Next Page 
అర్పణ పేజి 1


                                   అర్పణ

                                                                    పి.రామలక్ష్మీ

                         
    స్నేహం అమూల్య మైనది, అనిర్వచనీయమైనది. స్నేహితులకు బీజం ఎక్కడ, ఎప్పుడు ఎలా పడుతుందో ఎవరూ ఊహించలేరు. అది చిన్న మొలక దగ్గర పడినా, మహావృక్షం దగ్గర పడినా ఒకే దృక్పధం లో సాగిపోతుంది. చూచే వాళ్లకు చిన్నా పెద్దా, గొప్పా , బీదా , మంచీ చెడ్డా తారతమ్యం గాని స్నేహమనే అలత వీటిని లక్ష్య పెట్టకుండా స్వేచ్చగా ముందుకు అల్లుకు పోతూనే ఉంటుంది. ఆ పురోగమనం లో అది నశించినా సరే , వ్యాపించినా సరే -- ఒకటే లక్ష్యం , ఒకే దృష్టి.
    రకరకాల స్నేహలలో బాల్య స్నేహాలు ప్రధమంగా మమతలను సృష్టిస్తాయి. అవి సాధారణంగా ఎప్పుడూ ఉండేవి కావు. ఉద్యోగ రీత్యా , కుటుంబ ధర్మ రీత్యా బాల్య స్నేహితులు విడిపోక తప్పదు. అయినా ఎన్ని అగాధాలు, అంభోధులు అడ్దగించినా, మరిన్ని అవరోధాలు ఏర్పడినా బాల్య స్నేహ స్మృతులు మాత్రం ఎవరికి వారు మరిచిపోలేరు. జీవితమంతా ఆస్మృతులు చల్లగా స్పృశిస్తుంటాయి. మానవ జీవిత దర్పణం లో అది ఒక అందమైన భంగిమ. కలకాలమూ కనిపిస్తూనే ఉంటుంది.

                                          
    ఆ స్నేహానికి ప్రారంభం చూచాయ మాత్రమె కాని, అనుభవం జీవిత కాలమంతా స్పష్టాస్పష్టంగా గుర్తు వస్తుంది. శరీరం , మేధ, వాంఛ పెరుగుతున్న కొద్దీ సర్వ మానవ సహజామైన ద్వేషాగ్ని  కాని అసూయ కాని రగులుకున్నా , ఆ బాల్య దశ లోని స్నేహ స్మృతి మాత్రం ఎప్పటికీ వదిలి పెట్టదు.
    అనుభావమూర్తి అయిన మానవుడి జీవితంలో అవి అందమైన రోజులు. పీడకలలు రాని, బాద్యతలు అడ్డుకొని మంచిరోజులు.
    చిన్న తోట. బంగారు వన్నె లేడిలా ఒక అమ్మాయి ఆ బడి వెనక ఉన్న తోటలో పరుగు పెడుతూ ఉంది. పచ్చని పాదాలకు అడ్డు పడుతున్న పరికిణి ని ఒక చేత్తో పట్టుకుని అలిసి పోతూ అందకుండా పరుగెత్తుతున్న ఆ అమ్మాయి వెనక రెండు జడలు సగానికి కట్టి, మిగతాది గాలికి వదిలి , పంజాబీ డ్రెస్సు తో షోకుగా మెలికలు తిరుగుతూ మరొక పిల్ల వెంబడిస్తూన్నది. నీరెండ కాంతిలో ఆకుపచ్చని ఆ పచ్చిక మీద వాళ్ళు పరుగెత్తడం చూస్తె వివిధ వర్ణ విలిసీతాలైన సీతాకోక చిలకలు గుర్తు వస్తాయి.
    పరుగెత్తి పరుగెత్తి కాళ్ళు లాగేస్తుంటే పరికిణీ అంచు కాలికి చుట్టుకుని డభాలున ఒత్తుగా పెరిగిన పచ్చగడ్డి మీద పడి, మూర్చ పోయినట్లు నటించింది మొదటి అమ్మాయి. వెంబడిస్తూన్న పంజాబీ వేషం పిల్ల క్షణం లో రివ్వున వచ్చి ఆ అమ్మాయిని చుట్టేసి కితకితలు పెడుతూ తను కిలకిలా నవ్వడం మొదలు పెట్టింది.
    మొదటి అమ్మాయి కసురుతూ లేచి కూర్చుంది. జడ గంటలతో ఉన్న తన పొడవైన జడ చేత్తో సర్దుకుంటూ , "పార్వతీ! నీ అల్లరి జాస్తి అయిపోతుంది ...అమ్మయ్య! అలసి పోయాను, బాబూ! ఆయాసం వస్తోంది గుండెల్లో నుంచి. హుష్!....ఏమిటి నావైపలా చూస్తావు?" అంది. అలా అంటున్నప్పుడు కనుబొమలు చిత్రంగా కదిలాయి. మెల్లిగా నవ్వుతూ పెదాలు విరిచి వెక్కిరించింది. పార్వతి ఆ అమ్మాయి మాటలు లెక్కచెయ్యకుండా పెంకిగా చూస్తూనే ఉంది.
    'సరోజ ఎంత అందమైనది! గుండ్రని పచ్చని మొహం పైన నల్లటి మెరిసే జుత్తు చిన్నవైనా ఆకర్షనీయమైన కళ్ళు, సామాన్యమైన ముక్కు-- ప్రత్యేకించి ఏ అవయవాన్ని చెప్పలేకపోయినా మొత్తం మీద అందగత్తె. గుండ్రపు మొహం కావటం వల్లనేమో , నిండుగా హుందాగా కూడా ఉంటుంది. పన్నెండేళ్ళ కే ఇంత అందంగా ఉంది! ఆడపిల్లలు పెద్దయితే మరీ అందంగా తయారవుతారట! ఏమో!' వికసిస్తున్న పార్వతి హృదయంలో అనేక భావాలు వచ్చి చేతికి చిక్కకుండా పారిపోతున్నాయి.
    అరిచేతులతో వెనక్కు అనుకుంది. "సరూ! నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా?' అలవోకగా తల తిప్పుతూ అంది పార్వతి.
    "నీ అందం కన్నానా?" అంది సరోజ ఆకాశం వైపు చూస్తూ.
    "నా అందం గురించి నువ్వేం చెప్పినా, అతిశయోక్తి అంటారే మన మాష్టారు -- అదే అవుతుంది." పైజమాకు అంటిన ఇసుక దులుపుకుంటూ అంది పార్వతి.
    'నా అందం అతి సామాన్య మైనది , పారూ! నాలాగా, నా కన్నా తెల్లగా ఉన్నవాళ్ళున్నారు. వాళ్ళందరి లో నేను కూడా కలిసిపోతాను. కాని నీకు ఒక ప్రత్యేకమైన అందం ఉంది. నీతో కొన్నాళ్ళు కలిసి మెలిసి ఉన్నవాళ్ళ కు ఆ సంగతి తెలుస్తుంది." అంది సరోజ సున్నితంగా.
    "నువ్వెన్ని చెప్పినా సరే నేను నమ్మను." పెదాలు బిగించింది పార్వతి.
    "నేను నమ్మించుతాను, చూడు!" అంది సరోజ పిడికిలి చూపించి పట్టుదలగా.
    "నన్ను నమ్మించడమెందుకు? నా అందం పైన ఒక వ్యాసం లాంటిది వ్రాసి మాస్టారికి చూపించు. నిన్నూ, నన్ను బడిత తో పూజిస్తారు." నవ్వుతూ అంది పార్వతి.
    సరోజ, పార్వతి మాటలు వినిపించుకోకుండా చెబుతున్నది: "నీ అందం ఎల్లాంటి దంటే , పార్వతీ! తెలుపులో నలుపు కలిసిన చందం."
    పార్వతి అడ్డుపడింది. "అవును, నాకూ తెలుసు ఆ మాత్రం. దాన్నే మనవాళ్ళు చామన చాయ అంటున్నారుగా?"
    "అది కాదు . ఆ చాయ సంగతి నాకు తెలీదు? నీ రంగు అలాటిది కాదు. నాలుగు పాళ్ళ తెలుపులో ఒక పాలు గడమైన నీల మేఘపు రంగు కలిసి ఉన్న చాయ నీది. పోలిక ఏదైనా చూపించ మంటావా? అదిగో చూడు, ఆకాశం వైపు." నవ్వుతూ పడమటి నీలాకాశం వైపు వేలుతో చూపించింది సరోజ.
    తెల్లని దూదిలా పరుచుకున్న పెద్ద మబ్బులో సగానికి పైగా ఆక్రమించుకున్న నీడ లాంటి నీల వర్ణపు మేఘం.
    ఆశ్చర్యంగా చూసింది పార్వతి. "అమ్మయ్యో! అంత అందంగా ఉంటానా నేనూ?' దీర్ఘం తీస్తూ అంది.
    "మరేమిటి?" అంది సరోజ ఆ మాటను అందుకుని సాగదీస్తూ.
    "అయ్యో! ఆ మేఘం పారిపోతోంది. అల్లాగే ఆకాశం పైన ఉంటె ఎంత బావుండును! నేను నల్లగా ఉంటానని వెక్కిరించే వాళ్ళనందరినీ తెచ్చి, నా అందం ఈ మేఘం లాంటిదని చెప్పి ఉందునే!" పార్వతి హాస్యంగా కళ్ళు తిప్పింది.
    "అంతేకాదు. నీ కళ్ళల్లో చిత్రమైన ఆకర్షణ కూడా ఉంది. నీతో బాగా సన్నిహితంగా మెలిగే వాళ్ళు ఆ కళ కనిపెడతారు."
    "అయితే , ఇంతకీ నాతొ కొన్నాళ్ళు కలిసి తిరిగితే కాని నా అందం సంగతి ఎవరికీ తెలియదంటావు. అంతేనా?"
    "అవును." అంది సరోజ.
    "నన్నింత వర్ణించావు! ఇక నువ్వెలా ఉంటావో నేను చెప్పనా?" సరోజ వైపు కంటి కోసలతో చూచింది.
    సరోజ మాట్లాడకుండా పరికిణీ జాగ్రత్తగా సర్దుకుని మోకాళ్ళ ను చేతులతో చుట్టి కూర్చుంది.
    "మీ ఇంట్లో పసుపు పువ్వులు పూసే గులాబీ చెట్టు ఉందా?" అడిగింది పార్వతి.
    "ఊ."
    "డానికి మొగ్గ లున్నయ్యా?"
    "ఆ!"
    "సగం విడిలిన మొగ్గ ఉన్నదా అని?"
    "అబ్బబ్బ! ఊ ఉన్నట్లుంది."
    "అయితే రేపు తెల్లవారు ఝామున నాలుగు గంటలకి లేచి చూడు. అప్పుడు దాని మిగిలిన రేకులు కూడా విచ్చుకుంటూ ఉంటాయి."
    "అయితే ?" అర్ధమౌతూ అవనట్లు చూసింది సరోజ.
    "అప్పటి దాని అందమే నీది. ముగ్ధలా కనిపిస్తూ నెరజాణ!"
    నవ్వాగలేదు సరోజకు. "చాల్లే. మాట లెక్కు వవుతున్నాయి. ఈ మాటల నేర్పంతా రాబోయే పరీక్ష లో ఉపయోగించు. తెలుగు మాస్టారికి అభిమానం కలుగుతుంది. ముందు అటు చూడు, మీ బావ చేస్తున్న ఘనకార్యం." మాట తప్పిస్తూ అంది.
    ఆ అమ్మాయిల కళ్ళు ఒక్కసారి ఆ పరిసరాలను కలయ జూశాయి.
    అది బడి వెనక ఉన్న చిన్న తోట. రింగ్ ఫెన్సు ను అనుకుని గోరింట మొక్కలు, ఎర్ర గన్నేరు చెట్లు అక్కడక్కడా ఉన్నాయి. పడమటి వైపు దట్టంగా చింత మానులు. తోట మధ్యగా నుయ్యి ఒకటి ఉంది. ఆ నూతికి ఈవలి వైపు తోటమాలి పూరిల్లు; ఆవలి వైపు మామిడి చెట్టు. నూతికి అడ్డంగా రెండు వైపులా అరిటి చెట్లు బాగా పెరిగి, గెలలతో నిండుగా ఉన్నాయి. అక్కడి నుండి చూస్తె బడి తరగతులు -- వెనక వైపుని -- స్పష్టంగా కనిపిస్తాయి.


Next Page 

WRITERS
PUBLICATIONS