"పొండి! మీదంతా చోద్యం!" నవ్విందామె.
"ఇలా ఎందుకు నవ్వవు, బిందూ, నువ్వెప్పుడూ? నీ కళ్ళు ఎంత అందంగా మెరిశాయో తెలుసా ఈ నవ్వుతో?"
"నా కళ్ళలో అందం విరిసిందా, శ్యామ్! నిన్నెలా వారించాలి? నీ ముందు నా హృది పురి విప్పిన మయూరం అవుతుంది. ఏవో ఆశలు చివురించుతున్నాయి. మళ్ళీ లోలోన!" అని పైకి అనలేక సిగ్గుతో కళ్ళు దించుకున్నదామె.
"మీరో సి.ఐ.డి అయ్యారు నాకు! నవ్వనీయరు! నలుసు పడి కంట్లో నీరు తిరిగినా నమ్మరు. సరే! పదండి!" అంగీకరించిందామే ప్రయాణానికి.
ఆ ప్రయాణం లో ఆమె హృదయాన చల్లని జల్లు లెన్నో కురిశాయి. తీయని ఊహలెన్నో మల్లియలై విరిశాయి.
"బిందూ! ఈ సీట్లో కూర్చో ఎదురుగా. చక్కగా మాట్లాడుకోవచ్చు! మళ్ళీ బోరు కొట్టింది మీ అన్నయ్యతో ప్రయాణం అంటావ్" అంటూ నవ్వించే వాడు.
"ఏం తెమ్మంటావ్ తినడానికి? ఆపిల్స్ బాగున్నాయి! తెస్తా నుండు!" అంటూ దిగి వెళతాడు మరోసారి.
"నిజంగా చాలా చిక్కిపోయావ్. బిందూ, నువ్వు ఈ జ్వరంతో!"
"శ్యామ్! ఎందుకింత అనురాగం ఈ బిందు పైన నీకు? ఇంత తీయనిదా నీ స్నేహం? భరించలేక నా హృదయం పగిలి పోతుందేమో!"
ఆమె మనస్సు పులకించి పోయిందతని ఆత్మీయతకి. ఆమె శరీరం అలిసి పోయింది. కానీ, మనసున హాయి నిండింది. పేరుకుంటున్న నిరాశ కరిగి పోయింది.
కరుణ వాకిట్లోనే ఎదురయింది. ఆమె కళ్ళు ఆనందంతో చెమర్చాయి.
"బిందూ!..." మాట్లాడలేక కౌగలించుకుంది ఆప్యాయంగా!
హిమబిందు కనులలోనూ తడి మెరిసింది కరుణ ని చూడగానే. ఆ తడిలో ఆనందమూ ఉంది; బాధా తొంగి చూసింది.
"ఎన్నేళ్ళు అయినట్లుంది, కరుణా, మనం కలుసుకుని!" అన్న దామె లోనికి వెళుతూ.
కరుణ ఆవేగం ఇంకా అరనేలేదు. ఆ కనులలో అశ్రు బిందువులు ఉండి ఉండి మెరుస్తూనే ఉన్నాయి.
ఆ రోజంతా ఎన్ని కబుర్లు!! ఎన్ని చెప్పుకున్నా తరగవే ఈ ఇరువురికీ! ఆ కబుర్ల లో శ్యామసుందర్ ఎక్కువగా కదిలాడు. కరుణ కది వింతగా తోచింది. కానీ, స్నేహితురాల్ని చూసిన ఆనందం లో కరిగి పోయిందా విస్మయం.
ఆ నాలుగు రోజులూ నాలుగు క్షణా లయ్యాయి ఆ ఇరువురికీ. ఉత్సాహం ఊయల లూగుతుంది హిమబిందు హృదయాన. శ్యామ సుందర్ కంతగా సమయం చిక్కడం లేదు బిండుతో మాట్లాడ్డానికి. అయినా రాత్రి భోజనాలు చేస్తున్నప్పుడు ఎంతోసేపు కరుణతో, బిందు తో మాట్లాడుతూ కూర్చునేవాడు.
కరుణ పెళ్లి కుమార్తె అయింది. ఆ సింగారం లో ఆమెకో అందమైన శోభ వచ్చింది. రాత్రికి ముహూర్తం . బందుబులతో ఇల్లు సందడితో కనువిందు చేస్తుంది.
బుగ్గన చిన్న చుక్క. నుదుట కళ్యాణ పు బొట్టు. జడ పొడుగునా మల్లెలూ, గులాబీలూ , కంఠం చుట్టూరా మెరుస్తున్న సన్నని చెయిన్ పొడుగ్గా ఒయ్యారంగా వేలాడుతుంది.
పసుపువన్నే పట్టుచీర. నడుం చుట్టూరా తళతళ మంటుంది వడ్డాణం. కరుణ వంకే చూస్తుండి పోయింది బిందు. కరుణ అంత సందడి లోనూ గమనిస్తూనే ఉంది. హిమబిందు కళ్ళలో ఎప్పటిలా ఉత్సాహం మెరవడం లేదు. ఆ సాయంత్రం నుంచి. తదేకంగా తనవంకే చూస్తుండి పోయింది ముత్తైదువలు సింగారించు తుంటే.

'మళ్ళీ ఏమైంది? అన్నట్లు కళ్ళతోనే ప్రశ్నించింది కరుణ. మౌనం చెదరకుండా చిన్నగా నవ్వింది ఏం లేదన్నట్లు.
మంగళ వాద్యాలు మ్రోగుతున్నాయి పెళ్లి పందిట్లో. పిల్లలు హడావిడిగా పరుగు లేడుతున్నారు ఆ పందిట్లో కి. మరోసారి ముస్తాబును సరి చేసుకుంటున్నారు కొందరు అద్దంలో చూసుకొంటుందొకామే అందం ఎలా ఉన్నదా అని.
షహనాయి మధురాతి మధురంగా వినిపించుతున్నది మనస్సులో సందడి విద్యుత్తులా ఝల్లుమంటున్నది.
మంత్రాలు వల్లించుతూ వచ్చాడు పురోహితుడు లోనికి. కరుణ ని వెంట బెట్టుకుని వెళ్లిందో ముత్తైదువ.
తల వంచుకుని నెమ్మదిగా పెళ్లి పందిట్లో కి నడిచింది కరుణ. హిమబిందు కూడా పందిట్లో కి వెళ్ళింది. శ్యామసుందర్ హడావిడిగా ఉన్నాడు. క్షణం సేపైనా కూర్చోవడానికి సమయం దొరకడం లేదతనికి.
అందరూ పక్కనున్న వాళ్ళతో ఏదో ముచ్చటిస్తున్నారు. మధ్యలో నవ్వుకుంటున్నారు. కానీ, హిమబిందు బొమ్మలా మౌనంగా కూర్చుంది వేరుగా. ఏదో పని మీద లోనికి వెడుతున్న శ్యామ్ చూశాడా,మెని. క్షణ మాత్రం ఆగిపోయాడు. మళ్ళీ లోనికి వెళ్ళిపోయాడు వెంటనే.
వాద్యాలు మిన్ను ముట్టేట్టు మ్రోగుతున్నాయి. మంగళసూత్రా ధారణ జరిగింది. అక్షతలతో వధూవరుల తలలు అందంగా కనుపించు తున్నాయి.
హిమబిందు చేతిలో అక్షతంలాగే ఉండి పోయాయి అనే ఆమెకి ఎంతో సేపటికి తెలిసింది . అశ్రు బిందువులు జారిపడ్డాయి చేతిలోని అక్షతం పైన.
"కరుణా! వెయ్యేళ్ళు చల్లగా, హాయిగా ఉండాలి మీ దాంపత్యం! మధురాతి మధురమైన కావ్యం లా వెలిగి పోవాలి మీ అనురాగం!' మనస్సు దీవించింది శుభాన్ని కోరుతూ.
అప్పగింతలు కూడా ముగిశాయి . శ్యామ్ కూడా కంట తడి పెట్టుకున్నాడు చెల్లెల్ని అప్పగించుతూ. కరుణ కళ్ళ నుండి అశ్రు బిందువులు అవిరామంగా జారిపడుతూనే ఉన్నాయి. హిమబిందు కూడా నిగ్రహించు కోలేక పోయింది దుఃఖా వేగాన్ని. పెదవులు నొక్కుకుంటూ ఉండి పోయింది.
కరుణ లోనికి వచ్చింది. హిమబిందు చేతిని ఆప్యాయంగా నొక్కుతూ అంది:
"ఉత్తరాలు వ్రాస్తావు గా?' కనులింకా వర్షించు తూనే ఉన్నాయి.
"నేనెందుకు వ్రాయను? నువ్వే నన్ను మరిచి పోతావేమో? అందుకే ఈ చిన్ని కుంకుమ భరిణ ఇస్తున్నాను. కుంకుమ పెట్టుకున్నప్పుడు తప్పక గుర్తుకు వస్తాను!" అంటూ వెండి కుంకుమ భరిణ కరుణ చేతుల్లో ఉంచింది హిమబిందు.
"నిన్ను మరిచిపోతే గదా గుర్తుకు రావడం! ఈ కరుణ నీకింకా అర్ధం కాలేదు బిందూ! సరే , చూద్దువు గానిలే! అన్నయ్యతో కూడా పోట్లాడకు! ఎంత కోపం ఉన్నా నవ్వించితే నవ్వు! అన్నయ్యని అపార్ధం చేసుకొని మళ్ళీ హాస్టల్ కి వెళ్ళకు!"
"ఏమిటి? అప్పగింతలా ఇవి? నాకెందుకు? అత్తవారింటికి వెళుతున్నది నువ్వే తల్లి, నేను గాదు!"
"నీ గురించి చెప్పనీవు! ఎందుకిలా నవ్వులతో అసలు సంగతినే దూరంగా విసిరి వేస్తున్నావో నాకర్ధం కావడం లేదు , బిందూ!"
"అసలూ లేదు వడ్డీ లేదు గానీ, ముందు ప్రయాణానికి సిద్దంగా ఉండు. పెళ్లి కొడుకు తొందర పడుతున్నాట్ట."
"ఊ! అని నీతో చెప్పారు!' సిగ్గుపడింది కరుణ.
కారులో కూర్చుంటూ కరుణ హిమబిందు వంక చూసింది సజల నేత్రాలతో 'వెళ్లి వస్తా' నన్నట్లు. కదిలి సాగిపోయింది కారు క్షణం లో ముందుకి వేగంగా.
కళ్ళు వత్తుకుంటూ నిలబడి పోయాడు శ్యామ్.
"కరుణా! ఎప్పటికి మళ్ళీ నిన్ను చూడగలుగుతాను? శ్యామ్! నీ మనస్సు నిజంగా మృదుమధుర కావ్యం! అందుకే ఇంతగా కరిగిపోతున్నది నీ హృదయం కరుణ వెడుతుంటే!' అనుకున్నది హిమబిందు అతణ్ణి చూస్తూ.
హిమబిందు ని చూసి వెంటనే కళ్ళు తుడుచుకున్నాడతడు రుమాలుతో.
"ఎప్పుడూ , ఎవరి ఇంట్లోనూ నాలుగు రోజులుండ లేదు కరుణ! ఎలా ఉంటుందో అక్కడ!"
"మా ఆడవాళ్ళ కది బాధ అయినా బెంగతో క్రుంగి పోము లెండి" అన్నది బిందు.
"నీకింకా అనుభవం లోకి రాలేదు. మాటలు వేరు, అనుభవం వేరు, బిందూ!"
ఏదో అనబోతున్న పెదవులు ఆకస్మికంగా ఆగిపోయాయి. ఎందుకా విధంగా ఆగిపోయిందో అతని ఆలోచన కందలేదు.
ఆ రోజునే ప్రయాణం కట్టాలను కుంది. కానీ, కరుణ తల్లీ "మరునాడు వెళ్ళవచ్చు" అన్న మాటను తోసి పుచ్చలేక పోయింది.
బంధువులంతా వెళ్ళిపోయారా మరునాటికి. హిమబిందు కిక క్షణం కూడా అక్కడ ఉండాలే ననిపించింది. కరుణ మీది బెంగతో మనస్సేలాగో అయిపొయింది.
"మనం రేపు వెళదాం , బిందూ! ఈ ఒక్క రోజు నాకోసం ఆగిపోగలవా? ఇంకా కొంచెం పనుంది నాకిక్కడ. అమ్మ ఒక్కత్తే చేసుకోలేదు నేనూ నీతో పాటే వస్తే!"
"క్షమించాలి. ఎందుకో నా మనస్సు తిరగబడుతోంది ఉండలేనేమో?"
"ఉహూ! కాదనకు, బిందూ! ఇంకా డబ్బు సరిగ్గా ఎంత ఖర్చ యింది తేలలేదు. ఈరోజు అమ్మా, నేనూ అంచనా సరిజూసి మిగతాది బ్యాంకు లో వేయాలి. పొద్దు పోదని బెంగ పెట్టుకోవద్దు . నేనున్నానుగా! నీ కరుణ కి అన్నయ్యనే! పరాయి వాణ్ణి కాదు!"
ఆ పైన నిరాకారించ లేకపోయిందామె.
'శ్యామ్! నా మనస్సు నా మాట వినిపించు కోదు. కానీ, నీ మాటను తోసి పుచ్చలేక పోతుంది. నాకు తెలియకుండానే నా మనస్సు కి స్నేహితుడి వై పోయావు. ఇంకా నువ్వు పరాయి మనిషి వెలా అవుతావు? ఎందుకిలా శాసించు తున్నావ్ నన్ను?"
ఆలోచనలతో ఆమె కెంత సేపటికి కనులు మూత పడలేదు.
"నిద్రపోతున్నావా బిందూ!" అంటూ తలుపు తీసి లోనికి వచ్చాడతడు. కిటికీ లో కూర్చుందామె లేచి.
"నామీద నీకు కోపంగా ఉందిలే! అమ్మ కూడా అన్నదిగా-- 'పాపం! అమ్మాయిని అనవసరంగా అపివేశావు శ్యామ్! కరుణ ఉంటె సందడిగా ఉండేది' అని. ఎందుకో నిన్ను ఒంటరిగా పంపించాలంటే నా మనస్సు అంగీకరించడం లేదు."
