చిన్నగా నవ్వాడు. "నాకు తెలియదా, రాధా, నువ్వు ఈ సంగతి గ్రహిస్తావని. అందుకే రెక్కలు గట్టుకొని వచ్చాను. మీ వదిన కూడా నిన్ను చూడాలని అనుకొంది."
"ఒక సంగతి అడగనా, అన్నయ్యా?"
"ఒకటి కాదు, నీ ఇష్టం వచ్చినన్ని అడుగమ్మా."
చీరకొంగు వెలికి మడతపెడుతూ ఆగిపోయింది. క్షణం తటపటాయించి, "విష్ణుని పరాయివాళ్ళకి ఇవ్వడం నాకు బాధగా ఉన్నదన్నయ్యా. అదీ డాక్టరే. అతనూ డాక్టరే. వదిన అయితే కడుపులో దాచుకొంటుంది. చెప్పన్నయ్యా. విష్ణుని నీకు కోడలుగా చేసుకోవడం ఇష్టంలేదూ?" అంది.
ప్రయత్నపూర్వకంగా నవ్వాడు వేణుగోపాల్. "చూడమ్మా, రాధా నీకు తెలీదూ కాలం ఎలా మారిపోయిందో? ఆ కాలంలో నేను చెప్పినమాట నువ్వు విన్నావా?"
రాధ సిగ్గుతో తల దించుకొంది. అవును అతన్ని పెళ్ళి చేసుకోవాలని తను పంతం పట్టి గెలిచి ఆగర్భ శ్రీమంతులం బిడ్డ అయినా మామూలు క్లర్కుని చేసుకొంది. అన్నగారిని ఎదిరించి మరీ చేసుకొంది.
"అలాంటప్పుడు ఈ కాలపు పిల్లలు. అందులో ఎదిగిన పిల్లల మనస్తత్వం వేరుగా ఉంటుంది, రాధా. మనం చెబితే ప్రయోజనం ఎంత ఉంటుందో....." అర్ధోక్తిలో ఆగిపోయాడు.
"పోనీ, నువ్వు ఖచ్చితంగా అడగలేవా, అన్నయ్యా?" రాధ తిరిగి ప్రశ్నించింది.
"ప్లీజ్, రాధా! ఇది విను. నే నేదో పెంచి పెద్ద చేశావని నా ఋణాన్ని తీర్చుకోవాలనే అర్ధంతో నేను వాళ్ళని స్వార్ధానికి ముడి పెట్టను. ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళ తల్లితండ్రులైనా బహుశా అదే చేసే వారనుకొంటాను."
రాధ నిర్ఘాంతపోయింది. నిజమే, తన అన్నకు సూటిగా ఖచ్చితంగా మాట్లాడటం అలవాటు. రిక్షా మలుపు తిరిగేవరకూ వీధిలో నిలబడి చూస్తూనే ఉంది.
* * *
ఇంటికి వచ్చిన చాలాసేపటివరకూ మాట్లాడలేదు వేణుగోపాల్. ఒళ్ళంతా దుమ్మూ ధూళితో చీదరగా ఉంది. మనసంతా ఆందోళనగా ఉంది.
స్నానానికి నీళ్ళు తోడి భుజంమీద తువ్వాలు వేసుకొని భర్తను పిలిచింది భారతి. వంగి వీపు రుద్దుతూ "విశేషాలేమిటీ" అంది.
భార్య ఎప్పుడెప్పుడు అడుగుతుందా, ఎప్పుడెప్పుడు చెబుదామా అనుకొంటున్నాడు వేణుగోపాల్. "ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెలుసు, బారతీ. రాధ నాకంటే తెలివైంది. నన్నే 'క్రాస్' చేసింది." ఆఖరి చెంబు నెత్తిమీద కుమ్మరించుకొన్నాడు.
"అసలేం జరిగిందో చెప్పకుండా తెలివైనదంటే నాకేమీ అర్ధం కావడంలేదు." తువ్వాలు అందిస్తూ విసుక్కుంది భారతి.
"ఆనాటి బికారి వెధవలు ఇవాళ పనికి వచ్చారు. ఏమంటుందీ? తన కూతురు డాక్టరట, నా కొడుకు డాక్టరట. ముడిపెడితే కోడల్ని నువ్వు కడుపులో దాచుకొంటావట."
"రాధ అడిగినదాంట్లో నాకు తప్పేమీ కనిపించడం లేదు. మీ పిల్లలు వరస అయినవారు. విష్ణుని చేసుకోమని అడగడంలో రాధ మంచిపనే చేసింది. కానీ తెలివిగా మిమ్మల్ని మించి మాట్లాడాలని కాదు.
"మీరెప్పుడూ ఇంతే. రాదంటే మీకు గిట్టదేమో!"
"భారతీ!" ఆశ్చర్యపోయాడు వేణుగోపాల్.
"ఎందుకంత కోపం? రాధ మేనల్లుణ్ణి చేసుకొంటానని అడగడంలో స్వార్ధం ఏముందీ?"
"స్వార్ధం లేదూ? నువ్వు మనస్ఫూర్తిగా అంటున్నావా, భారతీ?"
"మనసులో ఒకమాట బైటకు ఒకమాట అనడం నాకు చేతకాదు. ఉన్నమాటే అంటున్నాను. రాము ఇక్కడకు వచ్చినప్పుడు నేనే చెప్పేస్తాను."
"బారతీ!"
"నన్ను మాట్లాడనివ్వండి. మీకు పిల్లలూ నేనూ ఇప్పటికే ఋణపడి ఉన్నాం."
"వద్దు, భారతీ మీరంతా కలిసి నా ఋణం తీర్చుకోవాలనే ప్రయత్నంలో నాకు దూరం కావద్దు. వాళ్ళని స్వేచ్చగా వదిలేద్దాం. వాళ్ళకి నచ్చిన పిల్లల్ని చేసుకోనిద్దాం."
విరక్తిగా నవ్వింది భారతి . "అవకాశాలు ఇచ్చి పిల్లల్ని మనమే చేజేతులా పాడు చేసినవాళ్ళం అవుతున్నాం. మీకు తెలియదు. అయిన సంబంధం చేసుకోవడంవల్ల ఈ రెండు కుటుంబాలూ ఎంతో స్నేహంగా విడరాని బంధంగా తయారవుతాయి. మీకు అది ఇష్టం లేదా?"
"అదికాదు, భారతీ!"
"విష్ణు అంటే రాముకి ఇష్టం ఉండి ఉంటుంది అలాగైనా మనకి మంచిది కదా?"
వేణుగోపాల్ మరి మాట్లాడలేదు. మౌనంగా భోజనం పూర్తిచేసి పడక గదిలోకి వెళ్ళిపోయాడు.
ఆ రాత్రి భర్త పక్కన మంచంమీద కూర్చుంటూ అడిగింది భారతి: "మీకు కోపం వచ్చిందా?"
వేణుగోపాల్ అప్పటికీ మాట్లాడలేదు అటుపక్కకు ఒత్తిగిల్లాడు.
భర్త నడుం చుట్టూ చేయివేసి తనవైపు తిప్పుకొంది భారతి. "మీకుకూడా కోపం వస్తుందన్నమాట." వేణుగోపాల్ కళ్ళలోకి చూసి తృప్తిగా నవ్వింది.
"మీ ఆడవాళ్ళకీ, వాడికీ ఇష్టమైతే నాదేముంది? అలాగే కానివ్వు, భారతీ! వాడిని నువ్వే కనుక్కో..."తలగడమీద ఉన్న తలను మెల్లగా భారతి ఒడిలోకి పోనిచ్చాడు.
భారతి ఆలోచిస్తూ ఉండిపోయింది. తన బిడ్డలు. భారతిని కటిక చీకటిలాంటి భ్యం ఆవరించి హృదయమంతా చుట్టేసింది. ఆ పొగ లోంచి బయటకు రావాలని విశ్వప్రయత్నం చేసి విఫలురాలైంది. కాలం నాలుగు చక్రాలు దొర్లించింది. నాలుగు సుదీర్ఘ సంవత్సరాలు ఎవరి ప్రమేయం లేకుండా రాము, రవి ఉభయుల మీద చిన్న గాయాన్ని ప్రయోగించి మరీ దొర్లాయి. కాలంతో బాటు మనుషుల్లో మమతలు పెరిగాయి. రామూ, రవీ ఇంతవాళ్ళు అంతవాళ్లై తమను తాము పరిశీలనగా చూసుకోగలిగేంతటి వాళ్లైపోయారు. ఏమైనా ఇద్దరిలో మానాని గాయం కలుక్కుమంటూనే ఉంది. రవికి ఇప్పుడు మనిషి విలువ ఏమిటో పూర్తిగా తెలుసు.

వైదేహిని తను కవ్వించాడు. ఆమాట అన్నను అన్నాడు కానీ తనే చేశాడు. నిశ్శబ్ధంగా సాగిపోయే వైదేహి జీవితంలో తను ప్రవేశించి ఆశ పెట్టాడు. ఈ విషయం తను వైదేహికీ మాట్లాడటానికైనా అవకాశం ఇచ్చాడా? తను వట్టిఫూల్. చిత్రమైన సంఘటనలు కొన్ని ఇలాగే జరుగుతూంటాయి కాబోలు.
వైదేహిని మరిచిపోవాలనే ప్రయత్నంలో పుస్తకాలతో కాలం దొర్లించాడు. పరీక్షలు పూర్తి అయిపోయాయి.
రవి బొబ్బర్లంకలో బస్సు ఎక్కాడు. "రైట్, రైట్!" కండక్టర్ అరుస్తున్నాడు. "మీ రెందాకా వెళ్ళాలండీ?" టికెట్ ఇవ్వబోతూ అడిగాడు.
"అమలాపురం." సమాధానం ఇచ్చాడు కండక్టర్ వైపు చూస్తూ. హఠాత్తుగా రవి మనసు మెదడుకు పని కల్పించింది.
'అవును' సందేహం లేదు.'
కండక్టర్ పరిశీలనగా చూశాడు. "రవిగారు కదూ? నమస్కారం అండి."
"రామకృష్ణ." రవి పెదవులు కదిలాయి. నాలుగేళ్ళలో రావలసిన మార్పు వచ్చేసింది. ఎత్తుగా బలంగా పెరిగిపోయాడు. అందుకే చూసిన వెంటనే గుర్తు పట్టలేకపోయాడు రవి.
"సినిమాకాండీ?" రామకృష్ణ అడిగాడు.
"లేదోయ్. అక్కడో ఫ్రెండ్ ఉన్నాడు. కలుసుకుందామని." రవి మనసు పాత సంఘటనలతో నిండి పోయింది. ఎంతో చలాకీగా, హోదాగా బతికిన రామకృష్ణ ఇప్పుడు కండక్టర్. పక్కకు జరిగి చోటిచ్చాడు, "కూర్చోవోయ్" అంటూ.
"ఇప్పుడెక్కడుంటున్నారండి?"
"కాకినాడలోనే. పరీక్షలైపోయాయి. ఇంక వెళ్ళిపోతాను. మీ రెక్కడుంటున్నారేమిటి?" రవి అడిగాడు.
రామకృష్ణ మామూలు ధోరణిలోనే, "అక్కపోయాక ఈదరపల్లి వచ్చాం. అక్కడే కొన్నాళ్ళు ఉన్నాం. చదువు అట్టే ఒంటబట్టలేదు. అందుకే ఈ కండక్టర్ పని చేస్తున్నానండి" అంటూ నవ్వాడు స్వచ్చంగా.
"నాన్నగారు బావున్నారా?"
"పక్షవాతం వచ్చి కాలూ చెయ్యీ పడిపోయిందండి. మంచంమీదే ఉంటున్నారు." లేచి మరో ప్రయాణికుడికి టికెట్ ఇచ్చి వచ్చాడు. "నా డ్యూటీకూడా అయిపోతుంది. మీరు నాతో..." సంశయంగా చూశాడు రామకృష్ణ.
"చెప్పవోయ్!" భయం లేదన్నట్టు భుజంమీద చేయి వేశాడు రవి.
"మా ఇల్లూ అక్కడే వస్తారా మీరు అని."
"నేను రావడం నీకు ఇష్టమైతే తప్పకుండా వస్తాను." రవి మనసు అభిమానంతో పొంగిప్తూంది.
పది నిమిషాల్లో వచ్చి కలుసుకున్నాడు రామకృష్ణ. అతని మొహంలోకి పరిశీలిస్తే ఆ రోజుల్లో చిలిపితనం స్పష్టంగా కనిపిస్తూంది. అందంగా, బలంగా ఉన్న రామకృష్ణను తను ఏదో ఊహించుకొన్నాడు. చివరికి ఆ రామకృష్ణ కండక్టరుగా మిగిలాడు.
రామకృష్ణతో పూర్వపు చలాకీతనం స్థానంలో పెద్ధరికం ఆవరించింది. "రిక్షాలో వెడదామాండీ?"
"ఎంతదూరం ఉంటుందోయ్?"
"దగ్గరేనండి."
"అయితే నడిచే వెడదాం." రవి వారిస్తున్నా వినకుండా చేతిసంచీ తనే అందుకొన్నాడు రామకృష్ణ.
* * *
కూచిమంచి అగ్రహారంలో ఓ మూల చిన్న పెంకుటింట్లోకి దారి తీశాడు రామకృష్ణ.
"చూడండి, రవిగారూ! మీరు కాస్త వంగుని రాకపోతే మా ఇల్లు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి." తన లేమిని గుర్తు చేస్తూ బలవంతంగా రాని నవ్వును తెచ్చి పెట్టుకొన్నాడు.
"ఫరవాలేదులేవోయ్" అంటూ లోనికి ప్రవేశించాడు రవి.
"ఇత నెవరో గుర్తున్నారా, నాన్నా?" రామకృష్ణ తండ్రి మంచానికి దగ్గరగా నిలబెట్టి రవిని చూపించాడు.
మంచంమీద పడుకొన్న రామకృష్ణ తండ్రి సూర్యనారాయణగారు లేచి కూర్చున్నారు. "నీకోసం కలవరించింది, బాబూ. కానీ, దురదృష్టం, నువ్వు లేవు." మంచం పక్కన ముక్కాలిపీటమీద కూర్చున్న రవి వైపు ప్రేమగా చూశారు. రవి కళ్ళలో నీళ్ళు సుళ్ళు తిరిగాయి. "మీకోసం వాకబు చేశాను. స్వయంగా రాజమండ్రి వెళ్ళాను. కానీ, మీ సరియైన అడ్రసు ఎక్కడా దొరకలేదు. చివరికి ఇన్నాళ్ళకి ఇలా కలుసుకోవాలని ఉంది కాబోలు."
సూర్యనారాయణగారు "అమ్మా!" అంటూ గట్టిగా పిలిచారు. రవి తలెత్తి చూశాడు.
"ఏం, నాన్నా?" గుమ్మంలోంచే ప్రశ్నించింది.
"ఇలా దగ్గరకు రా అమ్మా!" కూతుర్ని రవికి చూపించారు.
"చూడు, బాబూ! కాకినాడలో మేం ఉన్నప్పుడు ఇది వాళ్ళ అమ్మమ్మగారి ఊళ్ళో చదువుకొనేది. మొన్ననే బి.ఎ. పాసయింది."
"నమస్తే!" చేతులు జోడించి చూశాడు రవి.
అచ్చు గుద్దినట్లు ఒకటే పోలిక. వైదేహిలాగానే ఉంది. వైదేహి కళ్ళలో కొంటెదనం ఈ అమ్మాయిలో లేదు. మోహంలో గర్వం గిరిగీసినట్లు కనిపిస్తూంది.
"అక్క కాకినాడలో చదువుతుండగా అద్దెకు ఉండేవాడమ్మా ఇతను. ఇంజనీర్."
"ఇంకా కాలేదండి. మొన్ననే పరీక్షలయ్యాయి." రవి నవ్వాడు.
"భారతీ, ఇతనికి కాఫీ ఇవ్వమ్మా."
రవి అదిరిపడ్డాడు. 'భారతి'. అమ్మపేరుకూడా భారతే. రవి మనసు ఆలోచిస్తూంటే తెలియని ఆనందంతో చిందులు తొక్కసాగింది.
పది నిమిషాల తరవాత లేచాడు రవి. "నేనిక వెడతానండి."
"అక్కమీద అభిమానంతో మా ఇంట్లో నాలుగురోజులు ఉండవచ్చును కదండీ!" రామకృష్ణ మెల్లగా అన్నాడు, తండ్రికి వినిపించేంత స్థాయిలో.
"అవును, బాబూ. నువ్వు వెళ్ళడానికి వీలులేదు." సూర్యనారాయణగారి మాటను కాదనలేకపోయాడు రవి.
* * *
"ఏం, బాబూ, నిన్నొకటి అడగనా?" రాత్రి వీధిలో మంచాలు వేసుకొన్నారు అన్హా. గోదావరి గాలి చాలాదూరం వచ్చి చెవుల్లోంచి దూసుకుపోతూంది. కొబ్బరిచెట్లు ఆకులు మెల్లగా కదిలిపోతున్నాయి. మొదటి ఆట వదిలిపెట్టినట్టున్నారు. వీధిలో సందడి బాగానే ఉంది. 'ఎంత చక్కని ప్రదేశం ఇది!' రవి మనసులో హైదరాబాదు మెదిలింది. పట్టణ కోలాహలం ఎలాగైనా వేరే.
