Next Page 
బాంధవ్య బంధితులు పేజి 1

 

                    బాంధవ్య బంధితులు
                                                            --చెరుకూరి రమాదేవి

                    


    సముద్రపు హోరు జోరుగా ఉంది. జనసమ్మర్ధం ఎక్కువగా లేని ప్రదేశం చూచుకుని, ఇసుకలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాడు శ్రీనివాస్. మంచి పట్టులో ఉంది కథ. టైము ఎంత గడిచింది తెలియడంలేదు. చివరకు అక్షరాలు కనిపించనంతగా అలికినట్లైపోతూ ఉంటే అప్పుడు తెలిసివచ్చింది. చుట్టూ పరికించి చూచేసరికి చీకట్లు ముసురుకున్నాయి. మెల్లిగా పుస్తకం మూసి, రుమాలు దులిపి జేబులో పెట్టుకుని నడవసాగాడు బస్ స్టాపుకు.
    శ్రీనివాస్ దిగినచోటే మరో అమ్మాయికూడా దిగింది. అమ్మాయి ముందుగా, శ్రీనివాస్ వెనకగా నడవసాగారు. తన దోవంబట తను నడుస్తూ, పక్క విషయాలు అంతగా పట్టించుకోకపోయినా, ముందు నడుస్తున్న అమ్మాయి మూడు నాలుగు సార్లు వెనక్కు తిరిగిచూడటం గమనించాడు శ్రీనివాస్. ఆ అమ్మాయి కనులలో ఏదో అనుమానం పొడచూపుతూంది.

                                 
    ఇంకో ఫర్లాంగు నడిచి వెనక్కు తిరిగి చూచేసరికి వెంబడిస్తున్నాడనుకున్న అబ్బాయి కనుపించకపోయేసరికి, తన అనుమానానికి తనే సిగ్గుపడింది. బహుశా ఆ అబ్బాయి ఇల్లు ఇటే కాబోలు అనుకుంది.
    వారంరోజుల తరవాత ఒక మధ్యాహ్నం లైబ్రరీలో ఏవో పుస్తకాలు సర్దుతున్నాడు శ్రీనివాస్. రెండు అరలకు అవతలపక్కగా ఏవో పుస్తకాలు కోసం చూస్తూంది ఒక అమ్మాయి. యథాలాపంగా అటు తిరిగిన శ్రీనివాసరావు ఆమెను చూచి, తిరిగి పనిలో నిమగ్నమవుతూంటే, ఏదో స్ఫురణకు తిరిగిచూచాడు. ఆ అమ్మాయిని చూడగానే ఎక్కడో చూచినట్లనిపించింది చేతిలో ఉన్న పుస్తకాల్ని సర్దేసి అటువైపు వెళ్ళాడు. ఆ అమ్మాయి వెతుకుతున్న షెల్ఫ్ దగ్గరకు వచ్చి, "ఏదైనా ప్రత్యేక మయిన పుస్తకంకోసం వెదుకుతున్నారా?" అని అడిగాడు.
    అతనివంక చూచి, "ఊఁ. మామ్ షార్ట్ స్టోరీస్ కోసం చూస్తున్నాను ఒక భాగమే దొరికింది. రెండవ భాగం కనుపించలేదు" అంది.
    "ఓ! రెండవ భాగం ఎవరో తీసుకువెళ్ళారనుకుంటాను. వాళ్ళు తిరిగి ఇవ్వగానే మీకోసం ఉంచుతాను. ఇంకేమయినా కావాలా?"
    "ఇంకేమీ వద్దు. ఇవి చాలు" అంటూ మూడు పుస్తకాలు అందించింది తిరిగి ఇస్తూ సంతకం చెయ్యడానికి పుస్తకం జరిపాడు. సంతకం చేసి తిరిగి ఇస్తూ "మిమ్మల్ని ఎక్కడో చూచినట్లుంది. మీరు ఇక్కడ పనిచేస్తున్నారా?" అని అడిగింది ఆమె.
    "ఊఁ.ఒక వారంరోజులయింది చేరి."
    "ఉహూఁ. వారమే అయితే ఇక్కడ చూచిఉండను" అంది సాలోచనగా.
    "దానిదేముందిలెండి. మనిషినిపోలిన మనుషులు ఉంటారు."
    "ఊఁ." పరధ్యానంగా అని, "మీకు తెలిసే ఉండచ్చు. ఈ మామ్ రచనలు, హెరాల్డ్ రాబిన్స్ ని చాలా స్టోర్లలో వెదికేను. దొరకలేదు. ఎక్కడ దొరుకుతాయో మీకేమైనా తెలుసా?" అని అడిగింది.
    "ఇప్పుడు కొత్త పుస్తకాలు దొరకటం కష్టమనుకుంటాను. ఏ సెకండ్ హేండ్ బుక్ స్టోర్లలోనో వెదకండి. దొరకచ్చు."
    "నేనెప్పుడూ అక్కడ ప్రయత్నం చెయ్యలేదు. చూడాలి. థాంక్స్" అంటూ చకచకా వెళ్ళింది. ఆమెవంక చూస్తూ సాలోచనగా నిలబడ్డాడు. ఇంతలో ఎవరో పుస్తకాలు పట్టుకుని టేబిల్ దగ్గరికి వచ్చేసరికి ఆ పనిలో నిమగ్నమయ్యాడు.
    చేతిలో పుస్తకాలతోసహా మెరుపుతీగలా వెనక్కు వచ్చింది ఆ అమ్మాయి. 'వారంరోజులక్రితం మిమ్మల్ని బస్ స్టాప్ లో చూచాను. ఉన్నదున్నట్లు చెప్పాలంటే వెంబడిస్తున్నారేమో ననుకున్నాను" అని చెప్పి ఎంత త్వరగా వచ్చిందో అంత త్వరగా వెళ్ళిపోయింది తారాజువ్వలా. ఆమెవంక క్షణకాలం ఆశ్చర్యంగా చూచి నవ్వుకుని తిరిగి పుస్తకాలు నోట్ చెయ్యడంలో నిమగ్నుడయ్యాడు.
    లైబ్రరీలో కలుసుకున్నప్పుడల్లా ఆ అమ్మాయి మాటలు గుర్తుకు వస్తాయి శ్రీనివాస్ కు. ఒకరోజు శ్రీనివాస్ మార్కెట్ నుండి బస్సులో తిరిగి వచ్చాడు. బస్సు దిగి ఇంటిదోవ పడదామనుకుంటూంటే, తరచుగా లైబ్రరీలో కనిపించే అమ్మాయి కనిపించింది ఎటో చూస్తూ.
    ఆ అమ్మాయి పక్కగా వచ్చి, "ఈరోజు మిమ్మల్ని వెంబడిస్తున్నానండీ అన్నాడు నవ్వుతూ.
    ఎటో చూస్తున్న ఆమె కొద్దిగా ఉలిక్కిపడి, "ఊఁ" అంటూ తలఎత్తి చూచింది. ఆ మాటలు గుర్తుకుతెచ్చుకుని నవ్వేస్తూ "ఎక్కడినుండి?" అంది.
    "మార్కెట్ నుండి."
    "అయితే పొరబడ్డారు. నన్ను అనుకుని ఎవరో అమ్మాయిని వెంబడించి ఉంటారు. నేను కాలేజీనుంచి వస్తున్నాను."
    "పోనీ, ఇప్పుడు మీ ఇంటిదాకా వెంబడించమన్నారా?"
    "నయం. మా అన్నయ్య, నాన్న ఇద్దరూ ఇంట్లో ఉంటారు ఈ టైములో జాగ్రత్త" అంది నడుస్తూ.
    "అయితే ఎప్పుడు ఉండరో చెప్పండి. అప్పుడు మొదలుపెడతాను."
    "మీకు వెంబడించాల్సిన అవసరమేమిటి? నేను ఆహ్వానిస్తున్నాను. మా ఇంటికి రండి."
    "అబ్బే! ఊరికే అన్నాను" అన్నాడు నాన్చేస్తూ.
    "అయితే నేను మొట్టమొదటిసారి అన్న మాటలు ఇంకా గుర్తున్నాయన్న మాట" అన్నది.
    "మరచిపోతే కదా, గుర్తు ఉండకపోవటానికి?"
    అతనివంక సూటిగా చూచి మౌనంగా నడవసాగింది.
    "మిమ్మల్ని చాలాసార్లు చూచినా పరిచయభాగ్యం కలగలేదు. నా పేరు శ్రీనివాస్" అంటూ తన్ని తను పరిచయం చేసుకున్నాడు, అంతవరకు వేళాకోళంగా మాట్లాడిన శ్రీనివాస్ సిసలైన పెద్దమనిషిలా.
    "నమస్తే అనమన్నారా? నా పేరు అనూరాధ" అని అంటూండగానే ఇల్లు సమీపించింది. "ఇదే మా ఇల్లు. లోపలికి రండి" అంది.
    "ఇవాళ కాదు. మరోసారి...ఈ లోపల మిమ్మల్ని లైబ్రరీలో చూస్తాను" అని గుడ్ బై చెప్పి ఇంటిముఖం పట్టాడు అనూరాధను గురించి ఆలోచిస్తూ.

                                    2

    ఒక సామాన్యమైన ఇంటిముందు నుంచుని తలుపుమీద కొట్టసాగింది అనూరాధ, ఎంతసేపు కొట్టినా తలుపు తెరుచుకోదేమో అన్నట్లు విసుగ్గా దాని వంక చూస్తూ. మెల్లిగా తలుపు తెరిచింది లలిత నిద్రమొహంతో.
    "ఏమిటే ఇది? కాలేజీ ఎగ్గొట్టి నిద్ర'పోతున్నావు!" అంది అనూరాధ.
    "ఉష్! లోపలకు రా" అంటూ దారితీసింది లలిత. లోపల గదిలో మంచం మీద కూర్చుంటూ చుట్టూ చూడసాగింది అనూరాధ. చిన్నగది. నవారుమంచం మీద తెల్లటి దుప్పటి నలిగి ఉంది. పక్కన టేబిల్ మీద పుస్తకాలు పరిచి ఉన్నాయి. మెల్లిగా పక్కగది తలుపువేసి వస్తూ, "ఏమిటీ....ఈ వేళప్పుడొచ్చావు?" అంది లలిత.
    "నువ్వివాళ కాలేజీకి రాలేదని తెలిసి వచ్చాను, కనుక్కుందామని. అలా ఉన్నావేం? కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయి?"
    "రాత్రంతా మా అమ్మకు ఒంట్లో బాగాలేదు. ఏమిటో విపరీతంగా బాధపడింది. దానితో నాక్కూడా నిద్ర లేదు" అంది.
    "ఈపూట ఎలా ఉంది? డాక్టర్ని పిలిచావా?" ఆత్రతగా అడిగింది అనూరాధ.
    "ఆ! ఏదో మందు ఇచ్చారు. దానితో కొద్దిగా రిలీఫ్ ఇచ్చింది పొద్దున. ఇందాకే పడుకుంది." చెపుతూంటేనే కళ్ళలో నీళ్ళు తిరిగాయి లలితకు.
    "ఛ! ఏమిటిది, లలితా? మంచి డాక్టర్లకు చూపిస్తే త్వరలోనే నయమయిపోతుంది."


Next Page 

WRITERS
PUBLICATIONS