Previous Page Next Page 
మన్నుతిన్న మనిషి పేజి 8


    "ఈ కుక్కల నోట కర్రెట్టకిమానను.  బౌ బౌ మంటారు అంతేలే..."
    "కుక్కలా..." అంటూ కరవడానికి వచ్చినట్లు పొట్టయ్య లోపలికి వచ్చాడు.
    "ఆ బాబు యేలుబడి సేసినప్పుడు-ఒకడు పాక దగ్గరొకడు రావడమే .... అంతా యిష్టం అయి పోనాది.....ఛీ..."
    పొట్టయ్య రాముడువీపు మీద ఒక్క చరుపు చరిచాడు. "అమ్మో! బాబో!" అంటూ వాడు అదే పనిగా తిట్తున్నాడు. వీళ్ళందరే ఆ రాజులాంటోడిని చంపేసారని పోలీసోలకి సెప్తానని తిట్తున్నాడు. మరో నలుగురు పాకలో దూరిపోయారు.
    అందరూ బాగా తాగే వున్నారు. వాసన బాగా కొట్తోంది. కోటమ్మ పొమ్మంటోంది. వాళ్ళు అంతుతేలుస్తామంటున్నారు. నలుగురూ కూడి రాముడి కాళ్ళు చేతులు కట్టేశారు. మూలకు నిల్చున్న కోటమ్మవేపు మీసాలు తిముడుతున్నారు. మీద పడడానికి సిద్ధమౌతున్నారు. కోటమ్మ కేకలు పెట్తోంది. ఎవరూ రారు. ఆమెకు అంతా అయోమయమౌతోంది. ఇటూ అటూ చూసింది. నీళ్ళ కడవకనిపించింది. ఆ కడవ యెత్తి వాళ్ళమీద విసరి వెనకనించి తడిక తోసుకుని బోడమ్మ యింటివేపు పరుగెత్తింది.
    బోడమ్మ గదిలో మంచంమీద యింకా బెక్కుతోంది. కోటమ్మ కాలు మీదపడి "తాగి యీలంతా నా మొగుడ్ని బాదినారు. నన్ను ముట్టడానికి వస్తన్నారు. అంత మారాజు పెళ్ళానివి. నా కింకేగతినేదు."
    అంతలో వాళ్ళూ అక్కడకు వచ్చాడు. బోడమ్మ లేచి కూర్చుంది. మాటాడకుండా కోటమ్మను రెండోవేపు మంచంమీద కూర్చోబెట్టుకుంది. తను లేచి నిలబడి-
    "ఎవరయ్యా....?" అంది.
    "కోటమ్మను వదులు"
    "ఏలొదలాలి."
    "అదీ దాని మొగుడు మా  యందరినీ తిట్త న్నారు."
    "తిట్తే...."
    "దీని సంగతి సూస్తాం"
    "ఏం సూస్తారు?"
    "ఏదో సేస్తాం..."
    బోడమ్మ శోకమంతా కోపంగా మండిపోయింది. "ఏం సూస్తారు? ఏం సేస్తార్రా? ఆడదాన్ని యెంట తరుముతార్రా యెర్రి నక్కల్లాగ! ఉఁ ....అలాగ మింగినట్లు చూస్తారేం? పొండి....ఎదవల్లారా.....పోతారా లేదా..." అంటూ లోపల నించి యింత కారుంగుండతెచ్చి వాళ్ళ కళ్ళల్లోనికి విసిరింది. వాళ్ళు గెంతుతుంటే చిట్టిరాజొచ్చాడు.
    "ఎదవలు-కొవ్విన ఎదవలు-ఆలికి ఆలి, అప్ప చెల్లెల్లూ లేర్రా....ఊరా-ఆడివా!" కొడుకు వేపు తిరిగి "నాకేం నచ్చనేదురా? నివ్వొకడివున్నావన్న బయమే యెవరికీ నేదు. పరాయి ఆడదాని మీద సెయ్యి యెయ్యడానికి అయ్యో...అంత సులువై పోనాదా?"
    అంటూ, ఆమె కోటమ్మతో కలిసి వాళ్ళ పాకకు తీసుకవెళ్ళింది. రాముడు కట్టువిప్పి "నాయనా....నోరు కాసింత కట్టుకో-నోరు మంచైతే వూరు మంచవుతాది. పదుగురన్న అబద్ధం నిజమౌతాది. నిప్పక్కడన్న నిజం అబద్ధం అంటారు. ఆ చక్ర వర్తితో అంతాసరి..." అంటూ మెల్లగా తిరిగి వెళ్ళింది.
    వీరన్నపోయి పది రోజులు దాటిపోయాయి. బోడమ్మ వస్తు వాహనాలన్నీ తీసేసింది. ముఖాన బొట్టులేదు. మూల కూర్చుండి పోయింది. ఒంటిగా వుండటం వలన యెన్నెన్నో తలపుకు వస్తున్నాయ్. వీరన్న న్యాయం యిప్పుడే ఆమెకు తెలిసి వస్తోంది. ఆ గంభీర విగ్రహం ఎల్లప్పుడూ తనదగ్గరే మెసలుతున్నట్లు అనిపించేది. ఒకోసారి తనతో మాటాడుతున్నట్లు, తనేమన్నా చిన్న నవ్వు నవ్వి బయటకు వెళ్ళిపోయినట్లు - ఆడవాళ్ళను అంతగా గౌరవం చేసిన మగాడు ఆమెకు ఆగపడలేదు. తను తప్పుచేసిన్నాడు కోపంవచ్చి అన్నమాటలేనా నవ్వుతూ అన్నాడు గానీ కోపంతో విసుక్కుంటూ అనలేదు. ఇప్పుడామెకు అడుగున భూమి మీద ఆకాశం లేనట్లే వుంది. లోకం పచ్చగా కనపడలేదు. వెలుగు కనపడలేదు. ఏదో తప్పుచేసానన్నఆవేదన బోడమ్మకు ఎల్లప్పుడూ కలుగుతోంది.
    కొడుకు పదిరోజులు దీక్ష బూనాడు. తండ్రి చావుకు విలపించాడు. పదుగురూ వచ్చి బుజ్జగించేవారు. ఒకరోజున గుంపంతా గుమిగూడారు. చిట్టిరాజు తండ్రిని తలచుకుంటూ కన్నీరు తెచ్చుకున్నాడు. అతడికి యీ ప్రదేశంలోనే వాళ్ళంతా కలకాలం వుండి పోవాలనే కోర్కె వుండేదనీ. ఆ కోర్కె తన తల్లికి తెలియ చెప్పాడనీ అందుకే మనంయెలాగైనా యిక్కడ వుండి పోడానికి ప్రయత్నించాలన్నాడు. దానికిగాను కొన్ని ప్రతిపాదనలు చేసాడు.
    "ఎవడి మట్టుకు వాడు గడించి యిల్లుకట్టుకోలేరు."
    "మనం మందలోలం - ఈ నాడు యిక్కడ - రేపెక్కడో?" అడ్డు తగిలాడు వుప్పాలరాముడు.
    "రోజులు మారుతున్నాయ్. ఈ రోజుల్లో గాలోడలు - తవ్వోడలు, యెన్నో రకాలు ఇప్పుడు యిమానం యెక్కితే మధ్యాన్నం లండన్. సాయంత్రం అమెరికా... చంద్రలోకంకే యింకో పదేళ్ళలో మనిషి యెళ్ళిపోతాడు. అలాంటిది యిల్లుముక్క కట్టుకోవద్దా?"
    "గాలికి పెంకుటిల్లు పడిపోతాయిగానీ.. మన పాకలు కదలనే కదలవు. ఇంత గట్టివి వదలేసి.."
    "నివ్వు నోరుమూత్తావా? లేదా?" పెండ్రపొట్టయ్య రాముడ్ని మందలించగానే పదగురూ వాడిమీద లేచారు. చిట్టిరాజు వినయంగా "తెలీక అన్నాడు. ఒకడు కాదంటే అయిపోతాడా? ఇది గుంపంతటి మాట. గడించిన డబ్బు వస్తువాహనం ఒకచోట పెడ్దాం. డబ్బు కూడగానే యిల్లు కట్టేసి మనిషి కొకటి యిచ్చేద్దాం."
    "అంత సులువేంటి?" ఉప్పాలరాముడు యీసడించాడు.
    "మనం అదృష్టం బాగుంటే ఒక్కరోజులో ఆ డబ్బు దొరికిపోతాది."
    "దొంగ డబ్బు నాకొద్దు - నాకీ పాకే సాలు" అంటూ అక్కడ నించి వెళ్ళిపోయాడు రాముడు.
    చిట్టిరాజుకు కోపం వచ్చినా నవ్వి "దేశం యెంత ముందుకు పోయిందో యీ రాంగాడికి యేం తెలుసు? మన పిల్లల కోసం మనం యీ పని చెయ్యాల. ఇల్లు కట్టుకుని యిక్కడ ఒక చిన్న వూరు లేవదీద్దాం. ఊరు రాగానే బడివస్తాది. మన పిల్లలు చదువుతారు. చదివి డాక్టేర్లు, కలక్టేరు, మినిష్టేర్లు అవుతారు. అంచేత మనం మా బాబుకోరిక నిలుపుదాం" అంతా అలాగే అన్నారు.

                                   8

    చిట్టిరాజు ప్రోత్సాహంతో దొంగతనంచేసి బెల్లంతిన్న గుంపులో మగాళ్ళు ఆనోటితో కష్టపడి తవుడుబుక్క లేకపోయారు. రోజుకు రోజూ దొంగతనంలో ప్రావీణ్యం సంపాదించారు. ఉప్పాల రాముడు ఒకటి రెండుసార్లు ముందుకు దూకాడుగానీ భార్య చెయ్యి పట్టుకుని వెనకకు లాగేసింది.
    దోచినది చిట్టిరాజు కూడబెడ్తున్నాడని గుంపంతా అనుకుంటే చిట్టిరాజు శృంగారం చేస్తున్నాడు. ఆ శృంగారం వ్యభిచారం అంటే ఒప్పుకొడు. తల్లి యేమైనా పలికితే యెనుబోతుమీద వానపడి నట్లే ఖాతరు చెయ్యటం లేదు. కడుపు మడుగుచేసుకుని పళ్ళతో యెముకలూ మాంసం కొరుకుతూ పులిలా పెరిగిపోతున్నాడు. ఈ గుంపులో యెక్కువ తెలివిగలవాడు యేడుస్తున్నాడు. తక్కువ తెలివిగల వాడు తన్నులు తింటున్నాడు. సంసారంలేని చిట్టి రాజుకు సరసాలెక్కువైనయ్. గుంపంతా యేకమై పెంచిన యీ పొట్టేలు వాళ్ళనే తరిమి పొడిచి నట్లుంది. కానీ వాళ్ళేమీ అనలేకపోతున్నారు. చిట్టిరాజు చుట్టూ పదునైన కత్తుల్లా యువకులు చేరారు.
    వీరన్న చచ్చి వారాలు. నెలలు దాటిపోయాయి. ఒక రోజు వుదయమే గుంపులో మహాసందడిగా వుంది. గడచిన రాత్రి చేసిన ఘనకార్యానికి మెచ్చి మాంచి విందుభోజనం జరుగుతోంది. ఉదయమే పిల్లలతో అడవిపంది గొయ్యినించి కదల్లేదు. దానిని తాకుతూ కూర్చున్న మొగపంది మూతితో యేదో పసికట్టించి. ఇటూ అటూ కదలిపోడానికి చూస్తూ మర్రిచెట్టువేపు దౌడుతీసింది. కర్రలు పట్టుకున్న నలుగురూ వెంబడించారు. అటుప్రక్కనించి యిద్దరొచ్చారు. ఈ ఆర్గురిని తప్పించుకుని తూరుపు వేపునున్న యేటివేపు పరుగెత్తింది ఒకడు విసరిన కర్ర తగిలినా అరుచుకుంటూ నీటి ఒడ్డు వెంబడే పరుగెత్తుతోంది. ఆ కోపంతో మూతితో వచ్చి యిసుక తోస్తోంది. ఒక్కసారి నలుగురూ చుట్టుముట్టి కర్రలతో బాదారు. బొబ్బపెట్టుకుంటూ నీటిలోనికి వురికింది. అవతలిఒడ్డుకు ఈదుకుంటూ దిగువుకి వెళ్ళిపోయింది. ఒడ్డుమీదనించి చూస్తున్న చిట్టిరాజు నీటిలో దిగుతున్న వాళ్ళని వద్దని వారించాడు. గబగబ పాక దగ్గరికి వెళ్ళి తుపాకి తీసుకువచ్చాడు. అది గతరాత్రి దొంగతనంలో దొరికి నది. ఇటూ అటూ చూసాడు. తూటా బిగించాడు, అప్పటికే పంది అవతలి ఒడ్డుకు చేరుకుని వీరావేశమెత్తి యిసుకను అంతయెత్తుకు తోసి వేస్తోంది. ఏరుదాటకుంటా యిటువేపు నిల్చొనే గురిచూసి తుపాకి పేలించాడు. దెబ్బతిన్న పంది అంతయెత్తుకు యెగిరి పరుగెత్తి పడి పోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS