Previous Page Next Page 
మరుపులో మెరుపులు పేజి 9

 

                                     10
    పడుకోవడం, లేవడం వూళ్ళో తిరగడం, సినిమాకో , షికారు కో , అతి సామాన్యంగా ఓ వారం రోజులు గడిపే టప్పటికి విసుగెత్తింది కుసుమకు.
    అతని దగ్గర నుంచి వెళ్ళిపోవాలని మనసు రోజూ తొందర పెడుతోంది. కాని అంత సాహసం చేయలేక పోయింది. సాహసం కంటే ఆమె అంతరాత్మ అంగీకరించడం లేదు. అతన్ని భర్తగా భరించలేదు. జీవితంలో ఒక భాగస్తుడి గా ప్రేమించలేదు. కాని తనంటే అంత ప్రత్యెక శ్రద్ధ చూపించే వ్యక్టంటే ఏ భావం లేదని ఎలా అనుకోగలదు?.... ఆప్యాయంగా పలకరించే అతనంటే అభిమానమో, చిరునవ్వుతో అజ్నాపించే అతన్ని చూస్తె గౌరవమో , మరే భావమో ఆమెకే తెలియదు.
    అతని సమక్షంలో గంటలకు , గంటలే గడప గలదు. కాని వయసులో వున్న యిద్దరూ ఏ ఆకర్షణ లేకుండా, అతి స్తిమితంగా ఎలా గడపగలరు? అందులోనూ ప్రేమించి పెళ్ళి చేసుకొని, కోటి కోర్కెలతో వచ్చి రోజంతా తన్ని చూస్తూ గడుపుతూ. అతను ఏ ఆకర్షణ కు లోనవకుండా..... అదే జరుగుతే..... " ఆమెను భయం నిలవనీయకుండా చేస్తోంది. నిద్రలేని రాత్రిళ్ళు యుగాల్లా గడుపుతోంది.
    "అబ్బ, ఎన్నాళ్ళిలా.... వెళ్ళిపోదాం . హైదరాబాద్ కు. అంది ఆ రాత్రి క్రింద హోటల్ లో భోజనం చేస్తూ.
    "అప్పుడే విసుగేత్తిందా....వారం రోజులకే....?"
    "......"
    "యిక్కడ మంచి దృశ్యాలను ప్రదేశాలను చూస్తూ నువ్వు చాలా "ఎన్జాయ్" చేస్తున్నావను కున్నాను. " అన్నాడు కళ్ళు వంచి ప్లేటు వంక చూస్తూ. అది అబద్దమని అతనికి తెలుసు. చేదు మాత్రకు తీపి పూత.
    చూశాం గా, చూడాల్సినవి మీకు ఇంకా చూడాలని వుందా?"
    "నాకు వుండటానికేం గాని, రేవు బహూద్దూర్ గారి ఏకైక పుత్రుణ్ణి ,  ఎటువంటి హంగు, హడావిడి లేకుండా పెళ్ళి చేసుకున్నానంటేనే అందరికీ ఆశ్చర్యంగా వుంది. ఆనందంగా గడపాల్సిన హనీమూన్ వారం రోజుల్లో ముగించుకుని వచ్చామంటే ఏం బాగుంటుంది? ఒక్క రెండు వారాలు ఓపిక పట్టు.
    "మీరు ప్రతి దానితోనూ , పైవాళ్ళ ప్రమేయంతో లంకె వెయ్యకుండా వుండరు."
    "నాకు ఒకళ్ళు అనుకుంటారనే భయం లేదు. మనిద్దరి గురించి ముఖ్యంగా నిన్ను గురించి ఎవరికి ఎటువంటి అనుమానానికి రానివ్వడం నా కిష్టం లేదు."
    మరేమీ మాట్లాడకుండా భోజనం ముగించి లేచింది.
    "ఎందుకంత సేపు అలా బాల్కనీ లో నుంచుంటావు? ఆ చలిగాలి తగుల్తే జబ్బు చేయదూ?' అన్నాడు ప్రభాకర్. అప్పుడే లోపలకు వస్తున్న కుసుమను చూస్తూ, మందలింపు గా.
    అతని వంక చూచి, చేతి వాచీ వంక చూచుకుంది. "నిజంగానే బయట నుంచుని " అమ్మను గురించి ఆలోచిస్తూ వుంటే సమయం ఎంత గడిచింది తెలియలేదు అనుకుంది. రేపో వుత్తరం రాసి పడెయ్యాలి. నెల రోజులదాటి పోయింది. కంగారు పడుతుందేమో? ...."ఎలా? యీ ప్రభాకర్ ఒక్క క్షణం వంటరిగా వదలడు. కవరు కొందామంటే...." అనుకుంది కుసుమ.
    'ఆలోచిస్తూ నుంచుంటే టైమెంత యింది తెలియలేదు."అంది ప్రభాకర్ వంక చూస్తూ.
    'ఆమె ముఖంలోకి తరచి చూచాడు. ఆమె కూడా ఆలోచనలతో సతమత మయిపోతుందన్న మాట.' అనుకున్నాడు.
    మర్నాడు పొద్దున్నే ప్రభాకర్ బాత్ రూమ్ లోకి వెళ్ళం గానే మెల్లిగా అతని పెట్టె దగ్గరకు వెళ్ళి కవరు , కాగితాలు తీసుకుంది. గబగబా పెన్సిలు తో నాలుగు వాక్యాలు రాసింది.
    అమ్మకు,
    నేను క్షేమంగా వున్నాను. కొద్ది రోజుల్లో డబ్బు పంపిస్తాను. నీఅరోగ్యం బాగుందని తలుస్తాను. పాత ఎడ్రసు కే జవాబు రాయి.
                                                                                         'మాధవి'
    కవర్లో పెట్టి ఎడ్రసు రాసింది. మెల్లిగా బాత్ రూమ్ డోర్ దగ్గరకు వెళ్ళింది. షవరు పడుతున్న చప్పుడు వినిపిస్తోంది. మెల్లిగా తలుపు తోసుకుని క్రిందకు వెళ్ళింది, స్టాంపు అంటించకుండానే క్రింద పోస్టు డబ్బా లో పడేసి పైకి వచ్చేసింది.

 

                 
    మెల్లిగా తలుపు తోసుకుని లోపలకు అడుగు పెట్టింది. స్నానం చేసి బయట కొచ్చినట్లున్నాడు. అద్దం ముందు నుంచుని తల దువ్వుకుంటున్న ప్రభాకర్ వెనక్కు తిరిగి చూశాడు.
    "ఎక్కడికి వెళ్ళావ్"
    "ఎక్కడికీ లేదు. వూరికే క్రిందకు వెళ్ళాను." అంది. ప్రభాకర్ మరేమీ అడగలేదు. అడగటం అనవసరం అని కూడా అతనికి తెలుసు. నువ్వు రెడీయేనా?' అడిగాడు.
    తల వూగించింది.
    ఆమెకు బాగా దగ్గరగా వస్తూ "నీకు మరీ బోరింగ్ గా వుందా? పోనీ సిమ్లా గాని, కలకత్తా గాని వెడదామా?' అన్నాడు.
    ఒక్కసారి వులిక్కి పడింది. "వూహు....వద్దు నాకిక్కడ బాగానే వుంది." అంది తడబాటు తో.
    ముఖంలో స్పష్టంగా కనిపించిన కలవరపాటును గమనించి, అతని కనుబొమలు ముడుచు కున్నాయి. అంతలో జ్ఞప్తి కి తెచ్చుకుంటూ.... కలకత్తా అనగానే ముఖర్జీ గుర్తుకు వచ్చాడు కాబోలు" అనుకున్నాడు నిర్లిప్తంగా, ప్రభాకర్. "పద" అన్నాడు డోర్ ముందుకు తోస్తూ.

                                     11
    రాత్రి దాకా, అక్కడా, అక్కడా తిరిగి రూమ్ కొచ్చారు. రాంగానే అలసిపోయినట్లుంది . బట్టలు తీసుకుని స్నానం చెయ్యడానికి వెళ్ళింది కుసుమ.
    కిటికీ కర్టెన్లు పక్కకు తీసి, ట్రానిష్టర్ అన్ చేసి వచ్చి సోఫా లో జారగిల కూర్చున్నాడు ప్రభాకర్. ముందు కాఫీ టేబుల్ మీద వున్న మాగజైన్ చేతిలోకి తీసుకుని పెద్ద లైటు ఆర్పేసి, టేబుల్ లైట్ వేసుకుని కుర్చీ వెనక్కు వాలాడు. కాళ్ళు ముందున్న బల్ల మీద జాపుకుని.
    పైన పున్నమి చంద్రుడి వెలుగు రేఖలు కిటికీ లోంచి ప్రసరిస్తున్నాయి. పక్కన వున్న రేడియో లోంచి సంగీతం మృదు మధురంగా వినిపిస్తోంది.
    వెనక్కి, వాలిన శరీరం విశ్రాంతి కోరుతున్నా మనసు పరి పరివిదాల పరిగెడుతూనే వుంది. చేతిలో వున్న పుస్తకం లో పేజీలు  నామమాత్రంగా తిరిగి పోతూనే వున్నాయి.
    పైన పండు వెన్నెల. పక్కన మధురమయిన సంగీతం, ఎదురుగా తెల్లని పాన్పు .... మనసు నిండా వెచ్చని కోరికలు . ఒక్కసారి చుట్టూ చూచి బలవంతంగా పుస్తకం లోకి తల దూర్చుకున్నాడు.
    పక్కగా తలుపు తోసిన చప్పుడు విని పక్కకి తిరిగి చూసాడు. అప్పుడే స్నానం చేసి బయటకు వస్తోంది కుసుమ. ఒక్క క్షణం ఆమె వంక చూస్తూ నిలబడి పోయాడు.
    చేతి కున్న వాచ్ వంక చూసుకుంటూ 'అబ్బా! నలబై అయిదు నిమిషాలు తీసుకున్నావ్-- " అన్నాడు నవ్వుతూ.
    అతని వంక చూచి తను కూడా నవ్వుతూ "మీరు వెళ్ళచ్చు" అంది.
    ఆమె మాటలు అతనికి వినిపించనే లేదు. ఆమె వంకే విభ్రాంతి గా చూస్తూ నిలబడి పోయాడు. గదంతా పరుచుకుని వున్న పలుచని వెలుతుర్లో కుసుమ ఉషోదయం తో వికసిస్తున్న గులాబి లా వుంది. అప్పుడే స్నానం చేసి వచ్చిన ఆమె దగ్గర నుండి సోపు తాలుకూ మంచి గంధపు వాసనా గదంతా వ్యాపిస్తోంది. లేతాకుపచ్చ చీరలో, శరీరంలో ప్రతి వంపు తీర్చి దిద్దుకుని కొత్త చిగురులా మెరిసి పోతుంది. నిస్సంకోచంగా ఆమె వంక చూస్తూ "కుసుమా" అతని పెదిమలు అస్పష్టంగా కదిలాయి. మెల్లిగా ఆమె దగ్గరకు వస్తూ, ఆమె రెండు భుజాలు మీద బలంగా చేతులు వేస్తూ, దగ్గిరకు లాక్కుని, ఆమె పెదిమలను తన పెదిమలతో మూసేశాడు. అలా ఎంత సేపున్నాడో అతనికే తెలియదు. అప్పుడే వేడి, వేడి నీళ్ళల్లో స్నానం చేసి వచ్చి, వెచ్చగా వున్న కుసుమ శరీరం క్రమేపీ చల్లబడి పోతుంటే -- వులిక్కి పడ్డట్టు -- రెండు చేతులు వదిలేశాడు. అప్పుడే కొయ్యబారి పోయి, ఎండబడ్డ కలువ కాడలా వాలిపోతున్న కుసుమను గట్టిగా పట్టుకుని మంచం మీద పడుకో బెట్టాడు.
    ఆమె మీదకు ఆత్రుతగా వంగి "కుసుమా...!" పిలిచాడు. మొహం పాలిపోయి వుంది. భయంతో కాబోలు మెడ మీద నరాలు అదురుతున్నాయి. అస్పష్టంగా కదులుతున్న పెదిమల వంక చూచి, గ్లాసుతో కాసిని మంచినీళ్ళు తాగించి, గది బయటకు వెళ్ళాడు.
    "ఛ...ఛ...ఏమయింది యివాళ తనకు అనుకుంటూ. అసహనంగా రెండుచేతులూ జుట్టు లోకి పోనిచ్చుకుంటూ , బాల్కనీ కుర్చీలోకి వాలిపోయాడు. అక్కడ ఎంతసేపుండి పోయాడో అతనికే తెలియదు. ఎవరో పిలిచినట్లు వినిపించి వులిక్కిపడి లేచాడు.
    "అమ్మా....వద్దు....నాకు భయం. చలి వేస్తోంది... నేను లేవను....వద్దు...."అమ్మా....
    ఒక్క అంగలో గదిలోకి వెళ్ళాడు కుసుమా..... "లే....ఏదో.....కలవరిస్తున్నావు....కల వచ్చిందా ....లే!" బలంగా కుడుపుతుంటే కళ్ళు తెరిచి చూచింది కుసుమ. ఎదురుగా ప్రభాకర్ ని చూస్తూ నిద్రలో, బూచాడి ని చూచి దడుచుకున్న పసిపాపలా ఒక్కసారి దిండులోకి ముఖం దూర్చుకుంది. ఆమె వంక చూసి నిశ్శబ్దంగా నిట్టూర్చి, దుప్పటి కప్పి బట్టలయినా మార్చుకోకుండా తన మంచం మీద వాలి బలవంతంగా కళ్ళు మూసుకున్నాడు.
    మగత లాంటి నిద్ర మధ్యలో మేళుకువ వచ్చిన ప్రభాకర్ చుట్టూ పరికించి చూచాడు. టేబుల్ మీద వున్న గడియారం టిక్కు టిక్కు మంటూ నిశ్శబ్దాన్ని భంగ పరుస్తోంది. పలచగా వున్న నీలపు బెడ్ లైటు వెలుగులో గదంతా నిర్మలమయిన నీలాకాశం లా వుంది.
    నిద్ర లేమితో బరువుగా వున్న కళ్ళతో గదంతా కలియ చూచాడు. ఆటూ యిటూ పోతున్న దృష్టి ఆ ప్రయత్నంగా కొద్ది దూరంలో  వున్న కుసుమ మంచం మీద పడింది. నలిగిన దుప్పటి, ఖాళీగా నవ్వి నట్లనిపించి, కంగారుగా లేచి చుట్టూ చూశాడు. గబాగబా బాల్కనీ తలుపు తీశాడు. యింత చలిలో బయట నుంచుందేమో నని....
    అక్కడా లేకపోయేటప్పటికి అతనికి ఏవో అర్ధం కాని ఆలోచనలు, చుట్టూ ముట్టసాగాయి. ఎక్కడికి వెళ్ళి వుంటుంది యింత రాత్రి వేళ..... ఆలోచిస్తూనే గదిలోకి వచ్చాడు. బాత్ రూమ్ తలుపు కొద్దిగా తీసినట్టు కనిపించి ఒక్క అంగలో వెళ్ళి తలుపు పూర్తిగా తీసి చూశాడు. చూస్తూనే కొయ్యబారి పోయాడు.
    కుసుమ నేల నీడ పడుకుని వుంది. పక్కనే మంచి నీళ్ళ గ్లాసు, మాత్రల సీసా దొర్లుతున్నాయి. గబగబా వంగి సీసా తీసి చూశాడు. "స్లీపింగ్ పిల్స్."....
    అతని మెదడు పనిచేయడం మానేసింది. వెంటనే లైటు వేసి, కుసుమ పక్కన కూర్చుని, మణి కట్టు పట్టుకుని చూశాడు. అతనికి తెలియకుండానే పెద్ద రిలీఫ్ తో నిట్టుర్పు వెలువడింది. వెంటనే రెండు చేతుల మధ్య లేవనెత్తి మంచం మీద పడుకో పెట్టాడు.
    "ఎక్కువసేపు అయి వుండదు. మాత్రలు మింగి ....వెంటనే చికిత్స జరగకపోతే లాభం లేదు.... ఏం చెయ్యడం?.... ఎవర్ని పిలవడం....మేనేజర్ని పిలుస్తే.....వూహూ..... అందరికీ తెలిసి పోతుంది? ఒక్క క్షణం అయోమయంగా అటూ, ఇటూ పచార్లు చేశాడు. అప్రయత్నంగా మంచం మీద పడుకుని వున్న కుసుమ వైపు చూచాడు.... "అచేతనంగా , యీ ప్రపంచంతో ఏ సంబంధం లేనట్లూ కళ్ళు మూసుకుని అమాయకంగా ఆమె ముఖం వంక చూస్తుంటే జాలి లాంటి భావం నిండిపోయింది . బరువుగా నిట్టూర్చాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS