21
"ఇంకా పైకి చదువుతావా?' అనడిగాడు కమలాకరం చంద్రాన్ని
"చదవమంటే చదువుతాను" అన్నాడతడు.
"నాకోసం చదవడం కాదు. పోనీ బి.ఎల్ పరీక్ష యివ్వరాదూ?"
చంద్రం మొహంలో అయిష్టం చూశాక మరింత బలవంత పెట్టలేదు "సరే నీ యిష్టం" అన్నాడు అక్కడికా సంభాషణ తెంచుతూ.
ఎందుకైనా మంచిదని నెల తిరక్కుండానే చిన్న ప్రభుత్వోద్యోగం లో ప్రవేశ పెట్టాడు కమలాకరం చంద్రాన్ని.
మూడు నెలల తర్వాత , బాగా ఆరోగ్యం చేకూరిన అనంతరం స్థిమితంగా అలోచించి పెండ్లి సంబంధాలు వెదికే ప్రయత్నానికి నాంది జరిపించాడు.
ఒక మనిషికి డబ్బున్నదా లేదా అన్నదే ప్రధాన సమస్య -- చరిత్రలో నిమిత్తం లేని కొందరికి, కాకపోయినా లోకపు తీరు . లోక వ్యవహారాలూ దాని పైనే ఆధార పడి వున్నాయి చంద్రానికి అందంలో కాని, గుణం లో కాని లోపాలు లేవు. మంచి సంబంధాలే వచ్చాయి. కొన్ని సంబంధాలను చూడడాని కైనా ఇష్టపడలేదు కమలాకరం.
ఒక సుముహూర్తాన వచ్చిన , అన్ని విధాల యోగ్యమని పించిన సంబంధాన్ని చూడబోయాడు కమలాకరం చంద్రం వెంట వుండనే ఉన్నాడు.
ఆ అమ్మాయి చెక్కిన దంతపు బొమ్మలా వుంది. వయసు మాత్రం పదిహేడు దాటి వుండదు. చదువు పి.యు.సి . కమలాకరం ఒక ఒప్పందం పెట్టాడు. పెళ్లి అయిన తర్వాత అమ్మాయి పుట్టింటనే వుండి బి.ఏ పూర్తీ చెయ్యాలని, అంతరాలలో ఒక ఉద్దేశం వుంది. వివాహమైన తర్వాత దంపతులు కొన్నాళ్ళు వియోగాన్ని అనుభవిస్తే ప్రేమ బలపడుతుందని కమలాకరం ఊహ.
పెండ్లి కూతురు ప్రక్కనే కూర్చున్న ఆమె తల్లిని చూస్తుంటే కమలాకరానికి తనకు పరిచితులైన స్త్రీలలో ఎవరో ఒకామె అస్పష్టంగా జ్ఞాపకం వస్తోంది.
కమలాకరం చంద్రం తరపున వచ్చిన మధ్యవర్తి ఒక పాట పాడమనే సరికి సిగ్గుపడుతూ కొంతసేపు పాడలేదు. తన కూతురు బ్రతికి వుంటే ఎంత బాగుండేది!-- అది లేని లోటు ఈ అమ్మాయే తీర్చగలదు అనుకున్నాడు కమలాకరం. తప్పక ఈ సంబంధాన్నే స్థిర పరుచు కోవాలని నిశ్చయించు కుంటూ.
"నింగి కి నెలకు వంగిన వంతెనగా " అంటూ ఇంద్రధనుస్సు పాట పాడింది సుశి. ఏటేదుట ఏడు రంగుల ఇంద్రధనువు సాక్షాత్కరిచినట్టయింది కమలాకరానికి. తనకు సన్నిహితమైన ఒక రంగు కాల మేఘంలో లీనమైనట్టు అదృశ్యంగా వుంది. ఆ పిల్ల పాడుతున్న రాగంలో కరుణ రసమే ఎక్కువగా వుంది. కమలాకరం కళ్ళల్లో నీరు చిప్పిల్లి అరిపోవడాన్ని ఎవరూ గమనించలేదు.
అందరూ పెళ్లి కొడుకు వంక వోరగా చూస్తున్నారు. పెళ్లి వారితో ఏ సంగతీ తర్వాత తెలియ పరుస్తామని చెప్పి లేచారు పెద్దలు.
ఇంటికి చేరుకున్నాక సమయం చూచి చంద్రంతో ప్రస్తావించాడు కమలాకరం. నిశ్చయం కాక ఏమౌతుందన్న నిబ్బరం అప్పటిదాకా వుంది. తీరా చంద్రం మొహం చూస్తూనే ఆశ్చర్య పడ్డాడు.
ఉద్వేగాన్ని అణగ దొక్కుకుంటూ ఏం నీకు అమ్మాయి నచ్చలేదే మిటి కొంపతీసి ?" అనడిగాడు ఆదుర్దాగా.
చంద్రం కొంచెం మొగం దించుకుని పారిపోదామన్న ప్రయత్నంలో వున్నాట్టు కనిపించాడు.
"ఇప్పుడే పెళ్లి ఒద్దులెండి నాన్నా!" అన్నాడు చివరి కేలాగో.
అతన్ని వెళ్ళనీకుండా ఆపి -- "మాటనలా దాట వేస్తావెం ?- నచ్చక పొతే ఆ మాట చెప్పు. కాని ఇంతకంటే మంచి సంబంధం దొరకడం ఎంత కష్టమో నీకు తెలీదు. మన కులంలో అందమైన అమ్మాయిలు కనిపించరు." అన్నాడు గంబీరంగా.
"అందం సంగతి కాదు...." అని ఆగిన చంద్రం వంక చూస్తూ "ఎవర్నయినా ప్రేమించావా?" అన్నాడు సూటిగా.
చంద్రం ముఖంలో తడబాటు ను కళ్ళారా చూసిన కమలాకరానికి వేరే జవాబు తో అవసరం లేకపోయింది.
"ఆ మాట పెళ్లి చూపులకు ముందే చెప్పవలసింది ?" అన్నాడు కమలాకరం పెళ్లి చూపులకు ముందే ఆ మాట అడగ వలసిందని లోలోపల అనుకుంటూ. తల్లిదండ్రులు తాము చేసిన పొరపాట్లు తమ పిల్లల మీద రుద్దు తారెందుకో అర్ధమైనట్ల నిపించింది . అలాచేయడం పెద్ద తనాన్ని నిలుపు కొదానికే.
"ఇప్పుడు ఆ అమ్మాయికి మన విముఖత్వం ఎంత కష్టం కలిగిస్తుంది. చదువు, రూపం, కలిమి అన్నీ ఉన్న పిల్లకి లేని లోటో కటి మనం తెచ్చి పెట్టినట్టయింది. అన్నాడు నెమ్మదిగా నొచ్చుకుంటూ "పిరికి వాడి వెందుకయ్యావు?' అని మాత్రం నిలదియ్య లేదు. అతనికి తెలుసు.
చంద్రం కూడా నొచ్చుకున్నాడు. కాని తాను ప్రేమించిన మాట గురించి తండ్రి కేకలు వెయ్యకపోవడం కొంతలో వింత అయింది ఆ కుర్రవాడికి .
"సరే -- ఆ అమ్మాయిది ఏం కులం ?' అన్నాడు కమలాకరం నిగ్రహంతో.
"లింగదార్లు!"
కొద్దిగా ఆశ్చర్యపడి "నిన్ను ఆ అమ్మాయి ప్రేమించిన మాట స్పష్టంగా తెలిపిందా? లేక నీ ఊహలోకమా?" అన్నాడు.
చంద్రం సిగ్గుపడకుండా జాగ్రత్త పడుతున్నాడు. "బాగా తెలుసు."
"మరి వాళ్ళ వాళ్ళు ఒప్పుకునే మాట?--"
"రిజిస్టర్ మారేజీ చేసుకుందామంటుంది."
కొన్ని సమస్యలు తీరినట్ల యింది. అటు పైన కమలాకరం కొన్ని హెచ్చరిక ల్లాటి ప్రశ్నలు మాత్రం అడిగాడు.
"ఆ అమ్మాయి నెమ్మదైనదో కాదో. పరిశీలించావా ఎప్పుడన్నా! కనీసం అలాటి విషయం గురించి ఆలోచించుకోవడం జరిగిందా అని--? తన దృష్టి కి ప్రధాన మైనదిగా తోచిందాన్ని ప్రశ్న చేశాడు కమలాకరం.
ఈసారి చంద్రం సమాధాన మివ్వడానికి అయిష్ట పడ్డాడు.
అది చూచి కమలాకరం అన్నిటి కన్న ముఖ్యం ఆ అమ్మాయి కావడమొకటే నన్నమాట." అనుకున్నాడు స్వగతం లాంటి నవ్వుతో అతని కొకసారిగా వసంత ను ప్రేమించడం, ప్రతిమ తో దాంపత్య జీవనం సాగించడం వెంట వెంటనే గుర్తు కు వచ్చాయి.
సంభాషణ అక్కడికి కట్టుబడి పోయింది.
