Previous Page Next Page 
క్షమార్పణ పేజి 10


    ఆ ప్రయత్నంగా కేకేశాడు కమలాకరం. చేగోడీలు కొనే ఉద్దేశం కన్న, ఒంటరితనాన్ని మరిచే ఉద్దేశమే వుంది.
    రోడ్డున పోయే చిరు తిండ్లను కొనడం దురలవాటే అయితే, అలాటి దురలవాట్లు నేర్చుకొనటానికి ఇప్పుడు తన వద్ద చిన్న పిల్లలూ లేరు. అదేమని మందలించడానికి పెద్దలూ లేరు-
    నవ్వుకుంటూ ఆ కురరాడిని ఆహ్వానించాడు.
    అంత దొరబాబు తన దగ్గర అణాకి రెండు చేగోడీ లు కొన్నందుకు సిగ్గుపడి తలోంచుకొని డబ్బుల కోసం చూస్తున్నాడు చేగోడీల అబ్బాయి.
    ఒక్క ముక్క కొరికి మొహం చిట్లించాడు కమలాకరం. చదువుకున్న అమ్మాయి అయినా పద్మీని చేగోడీలు బలేగా చేసేది. డొమెస్టిక్ సైన్స్ అమ్మాయేమో ఒకవేళ?
    "డబ్బులిచ్చెండి దొరా? అమ్మ ఒక్కత్తే చూస్తుంటది."
    ఉలిక్కి పడ్డాడు అతను.
    సంభాళించుకుంటూ 'ఆంధ్ర దేశం వాడిలా వున్నావే? నీ పేరేమిటి?-- అన్నాడు కుతూహలంగా.
    "నాపేరు సూర్నారాయణ . మునుపు మాది కర్నూలు. అనక గోదావరి జిల్లా మా అన్న గెంటేసి నాడు మాకు తిండే పెట్టలేక --"
    "అయితే నువ్వూ. మీ అమ్మ ఇక్కడుంటున్నారా? చదువు కుంటున్నావా బడి కెళ్ళి?--"
    "లేదు, మా అమ్మ జంతిక లూ, చేగోడీలు చేసిస్తే బజారు లో, ఊర్లో తిప్పుతుంటాను."
    కమలాకరం సూర్నరాయణను ప్రశాంతంగా చూశాడు. కొద్దిసేపు "నువ్వు మీ అన్నలా చేయనంటే ప్రస్తుతం నీకు పని ఇప్పిస్తాను. ఇంట్లో చిన్నచిన్న పనులన్నీ చేసి పెడతావు. కొళ్ళాయి నీళ్ళు ఇంట్లోకి మోస్తావు" వాళ్ళు పదిహేనో ఇరవయ్యో ఇచ్చి , సంవత్సరానికి నీకు బట్టలు కూడా యిస్తారు" అన్నాడు అనంత రామయ్య అవసరాన్ని దృష్టిలో పెట్టుకున్న అతను.
    కుర్రాడు అప్పటికి తలాడించి పైసాలకు చెయ్యి జాపాడు.
    కమలాకరం లోపలికి వెళ్లి పది రూపాయల నోటు తీసుకు వచ్చాడు.
    "చిల్లర లేదు దొరా?' అన్నాడు బేలగా అబ్బాయి.
    'అక్కర్లేదు -- నీ దగ్గరుంచి-"
    "ఇంకా నేను దొరలా కనిపిస్తున్నా నేమిటి?-- దీంతో మీ అమ్మ కోక పంచె , నీకో చొక్కా చేయించుకో చూడూ -- అ చిరుగు లాగూతో  మాత్రం ఆ నోటు వెయ్యకు సుమా!"
    కమలాకరం వంక క్షణం పాటు రెప్పర్పక చూసి, నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు సూర్నరాయణ.
    అతను వెళ్ళాక కమలాకరం ఆలోచనలు మళ్ళీ ముందుకు సాగాయి. అతనికి స్పష్టంగా దృశ్య మౌతున్న ఆకాశంలో మార్పులు కూడా ద్యోతక మౌతున్నాయి.
    ఇందాకటి ఆరాటం లాటి, మండే వెలుగు లేదు ఆకసాన ఇప్పుడు. అదెంతో ప్రశాంతతను చాటుతోంది ప్రస్తుతం. చల్ల గాలుల తాకిడికి పరవశిస్తున్న మేనులా సౌమ్యం ప్రదర్శిస్తోంది. లేత నీలపు ముత్యాల్ని తలపింప జేస్తున్న గగనం ;లోకి తదేక దీక్షగా చూస్తున్నాడు కమలాకరం.
    ఒక్కొక్కరోజూ, ఒక్కొక్క సమయమూ మాత్రమె అతనిలో తల్లిని చూడాలని కాంక్షను ప్రేరేపింప జేస్తాయి. అపరామిత ఆనందాన్ని కలిగించే అలాటి పవిత్రమైన చల్లని ఊహను అతను అణచుకుందామన్న  అనుచు కోలేడు. ముఖ్యంగా ఆ ఊహ చల్లార్చుకోడం ఇష్టముండదు.
    ఎప్పుడో ఒకరోజు -- తిన్నగా వెళ్లి, తల్లి పాదాల మీద పడి క్షమాపణ కోరతాడని, కోరి తీరాలని కమలాకరం అనుకుంటాడు. అలా అనుకుంటూ చాలా రోజులు గడిపాడు.
    తన క్షమాపణ కి విలువ వుందా అని మధ్య మధ్య నిరాశ కలుగుతుంది. ఒకానొకప్పుడు వసంత ని క్షమాపణ కోరాడు. ప్రతిమ చనిపోయే ముందు, తాను వసంత ను ప్రేమించిన నిజాన్ని వెల్లడించి క్షమాపణ కోరుకున్నాడు. శక్తి హీనమైన నవ్వొకటి నవ్వి, ఆ సంగతి తనకు ముందే తెలుసనీ తెలీనట్టు నటించినందు కు క్షమించమని ప్రతిమ కోరింది. పాపం ప్రతిమ తనను జీవితాంతం గాడంగా ప్రేమించింది.
    విలువ ఉండడం, లేకపోవడం వేరే సంగతి. అందర్నీ కోరినట్టే అమ్మనీ క్షమించమని కోరతాడు తను. ఆ క్షణం ఏదో ఒక విధంగా ఎప్పుడో ఒకరోజు రాక తప్పదు.
    అవాంఛనీయమైన ఏ సంఘటనను తను ఎదుర్కోవలసి వస్తుందో అనేది కమలాకరం అంతరాంతరాల్లోని కల్లోలం, అలాంటి దిగులే వుండకపోతే ఈ పాటికి అతను సజల నేత్రాలలో క్షమించమని తల్లిని కోరి ప్రశాంతతను పొందేవాడు.

                                       27
    నాలుగు రోజుల అనంతరం పొద్దు వాటారుతున్న సమయంలో అనంత రామయ్య యింటి ఆవరణ లో అడుగు పెట్టాడు కమలాకరం.
    అప్పటికి రెండు రోజులిగా జ్వరం వచ్చి బాధపడుతున్నాడు అనంత రామయ్య, అందువల్ల కమలాకరం కి కూడా అంతగా తోచడం లేదు.
    రజని వచ్చి లెమన్ జ్యూస్ యిస్తూ "నాన్నగారు అలా బజార్లో కి వెళ్ళారు బాబాయ్" అన్నది.
    "ఏమిటి -- జ్వర మెప్పుడు పోయింది ?"
    "కమలాకరం ఆశ్చర్యానికి నవ్వుకుంటూ తొంబై తొమ్మిది డిగ్రీల జ్వరాని కాయన లెక్క చేయరు -- అంది రజని వినమ్రంగా.
