Previous Page Next Page 
మన్నుతిన్న మనిషి పేజి 10


    "దాన్నెందుకు కొట్టావ్?"
    "నివ్వెవడవురా అడగడానికి? అది నా యార్లు. తప్పుచేసిన్నాడు కొడ్తాను. ఒప్పుచేసిన్నాడు ముద్ది స్తాను."
    "ఈ వేషాలు నా దగ్గర పనికి రావు"
    "నీ యాసాలు నా దగ్గర సూపక...."
    "నా యిష్టమే..."
    "ఒరే-నివ్వో పద్దుకు మాలినోడివైతే....నిన్నూ ఒక పంది అని వూరుకుందునురా. నివ్వు యీ గుంపుకు రాజువుగా, రాజులాగ బతికి రాజులా యేలుబడిచేసి రాజులాగ మానంతో సచ్చిపోరా..."
    "నోరుముయ్యే ముండా"
    బోడమ్మ నవ్వి "నివ్వూ ఆ మాట అనేసావురా. ముందు ఆ ముండని వదులు, రేపొద్దున్న అది స్తలం తప్పితే... ఆ పుట్టినోడు జాతినేకండా పోగల్డు"
    "నేను వదలను - వదలను..."
    "అయితే సావు..."
    "నన్ను నవ్వమంటావా? నివ్వేసావు"  అంటూ తల్లి జుత్తు పట్టుకుని యీడ్చేసి తన్ని వెళ్ళి పోయాడు.
    "తల్లిని తంతావా?" ఈ మాట అంటున్న కోటమ్మ వేపు చూసి "నిన్నూ తన్నగలను" అన్నాడు.
    "ఎందుకొచ్చిన పౌరుషం - ఇంటి యెనకా తల సావడానికే?"
    ఈ మాటలతో ఆమె మీద కెగరబోయాడు కానీ ఆమె ఖాతరు చెయ్యక బోడమ్మ దగ్గరకు వెళ్ళి లేవనెత్తి ఓదారుస్తుంటే కాస్సేపటికి బోడమ్మ పకపక నవ్వుతూ....
    "ఆ రాతి మనిషిని పూజిస్తున్నాడు....ఎర్రోడు"

                                   10

    మర్రిచెట్టు క్రింద కూర్చొని మగడు బుగ్గయిన జాగా వేపు చూసి గుండె చెరువు చేసుకుంది బోడమ్మ చుట్టూ పచ్చగడ్డి. గడ్డిని మేస్తున్నాయి గాడిదలు. బూడిద రంగు మేఘాలు నీలిసముద్రంలా నున్న ఆకాశాన్నించి నీటిని పీల్చుకుని నలు పెక్కడానికి సిద్ధమౌతున్నట్లు కదలుతున్నయ్. ఇప్పుడు ప్రకృతి నవ్వుతున్నట్లున్నా, మరోగంటలో యేడుస్తున్నట్లు వర్షపుజల్లు రావచ్చు. కాళ్ళదగ్గర ప్రాకుతున్న చీమలను చూసి ముచ్చటపడింది. ఆమెకు వద్దన్నా గతం జ్ఞప్తికి వస్తోంది.
    బోడమ్మ మొగుడున్నప్పుడు గుంపులో యెవడి నీతి వాడికుండేది. కొట్టుకుంటే కోర్టులకెక్కడం. పోలీసుల వెంట తిరగటం వుండేదికాదు. కుల తగాదాలు కులంలోనే సరిచేసుకునేవాళ్ళు. రక్తం కారినా, ఆడదానితో యికటం ఆడినా, తీరుపుకి యెదురు తిరిగినా, రంకుపోయినా, యే కట్టుబాటుకి యెదురు తిరిగినా తప్పువుండేది. రూపాయి నుంచి వెయ్యి రూపాయలవరకు తప్పులుండేవి. తప్పున్నదన్న భయంతో పాటుమనిషి కొక మార్గముంచి ఆ మార్గంలో పోయేటట్లు మనసు పెట్టుకోవాలనే నియమం వుండేది. ఆర్జన విషయంలో ఆశవున్నా అది దురాశ అయ్యేది కాదు. చక్కెర తిని చేదన్న మనుషులు కారు వారు. ఉన్నప్పుడు దాతలయ్యేవారు లేనప్పుడు ముష్టి యెత్తుకోలేదు. ఒకోసారి గుంపులో నిప్పులాంటి కలహం పుట్టినా నీరులాంటి వివేకం దగ్గరేవుండేది. ఆ వివేకం వీరన్నలాటి పెద్దలకు వుండటం వలన వాళ్ళపై గుంపుకు విశ్వాసం వుండేది. విశ్వాసం భక్తిని ప్రేరేపించేది. వీరన్న అంటే పులిలా భయపడినా సమయానికి గూటిలో దివ్వెలా కనిపించేవాడు. వీరన్నకూ గుంపులో యెవరు వేలెత్తి చూపిస్తారనో భయం వుండేది.
    అలాంటి గుంపు గుంపంతా యిప్పుడు అల్ల కల్లోలమై పోయింది. తప్పులు తీసెయ్యటంతో తలో పెద్దమనిషి అయిపోయాడు. చిట్టిరాజు వచ్చి పేడా బెల్లం ఒకటే చేసేశాడు. వాడిలా పేచీకి పెదబాబులెందరో తయారయ్యారు. అన్నీ కొత్త భోగాలు కొల్లగొట్టి తెచ్చాడు. ఈ ఎలకల నోట్లో ఏనుగు దంతాలు మొలిపించాలని చూసాడు. ఛమ్కీ, సన్నజాజులు, సెంటులూ, వయసులో వున్న వాళ్ళ సొత్తుచేసి వంకరో టింకరో వయస్సే చక్కదన్నాడు. ముచ్చిరేకులు అంటించి రంగు తడక కట్టి గట్టి గోడను కూలదోసాడు. అన్ని మదాలు వచ్చి అందరూ నాయకులై తలగడ క్రింద తాచుల్లా తయారయ్యారు. సుద్ధం బద్ధం లేని వాగుడు! గమ్యం లేని పరుగు. చెవుడూ, చొట్టా, గుడ్డివాళ్ళ బ్రతుకులాంటి జీవితం అందరిదీ అయిపోయింది.
    బోడమ్మ యీ పరిస్థితికి యేడ్చుకుంది. కాస్సేపయ్యాక తమాయించుకుని -
    "ఈలంతా సబబు, సుద్ధిలేని మనుషులు, కొండ మీద చెట్లను పీకేయగలరు గానీ, కొండనే పీకేగలరా? ఎల్లప్పుడూ చినుకులే రాలవు. ఏనాడో ఓనాడు పిడుగు పడ్తాది. ఆ పిడుక్కి యీ గొడుగు లాగుతాయా?"
    వర్షం వచ్చి పడింది. బోడమ్మ పాకలోనికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి కొండల్లో మెరుస్తోంది. తెల్లవారే సరికే ఎండ. ఆ ఎండలో గాడిదలూ పందులూ కదలిపోయాయి. ఆలాంటప్పుడు, చిట్టి రాజు ఒక్కడే ఒకచోట కూర్చున్నాడు. నీలాంటి రేపునించి కోటమ్మ వెళ్ళిపోతోంది. యెండలో పసుపురాసిన ఒళ్ళు పాళా బంగారంలా వుంది. మాణిక్యాల్లా కళ్ళు తళ్కుమంటున్నాయ్, ముంగురులు ముఖంమీద వ్రాలి ముద్దెట్టుకుంటున్నాయ్. నాట్య మాడ్తున్నట్లు నడుస్తోంది. ఈ నిండు చందమామ దగ్గరకు యెగిరి నిలువెల్లా ముద్దాడాలనిపించింది చిట్టిరాజుకు. చిట్టిరాజులా మరో నలుగురికీ అనిపించింది. అందులో పెండ్ర పొట్టయ్యా వున్నాడు. ఏదో గుయ్ గుయ్ఁ లాడారుగానీ కోటమ్మ యేమీ పట్టించుకోలేదు. చంద్రుని చూచి కుక్కలు మొరిగి నట్లే వుంది.
    చిట్టిరాజుకు ఆ క్షణంనించీ ఆకలిచచ్చి కామం పెరిగింది. ఆలిగా చెలామణి అవుతున్న చుక్కమ్మ మీద మోజు గత వారం ఒక కబురు వినగానే పోయింది. తనతో కూడింది. తను లేనప్పుడు యింకొకడితో జతకట్టదా అనుకున్నాడు. ఇది అనుమానమే గానీ అంత వేగిరం వదలకుండా పట్టుకుంది. ఇన్నాళ్ళూ కన్నీరు లోలోపల మిగిలింది. ఇప్పుడు పైపైకి వదిలి చిట్టిరాజుతో విన్నవించు కుంది. చుక్కమ్మ కన్నీటి చుక్కలు చిట్టిరాజు గుండెలో రాల్లేదు. త్రోవలో వాడి తాపానికే ఆవిరై పోయాయి. ఈ ఆడదాన్ని అతి లోకువ చేసాడు. బలిమిలేదని పంతం పలకకుండా ఊరుకుంది చుక్కమ్మ. కోటమ్మలాంటి మాణిక్యాన్ని వదిలేసి చుక్కమ్మలాంటి మసిపాత వెంటబడ్డానని అనుకున్నాడు చిట్టిరాజు. ఒళ్ళు వంపులు తగ్గగానే కురులు వ్రేలాడివెఱ్రిగాక దలగానే కళ్ళల్లో, పెదాలలో, కన్నీరు ఆవేదనను కక్కగానే చిట్టిరాజుకు చుక్కమ్మ సరసం తెలియని మసిపాత అయిపోయింది. ఈ మసిపాతను చూచి అసహ్యించుకుంటున్నా డేగానీ అది విప్పి చూస్తే ఆ కడుపులో ఒక మాంచి వజ్రం దాగివుంది. దినదినము పెరిగి వెలుగును ఆ తల్లి గర్భ కుహరంలో వెదజల్లుతోంది. వయసొచ్చిన నాటినుంచే మండే కడుపుకు యిప్పుడే చల్లదనం వచ్చినట్టయింది. కడుపులో వున్నంతకాలం ఆ వజ్రాన్ని ఆమె భరించగలదు. బయటపడ్తే దాని బరువు మోసే తండ్రి వుండాలి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS