Previous Page Next Page 
మన్నుతిన్న మనిషి పేజి 9


    చిట్టిరాజు సైగ చెయ్యగానే అంతవరకూ ఆ తుపాకి వేపు ఆశ్చర్యంగా చూస్తున్న వారందరూ యేటి అవతలికి ఒడ్డుకు వెళ్ళారు. చచ్చిన పందిని తెచ్చి కాల్చడానికి పూనుకున్నారు. ఆవేళ పొద్దు పోయే వరకు గుంపులో నానా హంగామా జరిగి పోయింది. తిన్నారు, తాగారు, తిట్టుకున్నారు. గెంతారు. గడగడ లాడారు, కానీ కొట్టుకోలేదు.
    బోడమ్మ యిదంతా చూస్తోందిగానీ తాగబుద్ధి పుట్టలేదు, చీకటిపడినా అలా వాకిట మంచంమీదే జారపడి పోయింది. కొడుకు యీ రాత్రి వస్తాడు. భోజనం చేస్తాడని యెక్కడ? వాడికి యిప్పుడు సంపదవుంది. చాలా మరపు వచ్చింది. ఆపదలో అరుపులు విన్న మారాజు పోయాడు. పదును తెలుసుకున్న మనిషి. ఎవరికి యెలా చెప్పాలో అలా చెప్పేవాడు. ఏంటో వీడు పాలులా పొంగి పోతున్నాడు. పొంగినదంతా పొయ్యిపాలే కదా? ఈ దొంగడబ్బుతో వూరే నిలబెట్టేద్దామని చూస్తున్నాడు. మంగలి కత్తితో మానులు తెగేద్దామని యీడి తాపత్రయం. రాబందులా మనుసుల్ని పీకిస్తున్నాడు. ఎంత సెప్పినా యీడికి బుర్రకెక్కడం లేదు.
    దోడమ్మ యిలా అనుకుంటూనే నిద్దరపట్టక విచారించుకుంటోంది. గుంపులో సద్దుమణిగింది. తూరుపు కొండవెనుక చిన్న వెలుగు తాండవించింది. కొండమీద కన్నుగీటుతూ నిల్చున్న చుక్కలు యీ వెలుగుతో వెల వెల జారుతున్నాయ్. కోటి కళ్ళతో ఆకాశం అటువేపు ముఖం త్రిప్పింది. ఆ ముఖాన బొట్టులా నిల్చుంది చందమామ.
    మెల్లగా పొట్టయ్య చెల్లెలు అంకమ్మ, బోడమ్మ దగ్గరకొస్తూ -
    "సిన్నమ్మా పడున్నావా?" అంది.
    "నిద్దర్రాలేదే..." అలా పడుకునే బోడమ్మ సమాధానం యిచ్చింది. అంకమ్మ మంచం దగ్గరే కూర్చొని గుసగుసలు మొదలు పెట్టింది. వీళ్ళమీద వాళ్ళ మీదా యింత అంత చెప్పాక మనసు కుదుట బడ్డాక.
    "చిట్టిరాజుకు పెళ్ళిచెయ్యవా?" అంది.
    "పెద్దయినాడు మీసాలు తిప్పుతున్నాడు. నాలిక తిముడుతున్నాడు. నా మాట యింటాడమ్మా?"
    "ఎందుకింటాడులే. బాగా జరిగిపోతున్నాది."
    "ఎడమ చేత్తో చేసింది కుడిచేతితో అనుభవిస్తారని పెద్దలంటారు."
    "ఎప్పుడినించి యీ యేదాంతం వచ్చింది పిన్నమ్మా?"
    "చేసింది పోదే-సెయ్యింది రాదే- ఇలాగ రోజులు ఎలిపోనీ.....ఆడికేదో చెంబుడి నీరుపోసాక నానే మైనా ఫరవాలేదు."
    "నివ్వు ఊఁ అంటే రేపే ఆ నీరెయ్యించుకుంటాడు."
    "పెళ్ళికూతురో?"
    "ఆఁ...ఏం ఎరగనట్టు మాట్లాడుతున్నావు. లోకం అంతా కోడె కూస్తుంటే నీ చెవుకే రాలేదా?"
    బోడమ్మ చప్పున లేచి కూర్చొని "నా తల్లి నా చెవులో కాసింత ఎయ్యి"
    అంకమ్మ కాస్సేపు మౌనంగా వుండిపోయింది. తరవాత తేలిగ్గా....
    "ఏమీలేదు. వయసులోనే వున్నాది కదా....ఆ చుక్కమ్మనిచ్చి కట్టేరాదూ?"
    బోడమ్మ పెద్ద నిట్టూర్పు నిట్టూర్చి కోపంగా "ఇప్పుడన్నావు. ఎప్పుడా మాటనకు."
    "ఏమో?"
    "అది నా బాబుకు స్వంతపిన్నమ్మ. నా మొగుడితో అది మణిమిందే పినతల్లి, తల్లితో సమానం. తల్లి నన్ను గుడిసి ఆ తల్లి నన్నే పట్టుకోమంటావా ముండా?"
    "ఉన్న మాటంటే అంత కోపమేల? ఇంకా మీకూటి కుండ కుక్క ముట్టలేనట్టు అంటున్నావు. నీ మొగుడు ముసలి కాలానికి ముప్పతిప్పలు పడకుండా యేల సచ్చాడు. ఈ ఘోరం సూడనేకేనా?"
    "ఏమిటే....నా మొగుడున్నప్పుడు నా కొడుకు పినతల్లితో...."
    "కాపరం చేసేవోడు."
    బోడమ్మ అంత యెత్తుకు యెగిరి
    "మన్ను తిన్న ముండా? మంచి మాటెలా గంటానే గబ్బిలాయి ముకమా?"
    "నీది గబ్బిలాయి మొకమో, నాదో....రా....రా కళ్ళతో చూద్దువుగాని..."
    అంటూ ఆమె చెయ్యి పట్టుకుని గుంపు చివర నున్న పాక దగ్గరకు తీసుకవెళ్ళింది. లోపల చీకటిగా వుంది. గుసగుస మాటలు వినిపిస్తున్నాయ్. కొడుకు గొంతుక పోల్చింది. తరవాత సవతి గొంతుక వినిపించింది. గబ గబ తిరిగి పోతున్న బోడమ్మ వెనక పడి "ఏం తలుపు తియ్యమనేదా?"
    బోడమ్మ మాటాడలేదు. అంకమ్మ వెటకారంగా "ఇద్దరూ కూడి యేకాంతమాడంగ.....మనంయెందుకు అలదగ్గరికి.....ఇద్దర పెళ్ళాల మొగుడు యిరుకున పడి సచ్చాడు. కొవ్వినమ్మ యీ యేడుపేడుస్తున్నాది. ఇద్దరికి లగ్గం కట్టే..."
    అంకమ్మ తన పాకదగ్గర నిల్చుండి పోయింది. జోగుకుంటూ వెళ్ళిన బోడమ్మ పాకముందు పడి పోయి మౌనంగా దిగువునే దొర్లి దొర్లి యేడ్చింది.

                                       9

    బోడమ్మకు జీవితంపై విరక్తి కలిగిపోయింది. ఇదివరకు తను సలసల నీరులా మరిగినా, కుండలా భరించడానికి మొగుడుండేవాడు. ఇప్పుడు తను యేమన్నా కొడుకు చెయ్యికాలి కుండను వదిలేసినట్లు వదిలేస్తున్నాడు. వాడి నాలుకకు యెముకలేదు. కాబట్టి సుద్ధం బద్ధం లేకుండా పలికేస్తున్నాడు. వాడికెవడూ అడ్డే వాడులేడు. కాబట్టే అందలమెక్కి అందరిచేత మొయ్యిస్తున్నాడు. గుంపులో మగాళ్ళు అదుపులేని గుర్రాల్లా అడవులంట తిరిగినట్లు ఆడాళ్ళంటబడి నీతి తప్పిస్తున్నాడు. "ఆడది నీతితప్పిన కొంపలో దరిద్రమే మిగుల్తాది. అలాంటి కొంపలున్నగుంపు గోతిలో యేనాడో ఓనాడు కప్పెడిపోతాది." గుంపంతా ఆమె కంటికి చిదిగిన పండులా, విరిగిన టెంకాయలా, యెటుప్రక్క అంటే అటునడిచే ఎండ్రకాయలా కనిపించింది. "వ్యాధికి మందు గానీ విధికి మందా? గుణం తప్పిన శవాలుగా నున్న వీళ్ళకి యీ సింగారమెందుకు? అరటాకై పోయిన యీ ఆడోళ్ళకి అడ్డుగా యీ బట్టా పాతాయెందుకు? ఆడది అయితే అమృత మవ్వాల లేక పోతే విషమై మీదికొచ్చిన పరాయోడిని సంపాల. నీతిగల ఆడదాని కొరతతో యీ గుంపు కొండంత దూదయి పోయి ఒక్క నిప్పురవ్వకే భగ్గుమని పోతాది."
    బోడమ్మ యిలా తపించిపోతూ శాపంయిచ్చింది. కొడుకు తాగుతూ.
    "తాగమ్మా తాగే.....ఈ మంచి సరుకు మళ్ళా దొరకదు."
    బోడమ్మ మాటాడలేదు. దగ్గరగా గ్లాసులో తెచ్చి బలవంతం చేశాడు.
    "వద్దురా, రేతిరినించే తాగనని ఒట్టేసుకున్నాను
    "ఏల?"
    "మీ అయ్య వున్నప్పుడు మాతాగాను. అది చవక సరుకైనా పానకంలా వుండేది. ఇప్పుడు యీ కరీదు సరుకు చేదురా."
    "లేదమ్మా......ఒక్కసారి రుచిచూడు.....ఎంత మజాగా వుందో యీ సరుకు"

                                *    *    *

    "సరుకులో యేంవున్నాది. ఏ బుద్ధితో తాగితే ఆ మజా వస్తాది."
    "ఏం-సుకంరా లేవాయిప్పుడు? తిండికి కావలసినంత? తాగడానికి బోల్డు - ఊరూరా తిరిగే పాట్లు పోయింది కదా......ఇంకేంటి కావాలి.
    "ఇంత వుడటం వల్ల సుఖంరాదు. ఈ యింత యెలా గొచ్చింది. యెలాగ ఖర్చవుతుందన్న చింత వల్ల సుకం వస్తాది."
    "ఏం పొల్లు మాటలివి..." అంటూ లేచి పోయాడు.
    "ఇవి పొల్లు మాటలా?" చప్పున లేచిపోయింది బోడమ్మ. కళ్ళెర్రజేసింది. తీసి కొడుక్కి చెంప పెట్టుపెట్టి ఆమె రెండు చేతులతోనూ ముఖం మూసుకుని వెక్కి వెక్కి యేడుస్తోంది.
    చిట్టిరాజు తల్లి జుత్తు పట్టుకుని తలపైకి ఎత్తి "ఏమేం నన్నెందుకు కొట్టావే?"
    "ఛీ.... నీముకం సూపించక..." అంటూ ఒక్కసారి వూపి.... "ఆ మారాజు కొడుకట! పంది... బురదలో తిరిగినపంది."
    "నేను పందికాదు. ఆసనాల వీరన్న పంది..నిన్నో పందిలా వుంచాడు."
    బోడమ్మ పకపక నవ్వింది. కొడుకు కోపంతో వాగుతుంటే మరీమరీ నవ్వుతోంది.
    "ఎందుకే- పిచ్చిగాని పట్టిందే"
    "అవును - పిచ్చే - కుళ్ళుకంపులో దొర్లే పందివి కాకపోతే.......తల్లితో పోతావురా .... ఛీ ఛీ ..." అంటూ చేతకర్ర పట్టుకుని పందులను తోలుకుంటూ వెళ్ళిపోయింది.
    చిట్టిరాజు పిడికిలు పట్టాడు. తిండికి రావటం మానేసాడు. మకాం చుక్కమ్మ యింట్లోనే పెట్టాడు. ఒకరోజు చూసింది రెండురోజులు చూసింది. మళ్ళీ మూలపెట్టిన బుట్టతీసింది. ఆ మందులన్నీ మళ్ళీ భద్రపరచుకుంది. మరచి పోతున్న సోదె మననం చేసుకుంది. తాటాకులతో బుట్టలూ- గిలకలు అల్లింది. ఊర్లంటపడింది. అక్కడే చీకటి పడ్డ వరకూ వుండి పోయేది. ఇంటికి వెలుగులోవస్తే నరకం చూస్తానన్న భయంతో ఒకోసారి త్రోవలో యే చెట్టుక్రిందో, రోడ్డు వారనో కూర్చొని తనలో తనే యేవేవో మాట్లాడుకునేది. నలుగురికి సోదె చెప్పినది పిట్టలతోనో, పచ్చని చెట్ల కొమ్మలతోనో తనసోది చెప్పుకునేది. పిట్టలు పలికి నా చెట్ల కొమ్మలు గాలికి కదలినా మనసు ఆనందంతో నిండిపోయేది. ఒక ఆకురాలితే ఆ ఆకు పట్టుకుని తనూ అలా రాలిపోతే బాగుండే దనుకునేది. ఆకులు రాల్చిన చెట్లవేపు చూసి జాలి చెందేది. ఆకులు చెట్టుకున్నపుడు వాటి విలువ తెలిసేది కాదు. ఇప్పుడు కళలేకుండా బోడి అయి పోయాయి. మగడున్నపుడు వాడి శాంతం, గొప్ప తనం ఆమెకూ తెలిసేది కాదనీ యిప్పుడే తెలుసుకున్నది. తను వయసులో వున్నపుడు పరాయి మగాడు గురించి అన్నో తమ్ముడనో గాని యింకో తలపు వుండేదికాదు. ఇప్పుడు యీ ఘోరం తట్టుకోలేకపోతోంది.
    "వయసులో వున్న మొగాడికి వయ్యారంతో వున్న యే ఆడదైనా సఁయే. మొగాడు తుమ్మెదతో సమానం. యేది నెమిలో, యేది నక్కో అన్న గేనం ఆడదాని కుండాల. కట్టుకున్న మగడు నెమిలిలాంటివాడు. నక్కలాంటి వాళ్ళ మాయల్లో పడ్డ ఆడదాన్ని అనాలి."
    ఇలా అనుకుని ఒకనాడు వేగంగా యారలు యింటికి పరుగెత్తింది. అప్పటికి పాకలో ఒకర్తే వుంది. సరాసరి చుక్కమ్మ దగ్గరకే వెళ్ళి "మొగుడు సచ్చాడని యేడవకుండా కొడుకుతో సరసం భోంచేస్తున్నావా? ముండా.....ఆ జుత్తు ముడివిప్పు ఆ గాజులు, పూసలు దండలూ...తియ్యే..." అంటూనే బోడమ్మ ఆ పనులు బీభత్సంతో చేసేసింది.
    "ముష్టిదానా.... మా రాజుని కట్టుకుని ముష్టి వాడ్ని చేసేసావు. ఆడిని సంపి కొడుకుతో సరసాలాడలావే..."
    అందరూ చుట్టు ముట్టేసారు. బోడమ్మ వాళ్ళఅందరినీ చూడగానే వీరావతారమెత్తి.
    "కుళ్ళిన ఎదవలు, కంపు ముండలు, దొంగ సొత్తు, దరిద్రం - ఛీ....నాయంవున్న యేనుగు లంతా నోరున్న నక్కలుగా మారిపోనారు........ఛీఛీ.......సచ్చిన శవాలు మీ కంటే బాగు..."
    అంటూ అక్కడనించి  పూసుకుంటూ వెళ్ళిపోయింది.
    "బోడమ్మకు మొగుడు సచ్చాక పిచ్చొచ్చిందో నుకున్నారు చాలామంది.

                                       
    చిట్టిరాజు యింటికొచ్చేవరకు చుక్కమ్మ అలాగే వుంది. ఏడుస్తూనే వుంది. రాగానే అసలు సంగతి తెలుసుకుని కోపంతో తల్లియింటివేపు పరుగెత్తాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS