సురేఖా పరిణయం
ఉన్నవ విజయ లక్ష్మీ
.jpg.jpg)
"సురేఖా! గుడ్ న్యూస్ -- నీకు ఉత్తరం వచ్చింది." డాబా మీద నుండి క్రిందికి దిగి వస్తూ మెట్ల మీద నిలబడే స్నేహితురాలితో చెప్పింది శ్యామల -- వాళ్ళిద్దరూ రూమ్ మేట్సు -- ఇంటి దగ్గరి నుంచి వుత్తరమే లేదని, పది రోజులుగా సురేఖ రోజూ అనుకోటం శ్యామలకి తెలుసు. కవరు వెనక సురేఖ తండ్రి పేరూ, తండ్రి పేరూ వూరు చూసింది . కనక ఆ శుభవార్త ముందుగా స్నేహితురాలికి అందించేసింది.
"ఓ- థాంక్యూ " చిన్నగా నవ్వింది సురేఖ కారిడార్ లోనే ఆగిపోయి.
"ఆ థాంక్స్ మధ్య నాకా!"
"వ్రాసినందుకు వాళ్ళకీ వున్నాయి లే -- ముందుగా చెప్పినందుకు నీక్కూడా ఇస్తున్నాను"
"మహారాజులా పుచ్చు కుంటాను-- ఆ- చెప్పటం మరిచిపోయాను. మీ కజిన్, డాక్టరు రామకృష్ణట వచ్చి వెళ్ళారు.
"డాక్టర్ రామ కృష్ణా! " కదల బోయిన సురేఖ మళ్ళీ ఆగిపోయింది." ఆ అమ్మాయి గొంతులో ఆసక్తి ని ఆశ్చర్యాన్ని అర్ధం చేసుకోగలిగిన శ్యామల ...
"ఆ, అవును . ఎవరతను?" అంది వయ్యారంగా రేలింగు నానుకుని కుతూహాలంగా సురేఖ మొహం లోకి చూస్తూ.
"మా అత్తయ్య కొడుకు. "అంటూ తల ప్రక్కకి తిప్పెసుకుంది సురేఖ.
"ఓహో-- మళ్ళీ ఓ అరగంట లో వస్తానన్నారు-- ఇవాళ నువ్వు రావటం ఆలశ్యం అయిందెం?" -- శ్యామల గొంతులో చిలిపితనం తొంగి చూసింది-- అయినా అడిగిన ప్రశ్నకి సమాధానం ఆశించకుండా చిన్న పిల్లలా చెంగు చెంగున మెట్లుదిగుతూ గబగబ క్రిందికి వెళ్ళిపోయింది.
శ్యామల వుల్లాసానికి కారణం సురేఖ కి తెలుసు. తను గేటు దాటి లోపలికి వస్తుంటే ఓ కారు వెనకే వచ్చి ఆ అమ్మాయిని దాటుకుని ముందుకి వెళ్ళిపోయి ఓ ప్రక్కగా ఆగింది -- ఆ నల్లరంగు ఫియట్ కారునీ, అది డ్రైవ్ చేస్తుకుంటూ వచ్చే వ్యక్తీ నీ సురేఖ గుర్తుపట్ట కలదు-- అతను శ్యామలా వాళ్ళ మామయ్య మాధవరావు -- అతను అదేదో లేబరేటరీ లో సైంటిఫిక్ ఆఫీసరనీ, నెలకి వెయ్యి రూపాయల పైనే జీతం వస్తుందని , శ్యామలే చెప్పింది ఓసారి-- శ్యామల ఉద్యోగంలో చేరిన ఈ నాలుగైదు నెలల నుంచీ ఆ వుమన్సు హాస్టల్ కి వచ్చే రెగ్యూలర్ విజిటర్స్ సంఖ్య ఒకటి పెరిగింది.
అతను ఏ నాలుగు రోజులకో ఓసారి వస్తాడు. కాని, శ్యామల మాత్రం పాపం ఇంచుమించు ప్రతిరోజూ సాయంకాలం అంతా అతని కోసం కళ్ళు కాయలు కాచి పోయేటట్లు ఎదురు చూస్తున్నట్లే అనిపిస్తుంది-- ఆఫీసు నుంచి రాగానేఅదరా బాదరా టిఫినో, కాఫీ తీసుకుని అప్పుడు సావకాశంగా స్నానం చెయ్యటమో లేకపోతె మొహం కడుక్కోటమో అయాక తీరుబడిగా ముస్తాబవటం మొదలు పెడుతుంది. అసలే అందంగా వుండే శ్యామల అంత ఓపికగా సింగారించుకుని చూడ ముచ్చటగా తయారయేసరికి సురేఖ కి ఒక్కోసారి కాస్త అసూయ లాంటిది కలుగుతుంటుంది- ఆడవాళ్ళకి అందమే ఓ ఆభరణం అనుకుంటుంటే ఆమెకి తెలియకుండానే గుండెలలో నుంచి ఓ నిట్టుర్పు పుట్టుకు వస్తుంది --
అలా అలంకరించుకున్న శ్యామల డాబా మీదికి వెళ్ళి కూర్చుంటుంది. చేత్తో ఓ నవల ఏదో పట్టుకుని-- ఎవరూ డిస్టర్బ్ చెయ్యకుండా హాయిగా చల్ల గాలిలో కూర్చుని చదువు కుంటానని చెప్పటం ఓ సాకు మాత్రమే అని, ఆ అమ్మాయి దృష్టి చేతిలో వున్న పుస్తకం మీద కంటే రోడ్డు మీదవచ్చే పోయే కార్ల మీదే ఉంటుందని , మధ్య మధ్య పుస్తకం మూసి వేసి పిట్ట గోడ వార నిలబడి ఆసక్తి గా రోడ్డు మీదికి చూస్తూ ఉంటుందని సురేఖ గ్రహించేసింది.
ఆమాటే నవ్వుతూ అనేసింది కూడా ఓసారి -- శ్యామల బిడియంగా నవ్వేస్తూ చటుక్కున మొహం తిప్పెసుకుంది -- ఆ అమ్మాయి చెక్కిళ్ళ లో ఎర్ర గులాబీ లు విచ్చుకోతం మాత్రం సురేఖ దృష్టి ని తప్పించు కోలేక పోయాయి --
'ఇంక ఇంతకన్న స్పష్టంగా ఏ ఆడపిల్ల మాత్రం చెప్తుంది -- ఇంకా పెళ్ళే ప్పుడు చేసుకుంటారో -- అందాకా ఈ అమ్మాయి నిరీక్షణ తప్పదు." అనుకునేది.
'అయినా విజటర్స్ వస్తే ఆయా వచ్చి చెప్పదా? క్రింద నుంచి ఈ మొదటి అంతస్తు కి రావాలంటేనే నాకు కాళ్ళు పీక్కుపోతాయి -- అలాంటిది పని వున్నా లేకపోయినా పదిసార్లు పై డాబా మీదికి కూడా వెళ్ళి వస్తుంది. ఈ పిల్ల ఓపికకి మెచ్చుకోవాల్సిందే. ' అనుకుంటూ గది తలుపులు తెరుచుకుని లోపలికి వెళ్ళింది-- పర్సూ, కర్చీపూ టేబిలు మీద పడేసి అక్కడున్న కవరు అందుకుని సర్రున ఓ చివర చింపి ఆత్రంగా వుత్తరం పైకి తీసింది. -- నాలుగు పంక్తులు చదివేసరికి ఆ అమ్మాయి మొగం ఎలాగో అయిపొయింది.
"పెద్దక్కయ్యకి వంట్లో బాగుండటం లేదు-- ఆ వూళ్ళో ఎన్ని మందులు వాడినా లాభం లేక పోయేసరికి పదిహేను రోజుల క్రిందట ఇక్కడికి తీసుకొచ్చాడు మామయ్య -- పెద్దాసుపత్రి లో చూపించాం. ఆపరేషన్ చెయ్యాలి అంది డాక్టర్ -- ఈ రోజుల్లో అదొక పెద్ద భయం కాకపోయినా అక్కయ్య ఏడుస్తూ కూర్చుంది -- మరో డాక్టర్ కి కూడా చూపించాం -- యేవో మందులు వ్రాసి ఇచ్చింది -- వాటికీ తగ్గకపోతే ఆపరేషన్ చేయ్యాల్సిందేనుట-- ఈ జబ్బు తోటీ బెంగ తోటీ అది అలా చీపురు పుల్ల లా అయిపొయింది-- ఏమిటో ఇంట్లో ఎవరికీ మనస్సులు కుదురుగా లేవు- అందుకే వుత్తరం వ్రాయటం ఆలశ్యం అయింది.' అంటూ జబ్బు విషయాలూ అవీ వ్రాసింది ఉమ.
ఇంట్లో ఎవ్వరికీ మనస్సులు కుదురుగా లేవు అన్న అక్షరాలే కళ్ళ ముందు నిలిచి పోయినట్లుగా అయిపొయింది సురేఖ కి-- ఏమీ భయం లేకపోతె ఇలా ఉత్తరం వ్రాస్తుందా--
ఎప్పుడూ సందడిగా మాట్లాడుతూ గవ్వలు గిలాకరించినట్లు నవ్వుతూ ఒంటేడు నగలతో లక్ష్మీ దేవిలా కళకళ లాడుతూ ఉండే అక్కయ్య కళ్ళల్లో మెదిలింది-- 'తను అట్టే చదువుకోలేదు. మామయ్యా ఎక్కువ చదువు కోలేదు. పల్లెటూరి లో కాపురం -- అయినా ఆ విషయాలేవీ ఎప్పుడూ కూడ అను అలోచించి నట్లే అనిపించదు -- మొగుడి కీ పిల్లలకీ వేల్టికి ఇంత వండి పెడుతూ వాళ్ళ ఆలనా పాలనా చూసుకోటం కంటే ఆడదాని జీవితానికి మరో అర్ధం పరమార్ధం లేదనుకొనే తత్వం తనది -- పట్టుమని పది రోజులు పుట్టింట్లో వుండటానికే ఇదయి పోతుంది-'
'అదేమిటి ఇంకా అలాగే కూర్చున్నావు -- త్వరగా మొహం కడుక్కుని తయారవు--' సుడిగాలి లా గదిలోకి వచ్చిన శ్యామల స్నేహిరురాలిని హాస్యం చేయ్యబోయింది. కాని ఆమె ఉత్సాహంగా లేకపోవటం చూసి తెల్లబోతూ.
"అలా వున్నావేం -- ఏం వ్రాశారు,' అంది.
"మా అక్కకి వంట్లో బాగుండ లేదుట,' అంది సురేఖ వుత్తరంలోకి చూస్తూ.
"సుస్తీ ఏమిటట.' శ్యామల గొంతులో సానుభూతి నిండి వుంది -- సురేఖ చెప్పింది వింటూ, "ఎక్కడో పిచ్చిదానిలా ఉన్నావే -- ఆపరేషన్ పేరు వినగానే అలా బెంగ పెట్టుక్కూర్చున్నావా? అరికాల్లో గుచ్చుకున్న ముల్లు తీసిపారేసినంత అవలీలగా చేసేస్తున్నారు ఈ రోజుల్లో ఆపరేషన్లు-- నేను చెప్తున్నాను -- మీ అక్కకేం భయం లేదు,' అంది.
"మా కందరికీ కావలసిందదే,' అంది సురేఖ. ఆమె గొంతు బరువుగా వుంది.
"నీ మనస్సెం బాగుండలేదు కదూ........' దగ్గరగా వచ్చి స్నేహితురాలి భుజం మీద అనునయంగా చెయ్యి వేసింది శ్యామల-- మామయ్య సినిమాకి రమ్మంటున్నాడు-- పోనీ మానేసి నీ దగ్గరుండి పోనా--' అంది. ఈ స్థితిలో స్నేహితురాలిని ఒంటరిగా వదిలెయలేని బేలతనం, అటు మామయ్యా తో సరదాగా కాలం గడిపే అవకాశం పోగొట్టుకోలేని బలహీనత కూడా వున్నాయి ఆమె జాలి చూపుల్లో.
"నయమే -- మానేయటం ఎందుకు -- వెళ్ళిరా'--
'అన్నట్లు మీ బావ వస్తాడుగా ఇప్పుడు -- మీరిద్దరూ కూడా ఏ సినిమాకయినా వెళ్ళి పొండి-- జస్ట్ ఫర్ చేంజ్ ' తన సమయస్పూర్తికి తనే మురిసిపోయి, 'అయితే నే వెళ్తున్నా -- నాకోసం ఏం వుంచక్కర్లేదు. ఏకంగా భోజనం చేసే వస్తా,' అంటూనే అలమారు లో వున్న హ్యాండ్ బేగు అందుకుని హుషారుగా వూగించుకుంటూ వెళ్ళి పోయింది.
ఒకసారి వెళ్ళి అక్కని చూసి వస్తేనో అనిపించింది సురేఖ కి. 'మందేదో వాడుతోందిటగా-- ఏమైనా పని చేసిందేమో -- వ్రాసి కనుక్కుంటేనో , ' అనుకుంటూ లేచి వెళ్ళి కాగితం కలం చేతిలోకి తీసుకుంది.
'ఆపరేషన్ అంటే భయమే లేదంటుంది శ్యామల -- నిజమే నెమో-- ఈ రోజులూ ప్రతిదీ ఎంతో తేలికయిపోయింది ' అనుకోబోతుంటే చటుక్కున వాళ్ళ పొరుగింటి సావిత్రమ్మ గారు మనస్సు లో మెదిలింది. ఏమిటో నలతగా వుంటోంది అనుకుంటూనే నాలుగు రోజులు అశ్రద్ధ చేసి అయిదో నాడు అన్నం అదీ వండి పెట్టి పదిగంటల వేళఆస్పత్రికి వెళ్ళింది. ఊరికే చూపించుకు రావాలని. వ్యాధి లోపల్లోపల చాలా ముదిరి పోయిందని వెంటనే ఆపరేషను చేయించుకోవాలని-- అవాళే ఆస్పత్రి లో చేరిపోతే రెండు రోజులు అన్నీ పరీక్షలూ చేసి ఆపరేషను చేస్తాననీ' చెప్పింది డాక్టరమ్మా. అది వింటూనే ఆవిడ ఏడుస్తూ కూర్చుంది. మొగుడూ పిల్లలూ ఇరుగు పొరుగూ అంతా ధైర్యం చెప్పి మర్నాడు అస్పత్రి లో చేర్పించారు-- మూడో నాడు కాబోలు ఆపరేషన్ చేశారు-- అంతే --' సురేఖ ఒళ్ళు జలదరించింది . కళ్ళు చెమ్మగిల్లాయి. 'భగవంతుడా మా అక్కకి అలాంటి పరిస్థితి రానివ్వకు.' అనుకుంటూనే వేయి దండాలు పెట్టుకుంది. మనస్సు ఇటూ అటూ పరుగులు పెడుతుంటే కాగితం మీద కలం పెట్టటం సాధ్యం కాలేదు.
'సురేఖమ్మా -- మీకోసం ఎవరో వచ్చారు.' నరసమ్మ మాటలు వినిపించాయి.
'బావే అయి వుంటాడు . తనకీ వుత్తరం చూపిస్తాను.' అనుకుంటూ, 'నేను రెండు నిమిషాల్లో క్రిందికి వెళ్తాను. రెండు కప్పుల కాఫీ తెచ్చి పెట్టు అక్కడికి.' అని చెప్పి సోపు బాక్సు, టవలూ తీసుకుని హడావిడిగా బాత్ రూమ్ వైపు వెళ్ళిపోయింది-- అక్క సంగతి బావని అడుగుతాను అన్న వూహే సగం దిగులు తీరిపోయేలా చేసింది.
