Previous Page Next Page 
చదరంగం పేజి 8

                                  
    రవి నవ్వాడు. "నాకు నవ్వొస్తోందిరా, అన్నయ్యా మొదటినుంచీ నువ్వంతే. నీకు ధైర్యం లేదు. విష్ణు పరాయిది కాదు. అత్తయ్య కూతురు. అది నీ చుట్టూ తిరిగినా అర్ధం ఉంది. నువ్వు దానికి ఆశ పెడుతున్నావు."
    "నేనా!" అదిరిపడ్డాడు రాము. "నేను అలాంటి వాడివిట్రా, రవీ! నేను నా చుట్టూ తిప్పుకొని ఆశపెట్టి మోసం చేసేవాడినా? చెప్పరా, తమ్ముడూ. నేను...నేను అలాంటి వాడినా?"
    "ఖంగారెందుకు, అన్నయ్యా? నిన్ను చూస్తే ఎవరైనా ఆశపడతారనే మాటకు అన్నాను. నిజంగా నిన్ను అనాలని కాదు."
    దీర్ఘంగా నిట్టూర్చాడు రాము. "చంపేశావు ఫో. భయపడిపోయాను నిజంగా. కాకినాడ ఎలా ఉందిరా?" నవ్వుతూ తమ్ముడు మొహంలోకి చూశాడు.
    రవి మాట్లాడలేదు.
    "చెప్పవేంరా?" రాము దృష్టి దూరదూరతీరాలకు పోతూంది. హుస్సేన్ సాగర్ కు అవతలి గట్టున రైలు మెలికలు తిరుగుతూ సాగిపోతూంది. నౌబత్ పహాడ్ మీద నిల్చుని ఇద్దరూ తదేకంగా రోడ్లనూ మనుషుల్నీ మార్చి మార్చి చూడసాగారు.
    "కాకినాడ విశేషాలేమిటంటే మాట్లాడవేంరా, తమ్ముడూ?" రాము వదిలిపెట్టలేదు.
    "నేనున్నా గది ఒక రిటైర్డ్ మిల్ మానేజర్ ది. వైదేహి వాళ్ళ అమ్మయి. రోజూ సాయంత్రం గంట సేపు ఆయన వచ్చి మాట్లాడి వెడుతూ ఉంటారు. భార్య పోయింది. కాలేజీకి వెళ్ళడం, రావడం-ఇంతకు మించి విశేషాలేం లేవన్నయ్యా."
    "ఓహో! ..... అయితే అమ్మాయి కూడా ఉందన్న మాట!" రాము వేళాకోళం ఆడాడు.
    "ఒట్టురా, అన్నయ్యా నాకేం తెలీదు అసలు నేను విసుక్కున్నావినిపించుకునేదికాదు. మొన్న వచ్చేముందు ఖచ్చితంగా చెప్పి వచ్చాను కూడా!"
    "ఏమనేమిటి?"
    "నా కిక టిఫిన్ కాఫీలు వద్దనీ, నన్ను విసిగించ వద్దనీ."
    "ఛట్! అంతేకాదు. 'నువ్వంటే మహా ఇష్టం. నాన్నగారితో చెప్పివస్తాను' అని ఉంటావు." రాము నవ్వాడు.
    రవి మాట్లాడలేదు. ఆలోచిస్తూ ఉండి పోయాడు.
    "కోపం వచ్చేసిందేమిట్రా, రవీ. ఊరికే అన్నాను. ఏమీ అనుకోకు." తమ్ముడి భుజం మీద అనునయంగా చేతులువేసి తనవైపు తిప్పుకొన్నాడు. "నేనేమన్నాను, తమ్ముడూ! పెళ్ళి చేసుకోవడంలో తప్పేముంది? ప్రేమించి ఎంతమంది పెళ్ళి చేసుకోవడం లేదు? నువ్వెందు కిలా అయిపోయావు? నా మనసు నీకు తెలీదూ? జయే ఉంటే......" హఠాత్తుగా ఆగిపోయాడు.
    "లే దన్నయ్యా. అందుకు కాదు. మనం...మనం..."
    "ఊఁ మనం?"
    "అమ్మకు విరోధులం అవుతున్నామా?" అమాయకంగా అడిగాడు.
    "ఎందుకలా అనుకొంటున్నావు? అమ్మే ఏమైనా అన్నదా?"
    'లే' దన్నట్లు తల ఊపాడు రవి.
    "పోన్లే, రవీ! అమ్మ విషయం అయితే అమ్మకు మనం అంటే ప్రాణం. ఆవిడ బాధేమిటో మనకు అర్ధంకాదు. నేనూ చూశాను, మొన్నరాత్రి బావి దగ్గర కూర్చొని ఏడుస్తోంది. నాన్నగారు క్లబ్ నుంచి రాలేధప్పటికి. ఎంత అడిగినా చెప్పదు. 'నాయనా, రామూ!' అంటుందే కానీ ఏమీ మాట్లాడదు." రాము మొహంలో విచారం గూడు కట్టుకొంది.
    "ఆవిడో చిత్రమైన మనిషి. నాన్నగారు కూడా ఈమధ్య ఉత్సాహంగా ఉండటం లేదు." అన్నదమ్ములిద్దరూ చేతులు పట్టుకొని కొండ దిగి, పబ్లిక్ గార్డెన్స్ వైపు తిరిగారు.
            
                               *    *    *

    సెలవులు చకచకా గడిచిపోయాయి. జయ విషయంలో రవికూడా ఎంతో బాధ పడ్డాడు. రామూ, రవీ చీలిపోయారు. "ఇక ఈ సంవత్సరం గట్టెక్కితే మీ దారులు మీకు తెలుస్తాయి. ఉత్తరాలు రాస్తూ ఉండండి. మేము కూడా పెద్దవాళ్ళం అయ్యాం." చాటుగా కన్నీళ్ళు తుడుచుకొన్నాడు వేణుగోపాల్.
    భారతి నిర్వేదావస్థలో ఉండిపోయింది. పిల్లలు ఇద్దర్నీ తదేకంగా చూడటం తప్ప మాట్లాడలేక పోతూంది. "అమ్మా, మరి వస్తాం. నాన్నగారూ, వెళ్ళొస్తాం." వంగి నమస్కారం చేశారు.
    నడ్డి విరిగే బరువు మోయలేక ఎక్కడైనా కూలి పోతుందా అనిపించేట్లుందా రైలు. బాధగా కేకవేస్తూ రామునూ, రవినీ దూరంగా చెరో మూలకూ తీసుకుపోతూంది. పిల్లల్ని పంపి భార్య భుజం మీద చేయి వేశాడు వేణుగోపాల్. భారతి ఆ ఆసరాతోటే నడిచి స్టేషన్ బయటికి వచ్చింది.
    ఎవరైనా సరే ఎప్పుడో చేసిన పనికీ ఎప్పుడైనా బాధ పడటం సహజం కావచ్చు. తప్పు చేసినవాళ్ళను క్షమించి వదిలివేయడం కాదు. 'జరిగింది జరిగిందిలే' అని సరిపెట్టుకొన్నట్లు చెప్పి తీరాలి. రెండు మనస్సుల్లో ఉన్న అభిప్రాయం తెలియనప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. రకరకాల బాధల్లో 'కాన్సర్' వంటి బాధలు లేకపోలేదు.
    
                                                  *    *    *

    గేటు దగ్గరికి వచ్చి ఆగిపోయాడు రవి. గుప్పెడునిండిన తాళం చెవులు అందుకొని గోపీవంక ప్రశ్నార్ధకంగా చూశాడు.
    "ఆళ్ళిమ్మన్నారు, బాబయ్యా!"
    "ఏరా గోపీ, రామకృష్ణా వాళ్ళూ ఏరీ?"
    "ఆరా, బాబయ్యా?" గోపీ మొహం కారు మేఘాలను నింపుకొంది.
    "అవున్రా, వాళ్ళే రామకృష్ణా, అమ్మాయిగారూ, పెదబాబుగారూ."
    గోపీ ఏడుపు ప్రారంభించాడు. "మీరటెళ్ళారా, బాబయ్యా. అప్పుడేమైందకొన్నారు?" కాస్సేపాగి రవి మొహంలోకి తేరపారి చూశాడు. "మీకు తెల్దా, బాబయ్యా?"
    తల తిప్పాడు రవి. "ఏమైందిరా?"
    "అది కాదండీ. ఆ రాతిరేమయిందనుకొన్నారు? అమ్మాయిగారేమో కాలేజీనించి వచ్చారా. పుస్తకాలేమో నాకే ఇచ్చారండి. తలనొప్పి అంటూ పడుకొన్నారండి. మీరెళ్ళినకాన్నుంచి ఏడుస్తూనే ఉండారు, బాబయ్యా."
    "ఏమిట్రా నువ్వనేది?" రవి నొసలు చిట్లించాడు.
    "ఆ తరవాతేమైందనుకొన్నారు?"
    "చెప్పేదేదో తొందరగా చెప్పి ఏడు." విసుక్కున్నాడు రవి.
    "అమ్మాయిగారిని రాతిరికి రాతిరే రాజమండ్రి తీసుకెళ్ళిపోయారు. అమ్మాయిగారికి ప్రాణంమీదికి వచ్చేసింది కదండీ?"
    రవి సూట్ కేస్ ధన్ మని శబ్దం చేస్తూ కింద పడింది. వైదేహిని తనే తిట్టి పంపేశాడు నిర్దయగా.    గోపీ సూట్ కేస్ తీసుకొని తాళంతీసి లోపల పెట్టాడు.
    మంచంమీద కూలబడి ఆలోచనల్తో కొట్టుకు పోతున్నాడు రవి. 'ముందు చూసుకొని నడుస్తే మంచిది కదురా, తమ్ముడూ?' వైదేహి మాటలు ఈవేళ కొత్తగా అపురూపంగా ఉన్నాయి. వినాలని మనసు వేధిస్తూంది. తనే అన్యాయం చేశాడు. అసలా పిల్లను అర్ధం చేసుకోవాలని ఏనాడైనా ప్రయత్నించాడా? అయినా ఆ పిల్ల ఎన్నిసార్లు తను లేనప్పుడు గదిలోకి వచ్చేది. షెల్ఫ్ పూర్తిగా సర్దేది. అనవసరమైనవి తీసేసి అవసరమైనవే ఉంచేది. ఎప్పటికప్పుడు పుస్తకాలు సిద్ధంగా ఉంచేది. చూసీచూడనట్టు అన్నీ భరించి చివరికి కసిరికొట్టాడు. గర్వంగా ప్రవర్తించాడు. ఫలితం ఇప్పుడు ఏమౌతుందో? పొద్దున్నా, సాయంతరం టిఫిన్, కాఫీ తెచ్చి ఇచ్చేది. తమ్ముడితో కలిసి వేళాకోళం చేస్తున్నదనీ విరుచుకు పడ్డాడు. రోజూ కనిపించే ఆ అల్లరిపిల్ల ఇక మళ్ళీ కనిపించదనే ఊహ రవి మనసులో బయలుదేరి భయపెట్టడం మొదలు పెట్టింది. తనకు ఇప్పుడు ఎవరు చెబుతారు?
    మెల్లగా మంచం దిగి బావిలో నీళ్ళు నెత్తిన కుమ్మరించుకొన్నాడు. అలసటంతా పటాపంచలైపోయింది. తువ్వాలు తీసుకొని అద్దం ముందు నిలబడ్డాడు. అద్దంలో ప్రతిబింబం రవిని హేళన చేస్తూంది. 'అవున్రా, రవీ. ప్రేమించి పెళ్ళి చేసుకోవడంలో తప్పేముంది?' రాము కంఠం దూరంగా మనసులో ఘోష పెడుతూంది. క్రాపు దువ్వుకుంటూ హఠాత్తుగా దృష్టికి దూరంగా ఉన్న కవరు మీదకు పోనిచ్చాడు. పదిహేను రోజులక్రితం పోస్టు చేయబడ్డ ముద్రలు ఉన్నాయి దానిమీద. ఆదుర్దాగా చింపాడు.
    "శ్రీ రవిగారికి,
    నమస్కారాలు. మీరు వెళ్ళిపోయారు, కనీసం అడ్రసైనా ఇవ్వకుండా. నాకు చిన్నప్పటినుంచీ అందర్నీ వేళాకోళం చేయడం అలవాటు. అమ్మ పోయినందుకు నాన్నగారు ఇలా పెంచారు మమ్మల్ని. ఏ దురుద్దేశ్యంతో కూడా మిమ్మల్ని అనలేదు. ఆ విధంగా మీ స్నేహాన్ని పెంచుకోవాలని. ఇందుకు కారణం కూడా లేకపోలేదు.
    నాన్నగారు వీలు చూచుకొని మీతో అన్ని విషయాలూ సంప్రదించి మీ నాన్నగారితో మాట్లాడతానని మొదట్లోనే అన్నారు. మీతో వివాహం నావంటి ఏ స్త్రీకి ఇష్టం ఉండదు? అతిగా ప్రవర్తించి మిమ్మల్ని దూరం చేసుకొన్నాననుకొంటాను. ఇప్పుడు నాకు టైఫాయిడ్. మిమ్మల్ని చూడాలని ఉంది. రమ్మని వ్రాయలేను కానీ నామీద కోపం తగ్గించి నన్ను క్షమించండి. నా అదృష్టానికి మీరిచ్చే సమాదానం అంటూ ఉంటే నాళంవారి సత్రవుకు రండి.
                                                                                         ప్రేమతో
                                                                                          వైదేహి."
    వాలు కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకొన్నాడు. నుదుటిమీద చేయి వేసుకొని ఆలోచించసాగాడు. 'అనవసర విషయాల్లో జోక్యం చేసుకొని చదువు పాడు చేసుకోకు.' మనసు బాగా హెచ్చరిస్తూంది. 'లేదు రవీ. నీ స్నేహం కోరి అమాయకంగా అంత అవస్థలో ఉత్తరం వ్రాసింది. వెళ్ళి ఒకసారి చూసిరా.' ఏదో అంతర్గత శక్తి బలవంతం చేస్తూంది. రవి మనసును గట్టిగా అదిమేశాడు. నిజమే, వైదేహి మీద మమకారంతోనే తను విరోధం నటించేవాడు. చక్రాల్లాంటి కళ్ళతో వైదేహి ప్రతిమ రవి మనసులో కదిలింది. ఆ కళ్ళతోనే ఎన్నో సందేశాలు పంపేది. కానీ అందుకొనే తెలివి తనకు లేదు.
    కుర్చీలోంచి హడావిడిగా లేచాడు. టైము ఆరు దాటిపోయింది. ఇక ఈ రాత్రికి రాజమండ్రి వెళ్ళలేడు. పుస్తకాల షెల్ఫు దగ్గరికి వెళ్ళి ఎంతోసేపు నిలబడ్డాడు. మనసంతా మర్నాటికోసం నిరీక్షిస్తూంది. మెదడు పని చేయడం మానేసింది. భోజనమైనా చేయకుండా నిద్రలో మునిగిపోయాడు రవి.
    
                               *    *    *

    ఉప్పుసముద్రం దాటి బొబ్బర్లంక మీదుగా రాజమండ్రీ చేరుకొన్నాడంటే రవి ఎంత శ్రమ పడ్డాడో అంతులేనిది. మనసు ఆరాట పడుతూంది. ఎంతమంది తమ ఇష్టాల్ని బట్టి చేసుకోవడంలేదు? తను మాత్రం మామూలు మనిషి కాదూ? తను ఎవరికీ ఎందులోనూ తీసిపోడు.
    స్త్రీ తనకై వలచివస్తే చులకన చేసి పంపించే మగవాడు కాదు. వైదేహిని మురిపించే లోకాలకు తీసుకు పోవాలి.
    రిక్షా ఆపి లోపలికి దారి తీశాడు. "ఎవరండీ లోపల?" తలుపు కొట్టి ఆగిపోయాడు. తలుపు తెరిచి నవ్వి, "లోపలికి రండి" అంటూ ఆహ్వానించాడు అతను. కొంచెం ఆగి కుర్చీవేసి కూర్చోమని, "నువ్వు వస్తే ఈ కవరు ఇవ్వమన్నారు" అన్నాడు. ఇతడే ఇంటి యజమాని కావచ్చు. లావుగా, పొట్టిగా ఉన్నాడు. ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడేస్తున్నాడు.
    రవి కవరు అందుకొన్నాడు. "ఇంకేం చెప్పలేదాండీ?"
    "లేదోయ్. వాళ్ళు ఈదరపల్లి వెళ్ళిపోయారు."
    "వాళ్ళంటే ఎవరెవరు?" రవి మనసు ఆదుర్దాపెట్టింది.
    "తండ్రీ కొడుకే......"
    "అయితే వాళ్ళమ్మాయి వైదేహి?"
    అతను రవివైపు దృష్టిని సారించి నఖశిఖపర్యంతం పరీక్షిస్తూ, "మీరిద్దరూ క్లాస్ మేట్సా?" అని అడిగాడు.
    తల తిప్పాడు రవి.
    "సారీ, బాబూ. ఆ అమ్మాయి కాకినాడనుంచి రాగానే రెండు వారాలు తిరక్కుండా పోయింది."
    రవి నెత్తిన పిడుగు పడింది. కొంచెంసేపు ఆగి నీరసంగా, "నేను వెళ్ళొస్తానండి" అన్నాడు.
    "భోజనం చేసి వెళ్ళవోయ్."
    "థాంక్స్. వద్దండి. నేను వెళ్లిపోవాలి."
    వేధించే మనసును ఓదారుస్తూ రిక్షాలోనే కవరు చింపాడు.
    "నా రవీ,
    నమస్తే దీనికెంత ధైర్యం అని మీరు కళ్ళు చిట్లించి కనుబొమలు ముడి వేసుకొంటారు. దగ్గర్లో లేను కనక 'ఛీ, ఫో' అనడానికి వీల్లేదు. ఏమైనా, రవీ, మీరు మా ఇంట్లో దిగినరోజునుంచీ మిమ్మల్ని నా దగ్గిర ఉంచుకొంటే? అనిపించింది. సాహసం చేస్తున్నాననుకొంటున్నారా? ఈ ఉత్తరం కసిగా నాన్నగారికి చూపించినా నాకేం భయంలేదు. మీ ఉంగరాల జుట్టుతో ఆడుకోవాలనుంది. అయినా ఏం లాభం? ఈ జ్వరంలో నాకు సంధి కూడా వస్తూందట. కృష్ణతో నాన్నగారు అంటూంటే విన్నాను. ఈ ఉత్తరం సంధిలోనే వ్రాశాను.
    నేను చచ్చిపోతే నా రవి నెవరో తీసుకుపోతారు. నాకు ఏడుపు కూడా వస్తూంది.
                                                                                               వైదేహి."
    "వైదేహి!" రవి కళ్ళనుండి నీళ్ళురాలి కాగితం మీద అక్షరాలను తడిపేస్తున్నాయి. పిల్లలు ఇసుకలో ఆడుకొంటున్నారు. ఎక్కడ చూసినా తీరుబడిగా కూర్చున్న పెద్ధలూ, చిన్న్లలే కనిపిస్తున్నారు. ఇసుకలో వేళ్ళతో గీతలు గీస్తూ దూరంగా సముద్రం వైపు చూస్తూ తనలో తను నవ్వుకొంటూంది. ఎంతో హుషారుగా సందడిగా ఉంది బీచ్ అంతా రెండు గంటలుగా అక్కడే కూర్చొని బలరామ్ రాకకు ఎదురుచూస్తూంది విష్ణుప్రియ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS