి తమ పెళ్లి ఫోటోలు ఆ తరువాత తీయించు కున్నవీ పిల్లలవీ అంతా కలిపి తీయించు కున్నవీ అన్నీ చూపించింది-- ప్రతి ఫోటో వెనక గల చరిత్ర, అంటే అవి ఏ సందర్భంలో ఎక్కడ ఎందుకు తీయించు కున్నారో ఆవిడ ఒక్కోసారి కాస్త గర్వంగా మరోసారి చిరునవ్వుతో ఇంకోసారి కొత్త పెళ్లి కూతురిలా సిగ్గుపడుతున్నట్లు చెప్తుంటే కళ్యాణి మంత్ర ముగ్ధలా వింటూ వుండిపోయేది.
వోసారి ఆవిడ వాళ్ళ ఇల్లంతా డ్రాయింగ్ రూమూ, బెడ్ రూమ్స్ అన్నీ చూపించింది.
'ఇల్లు మరీ అంత పెద్దది కాకపోయినా పొందిక గా అన్ని సౌకర్యాల తోటీ వుంది. భార్యాభర్త లిద్దరూ మంచి అభిరుచి కలవాళ్ళు అనుకుంటా ఇల్లంతా అధునాతనంగా అలంకరించు కున్నారు. ఎక్కడెక్కడ దొరికే వస్తువులూ సేకరించు కుని-- ఇంటికి ముందూ వెనకా వుండే ఖాళీ స్థలంలో చక్కటి పూల మొక్కలు,' అను కునేది కళ్యాణి.
రోజులు గడుస్తున్న కొద్దీ అనసూయమ్మ తో స్నేహం పెరగసాగింది. అనసూయమ్మ బియ్యే ప్యాసయింది. ఊళ్ళో ఉన్న మహిళా సమాజాలలో చాలా వాటిలో ఆవిడ మెంబరు. ఆ విషయాలన్నీ ఆవిడ వుత్సాహంగా చెప్తుంటే ఆసక్తిగా వుంటుండేది కళ్యాణి-- అలా ఆవిడ చెప్తున్నది వింటూ తన విషయాలు గోప్యంగానే వుంచుతూ జాగ్రత్తగా మాట్లాడుతుండే కళ్యాణి ఒకనాడు మాటల సందర్భంలో తన చరిత్ర, తన సంకల్పం, తన కోరిక అన్నీ ఆవిడతో చెప్పేసింది.
మొదట తెల్లబోయి ఆ తరువాత కుతూహలంగా ప్రశ్నలు వేసి అన్నీ విన్న అనసూయమ్మ కళ్యాణి ఉద్దేశ్యాలని ఎంత గానో అభినందించి ఒకనాటికి కళ్యాణి కోరిక తప్పక నెరవేరుతుందనీ , బిడ్డా పాపతో కళ్యాణి సుఖంగా సంసారం చేసుకుంటుందనీ ఆశీర్వదించి పంపించింది.
నాలుగు రోజులు గడిచి పోయాయి. ఆవాళ ముప్పై ఒకటో తారీకు. కళ్యాణి మామూలుగా సాయంత్రం వాళ్ళింటికి వెళ్ళింది. కళ్యాణి ని చూసి పిల్లలు చాప వాల్చి పుస్తకాల సంచీలు తెచ్చుకుని కూర్చున్నారు.
ఒక్క అయిదు నిమిషాలు గడిచాయి. వాళ్లకిచ్చిన హోం వర్కు కరెక్టు చెయ్యటం కూడా ఇంకా పూర్తీ కాలేదు -- రోహిణి వ్రాసిన కంపోజిషన్ చదువుతున్న కళ్యాణి గదిలోకి ఎవరో వచ్చిన అలికిడి అయి తల ఎత్తి చూసింది. ఎదురుగా గుమ్మం దగ్గిర అనసూయమ్మ. ఆవిడ మొహం రోజులా ప్రసన్నంగా, నవ్వుతూ కళకళ లాడుతూ లేదు. ఆవిడ అలా వుండటానికి కారణం ఏమై వుంటుందీ అని కళ్యాణి వూహించు కోటాని కైనా వ్యవధి లేకుండా అనసూయమ్మ చటుక్కున ముందుకు వచ్చి,

'చూడండి మా పిల్లలకి వాళ్ళ స్కూల్లోనే వాళ్ళ టీచరే , స్కూలు టైము అయిపోయాక మరో గంట కూర్చుని ట్యూషన్ చెప్తానన్నారుట . ఇంకా చాలా మంది పిల్లలు చేరుతున్నారు-- ఆ టీచరే అయితే బాగుంటుందని మావారూ అన్నారు -- మరి ...అందుచేత రేపటి నుంచి మీరు రానక్కరలేదు-- హటాత్తుగా మీకిలా చెప్పటానికి నాకూ బాధగానే వుంది-- కాని ఏం చేస్తాను? ఇదుగో ఈ నెల జీతం.' అని చెప్పి అప్పటి దాకా గుప్పిట లో పెట్టుకుని వున్న నోట్లు కళ్యాణి ముందు చాప మీద పెట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది.
