Previous Page Next Page 
సంపెంగ పొదలు పేజి 10


    "ఆ! కానీ తరచూ మీరంతా గుర్తుకొస్తూ ఉంటారు."
    "మీరంతా అని నన్ను కూడా కలుపుతా రెందుకూ?" మీరు చెప్పకపోయినా, మీకు హరి ఎప్పుడూ గుర్తుకు వస్తాడని నాకు తెలుసు."
    "కాదు! కాదు! -- ఒక రకంగా మీరే ఎక్కువ గుర్తుకు వస్తారు. ఏం? మీకు నేనెప్పుడు గుర్తుకు రానా?"
    "నాకు చేతినిండా పని ఉంటుంది. నేను ఎవ్వరి గురించి ఆలోచించను." అని చటుక్కున లేచి నుంచుని "నాకు పని ఉంది. హరి వస్తే నన్ను కలవమని చెప్పండి" అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు గిరి.
    అలా వెళ్ళిపోవలసి వచ్చినందుకు అతని హృదయము అంతులేని ఆవేదనతో మూల్గు తుందని తెలియని ఉమ అతడు నడిచిపోయిన మార్గం వంకా శూన్యంగా చూస్తుండి పోయింది.
    
                                       11
    ప్రతినిత్యమూ, తమ ఇంటికి వచ్చి పోయే ఆంగ్లో ఇండియన్ స్త్రీ సముదాయంతో ఉక్కిరి బిక్కిరి గా ఉంది దుర్గకు. రీటా, దేరిస్సా , దిలారా ఇంకా ఎవరెవరో , ఇంచుమించు ప్రతి సాయంత్రమూ, తమ ఇంటికి వస్తూనే ఉంటారు. వాళ్ళ ప్రవర్తన చాలా వెకిలి గానూ, అసహ్యం గానూ, అనిపించేది దుర్గ కి -- అన్నింటి కంటే వాళ్ళతో మితిమీరిన చనువుతో వేళాకోళలాడే భర్త ప్రవర్తన ఆమెకు కొంత సహింపరానిదిగా ఉన్నా, ఇంతింత మాత్రానికే వేరుగా భావించటం, అనుచితమని తనకు తాను నచ్చ చెప్పుకుంది. అయినా సాహసించి, ఒకరోజు సాధ్యమైనంత సాధారణంగా  "మీ ఫాన్స్ లో అందరూ, ఇలాంటి ఆడవాళ్ళ నే ఉంచుకుంటే పని చక్కగా సాగుతుందా? వీళ్ళకు పని మీద శ్రద్ధ ఉంటుందా?" అంది.
    శంకర్ పకపక నవ్వాడు,.
    "వీళ్ళు లేకపోతె పని సాగదు' . వీళ్ళుండేది వళ్ళు వంచి పని చేయడానికి కాదు. దేనికి వేరే మగ గుమాస్తాలున్నారు-- తమ హొయలతో, వాల్చూపు లతో, చిరునవ్వు లతో అందరినీ షాపు కి ఆకర్షించటం -- తమ మాటల చాకచక్యంతో ఒక రూపాయి వస్తువు కొనదలుచుకున్న వాళ్ళ చేత, వంద రూపాయల వస్తువులు కొనిపించటం వీళ్ళ పని. ఆ పనిలో వీళ్ళు చాలా నేర్పరులు. తెలియటం లా?'
    దుర్గ ఆశ్చర్యంగా చూసింది.
    "అయితే మరి ...." అని క్షణ కాల మాగి "అట్లాంటి తేలిక మనుష్యులతో మీరంత స్నేహముగా ఎలా మసలగలుగుతున్నారు?"
    శంకర్ ఇంకోసారి బిగ్గరగా నవ్వాడు ------
    "నీ తలకాయ! స్నేహ మేమిటి? నా అందం చూసేవాళ్ళు నా వెంట పడుతున్నారు. ఏదో కులాసా కాలక్షేపం లే అని నేనూ సాగనిస్తున్నాను."
    ఈ సమాధానికి దుర్గ నిర్ఘాంత పోయింది. ఎంత అణచుకుందామన్నా అణగని అసహ్యం ఆమె మనసంతా క్రమ్ముకోసాగింది --- తాను తేలికగా భావించే వ్యక్తులతో కాలక్షేపం కోసం ఆనందాన్ని వెతుక్కోగలిగిన వాడా తానారాధించే తన భర్త/ తన సౌందర్యపు విలువను ఈ విధానం లో కొలుచుకోవాలను కుంటున్నాడా?"
    శంకర్ దుర్గ ముఖంలో మార్పును కనిపెట్టాడు. దగ్గిరగా వచ్చి నవ్వుతూ , "ఈర్ష్యా?" అన్నాడు.
    దుర్గ ముఖం జేవురించింది. "ఛీ! నేను ఈర్ధ్య పడటం సంభవిస్తే , నా సాటి వారిని చూసి మాత్రమే ఈర్ధ్య పడతాను." తీవ్రంగా అంది -- ఆ తీవ్రత్వము శంకర్ మనసుకు చురుక్కున తగిలింది. ఒక లిప్త మాత్రం అతని బొమలు ముడి పడ్డాయి. అంతలో నవ్వుతూ దుర్గను తన చేతులతో చుట్టి వేసి "వాళ్ళంతా , నా చేతి క్రింద పని చేసేవాళ్ళు, వాళ్ళతో మంచిగా ఉంటె, పని చురుకుగా సాగుతుంది. నువ్వీ విషయం గురించి ఆలోచించకు." అన్నాడు. అంతే! దుర్గ మనసులోని సమస్తమైన గ్లానీ ఎగిరిపోయింది. శంకర్ చిరునవ్వులో ప్రపంచంలోని సౌందర్యాన్నంతా, చూడగలదు దుర్గ -- అతని లాలన లో ప్రపంచాన్నే మరిచి పోగలదు.
    స్వల్పమైన అపాశ్రుతు లప్పుడప్పుడు విన్పిస్తున్నా , తన సంసారం స్వర్గ తుల్యమనే భావింప కలుగుతుంది దుర్గ----
    "దుర్గా!' అన్న శంకర్ గర్జన లాంటి పిలుపు విని హడలి పోతూ, గదిలోకి పరుగెత్తింది దుర్గ --
    గిరి, దుర్గను ముందరే హెచ్చరించాడు. "శంకర్ కు అన్నీ మంచి గుణాలే కానీ కోపమూ, మొండి పట్టుదలా ఎక్కువ. అతనితో ఎప్పుడూ వాదనల కు దిగాకు, పంతాలకు పోకు , సౌమ్యంగా సర్దుకు పోవటానికి ప్రయత్నించు.' అని. ఇంతవరకూ దుర్గ శంకర్ కోపం రుచి చూడలేదు. మొదటిసారిగా , ఉద్రేకంతో ఎర్రబారిన అతని ముఖం చూసి పులిని చూసిన లేడి పిల్లలాగా వణికిపోయింది.
    "ఈ డ్రాయర్ లో మొన్ననే కదా వంద రూపాయలు పెట్టింది? ఇవాళ చూస్తె రెండే ఉన్నాయి. రెండు రోజులలోనే వంద ఖర్చయి నాయా?"
    శంకర్ బుసలు కొడ్తూ తీక్షణంగా అడిగాడు. దుర్గ తెల్లబోయింది. అసలు ఆ పర్స్ లో ఎంత ఉందొ దుర్గకు తెలియదు -- శంకర్ ఎప్పటి కప్పుడు ఇంటి ఖర్చులకు కొంత డబ్బు ఆ పర్స్ లో పెట్టి డ్రాయర్ లో ఉంచుతాడు. అవసరాలకు దుర్గ వాడుతూ ఉంటుంది. ఎంత తీస్తుందో, ఎంత పెడ్తుందో దుర్గకేమీ గుర్తు ఉండదు. శంకర్ అకస్మాత్తుగా వేసినా యీ ప్రశ్నకు ఏం సమాధాన మియ్యాలో దుర్గకు తెలియలేదు.
    "అందులో వంద రూపాయలు ఉన్నాయా?" అంది అమాయకంగా -- శంకర్ రెచ్చిపోయాడు.
    "ఏం? నేను అబద్ద మాడుతున్నా నంటావా? కాకపోతే నా ఇంట్లో నేనే దొంగతనం చేసానంటావా?
    దుర్గ చెవులు మూసుకుంది. కళ్ళలో తిరుగుతున్న నీళ్ళను బలవంతాన ఆపుకుంటూ నిల్చుంది. ఇంతలో ఈ కేకలకు శంకర్ తల్లి కామేశ్వరమ్మ అక్కడికి వచ్చింది.
    "ఏమిట్రా శంకర్! ఆ కేకలు? పిల్ల బిక్కచచ్చిపోతుంది." అంది. దుర్గకు అత్తగారిని చూశాక ప్రాణం లేచి వచ్చింది. ప్రాధేయ పూర్వకంగా ఆవిడ వంక చూసింది.
    "ఇందులో మొన్ననే వంద రూపాయలు పెట్టాను. ఇవాళ రెండే ఉన్నాయి. మిగిలినవి ఏం ఖర్చయ్యాయని అడుగుతున్నాను." గట్టిగా అన్నాడు శంకర్.
    కామేశ్వరమ్మ పొడి నవ్వు నవ్వింది. "బాగుందిరా! వంద రూపాయలంటే మీకొక లెక్కా ఏమిట్రా? నువ్వొక షావుకారివి'. ఎంతైనా తెగలవు? ఇంక దుర్గ కలవారింట్లో అపూరుపంగా పెరిగింది -- ఇలాంటి వందలు రోజుకో ఎన్ని ఖర్చు చేసిందో? ఒక వంద రూపాయలకు ఇంత రాద్దాంతం చేస్తా వేమిటి?"
    అత్తగారి ధోరణికి దుర్గ రాపడి పోయింది. మతి లేని దానిలా ఆవిడ ముఖం వంక చూస్తుండి పోయింది. శంకర్ చిరాకుతో ఉన్నాడేమో, ఈ మాటలు అతనిని మరింత మండించాయి.
    "కలవారి పిల్లయితే, వాళ్ళింట్లో ఖర్చు పెట్టుకోమను. అక్కడ్నుంచీ తెచ్చి పెట్టుకోమను. ఇక్కడేం నేను రాసులు పోసుకోలేదు దుబారా చెయ్యటానికి."
    తన కన్నీళ్లు ఆపుకోలేక, అక్కడ్నుంచీ వెళ్లి పోతుంది దుర్గ.
    ఆ పగలంతా ఎలాగో తన మనో భారాన్ని అణచుకున్న దుర్గ, ఆ రాత్రి శంకర్ పాదాల మీద వాలి భోరున ఏడ్చింది. దీనమైన ఆమె ముఖం చూసే సరికి శంకర్ హృదయం ద్రవించింది. ఆమెను గుండెల కదుముకుని లాలనగా తల నిమిరి , "మేము ఎంత హీన స్థితిలో నుండి ఈ స్థితిలో కి వచ్చామో, నీకు తెలియదు దుర్గా! మొదట్లో బాగానే ఉండే వాళ్ళం. కానీ, మా నాన్నగారి దుబారా వల్లనే చితికి పోయాం. మళ్ళీ అలా కాకూడదు. కొంచెం జాగ్రత్తగా ఖర్చు చెయ్యటం నేర్చుకో!" అన్నాడు.
    ఈ ఓదార్పు తో దుర్గ కొంత స్థిమిత పడింది. వెక్కుతూ, "నేను ఎక్కువ ఖర్చు చేసినట్లు లేదు. ఏమో, అయినా లెక్క తెలియదు. ఇంక ముందు జాగ్రత్తగా ఉంటాను." అంది. శంకర్ "గుడ్" అని ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. దుర్గకు మాత్రం మనసులో అల్లకల్లోలం ఇంకా తగ్గలేదు. ఏదో ఆశంకతో మూలిగే హృదయాన్ని ఒదార్చుకుంటూ కలత నిద్ర అనుభవించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS