Previous Page Next Page 
క్షమార్పణ పేజి 9


                                    23
    చంద్రం తండ్రికి తెలీకుండా కొన్ని పనులు చేస్తుంటాడు. అలాగే విజయవాడ లో బ్యాంకు ఉద్యోగానికి అప్లై చేశాడు. ఇంటర్యూ ఆహ్వాన పత్రం చూస్తూ కమలాకరం మాతాడలేక పోయాడు. అటు వేపు వీడికేందుకు మోజు పుట్టిందా అని ఆలోచన రగిలి రెండు రాత్రుళ్ళు వరుసగా నిద్ర కు దూరమయ్యాడు.
    కాని, చంద్రం ఇంటర్వ్యూ కి వెళ్ళాడు. సెలక్టయ్యాడు. అదే మంత బ్రహ్మాండమైన ఉద్యోగం కాదు. రెండు వందల పైన వుంటుంది జీతం.
    చివరి వరకూ కమలాకరం తన వెంట వచ్చేస్తాడనే చంద్రం భావన. తీరా కమలాకరం అసమ్మతి తెలిపే సమయానికి, చంద్రం మొదటి ఉద్యోగానికి రిజైన్ చేయడం, ప్రయాణానికి సర్వ సన్నాహాలు పూర్తీ కావడం జరిగాయి.
    చంద్రం బిక్క మొహం వేసి, తండ్రికి నచ్చ చెప్పబోయాడు.
    'ఇక్కడి పలుకుబడి అక్కడెలా వస్తుందిరా?" అని తేలిగ్గా నవ్వేశాడు అతను.
    "ఇక మీరు పని మానేసినా మాత్రం ఏమైంది నాన్నా?"
    చంద్రం అమాయకత్వానికి జాలిపడి, ఆలోచిస్తూ "అలా మానేయవలసిన రోజులు కూడా దగ్గర పడుతున్నట్లే ఉన్నాయిలే" అన్నాడు కమలాకరం.
    అతని ధోరణి అంతు పట్టలేదు చంద్రం కి. తనదే తప్పయినట్లు నొచ్చుకున్నాడు. ఏం చెయ్యడానికి ఆశక్తుడై వెళ్లి ఉద్యోగంలో జాయినయ్యాడు. నెల్లాళ్ళ తర్వాత పద్మినీ కూడా ప్రయాణం కట్టింది. ఆ సందర్భంలో మళ్ళీ బ్రతిమాలే ప్రయత్నం చేశాడు చంద్రం. కాని కమలాకరం వినలేదు. తరచుగా మీరిద్దరూ వచ్చి పోతుంటే అదే నాకు పదివేలు ముసలి వగునయాక ఎలాగూ మీ చెంతనే చేరతాను అప్పుడు పద్మే నన్ను తన కొడుకనుకుని ఇంత తినిపించి జో కొట్టి నిద్ర బుచ్చుతుంది-" అన్నాడు హాస్యంగా.
    పద్మీనీ ఆర్ద్రంగా నవ్వింది. కమలాకరం ఒంటరిగా ఉండాలే అని ఏదో బాధగా ఉంది ఆమె క్కూడా.
    చంద్రం వినకుండా "నువ్వు చేసే పచ్చళ్ళు పార్శిల్ చేసి పంపెస్తుండమ్మా పద్మీనీ" అన్నాడు కమలాకరం నవ్వుతూ.
    "రెండు జాడీల నిండా గోంగూర పచ్చడి, కోరివికారం, ఊరగాయలు కొన్ని ఉంచానండీ మామగారూ. పక్కింటి పిన్ని గారి చేత చేయించిన కంది గుండా, కారప్పొడి డబ్బాల కెత్తి ఉంచాను. నేను వచ్చినప్పుడల్లా మీకు సంవత్సరాల కొద్ది సరిపోయేట్టు అన్నీ చేయించుతాను కదా! మీకేం భయం లేదు" అన్నది పద్మీని.
    "ఇంత బుద్ది మంతురాలైన కోడలు ఉన్నాక ఇంకేం భయం వుంటుంది ?-- చూడు పద్మీనీ చంద్రాన్ని జాగ్రత్తగా చూసుకునే భారమంతా ఇటు పైన వీడే. ఇన్నాళ్ళూ నా చేతుల మీదే ఉన్నట్టు లెక్క. పక్షుల రెక్కలకీ మనుషుల స్వతంత్ర భావాల అట్టే తేడా లేదు." అన్నాడు గంబీరంగా మారుతూ.
    కమలాకరం ఆశీస్సు లందుకుని చంద్రం, పద్మినీ బరువుగా నడుస్తూ వెళ్ళిపోయారు.

                                

                                        24
    నెల రోజులు తిరగ్గానే చంద్రం వచ్చాడు ఒక్కడూ. పద్మీనీని ఒంటరిగా వదిలి వచ్చినందుకు కొంచెం మందలించి త్వరగా పంపించేశాడు కమలాకరం. వెళ్ళినాక రెండు మూడు జాబులు వ్రాశాడు చంద్రం. అటు పైన నెలదాటి క్షేమ సమాచారాలు తెలియలేదు.
    కమలాకరం పేపరు చదువు తున్నాడన్న మాటే గాని మాటి మాటికి అతని దృష్టి వీధి వైపుకు వెళ్తుంది. ఒక వార్త చదవడం, రోడ్డు మీదికు చూడడం -- ఇదే పనిగా వుంది.
    ఆత్మీయుల ఉత్తరాల కోసం ఎదురు తెన్నులు చూడటం మళ్ళీ ఆరంభ మైంది అనుకున్నాడు.
    సైకిల్ బెల్ మ్రోగింది. కొద్దిపాటి తత్తర పాటుతో తలెత్తాడు కమలాకరం. ఎదురింట ఓ ఉత్తరం పడేసి సైకిలెక్కి రివ్వున పోయాడు పోస్టు మాన్.
    'చంద్రం ఉత్తరం ఎన్నాళ్ళ కూ రాదేమి చెప్మా?' అని కన్నులు చికిలించి ఆలోచించాడు.
    "ఆ-- ఏముంటుంది? కొత్త కాపురంలో ఉత్తరాలు రాసే తీరిక ఉండదు సాధారణంగా --" అనుకో గలిగాడు.
    "ఏదో గొప్ప ఆలోచనలో ఉన్నారు" అంటూ వచ్చాడు నరహరి. "సమయానికే వచ్చావు రావోయ్!" అని ఆహ్వానిస్తూ లేచి నౌఖరు  కుర్రాడు ఉంచి వెళ్ళిన ఫ్లాస్కు మూత తెరిచాడు కమలాకరం.
    కొత్త క్లయింటు విషయం చర్చించుకున్న అనంతరం ప్రపంచ విషయాల మీదకు మళ్ళారు.
    "అన్నట్టు -- చెప్పడం మరిచాను. మీ అనంత రామయ్య గారు కనిపించి రెండు రోజుల నుంచి కమలాకరం ఎక్కడా కనిపించడం లేదే అన్నారు. వీలుంటే సాయంత్రం ఇక్కడకు వస్తాడట -- " అని చెప్పాడు నరహరి.
    "నాకంటే పెద్దవాడైనా , ఏమిటో ఈ అనుబంధం?-- అన్నాడు కమలాకరం.
    నరహరి ఆగి అన్నాడు! "ఇదివరకు అతగాడు డబ్బు కోసం పరమ చండాలం పనులు చేసేవాడని ప్రతీతి. ఎందుకన్నా మంచిది మీరు కొంచెం జాగ్రత్తగా వుండండి."
    "ఫరవాలేదయ్యా! అలా అనుకోడానికి వీలులేదు. నా పట్ల ఎప్పటికీ నిస్వార్ధంగా వుంటాడు. అది నా నమ్మకం" అనేశాడు కమలాకరం.
    నరహరి దురభిప్రాయం గురించి తర్వాత తర్వాత ఆలోచించాడు అతను. అనంతరామయ్య తననింతగా అల్లుకు పోడానికి కారణం , బహుశా పదిమందీ వేలివేసినట్టు చూడడం వల్లనే ఏమో అనిపించింది.

                                                              25
    "మీరు అన్నంత వరకు నాకు జ్ఞానోదయం కలగలేదు. ఈ ప్రపంచం లోని ప్రతి బంధమూ, ప్రతి నిబంధనమూ స్వార్ధంతో పని చేస్తాయి --" అన్నాడు అనంతరామయ్య ఆవేశంగా.
    కమలాకరం తెల్లబోయాడు "ఇతనేం చెప్తాడు చెప్మా?'అనుకుంటూ.
    "నా పిల్లని పెళ్ళాడే మనిషి కోసం ప్రపంచమంతా గాలించాలని ఇవాళే కంకణం కట్టుకున్నాడు.
    అనవసరంగా కంగారు పడినందుకు నవ్వుకున్నాడు కమలాకరం తనలో తను.
    "మంచిది !" అనేశాడు పైకి. అదొక ఆశీస్సులా వినిపించింది అనంత రామయ్య కి. మంచి మాటలు ఆశీస్సుల్లా వినిపిస్తాయి. ఆశ్చర్యం లేదు.
    "ఈరోజు ఒక పుస్తకం చదివాను....."సావకాశంగా ఆరంభించాడు అనంతరామయ్య. 'అందులో నాయకుడు కులం కాని విధవ యువతి ని పెళ్లి చేసుకుంటాడు. తల్లిదండ్రు లతో పోట్లాదకుండా, వివాహానికి విముఖత చూపిస్తూ వారిలో మార్పు తీసుకు రావడం అతని ప్రత్యేకతగా కనబడింది..... అయినా ఈ ప్రపంచంలో అలాటి మనుషులు దొరుకుతారంటే నాకు నమ్మకం కుదరకుండా వుంది."
    కమలాకరం వెంటనే అడ్డు పడ్డాడు ఆ మాటకి. "మీ వంతు అలాంటి వ్యక్తీ కోసం వెదకడమే. ఆ పైన దైవ నిర్ణయం వుండనే వుందిగా."
    "నిజం నిజం" అన్నాడు అనంతరామయ్య. ఈసారి అయన ముఖం కొంత కులాసాగా కనిపించింది.

                                     26
    ఒక ఆదివారం ఎండవేళ ద్వారానికి ఎదురుగా వాలు కుర్చీలో వాలి ఊరికే అవతలకు చూడసాగాడు కమలాకరం. రెండు రోజుల క్రిందట చంద్రం ఉత్తరం వ్రాశాడు. అందువల్ల చెప్పలేనంత నిశ్చింతగా వున్నది ఆయనకి.
    ఈ ఒంటరి తనంలో అనిపిస్తోంది అప్పుడప్పుడు. జీవితం నుంచి రిటైర్ మెంటు కి ఎదురు చూడటమూ ఇది అని.
    మండే ఎండలో ఎలక్ట్రిక్ తీగెల మీద రెండు మూడు పిచికలు గుజ్జుగా కూచున్నాయి. ఉండి ఉండి కిచకిచ మంటున్నాయి.
    వీధి వసారాలో పై దూలం కంటికి గడ్డి గాదర తో చిన్న పిచ్చిక గూడు వేలాడు తోంది. పిచికల సంసారం. వాటి బాధ్యత, ఏ అజ్ఞాత శక్తి చేతో పెరేపింపబడుతున్న వాటి బుద్ది రోజూ పరిశీలిస్తున్నాడు. నిస్వార్ధ పరుడైన  -- పసి పిచుకలు ఏ పిల్లి నోటా, గాలి వాన పడకుండా కనిబెడుతున్నాడు పతి దినమూ.
    తల్లి పిచుక రివ్వున వచ్చి దూలం మీద వాలి గూడు కేసి తొంగి తొంగి చూచి ఎగిరి పోయింది. తెలియని లోటు స్పురించి గూడు వంక చూస్తూ చెవులు రిక్కించాడు కమలాకరం.
    "ఆశ్చర్యంగా వుందే! పిల్లలు ఎగిరి పోయాయా ఏమిటి? అనుకున్నాడు స్వగతంలో. గూడు లోంచి రోజూ కీచు కీచు మంటూ వినవచ్చే పసి గొంతుకలు ఇవాళ లేవు.
    "ఆశ్చర్యాని కేముంది ?-- ఎగిరి పోయాయి."
    అలాటి సత్యం బాగా తెలిసి వున్న తనకి. తల్లి పిచ్చుక మీద అంత జాలి ఎందుకు కలుగుతుందో అర్ధం కాలేదు. ఒకప్పుడు తాను ఆ పిల్ల పిచుక, ఇప్పుడు తను తల్లి పిచుక. తన బాధ రెండు విధాల వుందేమో?--'    
    "పోనీ -- ఏ పిల్లి నోటా పడకుండా బ్రతికి బట్టకట్టాయి " అని సమర్ధించుకోబోతుండగా , ఎదుటి దూలానికి వేలాడుతున్న పాము పొర అతని మనసు నంతా కళవళ పరిచేసింది.
    పిచుకలు హాయిగా కొత్త రెక్కలతో గాలిలోకి ఎగిరి పోయాయా?-- కాలసర్పం పాలబడ్డాయా?-- ఎటూ తేల్చుకోలేని కమలాకరం నిట్టూర్చడం మాత్రం చేశాడు.
    అంతే! ఈ ప్రపంచం అంతే! విశ్వ మాటకి పిల్లలను కని పెంచడం వరకే బాధ్యత. హాయిగా గాలిలో , స్వేచ్చ నింపుకుని , ఆనందంతో గమ్యం చేరేవాళ్ళు కొందరు. దుర్మార్గనరధముల ఇనుప సంకెళ్ళ ల్లాటి హస్తాలలో పడి భావితన్యాన్ని నశింప వేసుకునేది కొందరు.
    మనసు మళ్ళించు కునేందుకు రోడ్డు మీదకు దృష్టి పోనిచ్చాడు. కమలాకరం . "చేగోడీలోయ్...." అని అరచుకుంటూ పన్నెండేళ్ళ అబ్బాయి మండు టండలో రోడ్డు మీద తారట్లాడు తున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS