నాలుగు మంచాలు
---బలివాడ కాంతారావు
.jpg)
ఒక వ్యక్తీ మీద వివిధమైన అభిప్రాయాలున్నట్లే ఒక సంస్థ మీద కూడా ఉంటాయ్.
పెద్ద ఆసుపత్రి మీద ఒక వాదు "నరకం యెక్కడో లేదు, భూమ్మీద నరకం పెద్దాసుపత్రి" అని. ఇంకో అభిప్రాయం-- "పోతున్న ప్రాణాన్ని వెనక్కి లాగుతారు.
"ఇక్కడ చచ్చిన వాళ్లకి ప్రాణం పోయ్యలేరు కానీ-- మనుషుల బాధలను బాగుచేసే దేవతలు ఆ డాక్టర్లు. ఆసుపత్రి ఒక భూతల స్వర్గం ."
సూర్యం కు యిదివరకే ఆసుపత్రి మీద ఒక అభిప్రాయం ఏర్పడింది. అది నరకంగా యీనాటికీ వుండిపోయింది. ఆ అభిప్రాయం తోనే తను మళ్ళీ ఆ ఆవరణ లో అడుగు పెట్టవలసి వచ్చింది.
ఈసారి ఒకరిని చూడటానికి కాదు. తనే చికిత్స పొందటానికి ఆసుపత్రి లో చేరాడు. ఆరోజుల్లో తన జీవితం వేరు. ఆర్ధికంగా యిబ్బందులు పడుతూ బ్రతుకు భారం బ్రహ్మచారైనా మోయలేక కుంటుకుంటూ నడిచే సాంధునిలా వుండే వాడు. ఇప్పుడు స్పెషల్ వార్డు కోసం ప్రయత్నించి అలస్యానికీ తట్టుకోలేక "సి" క్లాసు వార్డు లోకి చేరటానికి ఒప్పుకున్నాడు. తనకంటే వెనుక పేరు నమోదు చేసుకున్న వారికి వెంటనే దొరకటం, ఏమంటే మా యిష్టం అని జవాబు పొందటం యింకా తన మొదటి అభిప్రాయాన్ని మార్చటానికి అవకాశం యీయలేదు.
ఈ 'సీ' క్లాసు వార్డు లో నాల్గు మంచాలున్నాయ్. ప్రతి రెండు మంచాల మధ్య సీలింగ్ ఫ్యాన్లున్నయ్. మూడు వేపుల ద్వారాలు ఒక వేపు గోడకు మందులు పెట్టుకోడానికి పెద్ద బీరువా వున్నాయ్. రోడ్డు వేపున ద్వారం కు యినుప తీగ కప్పిన కటకటాల తలుపులు -- అవి యెప్పుడూ తాళంతో బంధింపబడి వుంటయ్ . ఆ తలుపుల నించి వరండా లోనూ రోడ్డు మీదా పోయే మనుషులనూ వాహనాలను చూడవచ్చు.
సూర్యం పడుకున్న మంచం ప్రక్క మంచం మీద యెవరో వ్యక్తీ ఆవేళ వేకువ ఝామునే పోయాడట! అందుకే ఆ మంచం మీద తను చేరేసరికి పరుపు కూడా లేదు. ఆ మంచం చూడగానే సూర్యం మనసు ఒక్కసారి దిగజారింది. కళ్ళల్లో నీరు పెరుకున్నాయ్. గొంతుక పట్టుక పోయింది. ఇదివరకు అలాంటి మంచాన్నే ఉదయమే చూసాడు. గుండె బేజారెత్తి పోయింది. మళ్ళీ ఆసుపత్రి కి బాధపెడుతున్న అజీర్ణ పు వ్యాధికి సరియైన ట్రీట్ మెంటు చేసుకోడానికి వస్తే యీ ఖాళీ మంచం గతం జ్ఞప్తి కి తేవటమే కాదు కళ్ళకు కట్టినట్లు ఆ దృశ్యాలను చూపిస్తోంది. ఎన్నో విధాల మనసును సంధాన పరుచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.


ఒకసారి యెదురుగా నున్న రెండు మంచాల వేపు చూశాడు తన యెదురుగా వున్న వ్యక్తిని యిదివరకు చూసాడు. అతని గురించి పదుగురి నోట విన్నాడు. అతని ముఖంలో ఏదో భయం తాండవిస్తోంది. అశెట్టి గారు కూడా తన జీవిత నాటకం లో ఒక పాత్ర వహించారు. అదీ ప్రధాన పాత్రే. ఐనా అతనితో యిదివరకు ముఖ పరిచయం లేదు. కనీసం మాట్లాడనై నా లేదు. ఓహో మీరా అని చనువుగా అనే సాహసం కూడా సూర్యనైకి లేదు.
ఆ ప్రక్క మంచం లో వ్యక్తీ శెట్టి గారిలా వయసులో పెద్ద కాదు, ఇంచుమించు సూర్యం వయసు వుంటుంది. ముప్పయి సంవత్సరాలు నిండ కుండానే జబ్బు ముదిమిని తెచ్చి పెట్టినా ఆ కళ్ళలో మెరుపును అంటలేక పోయింది. తెల్లని పల్చని ముఖంలో చిరునగవు సత్యం స్వతహాగా తాండవిస్తోంది. ఆ చూపుల్లో యెదుటి వాళ్ళను సమ్మోహనం చేసే గుణం వుంది. అతను ఆలస్యంగా లేచాడు.
ఆ నాల్గు మంచాల వార్డులో సూర్యం చేరేసరికి వాతావరణం శోకమయమై వుంది. ఇంట్లో వ్యక్తీ యెవరో పోయినట్లుగా వుంది. ఏదో బరువుతో మనసు క్రుంగి పోయినట్లుగా నర్సులు కూడా కదులుతున్నారు.
'ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. నా పేరు 'శ్రీనివాస్' అంటూ ఆలస్యంగా లేచిన వ్యక్తీ వచ్చి సూర్యాన్ని పలుకరించాడు.
'నాపేరు సూర్యం!'
'వెల్ కమ్ -- వేగంగా కోలుకుని వెళ్ళిపోతారు.'
'ఎలా చెప్పగలరు?'
'మీరు పడుకున్న బెడ్ అలాంటిది. లక్కీ బెడ్.'
'మీదో."
"నెల అయ్యింది. ఏదీ తేల్చరు. ఇంకా జబ్బెంటో పోల్చు కోలేదట!'
'శెట్టి గారికి....'
"ఆయనకు హెర్నియా ఆపరేషను చెయ్యాలి. ఉండవలసిన జబ్బులన్నీ వున్నాయ్. షుగర్, కంప్లయింట్, హైబ్లడ్ ప్రజరు....వగైరా.'
'శెట్టి గారూ! మన సూర్యం గార్ని కలుసుకున్నారా?'
"అయ్యా-- నమస్కారం ...' పరుపు మీద నించి లేవకుండానే శెట్టి గారు అందుకున్నారు.
'నమస్కారం ' అన్నాడు సూర్యం.
"ఏం పని చేస్తున్నారు?'
'ఆఫీసరు -- నేవల్ ఫేక్టరీ లో.'
"ఏమిస్తారు?'
'అరువందలు.'
మంచిది.' అంటూ మెల్లగా శ్రమపడి పరుపు మీద కూర్చొని,
'జబ్బెమిటి?'
'కడుపు నొప్పి, అప్పుడప్పుడు వస్తుంది. అజీర్ణం.'
'పిల్లలేందరు?'
'ఇంకా పెళ్లి కాలేదు.'
'మీ వయసులో నాకు నలుగురు పిల్లలు.రోజులు మారిపోయాయి.'
'శెట్టి గారికి యేనమండుగురు పిల్లలండి. అందులో ఆరుగురు ఆడవాళ్ళూ' అందుకున్నాడు శ్రీనివాస్.'
'అమ్మయ్యో ఆరుగురే!' సూర్యం ఆశ్చర్యపడుతుంటే 'ఇంక ఒక్క అమ్మాయే పెళ్ళి కుంది లెండి!'
శెట్టి గారికి కఫం కూడా చేసినట్లుంది. దగ్గుతూ వుమ్ముతున్నాడు.
'రాత్రి బత్తాయి రసం తాగొద్దన్నానా? అందులో సేకరిన్ వేసి మరీ తాగారండి.' శ్రీనివాస్ అనగానే సూర్యం యెదుటి వాళ్ళ బాగోగుల విషయం యింత పట్టింపు చేసుకుంటున్న వ్యక్తీ వేపు ఆదరణ, తృప్తి తో చూశాడు.
'రాత్రంతా సరిగా నిద్దర లేదు. ఈ బెడ్ మీద మనిషి వేకువ ఝామునే పోయాడు, రాత్రంతా జ్వరంగా వున్నా దగ్గరే వున్నాను. చాలా బాధపడ్డాడు. భార్యా వుంది, బావమర్ది వున్నాడు. దగ్గర, పోయేటప్పటికి యెవరూ లేరు. వాళ్ళు ఎవరున్నా యేమి చెప్పేవాడో? ఆ కళ్ళు మూసేసరికి ఆ భార్య చెయ్యి ఆ నుదుటి మీద వుంటే యెంతో తృప్తితో చచ్చిపోను. అధవా ఆ ప్రాణం పోయేటప్పుడు ఆత్మీయుల యేడుపు వినిపిస్తే యెంత హాయి నిచ్చును. ఆ యేడుపు సంతోషం యిచ్చేది. అతను బల్ల గుద్దినట్లు నిజం చెప్పేవాడు. మొగమాటం అసలే లేదు. వాడు ఇంద్రుడవనీయండి , చంద్రుడవనీయండి. డాక్టరు మొదలు తోటీ వాని వరకు ఒకటే నిజాయితీ. అతనిని చూస్తె ముచ్చట వేసింది. నిజం చెప్పి పదుగురి లో చెడ్డ అయిన వ్యక్తీ. నా మనసు కుదుట పడలేదు. అందుకే మీకు పలకరించడానికి ఆలస్యంగా వచ్చాను.'
ఉపన్యాస ధోరణి లో శ్రీనివాస్ చెప్పుకు పోతుంటే సూర్యం నోట మాట రాలేదు. తను ఆలోచనలో నిమగ్నుడై గతంలోని సంఘటనలను మనః ఫలకం మీద మళ్లీ ప్రదర్శించుకొని బాధ పడుతున్నాడు. ఒకసారి రాలిన కన్నీరును తుడుచుకుంటున్న సూర్యాన్ని చూసి శ్రీనివాస్ నవ్వుతూ ---
"ఏవిటండి మీది యింత లేత మనసు. నాకు యేడ్చే వాళ్ళని చూస్తె జాలి వేయదు. కోపం వస్తుంది. ఈ లోకంలో ఏడవ టానికి యేముంది చెప్పండి?'
'అనుబంధాలు' సూర్యం మెల్లాగా గొణిగాడు. ' ఈ అనుబంధాలు, సంబంధాలు మనిషిని పిరికిని చేసేస్తే వాటిని దూరంగా వుంచటం మంచిది. ఏడుపు సంతోషం వలన వస్తే అనుభవించడానికి నాకేం అభ్యంతరం లేదు. ఇంకోవిధంగా ఏడ్చేవాడు చేత కాని వాడు.' శ్రీనివాస్ అందుకున్నాడు.
'ఏడుపుతో గుండె బరువు తగ్గిపోతుంది.'
'ఇంతకీ గుండె బరువెందు కెక్కాలి? నాకు వెన్నె ముక నిటారుగా నిల్చోడానికి వుండగా ముద్దలాంటి గుండె మీద ఆధారపడటం యిష్టం లేదు.'
'మనిషి మనుగడ కే అది ముఖ్యం.'
'పిరికివారై మీరు దానికి ప్రాధాన్యం యిస్తున్నారు కాబట్టి! పిరికి వాళ్ళ గుండె జోరుగా కొట్టుకుంటుంది. ధైర్యవంతుని గుండె వాడు చెప్పినట్లే వింటుంది. వెన్నె ముక గల మహానుభావులు గుండెను కొద్ది క్షణాలు ఆపి, మరీ బ్రతకలేదా?'
సూర్యం వాదించే పరిస్థితిలో లేడు. శ్రీనివాస్ ఒకసారి సూర్యం ముఖం వేపు పరీక్షగా చూసాడు. అప్పుడే ఒక నర్స్ అలా మండులుంచిన గోడ బీరువా వేపు వెళ్తోంది. తెల్లని దుస్తులు వేసుకున్నా యౌవ్వనం కొంటె చూపు చూస్తోంది. నడక నాట్యం చేస్తోంది. నగవు నింపిన పెదిమలు ఆహ్వానిస్తున్నాయ్. వయ్యారం వగలుతో కూడి ఒళ్ళంతా ఒంపు సోంపు లతో నిండుకుంది.
'గుడ్ మార్నింగ్ సిస్టర్" అన్నాడు శ్రీనివాస్.
'వెరీ గుడ్ మార్నింగ్ అన్నది ఆమె.
"ఏం అలా వున్నారు?'
'రొంప పట్టింది.'
'మందు తీసుకోలేదా?'
'ఏమందూ పని చేయటం లేదు.'
'నేనివ్వనా?'
ఆమె కొంటేగా చూసి 'మీరు డాక్టరు అయ్యాక యిద్దురు గాని.'
'ఈ నెలరోజుల ఆసుపత్రి జీవితం డాక్టరు మీది డాక్టర్ని చేసేసింది -- ఒక్కడోస్ తో మీ రొంప ను కుదర్చక పొతే నా పేరు డాక్టర్ శ్రీనివాస్ కాదు.'
