"ఇది నిజమే నంటావా, విష్ణూ?" సద్దు మణిగాక సమయం చూసి సూటిగా అడిగాడు రాము.
తలఎత్తి చూసి నిర్లక్ష్యంగా తల దించుకొంది.
"నిన్నే, విష్ణూ! ఏం, ఇది నిజమేనా అని అడుగుతున్నాను. మాట్లాడవేం?"
రాము మొహంలోకి చూసింది తిరస్కారంగా. "నీకు చెప్పాలా వివరాలు? అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం ఆరోగ్యకరం కాదు, బావా!"
"ఏమన్నావు?" రాము పళ్ళు పటపటలాడాయి.
"ఉన్నమాటే అన్నాను."
"ఏమిటా ఉన్నమాట?" రాము రెచ్చిపోయాడు.
"నీకు సంబంధించినంతవరకూ కలుగజేసుకొంటే మంచిదే కానీ, ఇలా అనవసర విషయాల్లో నేనూ ఉన్నానని తయారవకు!"
"విష్ణూ!" రాము బాధగా అన్నాడు. "నీ కిలా మాటలు కూడా ఆ వెధవే నేర్పాడా?"
"బావా!"
"చెప్పు, విష్ణూ వాడు మంచివాడు కాదు. నిన్ను నాశనం చేస్తాను. నీ కిలా చెప్పవలసి వచ్చినందుకు నాకే విచారంగా ఉంది. నువ్వు వట్టి అమాయికంగా తప్పటడుగు వేస్తున్నావు. వాడి సంగతి కాలేజీ మొత్తానికీ తెలుసు."
"హుఁ!" నిర్లక్ష్యంగా నవ్వింది విష్ణుప్రియ. "అక్కడి కేదో నువ్వే మంచివాడివైనట్లు మాట్లాడకు, బావా, నాకు తెలుసు, నేను చేసేదేమిటో? వెనకటికి ఎవరో అన్నట్లు...అదంతా దేనికిలే? నేను వస్తా." ఇసుకలోంచి లేచి చీర కుచ్చ్లెళ్ళు దులుపుకొంది.
"నువ్వు వెళ్ళడానికి వీల్లేదు." విష్ణు చేతిని పట్టుకొన్నాడు రాము. "నువ్వు పతనం కావడం నాకు ఇష్టంలేదు, విష్ణూ బలరామ్ అంత నీచుడీ ప్రపంచంలో మరొకడు ఉండడు. నిన్ను నలిపి నాశనం చేసి దిక్కు లేనిదాన్ని చేసి ఆ వెధవ....."
రాము చెంప పగిలిపోయింది. విష్ణుప్రియ పెదవులు కంపిస్తున్నాయి. "త నెటువంటి వారైనా కానివ్వు, బావా మాటిమాటికీ వెధవ అనడానికి నీకు అధికారం లేదు. జాగ్రత్త. వదులు చెయ్యి." మనిషి నిలువెల్లా వణికిపోతూంది.
మసక వెన్నెట్లో విష్ణు జారిపోతుందేమో నన్న భయంతో మరింత గట్టిగా పట్టుకొన్నాడు.
"నువ్వు వదలకపోతే అరిచి అల్లరిపాలు చేయవలసి వస్తుంది." రాము చేతుల్లోంచి విడిపోవాలని పెనుగులాడుతూంది.
"వదలను. మీ నాన్నకు ఉత్తరం వ్రాసి తక్షణం చదువు మానిపించమని చెబుతాను. నువ్విలా నాశనమై పోతోంటే నా కడుపులో ఏదో మంటగా ఉంది."
"అవును నీకు దక్కనని."
"విష్ణూ!" తెల్లబోయాడు రాము. "ఛీ! నీతో మాటలు పెంచుకోవడం నాదే తెలివితక్కువ. ఎవరి ఖర్మ వాళ్ళది. ఈ సముద్రంలో పడి చచ్చినా నా కేం బాధ లేదు." విసురుగా వదిలివేయడంతో విష్ణు ఇసుకలో పడిపోయింది. పక్కనే ఉన్న రాయి నుదుటికి తగలడంతో మంచి దెబ్బే తగిలింది. భయపడ్డాడు రాము. వెనక్కు రెండడుగులు వేసి నిమిషం ఆలోచించి ముందుకు సాగిపోయాడు.
* * *
"బీచ్ దగ్గర ఫార్స్ విన్నావుట్రా?" మెడికల్ స్టూడెంట్ మరొకడితో ఏదో అంటున్నాడు.
"నాకేం తెలియదు." రెండో విద్యార్ధి సమాధానం చెబుతున్నాడు.
"డాక్టర్ విష్ణు ప్రియా అండ్ డాక్టర్ శ్రీరామ్..." మెల్లగా తప్పుకుపోయారు రాము రావడంతో.
రాము చెవులు చిల్లులు పడుతున్నాయి. ఎక్కడ చూసినా ఇవే మాటలు. అసలు తను విష్ణుని ఆ ఉద్దేశ్యంతో ముట్టుకోనేలేదే! బాధతో రాము హృదయం ఎగిసి పడుతూంది. గదిలో ఒంటరిగా మంచంమీద పడుకొని ఆలోచిస్తున్నాడు. అన్యాయంగా నలుగురి నోళ్ళలో పడటం చిన్నతనంగా ఉంది. తలుచుకొంటున్న కొలదీ రాము గుండెల్లో దుఃఖం ఉబికి వచ్చేస్తూంది.
తండ్రి దేశాలు పట్టిపోతే తల్లి చనిపోతే కళ్ళలో వత్తులు వేసుకొని పెంచి పెద్ద చేశారు, స్వార్దాన్ని కలలో కూడా ఊహించకుండా ఎంతో డబ్బు ఖర్చు చేసి ఉన్నత విద్య చెప్పించి మంచిపేరు తీసుకురమ్మని నొక్కి చెబితే చివరికి తను చేసిన నిర్వాకం ఏమిటి? విష్ణు ఎలా ఏడిస్తే తనకెందుకూ? అసలు విష్ణుకూ తనకూ సంబంధం ఏమిటి? అనవసరంగా నిందల పాలయ్యాడు తను. రాము కళ్ళలో నీళ్ళు చెంపల మీదుగా ప్రవహించి తలగడను తడిపేస్తున్నాయి.
* * *
"ఏరా, రామా? ఇలా నువ్వే చేశావా? అమ్మకి తెలిస్తే ఎంత బాధ పడుతుందో ఆలోచించే చేశావుట్రా! పోనీ, నీకు ఇష్టమైతే నేనే ఆ రాధ దగ్గరికి వెళ్ళేవాడిని కదురా?" వేణుగోపాల్ మండిపోయే మనసును ఆర్పే శక్తిలేక ఎకాయెకి మద్రాసు బయలుదేరి వచ్చేశాడు.
రాము మాట్లాడలేదు.
"నిజమేరా నేనో పిచ్చివాణ్ణి అందుకే కొండంత ఆశలు పెట్టుకున్నాను. నా ఆశలు నేలమట్టం కావలసిందే. నాకు తగిన శాస్తి ఇలాగే జరగాలి."
"..............................."
"నిజం చెప్పు, రామా! నిన్ను నేనేమీ అవను. అనడానికి నువ్వేమైనా పసివాడివా? ఈ ఉత్తరంలో ఏముందో తెలుసా? విష్ణుప్రియను పబ్లిగ్గా బీచ్ లో బలాత్కరించి, దానికి ఇష్టం లేకపోయినా చెరిచి..."
"నాన్నా!" దెబ్బతిన్నట్లు చూశాడు రాము. అప్పటికే కళ్ళలో నీళ్ళు తిరిగి చెంపలమీద జారిపడ్డాయి.
"తన ఇష్టం వచ్చినట్లు దాన్ని నలిపి నాశనం చేశాడు నీ సుపుత్రుడు" అని వ్రాశాడు ఎవడో. వేణుగోపాల్ మొహం నల్లబడిపోయింది. విచారంతో మనసుతోబాటు శరీరంలో కూడా బలహీనత ఏర్పడి పోయింది. మంచంమీద కూలబడిపోయాడు.
"నన్ను నమ్మండి, నాన్నగారూ! నేను అలాంటి వాడిని అవునో కాదో తెలియదూ?"
వేణుగోపాల్ మొహం దించేసుకున్నాడు. "ఏమోరా, రామా! వర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో అంతా అయోమయంగా ఉంది. మిమ్మల్ని ఇంతవాళ్ళను చేస్తే నువ్విలా..."
తండ్రి మెడచుట్టూ చేయి వేసి గుండెల్లో తలదూర్చి వెక్కివెక్కి ఏడవసాగాడు చిన్న పిల్లవాడిమాదిరి. తండ్రీ కొడుకుల మధ్య నిశ్శబ్దం తాండవించింది.
కొంచెం సేపటి తరవాత కళ్ళు పైకెత్తి తండ్రి మొహంలోకి చూశాడు రాము. "చెప్పండి, నాన్నా. మీకు నామీద నమ్మకం లేదని ఒక మాట చెప్పండి." రెండు మూడు రోజులుగా రాము మనసును అశాంతి ఆవరించుకొంది. తను ఈ విషయంలోనే మధన పడుతూ, విచారిస్తూంటే పుండుమీద కారం చల్లుతూ తఃమ్ద్రి ప్రత్యక్షమై అదే విషయాన్ని అడుగుతున్నాడు.
"నీ బాధ నాకు తెలియదురా, రామా. మొన్న మొన్నటివరకూ నాకు కొడుకులుగా నా కళ్ళలో దీపం వెలిగించారని మురిసిపోయాను. ఆ కళ్ళలోనే ఇవాళ దుమ్ము పోశారంటే నా బాధ..."

తండ్రికి దూరంగా జరిగి తల దించుకొన్నాడు. "మిమ్మలి నమ్మించడం కష్టం, నాన్నా! మీరు చెప్పండి చదువు మానేసి మీతో వచ్చేయనా?"
వేణుగోపాల్ తల అడ్డంగా ఊపాడు. "వద్దు, రామూ. పరిస్థితులు అలాంటివి. నీమీద నాకు నమ్మకం ఉంది. కనకే ఇంత దూరం వచ్చాను. పోనియ్, నువ్వు బెంగ పెట్టుకోకు." కొడుకుమీద ఉన్న అనురగం ఉప్పెనలా వచ్చి మలినాన్ని కడిగివేసింది. లాయరైన వేణుగోపాల్ ఇటువంటి 'ఆకాశరామన్న' ఉత్తరాలు నమ్మడం పచ్చి అబద్ధం. కొడుకు హృదయాన్నీ పరిస్థితుల్నీ అవగాహన చేసుకోవాలనే స్వయంగా బయలుదేరి వచ్చాడు. రాము ఎంత అమాయికుడో తనకు తెలియనిదా? పిల్లలమీద వ్యామోహంలో దుర్మార్గులుగా తయారు చేయడం వేణుగోపాల్ కు సుతరామూ ఇష్టం లేదు. అందుకే అతడు భారతికి ధైర్యం చెప్పి మరీ వచ్చాడు. అయినా రామూ, రవీ వంటి మామూలు పిల్లలకు ఇటువంటి అన్యాయపు పనులు ఇటు సంప్రదాయమైనా నేర్పాలి, అటు స్వతహాగానైనా అబ్బాలి. రెండూ కాకపోతే సహవాసదోషమైనా ఉండాలి. ఇటువంటి పిల్లలు మగపిల్లల్లో ఆడపిల్లలుగా వ్యక్తిత్వాన్నీ, శీలాన్నీ నిలుపుకొంటారంటే అతిశయోక్తి కాదు. అలవాటు ప్రకారం రామును మనసారా కౌగలించుకొని ఆ రోజే ప్రయాణమై వెళ్ళిపోయాడు వేణుగోపాల్.
* * *
క్లబ్బునుంచి రాగానే భారత్కు ఉత్తరం అందించింది. కాఫీ కప్పును అందుకొని కవరు చింపి అక్షరాల బారుల వెంట పరుగు తీయించాడు దృష్టిని. చదివి డ్రాయర్ మీద విసురుగా పడేసి లేచి నిలబడ్డాడు వేణుగోపాల్.
"ఎవరు వ్రాశారు?" అనే అలవాటు భారతికి మొదటినుంచీ లేదు.
హాల్లో కూర్చొని స్వెట్టర్ అల్లుతూంది భారతి. పేపర్ చదువుతూ వివరంగా చెప్పాడు వేణుగోపాల్.
"రాధకి ఒంట్లో బాగా లేదట. నాకోసం కలవరిస్తూందట. బావ రాశాడు. ఎంత ప్రేమో చూడు!"
భారతి కళ్ళెత్తి చురుగ్గా చూసింది.
ఎంత దాచుకున్నా అతని గొంతులో హేళన కనిపిస్తూనే ఉంది. మొహంలో విచారరేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారతి భర్తను నిలువెల్లా పరీక్షిస్తూంది. పదిహేనేళ్ళ గూడు కట్టుకొన్న విరోధం ఉందో లేదో తెలియదు కానీ, అంతు తెలియని ఆరాటం దహించివేస్తూంది.
"పట్టుదలలు అంత మంచివి కావు. వెళ్ళిరండి. మంచంమీద రాధ 'అన్నయ్యా!' అంటూ ఏడుస్తుంది. నన్ను నిలదీసి అడుగుతుంది, 'వదినా, అన్నయ్య నెందుకు పంపలే'దని మీతో నేనుకూడా వస్తాను." భర్త మొహం లోకి చూసింది భారతి.
"ఇదొక ఎత్తు ఎందుకు కాకూడదు?" వేణుగోపాల్ లో అనుమానం బయలుదేరింది.
తెల్లబోయి చూసింది భారతి. "ఛ! మీరు న్యాయా న్యాయాలే తప్ప మరొక దృష్టితో ఆలోచించరు. మీ చెల్లెలు ఎలా ఉందోననే ఆదుర్దా మీకు లేదూ? ఆనాడు రక్తసంబంధం అన్నారే...
"మీకు లేకపోయినా నేను ఉండి ప్రయోజనం లేదనిపించుకోను. బట్టలు సర్దడం అంత కష్టం కాదు. వెళ్ళి వద్దాం. రాధను క్షమించవలసిన బాధ్యత అన్నగా ఎంతైనా మీమీద ఉంది.
"రాధకు మాత్రం ఎవరున్నారు? ఆవేశంలో అనేసింది కానీ, రాధకు తెలివి లేక కాదు. అవును. నేనూ మీ బిడ్డలూ ఏకమై మిమ్మల్ని అన్యాయం చేస్తామేమో అని రాధ అనుకోవడంలో తప్పేముంది?
"మీరే కాదు, ఆవిడను నేనూ అపార్ధం చేసుకొన్నాను. స్వంత చెల్లెలుగా సలహా ఇవ్వడంలో కాస్త తొందర పడ్డది. పదండి, వెడదాం."
"వద్దులే, భారతీ! నువ్వనుకొన్నంత కఠిణున్ని కాను నేను. నా చెల్లెల్ని బాధ పెడితే ఏడు తరాల మన వంశం కన్నీరు కారుస్తుందని మా అమ్మ ఎప్పుడో అంది. కానీ, నేను మరిచిపోయాను. చిన్నప్పుడు నా వీపుమీద 'గుర్రం' ఆడిన రాదను, పెరిగి పెద్దదై కాలేజీకి నా వెనకాల మోటార్ సైకిల్ మీద కూర్చొని వచ్చిన నా చెల్లెల్ని పూర్తిగా అర్ధం చేసుకోలేకపోయాను. ఇద్దరం పొరపాటు చేశాం. అందుకే..." వేణుగోపాల్ గొంతులో మాటలు పెగిలి రాలేదు.
"రాదు ఏమీ కాదు. నవ్వుతూ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. నా మాట అబద్ధం కాదు, చూడండి." భర్త భుజం మీద చేయి వేసి ఓదార్చింది భారతి.
"భారతీ! రాధను కొన్నాళ్ళు మన దగ్గర అట్టే పెట్టుకొందాం. నేను వెళ్ళి తీసుకువస్తాను. నువ్వు కూడా దేనికీ? నువ్వు వస్తే ఇంటికి తాళం వేయాలి. మనం ఇక ఇంటికి తాళం వేయకూడదు." హడావిడిగా వేణుగోపాల్ బట్టలు సర్దుకొన్నాడు.
* * *
"అన్నయ్యా!" అంటూ వచ్చి గట్టిగా కౌగిలించుకొంది రాధ.
కుడిచేతిని చేతిలోకి తీసుకుని గాజుల్ని తడుముతూ "ఎంత చిక్కిపోయావమ్మా, రాధా! ఇంకా అలిగే ఉన్నావా అన్నయ్యమీద? అప్పుడే ఎందుకు వ్రాయలేదు? నేను లే ననుకొన్నావా?" అన్నాడు.
రాధ సున్నితంగా అన్నగారి నోటిని చేత్తో మూసేసింది. "నన్నిలా కాసేపు ఉండనీ యన్నయ్యా. నీకు దూరంగా పదిహేనేళ్ళు గడిచిపోయాయి. నేను చేసింది పొరపాటే. పిల్లలు వృద్ధిలోకి వచ్చాక ఇలా అంటున్నానని అనుకొంటున్నావా, అన్నయ్యా?" రాధ వేణుగోపాల్ గుండెమీద తల ఆన్చించి.
"అలాగని నే నన్నానా అమ్మా, రాధా?" వేణుగోపాల్ మౌనం వహించాడు.
భోజనాల దగ్గర రాధభర్త, వేణుగోపాల్ చాలాసేపు ఎన్నో విషయాలు మాట్లాడుతూ పూర్తిగా ప్రపంచాన్ని మరిచిపోయారు.
"వదిన బాగున్నదా, అన్నయ్యా?" రాధ అడిగింది. చెల్లెలి గొంతు ఇద్దరి సంభాషణా తెంపేసింది.
"ఆఁ బాగానే ఉంది. అసలు అదికూడా వస్తానంది. కానీ నేనే వద్ధన్నాను."
"వదిన ఒక్కతి వస్తే మా ఆస్తి తరిగిపోతుందనుకొన్నావా?" నిష్టూరమాడింది రాధ.
"లేదమ్మా. ఇల్లు ఎవరు చూస్తారు? అదీగాక రామూ, రవీ హఠాత్తుగా రావచ్చు. అప్పుడు ఇల్లు తాళం పెడితే ఏం బాగుంటుంది చెప్పు?" వేణుగోపాల్ కళ్ళల్లో పిల్లల పేరు గర్వంగా ప్రతిఫలిస్తూంది.
కంచంలో చేతిని కడుక్కుంటూ అన్నాడు: "పెద్ద వాడు మెడిసిన్ చదువుతున్నాడు. రెండోవాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు."
"అవునట. విష్ణు చెప్పింది" అని భర్తవైపు చూసింది రాధ.
* * *
రెండుమూడు రోజులు దొర్లిపోయాయి. వేణు గోపాల్ ప్రయాణం కట్టాడు. రాధ అన్నగారి పక్కగా వచ్చి కన్నీళ్ళు తుడుచుకొంటూ అంది: "చూడన్నయ్యా! తెలిసి తెలియని రోజుల్లో పిల్లల్ని ఏదో అన్నాను అందుకు బాధ పడుతూనే ఉన్నాను. నన్ను క్షమించు."