    "అలాగునా?' అని కమలాకరం కుర్చీలోంచి లేచాడు.
    ఇంతలో "ఎవరే అమ్మడూ? కమలం బాబేనా? ఓ ,మాటిలా రమ్మని చెప్పు --" అని గొంతుక వినిపించింది . రజని అర్ధవంతంగా చూసింది అతన్ని.
    మారు మాటాడ కుండా లోపలి గదిలోకి నడిచాడు. ముసలమ్మ మంచం పైన లేచి కూచుంది. కుర్చీ జరిపి, రజని వెళ్ళిపోయాక , కమలాకరం కూచున్నాడు అందులో.
    "నాయనా! వీడి పిచ్చి విన్నావా?-- కూతురికి మళ్ళీ పెళ్లి చేస్తాడట. అది ముండ మోసి పదేళ్ళాయేను ...ఇప్పుడు డానికి పెళ్లి కాకపొతే ఏ మొచ్చే చెప్పు?--"
    కమలాకరం గతుక్కు మన్నాడు. తన సలహా ఒక చుట్టూ తిరిగి తననే కొట్టినందుకు?"
    ముసలావిడ "పాపం అతగాడు విస్తు పోయాడ"నుకుని "వద్దంటే వద్దని నాలుగు రోజులు దేబ్బలాడాను బాబూ! పెద్ద ముండని-- నా మాట కాదనేశాడు. సరిగదా, జ్వరం కూడా తెచ్చుకున్నాడు" అంది.
    "తన మూలంగా ఈ ఇంట కలతలు లేస్తున్నాయా?-- ' అనుకుంటూ గొంతు సవరించు కున్నాడు.
    కమలాకరం సరిగా గంట పైన అర్ధగంట వితంతు వివాహాల లాభాలు, పూర్వుల ఆచారాలు మూడా చారాలుగా మారిన తీరులు. సహజ వాగ్దోరణి తో వినయంగా విన్నవించుకున్న మీదట ముసలామె మనసు కదిలింది. మరో విధంగా చెప్పాలంటే డెబ్బది యేండ్ల ప్రాయాని కావిడ మనసు పురోగమననికి దారి వెదుక్కుంది.
    మర్నాడు అనంతరామయ్య నీ ఋణం ఎన్నటికి తీర్చుకోలేను కమలాకరం !" అన్నాడు.
    "దేనికి?"
    "మా అమ్మ మనసు ఏభై యాళ్ళాయి నేను మార్చలేక పోయాను. నిమిషాల మీద ఆవిడ మాట కట్టేశావు" అన్నాడు.
    కమలాకరం హాయిగానే నవ్వి "సంతోషం " అన్నాడు.
    తీరిగ్గా కూచుని తన అన్వేషణ వైనం చెప్పడం మొదలెట్టాడు అనంతరామయ్య.
    "తిరుపతి లో మావాళ్ళ యువకుడు ఒకతను ఉన్నాట్ట కమలాకరం! వయసు ముప్పయ్ అయిదు దాటి నలభై కి దగ్గర పడుతుంది. పెళ్ళంటే ఇష్టం లేక ఇన్నాళ్ళూ వట్టినే ఉండి పోయినట్టు చెప్తున్నాడు. మా అమ్మాయిని చేసుకోమని బ్రతిమాలడానికి బయల్దేరాలను కుంటున్నాను --"
    "తప్పకుండా వెళ్ళండి? మీకు జయ మౌతుంది" అన్నాడు కమలాకరం.
    "అంతమాటన్నావు . కాను అదే చాలనుకోను. నీ సహాయం పూర్తిగా కావాలి నాకు."
    "నేను కాదంటానా?" తీసుకోండి."
    "అయితే తిరుపతి ప్రయాణానికి సిద్దమేనన్న మాట?"
    నిలువు గుడ్లు పడిపోయి చూశాడు కమలాకరం. అనంతరామయ్య ఫక్కున నవ్వాడు. అదేనోయ్ బయల్దేరాలి మరి!"
    తమాయించు కున్నాడు కమలాకరం "మీ ప్లాను ఇదై వుంటుందనుకోలేదు ఇంత అర్ధాంతరంగా రావాలంటే --
    "నువ్వలా అడ్డు చెప్తావని ముందుగా మాట తీసుకున్నాను" అన్నాడు తీసుకున్న మాటకు తిరుగు లేనట్టుగా అనంతరామయ్య.
    ఇబ్బందిగా కదిలి "ప్రయత్నిస్తా" నని మాత్రం అన్నాడు కమలాకరం.
    రాక ఏం చేస్తాడు అన్నట్టుంది అనంతరామయ్య ధోరణి.
    "అమ్మాయిని కూడా తీసుకు వెళ్తాను. తిరుపతి దేవుని దర్శనాని కన్న నెపంతో. అలాగ అమ్మాయిని అందచందాలు అతను చూసే అవకాశం కలుగుతుంది. అటుపైన నువ్వు అన్నట్టు దైవ నిర్ణయం ఉండనే వుంది."
    "ఊ--" అన్నాడు కమలాకరం ముభావంగా.
    అన్నట్టు-- మీ అబ్బాయి దగ్గరి దిగవచ్చు కూడా వస్తూ వస్తూ ! నువ్వు నాలుగు రోజులుంటే వాళ్లకి తృప్తిగా ఉంటుంది."
    అనంతరామయ్య వాక్యం పూర్తీయేలోగా ఉలికిపాటు సర్దుకుని "ఇప్పుడెక్కడ వీలవుతుంది? అనేశాడు ముక్తసరిగా. అనంతరామయ్య సమస్యా పూర్తితాలైన అనేక ఆలోచనల్లో ఉన్నారేమో -- అందుచేత కమలాకరం ముఖ కనులలోని కలవర పాటుతో పాటు తడబాటు నిండిన వాగ్దొరణిని సైతం చూడలేదు.

                                                     *    *    *    *
    అనంత రామయ్య తో కలిసి తిరుపతి వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు కమలాకరం. దైవ సన్నిధి లో నాలుగు రోజుల పాటు అయినా మనస్సు కల్పించే చికాకులకు దూరంగా మనగలదే మోనన్న మధుర శాంతియుత భావన మెరిసింది .
    కాని-- అటు వేపులకు వెళ్ళాలంటే తానెందు కింతగా బెదిరి పోవాలో తనకే అర్ధం కాకుండా వుంది.     
    బహుళ పంచమి -- శనివారం రోజు ట్రెయి నేక్కారు ముగ్గురూ.
    "కళ్ళజోడు అలవాటు ఎప్పటి నించీ?" అనడిగాడు అనంతరామయ్య కమలకరాన్ని హాస్యం చేస్తూ.
    "ఇవాళ నుంచే అనుకోండి! ఎందుకంటె ఇలాటి అలవాట్ల కు నాంది ఎప్పుడో చెప్పలేం"
    కొత్తగా దిద్దుకున్న క్రాపును అరిచేత సద్దుకుంటూ సమాధానం చెప్పాడు.
    అంతా చోద్యం అనిపించింది అనంతరామయ్య కి.
    ముప్పయ్ ఏళ్ళు న్నా నిండా పాతిక వున్నటన్నా కనిపించడు రజని. వాడని మనసు వల్లనేమో!-- ఆ అమ్మాయి సందడి ఎక్కువగా వుంది. ఆ సెకండ్ క్లాసు కంపార్టు మెంటు లో నోరు ఎండి నప్పుడల్లా ఫ్లాస్కు లో కాఫీ, కూజా లో నీళ్ళు వొంచి ఇస్తూ వెంట తెచ్చిన చాకలెట్లు, ఇస్తూ చాలా అండగా వుంది పెద్ద వాళ్ళిద్దరి కి.
    వైధవ్యం వరించిం తర్వాత ఇదే కాబోలు రజని దూర ప్రయాణం అనుకున్నాడు కమలాకరం జాలిగా.
    ముఖ్యంగా కమలకరాన్ని వదిలి పెట్టలేదా పిల్ల. "ఈ ప్రదేశాలన్నీ మీకు బాగా తెలుసన్నారు మరి -- అన్ని విశేషాలు చూపించి, వాటి గురించి చెప్పండి బాబాయ్!" అని మొదలెట్టింది.
    "ట్రెయిన్ లోంచి విశేషాలు చూపమంటే ఎలానమ్మా రజనీ" అన్నాడు కమలాకరం.
    "అమ్మాయిని ఇన్నాళ్ళూ ఖైదు లో పెట్టానా? అని తనని తాను ప్రశ్నించు కున్నాడు అనంతరామయ్య. పెళ్లి ముఖ్యమే కావచ్చు మళ్ళీ పెళ్లి అయినా ! కానీ "దాని" కి ఉల్లాసకరమైన పనులు, వస్తువులు ఈ ప్రపంచంలో ఇంకెన్ని లేవని ! అది నవయుగం లోని పిల్ల అన్నమాట ఇన్నాళ్ళూ తాను మరిచి పోయారు కాదా!.....
    తిరుపతి లో దైవ దర్శనమూ అయింది. వరుని దర్శనమూ అయింది. కమలాకరం , అనంతరామయ్య అతగానితో మాట్లాడవలిసినదీ మాటాడదలచినదీ-- సంపూర్తిగా మాట్లాడి గాని ఊపిరి తిప్పుకోలేదు అతను-- రామారావు చాలా బిడియ పడ్డాడు.
    "పెళ్ళంటూ చేసుకుంటే ఎలాటి అమ్మాయి అయినా ఫరవాలేదు" అనేమాట అతని నోటి నుంచి రావాలని తహతహ లాడారు అనంతరామయ్య, అతని ననుసరించి కమలాకరం.
    "ఇప్పుడిప్పుడే పెండ్లి చేసుకోవాలని పోస్తోం"దన్న అభిప్రాయాన్ని ప్రకటించాడు వరుడు. అంతటితో ఊరుకుంటే అనంతరామయ్య గారు ఊహ లోకంలో వివరించి వుందురు.
    "ఈ విషయంలో మా పెద్ద వాళ్ళను సంప్రదించాలి" అనేసరికి నీరుగారి పోయారు ఇద్దరూ కమలకారమే మొదట తమాయించు కుని, యదా ప్రకారం సంభాషణ కొనసాగించాడు.
    పెద్దవాళ్ళ అనుజ్ఞ మీద ఇన్నాళ్ళూ అవివాహితుడుగా ఉన్నాడా ఈ బుద్ది మంతుడు -- అనుకున్నాడు కమలాకరం లోలోపల రజినిని చూసి నప్పుడల్లా అటువంటి రత్నాన్ని చేపట్టుదా మనిపించ లేదు కాబోలు -- ఏమో ?-- ఎవరి మనుసులు ఎలాటివో సృష్టి కర్తకే తెలియాలి అనుకుని, ఆ వ్యక్తీ గురించి ఆలోచించడం తగ్గించుకున్నాడు.
    తిరుగుముఖం ట్రెయిన్లో అనంతరామయ్య నిరుత్సాహంగా , ఉల్లాస రహితంగా కనిపించడంతో అతన్ని ఏదో విధంగా ఓదార్చి నచ్చ జెప్పవలిసిన బాధ్యత కమలాకరం వంతు అయింది. రజని అదేమీ పట్టించు కోకుండా కిటికీ లోంచి పరుగులెత్తే జగత్తును చూస్తూ కూచున్నది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS