Previous Page Next Page 
మరుపులో మెరుపులు పేజి 8

 

    
                                     9

    గుడిలో క్లుప్తంగా పెళ్ళి చేసుకుని, డార్జిలింగ్ బయలుదేరాడు కుసుమతో... అక్టోబరు మూలంగా చల్లటి గాలి జివ్వున వీస్త్గొంది. వూరంతా పొగ మంచుతో మసక మసగ్గా వుంది.
    వూరంతటి కి ఖరీదయిన హోటల్లో తమ కోసం రిజర్వు చేయబడ్డ రూమ్ కు చేరారు. విశాలమైన గది, గదంతా ఖరీదయిన ఫర్నిచర్, పక్కనే గది నానుకుని చిన్న బాల్కని.....ఒకసారి చుట్టూ చూసి తృప్తిగా శ్వాస వదిలాడు. ఒకసారి కుసుమ వంక చిన్నగా నవ్వి పక్కగా వున్న తలుపు తోసుకుని బాల్కనీ లోకి వెళ్ళాడు.
    ఒంటరిగా నిలబడిపోయిన కుసుమ ఆ గదంతా పరిశీలనగా చూస్తూ సుదీర్ఘంగా నిట్టూర్చింది. ఈ గదిలో ఈ రాత్రి తను ప్రభాకర్ వంటరిగా..... భయంతో వళ్ళంతా గగుర్పొడిచింది. "ఛీ తనెలా వచ్చేసింది అతనితో.... ఏమాలోచించకుండా , అతని చేతుల్లో..... తను...... మనసంతా జుగుప్స తో నిండిపోయింది. ఎంతపని చేసింది తను! యిప్పుడెం చెప్తుంది.... అసలెలా చెప్పాలి? అంతలోనే ఏదో కసి లాంటి భావం మెదిలింది. ఏం చెప్పాలి? తను చెప్పింది అతను అర్ధం చేసుకుంటేనా? అంత మొండి ధైర్యంతో ఈ పెళ్ళి చేసుకున్నందుకు అతనే తెలుసుకుంటాడు. తన అభ్యంతరం దేనికో....."
    ఆ జైలు నుంచి తప్పిస్తున్నానంటూ ఈ నరకంలోకి తెచ్చి పడేశాడు. అతను అమృత మనుకునే ఈ సుఖాలన్నీ తనకు విషంతో సమానమని అతని నీడ కూడా తను భరించలేదని అతనే తెలుసు కుంటాడు అనుకుంది కసిగా.
    కిటికీ దగ్గర నుంచుని దూరంగా మంచుతో కప్పబడిన కొండలను చూస్తూ నిలబడి పోయింది. అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చిన ప్రభాకర్ కిటికీ పక్కగా నిలబడి పోయిన కుసుమ ను చూస్తూ వుండి పోయాడు. "యెంత చక్కని రూపం.... దాని అడుగున ఎంత బేల హృదయం " నిశ్శబ్దంగా నిట్టూర్చాడు.
    "కుసుమా?" అంటూ చేరువకు వెళ్ళి భుజం మీద చెయ్యి వేశాడు.
    మీద పాము పాకినంతగా కలవరపడి వెనక్కి తిరిగింది. దగ్గరగా.... తెల్లటి పంచ....మెత్తటి లాల్చి ఎప్పుడూ లేనంత కొత్తగా.... దగ్గరగా కనిపిస్తున్నాడు ప్రభాకర్.
    దగ్గరగా వచ్చి రెండు భుజాల మీద చేతులు వేసి దగ్గరకు తీసుకున్నాడు. ప్రాణాలన్నీ బిగపట్టి అరచేతులు గట్టిగా ముడుచుకుని నిశ్శబ్దంగా వుండి పోయింది. అతని చేతుల్లో, అదేమీ గమనించని ప్రభాకర్ ముని వేళ్ళతో గడ్డం పట్టుకు ఎత్తి ఆమె పెదిమల మీద తన పెదిమలుంచబోతూ ఆమె ముఖం వంక చూశాడు. అప్పటికే ముఖం ఎర్రగా కందిపోయి వుంది. పెదిమలు అదురుతున్నాయి. ఒక్కక్షణం విభ్రాంతి గా చూసి చటుక్కున చేతులు వదిలేశాడు ప్రభాకర్.
    తన శరీరం మీంచి అతని చేతులు తీసేయడంతో పోయిన శక్తి తిరిగి వచ్చినట్లు గబగబా ఒక్క అంగలో వెళ్ళి సోఫాలో పడింది.
    రెండు చేతుల్లో ముఖం దూర్చుకుంటూ నాదగ్గరకు రావద్దు నేను సహించ లేను..... నాకసహ్యం..... అస్పష్టంగా అంటోంది వెక్కి వెక్కి ఏడుస్తూ.
    కుసుమకు దగ్గరగా వెళ్ళబోతూ ఆమె మాటలు విని ఓ అడుగు వెనక్కి వేశాడు. కొద్ది నిమిషాలు ఆగి దగ్గరగా వస్తూ "కుసుమా?" పిల్చాడు.
    "నాకు తెలుసు ఇలాంటి పరిస్థితి వస్తుందని, అందుకే నేను పెళ్ళి చేసుకోనన్నాను. నామాట మీరు లెక్క చెయ్యలేదు.... నన్ను బలవంతంగా యిక్కడికి తెచ్చి పడేశారు." 'కోపంలో.... ఆవేశం లో ఏదో అనేస్తోంది. తనేం మాట్లాడుతున్నది తెలియకుండానే!
    ఆమె వంక నిశ్చలంగా చూస్తూ వుండి పోయాడు. కొద్ది క్షణాలలో ఆమె కళ్ళు తుడుచుకుంటూ సర్దుకు కూర్చునే ప్రయత్నం చేసింది.
    "కుసుమా....ఒక్కసారి నా వంక చూడు. నేనడిగే దానికి నా వంక చూసి సమాధానం చెప్పు ....ఆరోజు ఆఫీసులో వర్షం వచ్చిన రోజూ నీకు గుర్తింది కదూ.....మొన్న కార్లో....." ఆగి పోయాడు. ఆమె ముఖంలో భావాలు చదవాలని.
    "ఎలా మర్చిపోతుంది తను? కోటగోడల్లాంటి అతని చేతుల్లో వణికిపోతూ.... అతని గుండెల్లో ముఖం దాచుకుని" బలవంతంగా కళ్ళు మూసుకుంది. యింక గుర్తు చేసుకోవడం యిష్టం లేనట్లు.
    ఆమె దేన్నీ గురించి ఆలోచిస్తోందో అర్ధమయినట్లు 'ఆరోజు నీకు తెలియలేదా?" అడిగాడు.
    "తెలుసు.....నాకెప్పుడూ తెలుసు. తప్పని సరయితే తట్టుకోగలననుకున్నాను."    
    ఒక్కక్షణం ఆమె వంకచూచి, చివాల్న లేచి, పక్క నున్న తలుపు తెరచుకుని బాల్కనీ లోకి వెళ్ళిపోయాడు.
    చల్లటి గాలి జివ్వున వీస్తూ వున్నా అతని నరనరాల్లో ప్రవహిస్తున్న వేడి తగ్గిపోలేదు. చాలాసేపు అలాగే నిశ్శబ్దంగా ఎటూ తోచకుండా గడిపాడు. పైన నిర్మలంగా  వున్న నీలాకాశం లో నల్లని కారు మబ్బులు చంద్రుడి ని కప్పేస్తున్నాయి. మబ్బులు దాటి, మళ్ళీ బైటకి వస్తున్నా చంద్రుడు ప్రశాంతంగా ప్రయాణం చేస్తున్నాడు. మిణుకు మిణుకు మనే తారల్ని చూస్తూ సుదీర్ఘంగా నిట్టూర్చాడు.
    "ఎన్ని ఆశించి యిక్కడకు వచ్చాడు?ఎటు వంటి సంఘటన ఎదురు చూచాడు? వెచ్చని కోరికలతో తడబడే తనువుతో వాంచా పూరితంగా తనలోకి వరిగి పోతుందనుకున్న వ్యక్తీ తప్పని సరైతే తట్టుకోగల ననుకునే' భావంతో ఎదురయితే నెత్తిన చల్లటి నీరు కుమ్మరించినట్లని పించింది ప్రభాకర్ కు. 'తప్పని సరిగా సద్దుకోవలసిన బంధం మా యిద్దరి మధ్య వుండవలసినది . బ్రతుకంతా బంధించవలసిన అనుబంధం. గతి లేక సద్దుకునేటట్లుంటే -- అంత కంటే నరకమే ముంది?
    ఒకరి కొకరు చేరువై - ప్రేమతో పెనవేసుకొ వలసిన బంధం ...యిలా ....ఛ. తను చాలా తప్పు పని చేశాడు. కుసుమను అంచనా వేయడంలో తప్పటడుగు వేశాడు. ఆమె భయాలు తను అనుకున్నంత తేలిక అయినవి కావు.
    ఇప్పుడు ఏమిటి చేయడం? తమ గదిలో వుంటేనే భయపడే వ్యక్తితో బ్రతుకంతా కాపురం. తనకు ముందుగా ఎందుకు చెప్పలేదు..... కుసుమ చెప్పలేదా.... తను చెప్పనివ్వ లేదా... ఒకవేళ ముందు తెలిసుంటే మాత్రం.... కుసుమను తను వదులు కో గలిగేవాడా ....? ఆమె మీద కలిగిన యీ అభిమానం కదూ..... తన్ని యింత సాహసం చేయనిచ్చింది....' నిశ్శబ్దంగా నిట్టూర్చాడు.
    "ప్చ్ కుసుమ మనసులో ఎన్ని భయాలు సుళ్ళు తిరుగుతున్నాయో .....అనుకున్నాడు. అంతలోనే. జాలిగా...ఒక్కసారి తను దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పగలిగితే -- తనవల్ల ఎటు వంటి భయం వుండదని....ఆమె అంతట ఆమె దగ్గరకు వచ్చేదాకా ...తనేం ఆశించడనీ ....చెప్పి భయం పోగోడితే ...... అవేశపడింది అతని మనసు. కాని అదెంత అర్ధరహితమైన కోరికో అతనికే తెలుసు.
    చాలాసేపు గడిచాక లోపలకు వెళ్ళాడు, యిందాక ఎక్కడ కూర్చుని వుందో అక్కడే వుంది కుసుమ. ఆమె వంక చూడనయినా చూడకుండా "నువ్వా మంచం మీద పడుకో. రేపు గది మార్చే ఏర్పాటు చేస్తాను." అంటూ సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా వెళ్ళి సోఫాలో వాలాడు.
    పోడుగయినా అతని శరీరానికి ఏ మాత్రం చాలలేదు సోఫా. ఆరోజు అతను ఎక్కడున్నది , ఏం చేస్తున్నది గ్రహించేంత మార్దవం కోల్పోయింది. ఆలోచనలతో కొట్టుకుపోతూ మధ్య, మధ్య మంచం మీద వున్న కుసుమను గమనిస్తూనే వున్నాడు. కుసుమ కూడా అదే స్థితిలో వుందేమో నిద్రపట్టక అటూ యిటూ దొర్లడం తెలుస్తూనే వుంది.
    ఎప్పుడు కళ్ళు మూతలు పడ్డాయో కళ్ళు తెరిచేసరికి గదంతా వెలుతురుతో నిండి వుంది. తన మీద కప్పి వున్న దుప్పటి వంక చూచుకుంటూ మెల్లిగా లేచి కూర్చున్నాడు ప్రభాకర్. తెల్లవార్లూ కాళ్ళు ముడుచుకుని వుండడంతో కాళ్ళు పట్టుకు పోయినట్లున్నాయి. బరువుగా వున్న కళ్ళను ఒక్కసారి చేత్తో మూసుకుని, బద్దకంగా మంచం వైపు దృష్టి సారించాడు. ఖాళీగా వున్న మంచం వైపు చూచి కంగారుగా లేచాడు.
    గబగబా బాల్కనీ వైపు వెళ్ళాడు, స్నానం అదీ అంతా పూర్తీ చేసినట్లుంది. బాల్కనీ గోడ నానుకుని బయటకు చూస్తూ నుంచుంది కుసుమ. కడిగిన ముత్యం లా వున్న ఆమెను చూచి ఒక్కసారి తేలిగ్గా నిట్టూర్చి బాత్ రూమ్ లోకి వెళ్ళాడు.
    బట్టలు మార్చుకుని బయటకు వస్తూ కుసుమ వంక చూచి చిరునవ్వు నవ్వాడు మాములుగా.
    "బాగా నిద్ర పట్టిందా?"
    "వూ"
    "బయటికి వెడదామా వూరు చూచేందుకు?' తల వూగించింది. గులాబీ రంగు స్వెట్టర్ తెచ్చి భుజం చుట్టూ కప్పుతూ "పద" అంటూ దారి తీశాడు.
    క్రిందకు దిగాక "ఒక్కక్షణం యిక్కడ వెయిట్ చెయ్యి యిప్పుడే వస్తాను" అంటూ మానేజర్ గదిలోకి వెళ్ళాడు ప్రభాకర్. అతన్ని చూడం గానే చిరునవ్వుతో పలకరించాడు మానేజరు. గబగబా బయటికి వస్తూ , ట్రంకాలు మీద రిజర్వు చేయించుకుని సతీ సమేతంగా వచ్చే వాళ్ళకు యివ్వవలసిన గౌరవ మర్యాదలు అతనికి తెలియనివి కావు.
    "గుడ్ మార్నింగ్ సర్. అంతా సౌకర్యంగా వుంది కదా?' "ఆ! బాగానే వుంది కాని బొత్తిగా అటు వ్యూ ఏమీ బాగాలేదు. ఆ దక్షిణం వైపు గదులు ఖాళీ లేవా?" అడిగాడు ప్రభాకర్.
    "లేకేం సార్...---కాని ....." సందేహంగా ఆగిపోయాడు.
    ఏమిటన్నట్లు చూచాడు ప్రభాకర్.
    "అన్ని ట్విన్స్ బెడ్స్ తప్ప డబుల్స్ లేవు. సార్.....' అన్నాడు నానుస్తూ..... హనీ మూనర్స్ కు పనికి రావన్నట్లు . ఫరవాలేదు. మేం బయటకు వెడుతున్నాం. వచ్చేటప్పటికి మా సామానంతా ఆ గదిలోకి మార్పించండి." అంటూ తాళం చెవి అందించి , మరో మాటకు తావివ్వకుండా బయటకు వచ్చేశాడు.
    సాయంత్రం హోటల్ తిరిగి వచ్చాక కొత్త గదిలో అడుగు పెట్టిన కుసుమ చుట్టూ పరికించి చూచి నిశ్శబ్దంగా నిట్టూర్చింది. ఏమిటీ జీవితం? బంగారు పంజరం లా? ఏ స్వేచ్చా లేకుండా మనసంతా తగని దిగులు నింపుకుని.... పైకి నవ్వుతూ నిట్టుర్చకుండా వుండలేక పోయింది కుసుమ.
    ఆ రాత్రి మాములుగా తన మంచం మీదకు వెళ్ళి పడుకో బోతున్న ప్రభాకర్ దగ్గర కు వెళ్ళింది కుసుమ. పడుకోబోతున్న వాడల్లా లేచి కూర్చుని "ఏం కావాలి?" అడిగాడు.
    కొద్ది క్షణాలు తటపటాయించింది. నన్నేక్కడికయినా పంపేయండి." అంది తలవంచుకుని.
    "ఎక్కడికి....?' ఆశ్చర్యంగా అడిగాడు.
    ఎక్కడికయినా సరే? మీకు సుఖం లేదు... నాకు తృప్తి లేదు.... ఎందుకిలా....." ఆగిపోయింది.
    ఆమె ముఖం వంక నిశింతగా చూస్తూ "కూర్చో " అంటూ చెయ్యి పుచ్చుకుని మంచం మీద కూర్చున్నాడు. ఒక్క క్షణం అలోచించి "పెళ్ళి చేసుకుని హనీమూన్ అంటూ బయలుదేరి ఒక్కడిని తిరిగి వెడితే అందరూ ఏమనుకుంటారు? అందరికి ఏం సమాధానం చెప్పను?' అన్నాడు.
    "మీ యిష్టం ఏదో ఒకటి చెప్పండి. నేను పారిపోయానని చెప్పండి. మీకంటే పరువు, ప్రతిష్ట..... నాకు ఏమీ లేవు. నేనే వెళ్ళిపోయానని చెప్పండి.... అప్పుడు మిమ్మల్ని గురించి ఎవరూ ఏమీ అనుకోరు. నాకే యింత గౌరవం, హోదా కలిగించినా, కృతఘ్నురాలిలా పారిపోయాననుకుంటారు." అంది నిశ్చలంగా.
    "కాని అది నా వ్యక్తిత్వానికి ఎంత భంగమో తెలుసా? నన్ను పెళ్ళి చేసుకున్న స్త్రీ నన్ను భరించలేక పారిపోయిందంటే నాకెంత పరువు తక్కువో నీకేమయినా అర్ధం అవుతుందా?" అతను అడిగే తీరు మునుపెన్నడూ వినిపించని గంబీర్యం. కొంత జంకు కలగజేసింది కుసుమకు. మౌనంగా వూరుకుంది.
    "నీకిది వరకే చెప్పాను. నీలాంటి సిక్ గర్ల్ ను వంటరిగా వదిలెయ లేనని.... నీ ఆరోగ్యం బాగుపడేందుకు నేను ప్రయత్నిస్తాను. నువ్వు సహకరించు, ఆ తరువాత కూడా నీకు నా దగ్గర యిష్టం లేకపోతె ఏదో ఒకటి ఆలోచించ వచ్చు" అన్నాడు ప్రభాకర్.
    "........."
    ఏమీ మాట్లాడని ఆమె వంక చూస్తూ "ఎందుకంత భయం నీకు?.....ఎక్కడి కయినా వెళ్ళి ఏం చేద్దామని?" యిన్నాళ్ళూ వంటరిగా వున్నావు. యింకొకరి సహచర్యం లో ఏదైనా ప్రయోజనం వుంటుందని ఎందుకనుకోవు...." అన్నాడు మృదువుగా.
    'యింకొకరి సహచర్యం.....తను తిరిగి ఏమీ పంచి యివ్వలేని తనకు యింకొకరి సహచర్యం అనుకుంటూ నిట్టూర్చింది.
    "పో, వెళ్ళి పడుకో...ఏదో ఒకటి చూద్దాం. పిచ్చిగా ఏం ఆలోచించకు" అన్నాడు దిండు మీదకు వాలుతూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS