8
అ రోజు తోటలో , గిరి చెప్పిన దగ్గర్నుండీ శంకర్ గురించి ఎక్కువగా ఆలోచించ సాగింది దుర్గ.
'దుర్గా! నేను కూడా నిన్ను హరి లాగానే ప్రేమిస్తున్నాను. అందుకనే ఈ విషయం చెప్పడానికి సాహసిస్తున్నాను. శంకర్, నువ్వు భార్య భర్తలయితే బాగుంటుందని పిస్తుంది నాకు. అయినా నువ్వూ ఆలోచించుకో! అతను ఏమీ చదువుకో లేదు. ఆ చదువు లేకపోవటానికి కారణం అతని తెలివి తక్కువ కాదు. చిన్నప్పటి నుండి తగిన శ్రద్ధ తీసుకోక పోవటం, అయినా అతనికి డబ్బు లేలోటు లేదు. చాలా రోజుల్నుండీ నాకు బాగా తెలుసు. సహృదయుడనే అనిపిస్తుంది. నాకొక చెల్లెలుంటే తప్పక శంకర్ కే ఇచ్చేవాడిని. అందుకే ఇప్పుడు ఈ నీ దగ్గర ఈ ప్రస్తావన తెస్తున్నాను." అన్నాడు గిరి.
దుర్గ కా మాటలు తరచూ గుర్తుకు వస్తున్నాయి. శంకర్ డి మంచి నిండైన విగ్రహము. చామన ఛాయ -- కళ్ళు చిన్నవైనా, ఆకర్షణీయమైనవి. మొత్తానికి చూడం గానే చాలా అందగాడనిపిస్తుంది. శంకర్ చాలా అందమైనవాడని దుర్గ ఇదివరకే మనసులో అనుకుంది. ఆలోచించిన కొద్దీ శంకర్ తన భర్త కావటం తన అదృష్టమే ననిపించింది దుర్గకు---- అతనికి చదువు లేదు. అయితే ఏం? అదీగాక, తను మాత్రం మరీ చదువు కుందా?
అలోచించి, అలోచించి తన అంగీకారాన్ని గిరికి చెప్పింది దుర్గ. శంకర్ ను గూడా సంప్రదించి హరి ద్వారా ఈ విషయం దుర్గ తల్లి తండ్రులకు చెప్పించే భారం తన మీద వేసుకున్నాడు గిరి.
శంకర్ ను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్న క్షణం నుంచీ , దుర్గ శంకర్ ను హృదయ పూర్వకంగా ప్రేమించనారంభించింది. ఏ పని చేస్తున్నా, ఆమె కళ్ళ ముందు శంకర్ సుందర రూపమే ప్రత్యక్షం కాసాగింది. అట్లాంటి శంకర్ భార్య కాగలిగే అదృష్టం తనకు కలిగించి నందుకు, గిరిని మనసారా అభినందించుకుంది. శంకర్ తో తను మాట్లాడింది చాలా తక్కువ. అసలతడిని పరిశీలనగా చూసింది కూడా లేదు. అయినా అతడిని మనసులో తలచుకోగానే తన హృదయమంతా అనిర్వచనీయమైన ఒక మధురిమతో నిండిపోతుంది.
ఒకనాడు దుర్గ ఒక్కత్తే తోటకు బయలుదేరింది. అప్పుడప్పుడు పూల కోసం ఒక్కత్తే అలా రావటం దుర్గ కలవాటే. పూల మొక్కల మధ్య నడుస్తుంటే ఆనాడు శంకర్ ఈ పూల మొక్కల గురించి చేసిన వ్యాఖ్యానం గుర్తుకు వచ్చి నవ్వుకుంది. అంతలో దూటంగా శంకర్ తన వైపే వస్తుండడం చూసి తన కళ్ళను తాను నమ్మలేక పోయింది దుర్గ. శంకర్ సమీపిస్తున్న కొద్దీ ఆమె శరీరం సిగ్గుతో, భయంతో వణకసాగింది. శంకర్ దీర్గ దగ్గిరగా వచ్చి, "చాలా రోజుల్నుంచీ సరిగా ఈ సమయంలో, ఈ వనం లో తపస్సు చేస్తున్నాను. ఇన్నాళ్ళ కు దేవి సాక్షాత్కారమయింది." అన్నాడు. దుర్గకు ఆశ్చర్య మయింది. భయమూ, సంతోషమూ కలిసిన ఒకానొక భావోద్వేగం ఆమె మనసు ఉద్విగ్నమవుతుంది. మాట్లాడలేక నిల్చుంది.
"అలారా దుర్గా! ఆ సన్నజాజి క్రింద కూర్చుందాం.' చొరవగా , చనువుగా , అడిగాడు శంకర్. దుర్గ రాననలేక పోయింది. తడబడే అడుగులతో అతని వెనుకనే నడిచి, అతనికి కొంచెం దూరంగా పచ్చిక మీద కూర్చుంది.
"నీకు సన్న జాజిపూవ్వులంటే చాలా ఇష్టం కదూ!" అన్నాడు చేతి కందిన సన్నజాజి మొక్కను తుంపుతూ శంకర్.
"మీకు ఎవరు చెప్పారు?' మృదువుగా అంది దుర్గ తలవంచుకుని.
"ఒకరోజున బత్తాయి పళ్ళ కోసం ఇక్కడికి వచ్చాను. అప్పుడు మాలి ఏదో మాటల మీద నీకు పువ్వులంటే చాలా ఇష్టమనీ, అందుకనే మీ నాన్నగారు, ఇన్ని పూల మొక్కలు వేయించారనీ అందులో సన్న జాజులంటే నీకు చాలా ఇష్టమనీ రోజూ ఆ పూలు నీకు పంపిస్తుంటారాని, అప్పుడప్పుడు నువ్వే వచ్చి కోసు కేళ్తుంటావని చెప్పాడు. అప్పట్నుంచీ ఇంచుమించు ఈ సమయంలో రోజూ నీకోసం ఎదురు చూస్తున్నాను."
ఎందుకూ ?"
"నీతో మాట్లాడవలసి ఉంది."
దుర్గ ఆశ్చర్యంగా కనుబొమలు పైకి లేపింది.
"అసలు మన పెళ్లి నిశ్చయం కాకముందే నీతో మాట్లాడాలను కున్నాను. కానీ, అవకాశం చిక్కలేదు. అసలు గిరి ఈ వార్తను చెప్పినప్పుడు నమ్మలేక పోయాను.' ఆగాడు శంకర్.
"అసలు విషయం ఏమిటన్నట్లు చూసింది దుర్గ.
శంకర్ గొంతు సవరించుకుని "నీకు తెలుసు. నేనేమీ చదువుకోలేదు...." అని ఇంకా ఏమో చెపుతుండగానే దుర్గ మధ్యలో అడ్డు తగిలి "అందుకు నాకేమీ అభ్యంతరం లేదు. నేను పెద్ద చదువుకున్న దానిని కాను." అంది వినయంగా-- శంకర్ అల్పంగా విసుక్కుని "అది కాదు-- విను. కొందరు ముందర గబుక్కుని పెళ్ళిళ్ళు చేసేసుకుని అ తరువాత తీరుబడిగా ఒకళ్ళ లోపాలు, ఒకళ్ళు వెతుక్కుంటారు. పెళ్ళంటే కనీసం మన భారతదేశం లో ఆజన్మాంత మూ ఉండే బంధమని అందరికీ తెలిసే అందరూ సరిగ్గా ఈ విషయమే మరిచి పోతారు. అందుకనే నీతో అన్ని విషయాలూ నేను ముందుగానే మాట్లాడదల్చు కున్నాను. నేను చదువుకోలేదని నా వ్యక్తిత్వాన్ని నేనెన్నడూ తక్కువగా భావించలేను. నా భార్య తన మాటలలో గాని, తన ప్రవర్తన లో గాని ఏ సందర్భం లోనైనా నా కంటే ఎక్కువ దాన్నాన్నే భావం చూపించటం నేను సహించలేను" అన్నాడు.
దుర్గ వ్యాకుల స్వరంతో "నాకంటే అన్ని విధాలా అధికుదయిన వ్యక్తినే నేను వివాహం చేసుకుంటున్నాను. అయినా ప్రేమమయ జీవితంలో ఎక్కువ తక్కువ లేమిటి?' అంది. ఈ మాటలకు శంకర్ అదోరకంగా నవ్వాడు. ఆ నవ్వులో భావం దుర్గకు అర్ధం కాలేదు.
శంకర్ మళ్ళీ "నాకు తండ్రీ లేరు-- కానీ తల్లి ఉంది. ఆమె ఏ సందర్భం లోనూ అవమానింపబడకుండా నాతోనూ, నా కుటుంబంతో నూ చూడబదాలని నా కోరిక. ఒక అక్క గూడా ఉంది. ఆమె సంసారం ఆమె చేసుకుంటుంది. ఎప్పుడైనా ఆమె నా ఇంటికి వస్తే తిరిగి సంతృప్తి గా వెళ్ళాలి."
"నేను మనసారా అభిమానించే వ్యక్తికీ అభిమాన పాత్రులయిన వారందరూ నాకు అభిమాన పాత్రులే! వారందరినీ నేనూ మనసారా అభిమానించి గౌరవిస్తాను."
ఆర్ద్ర స్వరంతో సమాధాన మిచ్చింది దుర్గ ------ శంకర్ కళ్ళు సంతోషంతో మెరిసాయి. తడబడుతున్న అడుగులతో , ఆమె సమీపానికి వచ్చి, తన చేతిలోని ఒక సన్న జాజి మొగ్గ నూ ఆమె జడలో తురిమాడు. ముందుకు వంగి దుర్గ గడ్డం పుచ్చుకుని ముఖం పై కెత్తి కళ్ళలోకి చూస్తూ "దుర్గా" అన్నాడు మత్తుగా -- పరవశత్వంతో , సిగ్గుతో దుర్గ కనులు అరతోడ్పులయ్యాయి. దుర్గ నిలువెల్లా పులకించింది. మృదువుగా అతని చేతులను విడిపించుకుని, దూరంగా జరిగి "వస్తాను" అని గాలిలో తేలిపోతున్నట్లు గా తన ఇంటికి చేరుకుంది. ఆ రాత్రి దుర్గకు కనులు మూత పడలేదు. తన తలలోని సన్న జాజి మొగ్గను ఆప్యాయంగా గుండెలకు హత్తుకుంది. కొద్దిపాటి పరిచయం తోనే తనకు 'నువ్వు' అని పిలువ గలిగిన అతని చొరవ , పక్కా వ్యాపార సరళి లో సాగిన అతని సంభాషణ, అతని మాటలలో ధ్వనించిన అధికారమూ, కొద్ది పాటి అపస్వరాలనామె మనసులో పలికింపక పోలేదు. అయినా శంకర్ సుందర స్వరూపం ఆమెకు సమస్త అపస్వరాలనూ అణచి వేసే మోహన రాగామయింది-- "దుర్గ తనను తానే అర్ధం చేసికోలేక పోతుంది." అన్నగిరి మాట లామె కిప్పుడర్దమయ్యాయి-- గిరిని మనసారా "నాగిరి అన్నయ్య! దేవత!" అనుకుని తృప్తిగా నిద్రపోయింది.
