"శాంతి సౌఖ్యాలు లేని చెడ్డ పనులు ఎవరు మాత్రం ఎందుకు చేస్తుంటారు , నాన్న?"
'చేస్తారమ్మా! నీతి నియమాలకి కట్టుబడి ఉండటం అందరికీ సాధ్యం కాదు."
"పోనీ, వాళ్ళకి ఇష్టం లేని పద్దతులు ఎలా ఆచరించగలరు? వాళ్ళ కేది నచ్చితే అలాగే బతుకుతారు , తప్పేమిటి?"
"తప్పు కాదా? ఏదో విధంగా సంఘ నియమాన్ని ఇష్టం చేసుకోటానికే ప్రయత్నించాలి గానీ...."
"బలవంతంగా ఇష్టం చేసుకుంటే ఆ వ్యక్తికీ సంతోషం ఎలా కలుగుతుంది, నాన్నా? సుఖ శాంతులు పొందాలన్నదే సంఘం ఆశయమైతే అది ఎవరి కేవిధంగా లభిస్తే మాత్రం సంఘాని కెందుకు?"
"అబ్బే! అలా కాదమ్మా! సంఘ నియమాలు ఎవ్వరూ మీరటానికి వీల్లేదు. దాని వల్ల కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి."
"అందుకని సంఘం కోసం మన ఇష్టాన్ని త్యాగం చెయ్యాలన్న మాట. ఊహూ నాకేం నచ్చలేదు నాన్నా! నీ కిష్టమైన విధంగా నీ జీవితాన్ని సంతోషంగా, స్వతంత్యంగా గడుపుకునే హక్కు నీకు ఉండనే కూడదా?"
"నూటికి నూరు పాళ్ళూ ఉండకూడదమ్మా! నాకు హత్యలే ఇష్టం; దొంగతనాలు ఇష్టం; దోపీడీ లు ఇష్టం! అప్పుడే మౌతుంది? ఇలా అందరూ అన్యాయాలకూ, అక్రమాలకూ తలపడి సుఖపడాలని ప్రయత్నిస్తే సంఘం మనుగడ కి అర్ధం ఉంటుందా? ఆలోచించు.
నిజంగా పద్మజ కు ఆలోచించటం తెలిసింది. కొంతసేపు ఊరుకుంది. "కానీ, నాన్నా! తన ప్రవర్తనని తనే తీర్చి దిద్దుకోగల వివేకం కూడా ఆ వ్యక్తికే ఉన్నప్పుడు? సంఘాన్ని ఏ విధంగానూ బాధించని కోరికలు మనిషికి కలిగినప్పుడు?"
"సంఘం సమర్చించని కోరికల్ని తీర్చుకోకపోతే ఏమమ్మా?"
"అదేమిటి నాన్నా? మనకై మనమే ఏర్పరచుకున్న సంఘం లో ఎవర్నీ బాధించ కపోయినా అంత తీర్చుకోకూడని కోరిక లేలా ఉంటాయి? నాకు బాగా చదువుకోవాలని కోరిక కలిగింధనుకో-- ఆడపిల్లకి చదువెందుకని పదిమంది వెటకారాలు చేస్తారనుకో. అప్పుడు మనమేం చెయ్యాలి? సంఘ నియమాన్ని కాదని నేను బాగా చదువుకుంటే ఎవర్ని బాధించినట్టు? ఈ పరిస్థితుల్లో కూడా మన కోరికల్ని చంపుకోవాలా, నాన్నా?"
సోమయాజి మౌనంగా కూతురి ముఖంలోకి చూశాడు.
పద్మజ మళ్ళీ అంది; "సంఘ నియమాలు తప్పుతప్పులుగా ఉండబట్టే కదూ, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి? నేను చరిత్ర లో చదువు కోవటం లేదా ఏమిటి? రాజారామమోహన్ రాయ్ పుట్టిన తర్వాతే సతీ సహగమనాలు మాసిపోయాయి. అంతవరకూ ఆడదాన్ని శవాలతో కాల్చి చంపటం మంచి అంచరమేగా? ఎవ్వరూ మీరకూడదుగా? ఆ తర్వాత దాన్ని అన్యాయమని అపు చేశారా లేదా? వీరేశలింగం పంతులుగారు స్త్రీ పునర్వివాహాలు ప్రారంభించారు. బాల వితంతువులై ఆజన్మాంతం కుళ్ళి కుళ్ళి ఏడ్చే స్త్రీలకూ జీవితంలోని సుఖాన్నీ, ఆనందాన్నీ కలిగించారు. ఇప్పుడు దాన్ని కూడా అంతా మెచ్చుకుంటున్నారు. తర్వాత గాంధీ తాత దయవల్ల ఆడవాళ్ళ జీవితం ఇంకా బాగుపడింది. స్త్రీ కి కూడా చదువు ముఖ్యమన్నారు. ఈ సంఘాన్ని ఎవరో ఒకరు ఎప్పటి కప్పుడు దిద్దుతూనే ఉన్నారెందుకని? ఇప్పటికి మాత్రం సంఘంలో లోపాలు లేవని ఎలా చెప్పగలం?" స్కూలు పుస్తకాలు వల్లే వేసిన తాలుకూ విజ్ఞానం కూతురి మాటల్లో యధాతధంగా దొర్లుతుంటే ముచ్చట కలిగేది సోమయాజికి.
"ప్రస్తుతం సంఘంలో ఉన్న లోపాల్ని దిద్దే దానివి నువ్వేలా ఉన్నావు" అంటూ నవ్వాడు అంతవరకూ మౌనంగా కూర్చుని వింటున్న విజయ శాస్త్రి.
"పద్మజ అన్నట్టు సంఘాన్ని ఎల్లవేళలా సమర్చించ లేం, శాస్త్రీ! అందులో మాత్రం అవకతవకలు లేకపోలేదు" అంటూ, కూతుర్ని ఉద్దేశించి అడిగాడు సోమయాజి; "నీకు నచ్చని విషయాలని నువ్వు దిక్కరించగలవా, అమ్మా?"
"ఆ, నాకేం భయం లేదు. నా మంచి చెడ్డలు నేనే ఆలోచించుకోగలను. నా సుఖం ఏమిటో నా దుఃఖం ఏమిటో నా కన్నా ఎక్కువ ఇతరుల కేలా తెలుస్తాయి? నామీద నాకు లేని బాధ్యత సంఘాని కేలా ఉంటుంది?"
సంతోషంగా నవ్వాడు సోమయాజి. "పోనీ, నువ్వు తెలివి గలదానివి. స్వతంత్ర భావాలు కలదానివి. నీ బతుకు నువ్వు నిర్ణయించుకోగలవనే నమ్మకం కూడా సంఘానికి ఉంటుంది. కానీ.... ఆ శక్తి లేనివాళ్ళ మాటేమిటి? వాళ్ళ బతుకుల నిర్ణయం వాళ్ళకే అప్పగిస్తే ఎలా చేసుకోగలరు? అటువంటి సామాన్యుల పాలిట సంఘం పెన్నిధి లాంటిది కాదా?"
"కాదు, నాన్నా! వాళ్ళకి సాయం చెయ్యకపోగా జీవితమంతా పిరికి వెధవల్ని చేస్తోంది . ఎంత తెలివితక్కువ వాళ్ళయినా తమ జీవితాల్ని సురక్షితంగా, సుఖవంతంగా చేసుకోవాలనే ప్రయత్నిస్తారు. ప్రతివాళ్ళూ అది నిర్ణయించుకొనే స్వతంత్ర శక్తిని సంఘం కలిగిస్తే నే బాగుంటుంది . జబ్బుల వాళ్ళని చేసి తర్వాత మందులు ఇవ్వటానికి ప్రయత్నించే కన్నా, అసలు వాళ్ళకా జబ్బులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది కదూ? ఎవరి మంచి చెడ్డలు వారు తెలుసుకోటాడాని కైనా విద్య, కావాలి, నాన్నా! ఇప్పుడు నాకు తెలిసింది."
చెల్లెలి ధోరణి శాస్త్రికి కూడా సంతోషం కలిగించింది. కామేశ్వరమ్మ సరే సరి! విస్తుబోయి బుగ్గన వేలు తియ్యకుండానే కూర్చుంది.
"సుజా నీ ఒళ్ళో నే నిద్రపోతున్నట్లుంది. లేచి పడుకోబెట్టు రాదూ?' అన్నాడు సోమయాజి.
"ఈ వాగుడంతా ఎప్పుడు నేర్చిందండీ ఇది?" అంటూ లేచి సుజాను మంచం మీద పడుకో బెట్టింది కామేశ్వరమ్మ. సోమయాజి నవ్వుతూ అన్నాడు;; "అమ్మా! పద్మా! రేపటి నుంచీ మీ అమ్మకి కాస్త చదువు చెప్పరాదూ?"
"నిజంగా చెబుతాను, నాన్నా! రేపే కొత్త పలక కొని తీసుకొస్తాను అమ్మకి" అంది సంబరంగా పద్మజ.
"చాల్లేవే -- నీ హస్యాలూ నువ్వునూ. ఆ చడువేదో నువ్వు వెలగబెడుతున్నావు, చాలదూ?" కడుపులో ఎంత సంతోషం ఉన్నా కూతుర్ని పైకి ఎప్పుడూ ఈసడిస్తూనే ఉంటుంది కామేశ్వరమ్మ.
పద్మజ ఫక్కుమంటూ నవ్వేసింది. "అమ్మకి కోపం వచ్చింది, నాన్నా!"
"అమ్మ ఎప్పుడూ అంతేగా? నీతో ఇంకా ఎవరెవరు మాట్లాడుతున్నారు రేపు?' అన్నాడు సోమయాజి.
"వాళ్ళ స్నేహితురాలు పార్వతి ఉండనే ఉందిగా?' నవ్వాడు శాస్త్రి.
"అది మాట్లాడనంది . దానికి బోలెడు సిగ్గు. ఎంత చెప్పినా వినదు. రఘుబాబు కూడా మాట్లాడతానని పెరిచ్చాడు. ఇంకా నలుగురైదుగురు మాట్లాడుతారనుకుంటాను , నాన్నా. నేను వెళ్ళి వ్యాసం వ్రాసుకుంటాను, నాన్నా!" అంటూ లేచింది పద్మజ.
"అదే మంచిదమ్మా! నీకు తోచిన విధంగా నువ్వు వ్రాసుకో. ఎవరి కాళ్ళ మీద. వాళ్ళు నిలబడటానికే ప్రయత్నించాలి."
పద్మజ చదువుకునే గదిలోకి పోయి తెల్ల కాగితం తీసుకు కూర్చుంది.
