మొగలి పొదలు
గంటి వెంకట రమణ

ఫెళ్ళు మంటూ నిలువెత్తు వృక్షాలు కూకటి వ్రేళ్ళ తో సహా నేల కూలుతున్నాయి. ఆకాశం పూర్తిగా కాటుక కొండలా వుంది.
ప్రకృతి విలయ తాండవం చేస్తుంటే పెనుగాలి కి అక్కడక్కడ గుడిసెల మీద కప్పులు కాగితం ముక్కల్లా ఎగిరి పోతున్నాయి. సంధ్య వెలుతురు కనిపించ నీయకుండా ముంచుకు వస్తున్నాయి మేఘాలు.
ఈదురు గాలి నరనరాల్లోంచి వ్యాపించి మనిషిని గడ్డ కట్టించేస్తోంది దూరాన మేడల మీద కరెంటు దీపాలు ఆరిపోయాయి. వీధి పూర్తిగా చీకటి కమ్మేసింది.
గుడ్డి దీపాల వెలుగు లో ఎవరికి వారే ముడుచుకు పడుకున్నారు. గాలికి యే క్షణాన వూపిరి పోతుందో అన్న భయంతో రెపరెప లాడుతోంది గూట్లో సమిదే లో వున్న ఆముదం దీపం తాలూకు వొత్తి.
శ్రీనివాస్ తల్లి మంచానికి వెనక్కి జేరగిలబడి బయట నిశీధి లోకి లోపల తల్లి మంచం మీదికీ మార్చి మార్చి చూస్తున్నాడు. అంతవరకూ బయట ప్రకృతి లో రంగులు వ్రుద్రుతంగా మారిపోతున్నాయి. మంచం మీద నిశ్చలంగా కదలలేని స్థితిలో అటు నుంచి యిటు తిరిగింది జానకి.
'అమ్మా ' అంతవరకూ బిగపట్టుకుని తల్లి కోసం యెదురు చూస్తున్న శ్రీనివాస్ గుండె ల్లోంచి మాటలు దొర్లాయి బయటికి. జానకి కళ్ళు తెరుచుకున్నాయి పూర్తిగా. మోహంలో కొత్త రకం తేజస్సు వెలిగిపోతోంది. గుండెలు యెగిసి పడుతున్నాయి. "నాన్న రాలేదూ.' జానకి చాలా నెమ్మదిగా అడిగింది.
శ్రీనివాస్ మొహం క్షణం లో చిన్న బోయింది. తల గుమ్మం వైపు కు తిప్పేసి, గొంతు సవరించుకుంటూ అన్నాడు 'లేదమ్మా' అని.
"రారు ఎందుకు వస్తారు? పదిమంది పిల్లల్ని కని పనికి రాకుండా పోయిన ఈ కట్టే లో సత్తువే వుంటే తప్పకుండా వచ్చేవారు. ప్రపంచం శ్రీనివాస్. ప్రపంచం. నాకు నవ్వు వస్తోంది.' జానకి నవ్వింది చిత్రంగా శబ్దం చేస్తూ. శరీర దారుడ్యం తప్పనంత వరకూ మనల్ని దేవతలకన్న యెక్కువగా ఆరాధిస్తారు. అవిటి బ్రతుకే అయి దురదృష్టవ శాత్తు మన చుట్టూ బాధలు చుట్టుకుని యిలా కధ అర్ధాంతరంగా ఆగిపోతే మన గురించి యెవరూ పట్టించుకోరోయ్.'
"నువ్వు వూరు కోఅమ్మా. నీకు రెస్టు కావాలని డాక్టరు చాలాసార్లు చెప్పాడు. నువ్వు తెలివి వచ్చినప్పుడల్లా యిలా అంటూ వుంటే మందులు వంట బట్టవు."
జానకి చటుక్కున శ్రీనివాస్ చేతిని గుండెల మీదికి తీసుకుని కొద్దిగా బలంగా లాగి ఆ గుండెల్లో యిముడ్చు కునేందుకు ప్రయత్నం చేసింది. తల్లి రొమ్ము ల్లోంచి వెచ్చని ఆవిరి లాంటి గాలి మొహాన్ని కప్పేస్తూ ప్రేమలో ముంచేస్తుంటే అక్కడే తలను దూర్చేసి యిరవై నిండని శ్రీనివాస్ యిరవై రోజుల పాపాయి మాదిరి అయిపోయాడు. తల్లి అస్వస్థత చటుక్కున గుర్తుకు రాగానే లేచి కూర్చున్నాడు . ఆవిడ గుండెల మీద చేయి వేసి 'చెప్పమ్మా నీకు నాన్నగారిని చూడాలని ఉంది కదూ' అన్నాడు.
జానకి కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరిగాయి. ముత్యాల్లా మెరుస్తూ పచ్చని చెంపల మీద బొట్లు బొట్లుగా రాలి పడుతుంటే శ్రీనివాస్ గుండెల్ని యెవరో నలిపెస్తున్నట్లు బాధపడ్డాడు.
"అన్నట్లు చెల్లాయి ఏదమ్మా?"

"స్కూలు నుంచే రాలేదు. దేనికిరా శ్రీనివాస్? నాన్నగారి కోసం నువ్వు వెళ్లి డాన్ని కాపలా పెట్టిందుకేనా'
'అమ్మా' శ్రీనివాస్ ఆశ్చర్య పోయాడు.
'ఒద్దు ఆయన్ని బలవంతంగా రప్పించడం నాకు యిష్టం లేదురా, జరిగేది జరగకుండా ఉండదు. కాని శ్రీనివాస్ ఈ మనుషులు యెంత చిత్రంగా ప్రవర్తిస్తారని.'
'నువ్వు మాట్లాడకమ్మా. నీకు పుణ్యం వుంటుంది. నిన్ను రెస్టు తీసుకో మన్నారు నువ్వు వినడం లేదు. ఎలాగ నీతో? నువ్వు నిద్ర పోయినంత సేపూ కొట్టుకు లాడుతోంది వెధవ ప్రాణం. తీరా నువ్వు లేచాక యిలా కామా, పుల్ స్టాప్ లేకుండా మాట్లాడేస్తుంటే నిన్నెలా ఆపను నేను.'
నిరాశగా నవ్వింది జానకి: 'యింకా ఎంతో కాలం యీ శ్రమ పడాలనుకుంటున్నావేమోరా . కానీ నాకు తెలుసు, ఈ ఘడియలు యెలాంటివో. కళ్ళకి స్పష్టంగా చివరి క్షణాలు కదులుతూ కనిపిస్తుంటే యెలా మరిచి మభ్య పెట్టుకోగలను నన్ను నేను.'
'లాభంలేదు ' నిట్టూర్చాడు శ్రీనివాస్ నీకు యీ సంగతి తెలుసు కదూ!"
"ఏ సంగతీ?"
"మీ నాన్న నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు జరిగిన సంఘటనలు....'
"తెలుసునమ్మా....యిప్పుడవన్నీ యెందుకు?"
వున్నట్టుండి ఫెళ్ళున నవ్వింది జానకి. 'యిప్పుడేరా తెలుసుకునేది. అమ్మ పోయాక నీకు చెప్పేందుకు ఎవరూ వుండరు. నిజానికి స్త్రీలు చంచల చిత్తులు వొప్పు కుంటాను. కానీ పురుషుడు స్త్రీని ఎలా లొంగ దీసుకుని పాదాల కింద అణిచేస్తాడో వొక్కసారి గ్రహిస్తే నిజంగా జాలి పడవలసింది స్త్రీల మీదే.'
'........'
'అయన రారు. సరస్వతి మీద నీకు వున్న ప్రేమని నేను అర్ధం చేసుకో గలను. అయన కాదు ఎవరు రాకపోయినా' నిశ్చింతగా పోగలను. డాన్ని మాత్రం....' వుండ బట్టలేని జానకి ఘోల్లున యేడ్చేసింది మాటని మధ్యలోనే త్రుంచేసి.
"ఎందుకమ్మా , ఇప్పుడెం జరిగిందని?"
"పదిమందిని కన్నా రెండు కళ్ళల్లా మీరే మిగిలారు. ఆ బాధకి తోడు మీ నాన్న నన్ను పూర్తిగా వదిలేయడం యిదెం న్యాయం? స్త్రీ కి తృప్తి యెప్పుడో నీకు యిప్పుడు యిలా చెప్పవలసి వస్తుందను కోలేదు. నీకు యేవేవో చెప్పాలని వుంది. నువ్వు వింటావా శ్రీనివాస్....'
'చెప్పమ్మా.'
'గుండెల్లో దాగే బాధలు వొక్కసారి పోతాయి, యెప్పుడో తెలుసా మరో ప్రాణికి పంచి పెట్టినప్పుడు. యీ రాత్రి అయన వొళ్ళో నిద్ర పోవాలని, ఆ కౌగిలి లో కరిగి పోవాలనీ వుందిరా శ్రీనివాస్. చావు బ్రతుకుల మధ్య కొట్టుకు పోతున్న నా దగ్గరికి అయన రారు. ఆ స్వర్గ సుఖం ముందు....' జానకి అంతకంత కు రోప్పుతోంది ఆయాసంగా! 'నేను చచ్చి పోయేందుకు'' జానకి తలఉన్నట్టుండి వొక్కసారి ఎగిరి పడింది శ్రీనివాస్ ని అదర గొడుతూ.
"అమ్మా! అమ్మా!' శ్రీనివాస్ గొంతు చించుకుని అరిచినా వినిపించుకోలేదు. వర్షం చిల్లులు చేస్తోంది ఆకాశాన్ని. అయిపొయింది గూట్లో కొట్టుకు లాడుతున్న సమిధ ఆరిపోయెందుకు అట్టే వ్యవధి అవసరం లేకుండా , తెరుచుకున్న తలుపుల మధ్య నిశ్చేష్టు రాలై నిలబడిపోయింది . వర్షానికి తడిసి ముద్ద అయిపోయిన సరస్వతి.
శ్రీనివాస్ ఏడుపు హృదయాన్ని ముక్కలు చేస్తోంది! 'అమ్మా నాన్నగారు నీకు కావాలన్నావు. నేను తీసుకు రాకుండానే ' శ్రీనివాస్ తలెత్తాడు. సరస్వతీ చూస్తుండు' అతని పరుగుతో బాటు మాటలు కూడా వెళ్ళిపోయాయి గాలిలోకి చొచ్చుకు పోతూ.
సరస్వతి యేడుస్తోంది తల్లి తల గట్టున కూర్చుని 'అమ్మా నేను వచ్చేశా నమ్మా-- వొక్కసారి కళ్ళు తేరు.'
జానకి గుండెల మీద నిశ్చింతగా వున్నాయి చేతులు.
మాసిపోయిన పరికిణి కి చేతులు తుడుచుకుంటుంటే నల్లని మరకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పొట్ట గడవడమే కష్టమై పోతుంటే అందం చెక్కు చెదరక పోయినా, ఆత్మాభిమానం అడ్డం వచ్చినా, బ్రతుకు తెరువు కోసం, శ్రీనివాస్ రాత్రిళ్ళు రిక్షా లాగడం రెండో కంటి వాడికి తెలియనీయక పొతే, సరస్వతీ ఇరుగుపొరుగు యిళ్ళల్లో చిన్న చిన్న పనులు చేయడం తెలియ నివ్వలేదు. శ్రీనివాస్ చేతులు కదుములు కట్టి పోయాయి. సరస్వతి అరచేతులు అవికాయలతో నిండి పోయాయి. ఆ పిల్లే తల్లికి మందులు తెచ్చేది చాటుగా. శ్రీనివాస్ అదే పని చేసేవాడు. ఋణం తీరక ముందే తల్లి వెళ్ళిపోయింది. పోగొట్టుకున్న తల్లిని చూస్తూ బావురుమంది సరస్వతి. తండ్రి అంతే సరస్వతి కి వొకటే గుర్తు వుంది . బాగా తాగేసి చిత్తుగా తిని తల్లిని మెత్తగా తన్నే కధల్లో రాక్షసుడని, అటువంటి రాక్షసుడు జానకి ని యెలా ప్రేమించాడో అర్ధం కాదు శ్రీనివాస్ కి.
"జానకీ' వస్తూనే మంచం మీద పడి వున్న శవాన్ని గోపాలం వాటేసుకుని బావురు మన్నాడు. పిల్లలిద్దరూ ఆశ్చర్య పోయారు.
"జానకీ నన్ను క్షమించు నేను నిన్ను పోగొట్టు కుంటా ననుకోలేదోయ్. నన్నెందుకు యిలా చేశావు. నన్ను నమ్మవు. అందుకే యింత శిక్ష విధించి వోక్కదానివే పారిపోయావు. ఆ రోజున మీ యింట్లోంచి వోక్కడి నీ బయటికి వచ్చేస్తుంటే తోడుగా వచ్చావు. యివాళ నా తోడూ లేకుండా ఎలా వెళ్ళిపోయావు? ' గోపాలం ఏడుస్తుంటే నాటకం చూస్తున్నట్టుగా వుంది పిల్లలిద్దరికీ.
"అన్నయ్యా' అంటూ సరస్వతి కౌగలించుకుంది శ్రీనివాస్ ని. అన్నా చెల్లెళ్లిద్దరూ కూర్చుండి పోయారు , వోదార్చేందుకు కానే బాధ పంచు కునేందుకు గాని, మరో వ్యక్తీ లేదు ఆ యింట్లో. గోపాలం నిట్టుర్పులతో వెచ్చగా మారిపోయింది గది. అన్నా చెల్లెళ్ళుఇద్దరూ శవం మీద పడి యేడుస్తున్నారు. గోపాలం ఆ యింటి కి అతిధి గానే వున్నాడు. అతన్ని గురించి ఆలోచించేందుకు శ్రీనివాస్ బిడియ పడుతున్నాడు. తండ్రి అనే పదానికి పదేళ్ళ క్రితం తెలిసిన అర్ధం వట్టి మమత అని-- కానీ యీ పదేళ్ళ లో తండ్రి అంటేనే అర్ధం మారిపోయి ఆ స్థానం లో మరో రూపం వికృతంగా నృత్యం చేస్తోంది. గోపాలం యేడుస్తున్నాడు . జీవితంలో జానకి యేమీ సుఖపడలేదు.
"నిన్ను నలిపి నాశం చేశానని లోకం అంటుంది జానకి ఏం చేయను? ఈ దారిద్ర్య బాధ అనుభవించడం నా తరం కాలేదు. ఐశ్వర్యంతో , తుల తూగాలని లేకపోయినా వున్నంత లో హాయిగా బ్రతకాలను కునే నిన్నేదో సుఖ పెట్టాలనే ఉద్దేశ్యంతో నే యిక్కడికి తీసుకు వచ్చాను. నీకు గుర్తుందా జానకి, నువ్వు శ్రీనివాస్ ని మూడు నెలల గర్బిణీ గా వున్నప్పుడు....' గోపాలం కళ్ళు అగ్ని శిఖల్లా మారిపోయాయి . అతని కళ్ళ ముందు గతం చిందులు త్రొక్కు తోంది.