22
ఎవరి ఇష్టా కష్టాలతో నిమిత్తం లేకుండా భగవంతుడు ముదివేసినట్టు పెండ్లి జరిగిపోయింది. వధూవరుల బాధ్యత సర్వం కమలాకరమె వహించి పెళ్లి నిరాడంబరంగా జరిపించాడు. స్నేహితులకూ, అశ్ర్రితులకూ స్వగృహం లో విందు జరిగింది.
కాని పెండ్లి కూతుర్ని చూచాక కించిత్ ఆశ్చర్య మని పించింది కమలాకరానికి. అప్సరస లక్షణాలేమీ లేవు ఆ అమ్మాయి పద్మిని లో. అప్సరస అంటే కమలాకరం మనసుకి వసంత అన్నమాట! పద్మినిది ఏదో సామాన్య మైన అందం. ప్రతిమ కంటే కూడా కొంటె తక్కువే. ఆ పిల్ల శరీర చాయ చూస్తూనే పంకజం మేనిరంగు గుర్తు వచ్చింది కమలాకరానికి. చంద్రం ఈ అమ్మాయిలో ఏం గొప్ప లక్షణాలు చూచి ప్రేమించాడో మామూలుగానే అర్ధం కాలేదు అతనికి. ఎందుకంటె చాలామందిని ఇట్టే ఆకర్షించే చురుకుపాలు కూడా పైకి కనిపించలేదు. చంద్రాన్ని తెగించి పెళ్ళాడటమే పద్మిని ప్రత్యేకతగా తోచింది. భాగవతం లోని రుక్మిణీ జ్ఞాపకాని కొచ్చి "అవును! ఇంక భాగవతం , రామాయణం మొదలైనవి చదవ నారంభించాలి ....వయస్సు ఏయేటి కాయేడు పైబడుతోంది కదా మరి -- " అనుకున్నాడు విశ్వసిస్తూ.
పానకంలో పుడక లాగ , అందమైన దృశ్యాల్లాటి ఆనందనుభవాలకి అడ్డు కర్ర లాగ చంద్రం తోలి రోజుల దాంపత్య సంపూర్ణ సుఖాలకి అవాంతరాలుగా ఉండకూడదన్న ఉద్దేశంతో కమలాకరం ఇంటి పట్టున ఉండడం చాలా వరకు తగ్గించేశాడు. ఏవో పురాణ గ్రందాలైతే తీప్పించుకున్నాడు కాని-- వాటి పైన మనసుకి ఏకాగ్రత కుదరలేదు. పురాణ కాలక్షేపాలకన్న కమలాకరం దృష్టిని స్నేహ వర్గమే ఆకర్షించుకుంది.
ఏ స్నేహితుడి తోనో కలసి -- బాడ్మింటన్ కోర్టుకో. క్రికెట్ మాచ్ కో -- వీలైతే మార్నింగ్ "షో" కో లేక సెకండ్ షో కో -- షికారుగా లైబ్రరీ వైపో, క్లబ్బు వైపో -- గాలి పీల్చుకునే టందుకు పార్కు వంకో , స్టేషన్ వంకో వెళడానికి బాగా అలవాటు పడ్డాడు.
ఈ గొడవలో అతనికి బాగా సన్నిహితంగా వచ్చిన మిత్రుడు అనంత రామయ్య. అనంతరామయ్య గారింట్లో వారి తల్లి గారైన మంగ తాయారమ్మ తో మాట్లాడడం కమలాకరం కి హాబీగా మారింది. అనంత రామయ్య కి నలుగురు చిన్న వాళ్ళయిన కొడుకులు, ఒకే ఒక్క పెద్ద కూతురు రజని, ముప్పయ్ దాటిన అందమైన రజని నుదుటి మీద వైధవ్యం స్పష్టంగా కాన వస్తుంది. అదిచూచిన కమలాకరం బాధపడ్డాడు అవ్యక్తంగా.
"మీ రజని ఏ పాపం చేసిందని ఆ పిల్లని ప్రాపంచిక సుఖానికి దూరంగా వుంచేశారు?' అని స్నేహంగా నిలదీసి అడిగాడు.
అనంతరామయ్య ఆశ్చర్యాపడి -- "దేవుడు చేసిందానికి నన్నంటా వేమయ్యా?-- అన్నాడు ఇంచుక జీరతో.
"నేడు వితంతువుల్ని పెళ్ళాడే వారు అక్కడక్కడా లేకపోలేదు ఎటొచ్చీ ఆ భాధ అనుభవిస్తున్న వారూ , వారి ఆత్మీయులే ఈ విషయంలో. జాగు చేస్తున్నారు. కనుక మీరు అల్లాటి ప్రయత్నాలు చెయ్యండి --" అన్నాడు కమలాకరం.
అనంతరామయ్య అలొచనలొ పడ్డాడు.
* * * *
సరిగ్గా ఎనిమిదయింది కమలాకరం ఇల్లు చేరేసరికి. చంద్రం ఇంకా వచ్చినట్లు లేదు. సాయంత్రం వచ్చిన పేపరు ఏమాత్రం నలగకుండా టీ పాయ్ మీద వుంది. పద్మినీ పండుకోబోయే ముందు పేపరు చూస్తుంది. అంతవరకు పనుల్లో సతమత మౌతో వుంటుంది. ఒక వేళ చంద్రం లోపలెక్కడో ఉన్నాడను కోడానికూడా ఆస్కారం లేదు. వసారా చిన్న గదిలో ఉండవలసిన జోళ్ళు లేవక్కడ. అలావాటు చొప్పున అక్కడ ఉండి తీరాలి అని.
అలికిడై తలెత్తి చూశాడు. పద్మినీ గాజు గ్లాసు లో డ్రింకు తీసుకు వచ్చింది. కమలాకరం తొమ్మిదింటికి తప్ప భోజనం కి కూచోడు.
వంగి తన ముందు గ్లాసు పెడుతూన్న పద్మిని సుఖాన్ని పరిశీలనగా చూచి తర్వాత గోడ వైపు చూస్తూ వాడింకా రాలేదా పద్మీనీ?" అని అడిగాడు.
"ఇవ్వాళ ఎందుకో ఆలస్యం . చేశారు ....." అంది పద్మినీ ఆగుతూ ఆగుతూ.
"రోజూ వేళపట్టున వస్తాడు కదూ?--"
"వస్తారు" అని సిగ్గు చేత క్లుప్తంగా చెప్పింది.
నలబై పైన ఒకటో రెండో చాటుతున్న కమలాకరం ఇంకా యువకుడు మోస్తరు గా కనిపించడం అతని ప్రత్యేకతే కావచ్చు. పద్మినీ అతని వద్ద జంకడంలో అర్ధం వుంది.
"చదువుకున్న దానివి నువ్వే ఇలా "మాట్లాడటానికి సంకోచపడితే ఎలా అమ్మా?-- అని కొంచెం ఆగి మళ్ళీ అన్నాడు. "గుట్లు ఏవన్నా వుంటే రట్లు చేసుకోక పోవడం మంచిదని నేనూ ఒప్పుకుంటాను. కాని ఏవన్నా లోటు పాటులు మనసుకి తోస్తే, సమయం మించి పోకముందే ఇంట్లో వాళ్లకి తెలియజేయాలి. బాధ వున్నా లేకపోయినా నష్టం మాత్రం వుండదు అలా చెప్పడం వల్ల? ఎమ్మా పద్మీనీ?"
"అవునన్నట్టు తల తాటించి వూరుకుంది. తొమ్మిది దాటినా చంద్రం వచ్చే సూచనలు కనబడక కమలాకరాన్ని భోజనానికి లేపింది ఆ పిల్ల.
భోజనం కానిస్తూ "ఈ కాకరకాయ పులుసు కన్న ,వేపుడుకే ఎక్కువ. కాస్త చింతపండు వేసేస్తే చేదు విరిగిపోయాక, కాకర వేపుడు కి మించిన కూరేక్కడుంది వేరే?-- " అన్నాడు హాస్యంగా. పద్మినీ నవుకునేలా.
"వాడికి, అవపెట్టిన అరటి కాయ కూర ప్రాణం మీ ఇళ్ళలో ఎలా చేస్తారో తెలీదు గాని -- ఆవ పెట్టడ మంటే నాలుగు అవగింజలు విసరడం కాదు-- సరిగ్గా ఇంత అవముద్ద నూరాలి!"
పద్మినీ నోరు తెరుచుకుని విన్నది ఆ పాక ప్రావంగికుడిని.
తాను చెక్కెర వెయ్యని చిక్కని పాలు త్రాగుతాడనీ, ఉప్పు వెయ్యని మజ్జిగ త్రాగడం ఇష్టమనీ, అరగ్లాసు చెక్క లాంటి పెరుగులో అయిదు స్పూన్ల పంచదార అవసరమనీ ఎన్నో చెప్పాడు ఆరోజు కోడలికి. పద్మినీ కి మామగారి పట్ల గౌరవం కలిగింది చనువు ఏర్పడింది.
రాత్రి పది దాటి వచ్చాడు చంద్రం. ఏమంటే -- ఒక మిత్రుడు ప్రమోషన్ సందర్భాన్ని పురస్కరించుకుని టీ పార్టీ ఇచ్చి ఉన్న పళాన సినిమాకు లాక్కు పోయాడట.
