రఘుబాబు పుట్టిన రోజు వేడుక సావిత్రిని అన్నపూర్ణమ్మ నూ కూడా ముఖాముఖీ పరిచయం చేసింది.
ఒంటిమీద ఎక్కడా ఖాళీ లేదని పించేలా ఒంటేడు నగలూ, పెద్ద పెద్ద జరీ పువ్వులున్న ఎర్ర పట్టుచీరా, ముడి చుట్టూ ఒత్తుగా కనకాంబరాలూ, పాదాలకు పచ్చగా పసుపు పూతా -- అనుకోకుండా ఇంట అడుగుపెట్టిన పేరంటాలిని చూసి తొట్రుపడింది సావిత్రి. ఆవిడ వెనకే నిలబడి ఉన్న రఘుపతి ని చూడటం తో మాత్రం కొంత ఊహించ'గలిగింది . "అమ్మా! అమ్మా! రఘు బాబు వాళ్ళ అమ్మగారు వచ్చారే !" అంటూ పిల్లలు సంబరంగా అరుస్తుంటే ఉన్న అనుమానం కూడా తీరిపోయింది.
కంగారుగా చాప పరుస్తూ , "రండి ! రండి! నిలబడిపోయారు. రండి" అంటూ ఆహ్వానించింది.
అన్నపూర్ణమ్మ చాప మీద కూర్చుని సంగతంతా చెప్పింది. "మీయింటికి రావాలని ఎప్పటి కప్పుడే అనుకొంటూ బద్దకించేసాను, వదిన గారూ!" అంటూ సంభాషణను ఉపక్రమించింది.
"ఆ 'వదిన గారూ!" అన్న సంబోధన సావిత్రికి చాలా ఇంపుగా తోచింది. 'బొత్తిగా అతిశయం లేని మనిషి' అనుకొంది. మనస్పూర్తిగా నవ్వుతూ అంది; "ఆ-- దానికే ముంది లెండి! నేనూ ఎన్నోసార్లు అనుకున్నాను. ఈ పిల్లలతో , ఇంటి పనులతో తీరి చస్తేనా? మన ఆడవాళ్ళకి ఇల్లే కైలాసం కదా?"
"అవుననుకోండి. అయినా కాస్త ఇరుగూ పొరుగూ అంటూ రాకపోకలు లేకపోతె ఎంతకాలం గడుస్తుంది? రేపు మావాడి పుట్టిన రోజు. కొత్తగా వచ్చిన ఊరు. ఎవరున్నారు పిలవటానికి? కాస్త ఈ వీధిలోనైనా నలుగురి నీ పిలిచి వెళ్దామని బయల్దేరాను. మీరు తప్పకుండా రావాలి సుమా, వదినగారూ!"
"అయ్యో! ఎంతమాట! తప్పకుండా వస్తా నండీ! మీకేమైనా పనిపాటల్లో సాయం కావాలన్నా నిర్మొహమాటంగా నాకు చెప్పండి."
"అంత మాటన్నారు-- అదే చాలు. ఈసారి ఏమంత వేడుకగా చెయ్యాలనుకోవటం లేదండీ!" అన్నపూర్ణమ్మ ముఖం నిండా విచార లేఖలు అలుముకున్నాయి . "క్రిందటి సంవత్సరం సరిగ్గా ఈ రోజుల్లోనే మా అమ్మాయి-- ఏడెనిమిదేళ్ళ పిల్ల -- టైఫాయిడ్ జ్వర మొచ్చి పోయింది, వదినగారూ! ఆ దుఃఖంతో గడిచిన పుట్టినరోజు ఎలాగూ చెయ్యలేక పోయాము. ఈసారైనా వాడి నెత్తి మీద పదిమంది పెరంటాళ్ళ చేతా నాలుగక్షింతలు వేయించాలని బుద్ది పుట్టి, నిన్ననే ఈ మాట కాస్తా మీ అన్నయ్యగారితో చెప్పాను. నలుసులా మిగిలిన వాడు వీడోక్కడే ! ఎన్ని కానుపులు కన్నా దక్కించుకోలేకపోయాను-- దౌర్భాగ్యురాలీని."
సావిత్రికి చాలా జాలి వేసింది. అయ్యో! అలా విచారించకండి, వదినగారూ! భగవంతుడు ఏం చేసినా ఆమోదించటం తప్పితే మన చేతిలో ఏముంది?" అంది ఓదార్పుగా.
"మీ పార్వతిని చూస్తె నా కెంతో ముచ్చటగా ఉంటుంది. ఆడపిల్ల తిరగని ఇల్లు ఏం ఇల్లు చెప్పండి!"
"మా పార్వతిని మీ యింట్లోనే అట్టే పెట్టుకోండి. మాకు రుక్మిణి ఉందిగా?' అన్నపూర్ణమ్మ దిగులు మరిపించి కాస్త కబుర్ల లో పెట్టాలనే ఉద్దేశ్యంతో నవ్వుతూ అంది సావిత్రి.
"ఎన్ని కాయలు కాస్తే మాత్రం చెట్టుకు బరువంటారా?" అంటూ లేచింది అన్నపూర్ణమ్మ. కుంకుమ భరిణె తీసి సావిత్రికి బొట్టు పెట్టింది. భరిణె ముయ్యబోతూ మళ్ళీ జ్ఞాపకం వచ్చిన దానిలా పార్వతి నొసట కూడా కుంకం దిద్దింది. ఎగబడుతున్న రుక్కు ముఖాన కూడా ఓ పిసరు అంటించి ముద్దు పెట్టుకుంది. "అన్నట్టు చెప్పటం మరిచే పోయాను. రేపు మీ పిల్లలు ముగ్గురు మా యింట్లోనే భోజనం చేస్తారు, వదినగారూ! మరి పంపించక తప్పదు" అంది రెండడుగులు ముందుకు వేసిన అన్నపూర్ణమ్మ ఆగి నిలబడి.
"మీరడిగితే నేను కాదంటానా? కానీ.... ఈ కుర్ర కుంకలతో ...ఎందుకండీ మీకు శ్రమ?"
"శ్రమ అయినా తప్పదు . అది నాకు సంతోషంగానే ఉంటుంది. మరి వస్తాను. రేపు..... మరిచి పోరుగా?" అంటూ రోడ్డు మీదికి నడిచింది.
మర్నాడు పేరంటం అయ్యాక కూడా సావిత్రి అన్నపూర్ణమ్మ దగ్గర కూర్చుని గంటసేపు కబుర్లతో గడిపింది. ఆ ఆడంగుల కబుర్ల లో అత్తవారిళ్ళూ, పుట్టిన వారిళ్ళూ, పెళ్ళిళ్ళూ, కాపరాలూ, చుట్టాలూ, వంశాలూ , గోత్రాలూ -- సమస్తం దొర్లిపోయాయి. నేలమీద చిందిన పాదరసం బోట్ల లాగా.
"అయితే ....ఆ వెంకటాద్రి తాతగారు.... మీ వేలు విడిచిన మేనత్త గారికి బంధువే నంటారా? ఇంతసేపూ చెప్పరేమండీ? ఓ మీరు నిజంగానే నాకు వదినగారయ్యారే!" ఆశ్చర్యంగా గొంతు పెద్దది చేసుకుంది అన్నపూర్ణమ్మ. "ఏమండోయ్ !విన్నారూ? మన రఘుబాబు మాస్టారూ, సావిత్రి వదిన గారూ మనకి దగ్గర వాళ్ళేనండీ! ఎదురెదురుగా ఉంటూ తెలుసుకోలేకపోయాము. మా వెంకటాద్రి తాతకి....." అంటూ వీధి గదిలోకి వినిపించేలా అరిచి మళ్ళీ వచ్చింది.
"చుట్టరికం లేకపోతె మాత్రం మీ అభిమానాల కేం తక్కువ, వదినగారూ?"
"ఇక గారూ గీరూ అంటూ మన్నింపు లెందుకులే వదినా! మనం, మనం పరాయి వాళ్ళమా ఏమిటి? సాక్షాత్తూ వదినా మరదళ్ళ మయ్యాము."
"ఏమిటి పూర్ణం , ఇందాక అంటున్నావు?' అంటూ చలపతి రావు మధ్య గది తలుపుల దగ్గర నిలబడి అడిగాడు. అన్నపూర్ణమ్మ పుట్టెడు సంతోషంతో -- 'అఘోరించినట్టే ఉంది. ఇంతకీ మీరు విననేలేదూ? ఏం, అక్కడ నిలబడి పోయారు? లోపలికి రండి. సావిత్రి వదిన మరెవరో కాదు. మీకు చెల్లెలేనూ. మా వెంకటాద్రి తాతకి....." అంటూ ఆ డొంక తిరుగుడు చుట్టరికాన్ని సాగదీయటం లో నిమగ్న మై పోయింది.
చలపతిరావు ముఖంలో కూడా సంతోషం కనిపించింది. "ఆహా! అలాగా? బావగారు వీధి గదిలోనే కూర్చున్నారు. ఈ కబురు కాస్తా చెప్పేస్తాను" అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు.
"అమ్మా! మాస్టారి కి ఫలహారం ఇస్తానన్నావు కదమ్మా" అంటూ వచ్చాడు రఘు.
"ముందు లోపలికి పిలిచి పంచేలా చాపు ఇచ్చి దణ్ణం పెట్టారా! తర్వాత ఫలహారం వడ్డిద్దువు" అంటూ తాంబూలం చుట్టటానికి లేచింది అన్నపూర్ణమ్మ.
(1).jpg)
"నిన్న నీ పుట్టినరోజు పండగట కదూ, రఘూ బాబూ? పార్వతీ వాళ్ళని పిలిచావుట . నన్ను కూడా పిలవలేదేం?' నిలదీసి అడిగినట్టే అడిగింది పద్మజ.
బిత్తరపోయి రఘుబాబు కాస్సేపు మాట్లాడలేక పోయాడు. "నేను....నేను.... పిలవలేదుగా? మా అమ్మే పార్వతీ వాళ్ళని పిలిచింది" అన్నాడేలాగో.
"పోనీ ......నువ్వయినా నన్ను పిలవకూడదేమిటి? " నిష్టూరంగా చూసింది పద్మజ.
తన దోషమేమీ లేదన్నంత ధీమాగా అన్నాడు రఘు బాబు! "మీ యిల్లు నాకు తెలీదుగా?"
"పార్వతికి తెలుసుగా? మీరిద్దరూ కలిసి రాకూడదేమిటి?"
సంశయంగా నసిగాడు రఘు బాబు! "మీ యిల్లు.....చాలా దూరం అన్నావుగా? అంత దూరం....మా అమ్మ నన్ను వెళ్ళనిస్తుంది?"
"ఛ! నువ్వు ఉత్త పిరికివాడివి."
మాట్లాడలేదు రఘుబాబు.
తర్వాత పార్వతి తో కూడా ఆ మాటే రెట్టించింది పద్మజ. "రఘుబాబు ఉత్త పిరికివాడు , పారూ!"
అయిష్టంగా చూసింది పార్వతి. "ఏం? ఎందుకలా అంటావు రఘు బాబుని?' అని అడిగేస్తే బాగుండు ననుకోంది.
"మా యింటికి రావటానికే భయం వేస్తున్నట్టు మాట్లాడతాడెం , పారూ?' అంది పద్మజ నుదురు చిట్లిస్తూ.
దానికీ పార్వతి ఏమీ జవాబుచెప్పలేదు. అస్తమానూ రఘు బాబును పద్మజ అలా వెక్కిరించటం పార్వతి కేం నచ్చలేదు. "అలా అనకు, పద్మజా!" అని చెప్పాలనుకున్నా ధైర్యం చాలలేదు. అసలు రఘు బాబు మీదే కోపం వచ్చింది పార్వతికి.
"రఘూ! నువ్వు ఉత్త పిరికి వాడివటగా? అస్తమానూ అంటోంది పద్మజ" అనేసింది సాయంత్రం రఘు బాబుతో.
రఘు బాబు నవ్వేసి ఊరుకున్నాడు. పార్వతికి చిరాకు వేసింది. "నువ్వు పిరికి వాడివని పద్మజ నాతొ ఎన్నిసార్లో చెప్పింది తెలుసా?"
"ఊ! నాతోనూ చెప్పింది పొద్దున్న."
"మరి నువ్వేమీ అనలా? నీకు కోపం రాలా?" విచిత్రంగా చూసింది పార్వతి. మాట్లాడలేదు రఘు బాబు. ఇంకా కోపం వచ్చింది పార్వతికి.
"నేనేం పిరికి వాణ్ణి కాదు. అలా అంటే ఊరుకోను" అని తనతోనే దెబ్బలాడతాడేమోననీ, ఆటలోంచే లేచి పోతాడేమోననీ ముందు భయపడింది పార్వతీ. రఘు బాబు దెబ్బలాడలేదు సరి గదా -- జవాబైనా చెప్పకుండా నవ్వుతూ కూర్చున్నాడు . పార్వతి పౌరుషంగా లేచింది. "నువ్వు నిజంగా పిరికి వాడివే! పద్మజ అబద్దం చెప్పదు. ఛీ! నీ జట్టు ఉండనే ఉండను" అనేసి మరి వెనక్కు తిరిగి చూడకుండా వచ్చేసింది.
మర్నాడు ఆదివారం అయినా పార్వతి ఆడుకోటానికి తోటలోకి వెళ్ళలేదు.
దిగులుగా కూర్చున్న కొడుకును మందలిస్తూ -- "ఏమిరా , రఘూ , అలా కూర్చున్నావు? పార్వతి ఆడుకోటానికి రాలేదేం?" అంటూ దగ్గరికి వచ్చింది అన్నపూర్ణమ్మ.
గత రాత్రి నుంచి లోలోపలే ఏడుపు అపుకొంటున్న రఘు బాబు ఒక్కసారిగా తల్లి ఒళ్ళో దూరి బావురుమన్నాడు. ఎంత ఓదార్చినా వినకుండా వెక్కి వెక్కి ఏడ్చాడు.
"అసలేమైందిరా? మీరిద్దరూ దెబ్బలాడు కున్నారా?" అని అడిగితె అడ్డంగా తల తిప్పాడు.
"మరేమిటి? ఎందు కేడుస్తావు?" అడిగి అడిగి విసిగిపోయినా జవాబు చెప్పలేదు రఘు బాబు.
"ఉండు , నేను పార్వతి నడిగి వస్తాను" అంటూ బయల్దేరింది అన్నపూర్ణమ్మ. రఘుబాబు దిగ్గున లేచి తోటలోకి పరిగెత్తాడు.
"వదినా! మా కోడలు పిల్లెదమ్మా? ఇవ్వాళ రానే లేదేం?" అంటూ సావిత్రిని పిలుస్తూ ఇంటి గడపలో కాలు పెట్టింది అన్నపూర్ణమ్మ.
