కర్తవ్య మూడుడై, ప్రభాకర్ ....ఏ ఆలోచనను అంగీకరించలేక "ముందు డాక్టర్ని పిలవాలి.....తరువాత విషయాలు తరువాత "అనుకుంటూ బల్ల మీద వున్న టెలిఫోన్ డైరెక్టరీ తీశాడు.
అంతలోనే చీకట్లో కాంతి రేఖలా .... నడిసముద్రం లో గడ్డి పోచలా .... ఒక్క మెరుపులా గుర్తుకు వచ్చింది...
"మోహన్! అవును మోహన్ యిక్కడే వుండాలి బెంగాలీ అమ్మాయిని పెళ్ళి చేసుకుని యిటె సెటిల్ అయిపోతున్నట్లు ఆ మధ్య ఎప్పుడో రాశాడు. మోహన్.....యమ్ ....." అనుకుంటూ నెంబరు కోసం వెతికాడు.
నెంబరు క్రింద చూపుడు వేలుంచి, నెంబర్ డయల్ చేశాడు.
"........" ఏం నిద్ర డాక్టర్ అయి వుండి .... యింత నిద్రేం...." అసహనంగా అనుకుంటూ చేతి వాచీ వంక చూసుకున్నాడు.
"హలొ ...మత్తుగా వినవచ్చింది అవతలి నుండి.
"హలో ....మోహన్.... నేను.... ప్రభాకర్ హైదరాబాద్ గుర్తున్నానా?"
"అరె! నువ్వా! ఎమిటిప్పుడు ఫోన్ చేశావు. పెళ్ళి చేసుకున్నట్లు, యిటు వైపు హానీమూన్ కు వెడుతున్నట్లు పేపర్లో చూశాను.... ఏమిటి చెప్పా పెట్టకుండా , ఓ కార్డు ముక్కయినా రాయకుండా.... పెళ్ళి చేసుకుని , పైగా గుర్తున్నానా అని నన్ను అడుగుతున్నావా?" అయినా యింత రాత్రి పిల్చావేమిటి? హాయిగా యన్జాయ్ చెయ్యాల్సిన హనీమూన్ ని." ఎక్కడి వూపిరి పీల్చుకోకుండా అడిగేస్తున్నాడు మోహన్. "నువ్వు కాసేపు నోరు మూసుకుని నే చెప్పేది వినిపించుకుంటావా?"
అటువైపు నుంచి టక్కున ఆగిపోయింది వాక్ ప్రవాహం.
"నువ్వు యిక్కడకు తక్షణం రావాలి. వెరీ అర్జంట్." అంటూ తనున్న హోటల్ పేరు, రూమ్ నెంబరు చెప్పాడు. "వస్తూ స్టమక్ పంపింగ్ పరికరాలు కూడా తీసుకురా."
'దేనికి ? ఏమయింది?..." ఆత్రుతగా అడిగాడు మోహన్.
"అంతకంటే ఫోను మీద యింకేమీ చెయ్యలేను. వెంటనే రావాలి." ఫోను మూసేశాడు.
అరగంట సేపు నానా అవస్థ పడి మాత్రలన్నీ పంప్ చేయించి, కుసుమను మంచం మీద పడుకో పెట్టారు. యిద్దరూ యివతలకు వచ్చి కుర్చీలో కూర్చున్నారు. జేబులోంచి రుమాలు తీసుకుని నుదురు తుడుచుకుంటూ బలంగా శ్వాస వదిలాడు ప్రభాకర్.
మోహన్ సిగరెట్ పాకటే తీసి అతనొకటి తీసుకుని ప్రభాకర్ కు అందించాడు. ప్రభాకర్ సిగరెట్ వెలిగించి తను కూడా వెలిగించుకుని "యిప్పుడు చెప్పు ఏమయిందో...." అన్నాడు.
అర్హరాత్రి- అలాంటి అత్యవసర సమయంలో ఆపద్భాందవుడిలా ఎదురొచ్చిన స్నేహితుడికి అబద్దం చెప్పడానికి మనసంగీకరించ లేదు ప్రభాకర్ కు. అందుకనే కుసుమ కున్న మానసిక సమస్యలు, అంతకు క్రితం జరిగిన సంఘటన వివరించాడు.
కాలిపోతున్న సిగరెట్టూ ను చూస్తున్న, స్నేహితుడి ముఖంలోకి చూస్తూ "పెళ్ళికి ముందు యివన్నీ నీకు తెలియదా?' అడిగాడు మోహన్.
"........."
"తెలిసే చేసుకున్నావన్న మాట." అన్నాడు ఆశ్చర్యంగా.
"ఏదో కారణముండకుండా వుండదనుకున్నాను. అంత క్షణాల మీద నిర్ణయించుకుంటే?- కాని నువ్వంత ధైర్యం చేస్తావని అనుకోలేదు." అన్నాడు.
మోహన్ కు ఏ సమాధానం యివ్వకుండా "యింకేం ప్రమాదం లేదంటావా?" అడిగాడు.
"నో- నొప్ షి యీజ్ ఓ.కే. రేప్పోద్దుటికి మాములుగా అవుతుంది. రేపు గదిలోంచి బయటకి వెళ్ళ నివ్వకు. బాగా నీరసంగా వుండవచ్చు."
"......."
"పొద్దున్నే ఎలా వుందో ఫోను చెయ్యి. అవసరమయితే వస్తాను. యిలాంటి సందర్భంలో ఆవిడ యితరులను చూడటానికి యిష్ట పడదేమో! ఆవిడని యిబ్బంది పెట్టడం భావ్యం కాదు."
కృతజ్ఞత గా చూశాడు ప్రభాకర్.
"ఏం చెద్దా మనుకుంటున్నావు?" మోహనే అడిగాడు కొద్ది నిముషాలు పోయాక.
"ఇంకా ఏం నిశ్చయించుకోలేదు."
"బొంబాయి లో గొప్ప సైకాలజిస్టు వున్నాడు. యీ మధ్యే ఫారిన్ నుంచి వచ్చాడు. వెళ్ళి కలవ కూడదు." అన్నాడు మోహన్ జేబులోంచి పెన్ను, పేపర్ తీసి యడ్రస్ రాస్తూ.
దాన్ని అందుకుని, పేరు చూసి మడిచి జేబులో పెట్టుకుంటూ "థాంక్యూ" అన్నాడు.
"యింక నే వెడతాను..." అన్నాడు కుసుమ మంచం దగ్గరకు వెళ్లి పల్సు పట్టుకు చూసి.


"థాంక్యూ , మోహన్...." ఆగిపోయాడు ప్రభాకర్.
మోహన్ నవ్వి వూరుకున్నాడు.
"నాకు యివాళ నిజంగా ఏం మాట్లాడాలో తెలియడం లేదు, అయామ్ సారీ" అన్నాడు తిరిగి .
"అదేం మనసులో వుంచుకోకు. ఆ మాత్రం అర్ధం చేసుకోగలను. రేపు ఆవిడ లేచాక ఫోన్ చెయ్యి." అంటూ మెడికల్ చెస్ట్ అందుకున్నాడు.
మోహన్ తో పాటు కారు దాకా వెళ్ళి పైకి వచ్చాడు ప్రభాకర్. మంచం మీద అచేతనంగా నిద్రపోతున్న కుసుమను చూస్తుంటే, అతని మనసులో రకరకాల భావాలు కలిగాయి.
"తనెందుకంత బలహీనుడయి పోయాడు. క్షణ కాలం తను లోనయిన బలహీనతకు ఫణం ఆమె ప్రాణమా. ఎందుకంత సాహసం చేసింది? మధురమయిన అనుభూతులకు లోనయి. జీవితాంతం గుర్తుంచుకోవలసిన సంసార సుఖం కుసుమకు ఎంత జుగుప్స ఎందుకు కలిగిస్తోంది?" అన్నీ ప్రశ్నలే! ఒక్కదానికి సమాధానం లేదు.
"తన మీద కుసుమకు నమ్మకం పోయింది. లేకపోతె అంత సాహసం చేసి వుండదు. తను కోరికలకు దాసుడై పోతానని. ఆమె యిష్టాలలో ప్రమేయం లేకుండా ప్రవర్తిస్తానని భయపడి వుంటుంది.
ప్రభాకర్ హృదయం విభిన్న బావాలతో నిండిపోయింది. చేసినపనికి సిగ్గు -- జరిగిన దానికి పశ్చాత్తాపం కుసుమను చూస్తె జాలి , సానుభూతి ఏం చేసేందుకు యిదని తేల్చుకో వీల్లేని పరిస్థితికి విసుగు.... విరామం లేకుండా పరుగెత్తి ఆలోచనలను అదుపులోకి తేలేక పోయాడు.
ఒక్కొక్కసారి శరీరం ఎంత విశ్రాంతి కోరుతున్నా మనసు మేల్కొలుపుతూనే వుంటుంది.
ఆ మిగిలిన రాత్రంతా మేల్కొలుపుతూన్న మనసుతో, రెచ్చ గోడుతున్న ఆలోచనలతో అటూ. ఇటూ పచార్లు చేస్తూ గడిపాడు.
13
అప్పుడే మెలుకువ వచ్చిన కుసుమ బరువుగా మత్తుగా వున్న కళ్ళను మెల్లిగా తెరవడానికి ప్రయత్నిస్తోంది. బలవంతంగా కళ్ళు తెరిచినా విడిపోని మగతతో మూతలు పడిపోతున్నాయి.
చాలాసేపు పెనుగులాడి , బలవంతాన కళ్ళు తెరిచింది. ఏమిటో అయోమయంగా వున్న మగత ఆమెను భయపెట్టింది. కొద్దిగా తెలివి రాంగానే దేనికోసమో తడుము కుంటున్నట్టు చెయ్యెత్తి చుట్టూ వెదక సాగింది. కళ్ళు పూర్తిగా తెరవ కుండానే.
అది గమనించి పక్కనే కుర్చీలో కూర్చుని వున్న ప్రభాకర్ లేచి మంచం దగ్గరగా వెళ్ళాడు. తెరిచి వున్న చేతి మీద చేయి వేసి మృదువుగా నొక్కాడు. వెంటనే తను పట్టు వదిలితే మళ్ళీ దొరకదేమో అన్నంత భయంగా గట్టిగా పట్టుకుంది అతని చేతిని కుసుమ.
కళ్ళు మూసుకుని వున్నా, కదులుతున్న కనురెప్పలు మెలకువగా వున్నట్లు తెలుపుతున్నాయి.
ఆమె మీదకు వంగి "కుసుమా?" మెల్లిగా పిలిచాడు ప్రభాకర్. "మెలుకువ రావటం లేదా." అడిగాడు.
"కాదన్నట్లు తల వూపింది."
"లేచి కొంచెం కాఫీ తాగుతావా?"
మెల్లిగా కళ్ళు తెరిచి చూచింది. దగ్గరగా ఆప్యాయంగా వున్న అతని ముఖంలోకి ఒక్క క్షణం సేపు చూచి కళ్ళు మూసుకుంది. ఎప్పుడులా చిరునవ్వుతో మాములుగా వున్న అతని ముఖం లోకి తను చూడలేననుకుంది.
పక్కనే బల్ల మీద వున్నా ప్లాస్కు తెరిచి కాఫీ పోశాడు. మెల్లిగా లేవడానికి ప్రయత్నిస్తున్న కుసుమకు తన చేయి ఆసరాగా యిచ్చి లేవదీసి కాఫీ అందించాడు.
వెనక్కి దిండు మీదకు అనుకుని కాఫీ తాగింది. చాలాసేపు కళ్ళు మూసుకుని, మౌనంగా గడిపింది. పక్కనే కుర్చీలో కూర్చుని పేపరు చదువుకుంటున్న ప్రభాకర్ ని గమనించనట్లు.
"రాత్రి ఎవరయినా వచ్చారా?' అడిగింది వున్నట్లుండి.
"ఏం?"
"ఏం లేదు. నాకు నిద్ర మధ్యలో ఎవరివో కొత్త మాటలు వినిపించినట్టు గుర్తు. మరి కలమో!"
"కల కాదు....నిజమే! మోహన్ అని నా స్నేహితుడు వచ్చాడు. అతనే రాకపొతే యీ పాటికి పోలీసులకు సంజాయిషీ యిస్తూ వుండేవాడిని అన్నాడు. ఆమె ముఖంలోకి పరీక్షగా చూస్తూ.
