గోడవార కూర్చుని చదువుకొంటున్న పార్వతి ముంగిలా తల దించుకుని ముడుచుకు పోయింది.
"ఇక్కడే ఉన్నవుటే? ఏం? మావాడూ, నువ్వూ ఏమైనా దెబ్బలాడు కున్నారా?"
"ఏమిటి, వదినా , పొద్దున్నే వచ్చావు ?" అంటూ వంటింట్లోంచి బయటికి వచ్చింది సావిత్రి.
"చూడు, వదినా! ఈ పిల్లలు-- చక్కగా ఆడుకోకూడదూ? ఏమైందో ఏమో? రాత్రి నుంచీ మావాడు అదో మాదిరి గానే ఉన్నాడు. ఏమిరా? అని పలకరించబోతే బావురుమని ఏడుస్తూ కూర్చున్నాడు. అసలు సంగతేమిటో అడుగుదామని చక్కా వచ్చాను."
"ఏమే , పార్వతీ? ఏమైంది?' సావిత్రి అడిగినా పార్వతి దించిన తల ఎత్తలేదు.
"అందుకే కాబోలు పొద్దున్న మీ యింటికి వెళ్ళి ఓ గిన్నెడు పంచదార తెమ్మంటే వినకుండా కూర్చుంది. అప్పుడు సూరిని పంపించాను . ఏమో వదినా! దాని వైఖరి నేను పట్టించుకొనే లేదు!"
"ఓసారి లేచి రావే, పార్వతీ! వాడేందుకు ఏడుస్తున్నాడో అడుగుదువు గాని" అంది అన్నపూర్ణమ్మ.
"వెళ్ళు, ఓసారి వెళ్ళిరా! తప్పు కదూ? అలా దెబ్బలాడుకోవచ్చా? రఘు బాబుకి చెప్పిరా!" అంటూ తొందర చేసింది సావిత్రి. పార్వతి కిక లేవక తప్పలేదు. అడుగులు లెక్క పెట్టుకుంటూ అన్నపూర్ణమ్మ వెనకే నడిచింది.
"అడుగో ఆ సపోటా చెట్టు కింద కూర్చున్నట్టున్నాడు. దగ్గరి కెళ్ళి పలకరించు. నా వంటేలా తగలడి పోయిందో ఖర్మ!" అంటూ గబగబా లోపలికి పోయింది అన్నపూర్ణమ్మ.
పార్వతి పిల్లిలా నడుస్తూ చెట్ల దగ్గరికి వెళ్ళింది. మోకాళ్ళ చుట్టూ చేతులు బిగించి ముడుచు కూర్చున్నాడు రఘు బాబు! పార్వతిని చూసినా చూడనట్టు.
కాస్సేపు సిగ్గుతో మాట్లాడలేక పోయింది పార్వతి. చివరికి ధైర్యం చేసి, రెండడుగులు ముందుకు నడిచి రఘు బాబు పక్కనే కూర్చుని భుజం మీద చెయ్యి వేసింది.
"రఘు బాబూ!"
"........."
"నా మీద కోపం వచ్చిందా , రఘు బాబూ?"
".........."
"నిన్నెప్పుడూ ఏమీ అనను. రఘు బాబూ? నాతొ మాట్లాడవూ?"
రఘు బాబు తలతిప్పి చూశాడు. రెండు కన్నీటి చుక్కలు పార్వతి చేతుల మీద పడ్డాయి. తెల్లబోయింది పార్వతి. "ఎందుకూ? ఏడుస్తున్నావెందుకూ?" అంది.
"నేను....నేను....పిరికి వాణ్ణిగా?"
"నేను అన్నానా? పద్మజేగా అంది? నీతో కూడా అందిగా?"
"ఉహూ! నువ్వూ అన్నావు."
సిగ్గుపడిపోయింది పార్వతి. పాపం రఘుబాబు ఏడుస్తున్నాడు కూడాను. "పోనీలే -- ఇంకెప్పుడూ అననుగా?"
"మరి నా జట్టు కూడా ఉండనన్నావుగా?"
"ఛీ! ఎందుకు ఉండనూ? తప్పకుండా ఉంటాను."
రఘు బాబు ముఖం నిండా సంతోషం కనిపించింది పార్వతికి.
"అయితే -- రఘు బాబూ! పద్మజ అంటే ఏడవలేదు కదా? నేను అన్నానని ....."
"ఊహూ! నువ్వెప్పుడూ నన్నలా అనకు, పారూ!"
పార్వతి ఆశ్చర్యంగా చూసింది. రఘు బాబు ఎప్పుడూ అలా పిలవలేదు. ఎప్పుడూనూ.
"నన్ను ఇలాగే పిలువు, రఘు బాబూ! నా కెంతో బాగుంది."
సిగ్గుగా నవ్వాడు రఘు బాబు.
"రా! ఆ మందార పువ్వులు కోసుకుందాం." రఘు బాబు చెయ్యి పట్టుకుని లేచింది పార్వతి.
* * * *
హటాత్తుగా అన్నాడు రఘు బాబు ' "పారూ! మన కిద్దరికీ పెళ్ళి చేస్తుందంట మా అమ్మ."
అయోమయంగా చూస్తూ అంతలోనే సిగ్గు పడిపోయింది పార్వతి. "అలాంటి మాటలు అనకు బాబూ! నాకు సిగ్గు" అంటూ మరో చెట్టు చాటుకు పరిగెత్తింది.
"నేనేం అనలేదు. మా అమ్మే మీ అమ్మతో చెబుతోంది నిన్న" అంటూ దగ్గరికి వచ్చాడు రఘు బాబు. పార్వతి బొమ్మలా నిలబడి పోయింది. పెద్దవాళ్ళు అలా మాట్లాడుకోవటం పార్వతి కూడా వినకపోలేదు అప్పుడప్పుడు.
"మీ పార్వతి ని మా వాడికి చేసుకుంటాం, వదినా!" అంటూ నవ్వుతుంది అన్నపూర్ణమ్మ.
సావిత్రి కూడా నవ్వుతూనే -- "అవెక్కడి మాటలు లే , వదినా! మీ అంతస్తేమిటి, మా అంతస్తేమిటి? అలాంటి వెర్రి మొర్రి ఆశలు మాకేం లేవు సుమీ!" అనేస్తుంది.
వదినా మరదళ్ళ హస్యాలతో చనువుగా జోక్యం కల్పించుకుంటూ -- "మీ వదిన మాట అబద్దం కాదమ్మా, సావిత్రీ! పార్వతి మా యింటి కోడలే అవుతుంది చూడు. మా వెర్రి బాగులవాడికి మీ పార్వతిని కట్టబెడితే మరి మాకు బెంగ తీరిపోతుంది" అంటూ సమర్ధిస్తాడు చలపతి రావు.
"మన పార్వతి అదృష్ట జాతకురాలే , సావిత్రీ! లక్షాదికరీ కోడలు కావడం అంటే....' అంటూ కూతురి అదృష్టానికి మురిసిపోతున్న భర్తను వారిస్తూ మందలిస్తుంది సావిత్రి. "మీ పిచ్చి గానీ, వాళ్ళకీ, మనకీ పొత్తేమీటండీ? ఎందుకొచ్చిన ఆశలు? ఎంతలో వాళ్ళం అంతలోనే ఉండాలి"
"అన్నిటికీ నీకు చెడ్డ అనుమానం! ఏమో? దాని అదృష్టం ఎంత గొప్పదో మనకేం తెలుసు?" అనేస్తారు రామనాధం మేష్టారు ఆశ పోగొట్టుకోలేక.
పెద్దవాళ్ళు హస్యాలూ, వాదాలూ అంత వరకూ సరిగ్గా అర్ధం కాకపోయినా , రఘు బాబు కూడా అలా పెళ్ళి మాట ఎత్తేసరికి , పార్వతికి అంతులేని సిగ్గు , ఆ సిగ్గు లోనే అర్ధం కాని సంబరమూ కలిగాయి. ఆ రోజంతా రఘు బాబుతో సరిగ్గా తలెత్తి మాట్లాడలేక పోయింది.
పెళ్ళి మాట ఎలా ఉన్నా రఘూ వాళ్ళింట్లో పార్వతి అతి చనువుగా తిరగటానికి అలవాటు పడిపోయింది. అన్నపూర్ణమ్మను "అత్తా!" అనీ, చలపతి రావును మామయ్యా!' అనీ పిలుస్తూ అరమరికలేకుండా , ఎవరి దగ్గరా జంకు గొంకులు ఎరగకుండా వేళాకోళలతో, కులాసా కబుర్లతో ఇంట్లో పిల్లగానే మసలసాగింది.
తల్లిదండ్రులతో కూడా ఎక్కువ మాట్లాడే అలవాటు లేని రఘు, పార్వతి తో మాత్రం ఎన్ని గంట లైనా నిర్లజ్జగా కబుర్లు చెబుతూ నవ్వుతూ కూర్చుంటాడు. పద్మజ ఉన్న కాస్సేపూ దిక్కులు చూస్తూ గడిపే రఘు లో పార్వతి తో మాత్రమే గడపాలన్న ఆసక్తి, కోరికా నానాటికీ బలపడుతూనే ఉన్నాయి.
అట పాటల్లో , చదువు సంధ్యల్లో కొడుకు చూపే చురుకుదనం తలిదండ్రులకు సంతృప్తి కలిగించింది.
* * * *
"అన్నయ్యా ! స్త్రీ విద్య గురించి నాకో వ్యాసం వ్రాసి పెట్టవూ? నేను డిక్టేట్ లో మాట్లాడతాను రేపు" అంది పద్మజ , అన్నం తిని లేస్తున్న విజయ శాస్త్రితో.
"అబ్బో! ఈవిడగారప్పుడే ఉపన్యాసాలిచ్చేస్తుంది కాబోలు" అంటూ తుండుతో చేతులు తుడుచుకుంటూ వచ్చి, వాకిట్లో మంచం మీద కూర్చున్నాడు శాస్త్రి.
"అప్పుడే ఏమిట్రా? ఫొర్తు ఫారం చదివే పిల్ల ఆమాత్రం మాట్లాడక లేకపోతె ఎలా?" అంటూ నవ్వి ఈశ్వర సోమయాజి కూతుర్ని దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకున్నాడు. "అన్నయ్య తర్వాత వ్రాసి స్తాడులే గానీ , అసలు స్త్రీ విద్య మీద నీ కెలాంటి ఉద్దేశ్యాలున్నాయో ముందు చెప్పమ్మా!"
పద్మజ కా ప్రశ్న అంతగా అర్ధం కాలేదు. "అంటే?" అంది అమాయకంగా.
"నీ ఉద్దేశ్యంలో స్త్రీకి విద్య అవసరమేనా?"
"అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇస్తుంది విద్య. అ జ్ఞానం స్త్రీ కెందుకు అవసరం కాదు?"
"కాకపోనూ వచ్చు. నేను చదువుకున్నాను. పెద్ద ఉద్యోగం చేస్తున్నాను. మీ అమ్మ బొత్తిగా చదువుకోలేదు. అయితే మాత్రం ఏం కష్టం వచ్చింది?"
"ఇప్పుడు నువ్వు ఉద్యోగం మానేస్తే నీ చదువంతా అనవసరమేనా?"
తడబడ్డాడు సోమయాజి. "ఆహా! అలాక్కాదు. నేను ఉద్యోగం ఎందుకు మానేస్తాను? పురుషుడు సంసారాన్ని బతికించటానికి ఉద్యోగం చేస్తూనే ఉండాలిగా?"
"ఉద్యోగం చేసినా, మానినా విద్య ప్రయోజనం విద్యకి ఉంటుందిగా నాన్నా? విద్య ప్రసాదించే జ్ఞానం స్త్రీకి మాత్రం ఎందుకు అవసరం కాదు? ఆడవాళ్లు అజ్ఞానం తో పడి వుండాలా? అయితే మా బళ్ళో ఇద్దరు పంతులమ్మ లు ఉన్నారు. వాళ్ళు ఉద్యోగం చేస్తున్నట్టేగా?"
"అది మన సంఘానికి వ్యతిరేకమే కదమ్మా?"
"సంఘం అంటే?"
"మనకి హిందూ మతం లో స్త్రీ పురుషులు పాటించవలసిన నీతి నియమాల్ని, ఆచార వ్యవహరాలనీ నిర్చేశించేది సంఘం."
"అది ఎక్కడుంటుంది?"
"ఎక్కడో ఉండటం కాదు. మనకి మనమే సంఘం. మనం ఏం చెయ్యబోయినా పదిమందీ ఏమనుకుంటారో నన్న భయమే సంఘ భయం. అది ప్రతి ఒక్కరికీ ఉండి తీరాలి."
"ఎందుకూ?"
"ఎందు కేమిటి? అందరూ ఒక పద్దతికి కట్టుబడి సంఘ నియమాల ప్రకారం మంచిగా బతకకపొతే శాంతి సౌఖ్యాలు ఎలా ఉంటాయి?"
