Previous Page Next Page 
సంపెంగ పొదలు పేజి 9


                                       9

           
    పెళ్లి పందిరంతా మెర్కురీ లైట్ల కాంతి లో ధగధగ ప్రకాశిస్తుంది. పట్టుచీరెల రెపరెపలు గాజుల గల గలలు, సువాసనల ఘుమఘుమ లు, పిల్లల ఏడుపులు, హడావుడి కేకలు, కన్నె పిల్లల విలాసాలు, వయసు గాళ్ళ హొయలు, ఆడంగుల కబుర్లూ వీటన్నిటితో ఆ పందిరి కళకళ లాడిపోతోంది. పురోహితులు మంత్రాలు పఠిస్తున్నారు. సన్నాయి అత్యంత మధురంగా "సీతమ్మ పెళ్లి కూతురాయెనే" వాయిస్తోంది. శంకర్ లేచి తన ఎదురుగా సీతాదేవి లాగా కూర్చున్న దుర్గ మెళ్ళో మంగాల్యాల ను సూత్రంతో బంధించాడు. దుర్గ గుండెలు దడదడ లాడాయి. ఆనాటితో తన జీవిత చరిత్ర పూర్తిగా మారిపోయిందనుకుంది . తనను తాను మనసారా శంకర్ పాదాలకు సమర్పణ కావించుకుంది. అంతులేని సంతోషంతో గిరి వాళ్ళ మీద ఉత్సాహంగా అక్షింతలు వేశాడు. మనసులో ఏమేమో ఆశీర్వదించు కుంటూ. హరీ, ఉమా కూడా వదూవరు లపై అక్షింతలు జల్లారు -- గిరి హరి వెనుకగా వచ్చి, భుజం మీద చెయ్యి వేసి, 'తొందర పడకు నాయనా! ఇంకో మూడేళ్ళాగు. నీ నెత్తి మీద కూడా మేమంతా అక్షింతలు వేస్తాం." అన్నాడు. హరి నవ్వాడు. కానీ, ఆ నవ్వులో ఏదో వెలితి, దిగులు కనిపించాయి. అది గమనించిన గిరి మనసు సానుభూతితో నిండి పోయింది. తాను ఆ చిరునవ్వు లోని దిగులును పోగొట్ట గలుగుతే ....అది సాధ్యమా? ఆప్రయత్నంగా అతని చూపులు ఉమ కోసం వెతికాయి. అడ వాళ్ళలో ఎవరితోనూ కలవకుండా , ఒక స్తంభానికి అనుకుని నిపుణుడైన శిల్పి చెక్కిన విగ్రహంలా ఉన్న ఉమ, తదేకంగా దుర్గా, శంకరు లను చూస్తోంది. గిరి తీక్షణమైన చూపులకు ప్రభావితురాలయి, ఉమ కూడా తన చూపులను తిప్పింది. ఆ ప్రయత్నంగా ఆమె పెదవుల పై చిరునవ్వు నాట్యం చేసింది. గిరిని చూస్తేనే ఉమా కళ్ళు ప్రాణం పెట్టాయి-- ఆమె చిరునవ్వు లోని మాధుర్యమూ, కళ్ళలోని ఆప్యాయత , గిరికి తేలికగానే అర్ధమయ్యాయి. సమాధానంగా తను నవ్వాడు. సంతోషమూ, దుఖమూ అతని మనసులో సమంగా నాట్యం చేస్తున్నాయి.
    పెళ్లి పనుల్లో ఉమ ఎంతో పాల్గొంది. వడ్డన లలో దుర్గను తయారు చెయ్యటం లో, బ్రాహ్మణులకు పెద్దలకూ , అవీ ఇవీ అందించటం లో అంతటా ఉమ తనే అయింది.
    కానీ, అక్కడ సమావేశమయిన వారిలో ప్రతి ఒక్కరూ తనను హరి కాబోయే భార్యగా గుసగుస లాడి నప్పుడు, కొందరు మోటుగా ముఖం ఎదురుగానే, వేళాకోళం చేసినప్పుడు మాత్రం ఉమ మనస్సు కలుక్కు మనేది. హరి కూడా హడావుడి గా తిరుగుతూనే ఉన్నాడు. కానీ, అంత కంత హుషారుగా లేదు. శంకర్ స్థానం లో అతను మొదటి నుంచీ గిరినే ఊహించు కున్నాడు. దుర్గా, శంకర్ ల వివాహా ప్రస్తావన విన్నప్పుడు. హరి ఎంతో ఆశ్చర్య పోయాడు. బహుశా, దుర్గే గిరిని కాదని ఉంటుందని ఊహించుకున్నాడు.చెల్లెలి మీద ఎంతో కోపమూ, గిరి పట్ల సానుభూతి కలిగాయి. గిరి పెళ్లి పనుల్లో ఉత్సాహంగా పాల్గొంటుంటే , గిరి మీద అతనికి గౌరవం పెరుగసాగింది. ఈ సానుభూతి భావన హరిని గిరికి మరింత సన్నిహితుడ్ని చేసింది.
    దుర్గా శంకర్ లకు ఆ రాత్రే పునస్సంధానం నిర్ణయించారు. ఉమ తన చేతులతో స్వయంగా దుర్గను అలంకరించింది. తెల్లని చీర, తెల్లని జాకెట్టు , జడలో తెల్లని సన్న జాజులు , ఎక్కడ లేని అందాన్ని సంతరించుకుంది. ఉమ వంగి దుర్గ చెవిలో 'ఈరోజు నీ కోసం క్రొత్త ప్రపంచపు తలుపులు తెరుచుకుంటున్నాయి. పో జాగ్రత్తగా ప్రవేశించు, ఆ లోకం లోకి.' అని బుగ్గ మేలి పెట్టింది. నోటి మాట రాక దుర్గ ఆమెను తన చేతితో మృదువుగా వెనక్కు నెట్టింది.
    అప్సరస లా, అడుగు పెట్టిన దుర్గను చూసి శంకర్ నిలువెల్లా పులకరించాడు. ఆమెను సమీపించి కోగిట్లో పొదివి కొని, "నీ, శరీర కాంతితో ఈ గదినంతా ప్రకాశ మానం చేశావు. నీ అంతరంగిక సౌందర్యంతో నా బ్రతుకును తేజో మాయం చెయ్యాలి." అన్నాడు. ఆ మాటలకు దుర్గ ఎంతో సంప్రీతురాలయింది. ఆరాధనా భావంతో అతని వంక ఒకసారి చూసి, అతని కౌగిట్లోంచి జారి పాదాలకు నమస్కరించింది. శంకర్ ఆమెను ఆప్యాయంగా లేవనెత్తి గాడంగా గుండెలకు హత్తుకుని, సిగ్గుతో తల వంచిన ఆమె చుబుకాన్ని స్పర్శించి, ముఖాన్ని పై కెత్తి "సమాధానం ఇయ్యవూ" అన్నాడు.
    దుర్గ బలవంతాన గొంతు పెగల్చుకుని "నాదేమీ లేదు. మీ తెజేస్సే , నాలో ప్రతిఫలిస్తుండవచ్చు." అంది. శంకర్ నవ్వి ఆమెను తన రెండు చేతులతో ఎత్తుకుని మంచం మీద పడుకో  బెట్టాడు.
    కోడి కూత విన్న దుర్గ "ఎలా తెల్లవారిందా ?' అని ఆశ్చర్యపోయింది. తనవంక కొంటెగా గర్వంగా చూసే శంకర్ నేత్రాలను, తన మెత్తని చేతులతో మూసి, చటుక్కున మంచం మీంచి లేచి గది తలుపులు తీసుకుని తడబడే కాళ్ళతో బయటకు నడిచింది.

                                     10
    ఉమ తన ప్రయాణానికి అన్నీ సర్దుకుంటుంది-- హరి ఆమెకు సమీపంలోనే ఒక సోఫాలో కూర్చున్నాడు. ఎంతకూ ఉమ తలెత్తక తలవంచుకుని తన పని తను చూసుకుంటుంటే , హరి విసుగెత్తి 'ఉమా' అన్నాడు ఆమె దృష్టి మళ్ళించటానికి, ఉమ ఒకసారి తలెత్తి చూసి మళ్ళీ తన పనిలో లీనమయింది.
    "కాస్త నా మాట విను." అన్నాడు హరి కరుగ్గా.
    "వింటూనే ఉన్నాను, మాట్లాడు ." అంది ఉమ నిర్లక్ష్యంగా తలెత్తకుండానే.
    "అదికాదు ఉమా! మనం పెళ్లి చేసుకుంటే మాత్రం నువ్వు చదువు కోవటానికేం ?"
    "బావా!......" విసురుగా తలెత్తిన ఉమ హరి ముఖం చూసి తల దించుకుంది.
    "నన్ను పదిసార్లు విసిగిస్తే నీకేం వస్తుంది?"
    హరి ముఖం మీద చన్నీళ్ళు జల్లినట్లుంది ఆ సమాధానం కొన్ని క్షణాలు మాట్లాడలేక పోయాడు.
    "నిన్ను విసిగిస్తున్నానా, ఉమా!"
    "చాలా!...."
    హరికి కష్టం తోచింది. ఉమ వంక నిదానించి చూస్తూ "అసలు నీకు నా మీద మునుపటి ప్రేమ లేదులా ఉంది."అర్ధం చేసుకోవటం లో ఉంది."
    "అంటే...."
    ఉమ హరి ముఖంలోకి చూసింది. ఏదో చెప్పాలని ఆమె పెదవులు కదిలాయి. అంతలో తల వంచుకుంది. ఆమె ఏదో చెప్పబోయి సందేహిస్తుందని హరి గ్రహించాడు.
    "నా దగ్గిర సంకోచ మెందుకు ఉమా చెప్పు!...." అన్నాడు.
    ఉమ ధైర్యం చేసింది.
    "నా మనసు చదువు మీద తప్ప మరి దెనిమీద లేదు. నువ్వు పెళ్లి చేసేసుకుంటే మంచిది బావా?"
    హరి ఉలికిపడి నిటారుగా కూర్చున్నాడు.
    "ఇలా నువ్వు మాట్లాడటం ఇది రెండవ సారి. ఇదేమిటి ఉమా! నేను నిన్ను తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసికొను. నన్ను తప్ప ఇంకెవర్నీ నిన్ను చేసుకోనివ్వను. నువ్వు నా దానివి."
    ఉమ గుండెలు ఝల్లు మన్నాయి. హృదయంలో నుండి మూగగా అల్లరి పెడ్తున్న అంతంలేని అనేక భావాలు, హరి ముందు భాషను కల్పించు కోలేక పోతున్నాయి. హరి అమాయక మైన ముఖమూ, అతని నిర్మలమైన అనురాగమూ , ఆమె గొంతు నొక్కి వేస్తున్నాయి. హరి దీక్షగా క్షణ కాలం ఉమ ముఖంలో మారే రంగుల్ని పరిశీలించాడు. ప్రప్రధమంగా అతనికి ఉమకు తన మీద గల అనురాగం మీద శంక జనించింది. కానీ ఆ భావన అతదేక్కువ కాలం భరించలేక పోయాడు. తన వ్యధిత హృదయాన్ని తానే అసందర్భపు సమాధానాలతో ఊరడించు కున్నాడు.
    "పోనీయ్ లే ఉమా! రెండేళ్ళు గడిచిపోయాయి. ఇంక మూడేళ్ళు ఎంతలో గడిచి పోతాయీ? ఇంకెప్పుడూ నిన్ను విసిగించను లే!" అన్నాడు. ఉమ కడుపు తరుక్కు పోయింది. ఇట్లాంటి హరికి తను అసలు విషయాన్నెలా చెప్పగలదు? చెప్పకుండా ఎలా ఉండగలదు?
    "నన్ను క్షమించు బావా!' అంది చెమ్మగిల్లిన కళ్ళతో.
    ఉమ చెమ్మగిల్లిన కళ్ళు, హరికి మరొక విధంగా అర్ధమయ్యాయి. అతని మనసులో అంతకు పూర్వం ఉన్న గ్లాని అంతా ఎగిరి పోయింది.
    "ఊరుకో ఉమా! మనమధ్య క్షమాపణ లేమిటీ ?' ఆర్ద్ర స్వరంతో అన్నాడు----
    ఉమ మాట్లాడలేదు. హరే , మళ్ళీ సంభాషణ ప్రారంభించాడు.
    "పోనీ, ఇంకో రెండు రోజు లుండరాదా?"
    "వీల్లేదు బావా! నాకు సెలవు లేదు. అయినా నేనిక్కడుండి చేసేదేముంది?"
    ఈ ఆఖరు మాటలు హరి మనసులో గుచ్చు కున్నాయి. ఎంత ఉత్సాహం తెచ్చి పెట్టుకున్న హరి మనసు మాటిమాటికి ఉమ మాటలతో కృంగి పోతుంది. ఆమెతో సరదాగా కాలక్షేపం చెయ్యాలని తానెంత ఉబలాట పడుతున్నాడో ఆమె అంతగా దూరంగా పోతుంది.
    విసుగ్గా అక్కడి నుండి లేచి పోయాడు హరి -- హరిలోని భావ పరివర్తన ను ఉమ గమనించక పోలేదు. అతనిని వెనక్కు పిలుద్దామని అనుకునీ తన సానుభూతి ని అతడు మరోకలాగ అర్ధం చేసుకోవచ్చుననీ, అతడిని మరింత ఉత్సాహ పరచడం మంచిది కాదనీ ఊరుకుంది.
    సామానులన్నీ సర్ది వారగా ఉంచీ, ఒక పత్రిక చేతిలోకి తీసుకుంది. అంతలోనే బయట అడుగుల చప్పుడు వినిపించి ఉమ గుండెలను గుబగుబ లాడించింది. ఆ అడుగుల చప్పుడు ఎంత గందర గోళం లో నైనా ఉమ గుర్తించగలదు. అవి గిరివి.
    ఉమ, ఒక్కత్తే ఉండటం చూసి ఆశ్చర్యంగా "హరి ఇంట్లో లేడా?' అన్నాడు గిరి.
    "లేదు. ఇప్పుడే రావచ్చు. కూర్చోండి." అంది ఉమ.
    ఇట్లాంటి సన్నివేశాన్ని ఎదుర్కోవలసి వచ్చినందుకు గిరి ఇరుకున పడ్డాడు. నేను కూర్చోనని వెళ్ళిపోవటం అతనికి సబబుగా తోచలేదు. ఆ శక్తీ లేకపోయింది. ఇట్లాంటి అవకాశం కోసం ఉమ రెండు సంవత్సరాలుగా తపస్సు చేసింది. ఎన్నెన్నో మాట్లాడాలని ఊహించింది. ఈనాడు నిజంగా తాను కోరుకున్న అవకాశం లభించినా అమెకునోట మాట రావటం లేదు.
    "బాగా చదువుతున్నారా?" అన్నాడు గిరి యధాలాపంగా ----


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS