"ఏం ? నేనేం చిన్న పిల్లని గాదే!"
"నిజమే. కానీ, నీ మనస్సు అలాంటిది గాదు, బిందూ! పసిపాపే నయం దాని ముందు."
విస్మయం కదిలిందామె విశాల నయనాల నిండుగా ఆ జవాబు వినగానే.
"లాభం లేదిక, శ్యామ్! నేను ఓడిపోతున్నాను నిజంగా నీ ముందు .' పైకి చిన్న శబ్దం కూడా రాలే దామె కంఠం నుంచి.
"నిన్న ఎందుకంత పరధ్యానంగా ఉన్నావు బిందూ? అంత సందడి లో నువ్వే అలా ఏకాకిలా కనిపించావు నాకు. అప్పటివరకూ నవ్వుతూన్న నీ మనస్సంత లోనే ఎందుకలా మూగపోయింది? ఓ స్నేహితుడుగా అడుగుతున్నాను. నువ్వు నవ్వుతూ తిరక్కపోతే నా మనస్సు కి ముళ్ళు గుచ్చు కుంటుంది , బిందూ! నీ ఊహల్లో ఈ శ్యామ్ కి ఏ రూపం ఉందొ నాకు తెలియదు. కానీ, నా మనస్సుకి నచ్చిన ప్రియమైన స్నేహితురాలివి నువ్వు! అందుకే నిన్నిలా అడుగుతున్నాను."
"శ్యామ్! నా మనస్సు తూలిపోతున్నది! నీ గుండెల్లో ఇంత అమృతం ఉందని నాకు తెలియ దింత వరకూ. అంత తియదనాన్ని నింపకు! భరించలేక పగిలి పోతుందేమో హృదయం! నా గొంతు పెగలడం లేదే! నీకెలా వినిపించాలి? విన్న తరువాత నీ స్నేహం నాకు దూరమైతే? అది ఇంతకన్నా దుర్భరం!'
"మాట్లాడవేం , బిందూ! ? ఏడుస్తున్నావు కదూ! ఇలా చూడు!" అంటూ దగ్గరగా వచ్చి భుజాల మీద చేతులు వేసి ముఖాన్ని తల వైపుకి తిప్పుకున్నాడు . పెల్లుబుకుతున్న కన్నీరు మరింత వేగంతో బయట పడింది. అతని కంఠం లోని వదించిన ఆత్మీయత కామె కదిలిపోయింది. అతని భుజం మీద వాలిపోయి వెక్కివెక్కి ఏడ్చింది.
"బిందూ! ఈ శ్యామ్ నీవాడు! నీ దుఃఖం లో నన్నూ పాలు పంచుకోనివ్వు! నన్నపార్దం చేసుకోకు. నీకేమైందో నేను వినకూడదా?" లాలనగా అడిగాడతడు.
ఇంకా దుఃఖం అరనే లేదు. కొంతసేపటికి తానెలా నిలబడింది తెలిసి సిగ్గుతో దూరంగా జరిగింది. అతని వైపు చూడలేక తల వంచుకుంది.
"కూర్చో , బిందూ !" అతడు కూడా కుర్చీలో కూర్చున్నాడు.
తన హృదయాన అతని కోసం ఇంత అనురాగం పొంగి పొరలు తుందని ఇప్పటికి పూర్తిగా తెలిసిపోయింది.
అతని కంఠనా లాలన ఉంది. అనురాగం ఉంది. ఆ రెండూ లోలోన రగులుతున్న దుఃఖాన్ని చల్లార్చుతున్నట్లు తోచిందామెకి. ఆ స్పర్శ మండుతున్న మనస్సు పై పన్నీరు చిలికించింది. ఆ కళ్ళలోని ఆత్మీయత హృదయాన మల్లెల్ని పూయించు తుంది.
మధురమైన భావ మేదో లోలోన బొంగరం లా తిరుగుతుంది.
"సరే, పడుకో! అమ్మ వచ్చినట్లుంది, మామయ్య గారి ఇంటి దగ్గర నుంచి! బిందూ! ....నీ మనస్సు నాదేనా? చెప్పు! ఈ ఒక్కదాని కైనా జవాబు చెప్పవూ? ఇలా చూడు! అమ్మతో చెబుతాను! నీకు ఇష్టం అంటే !"
ఆమె కెదురుగా నిలబడి ఆమె చేతిని మృదువుగా స్పృశించుతూ అడిగాడు.
"వద్దు ! వద్దు!"
"ఏం వద్దు? నేనా ? అమ్మతో చెప్పడమా? చెప్పు బిందూ? ఎందుకిలా దాచుకుంటావు నిజాన్ని కూడా! పోనీ, నన్ను చూడనీ ఈ నీ కళ్ళలో! ఆ! దొంగ ! సిగ్గుతో పాటు ఈ శ్యామ్ మీద అనురాగం కూడా మెరుస్తుంది! ఏం, బిందూ! నిజమే కదూ? నీ కళ్ళలో ఎంత అందం ఉందీ!" మృదువుగా ఆమె నేత్రాల్ని ముద్దు పెట్టుకున్నాడు.
ఆమె నివ్వెరపోయిందా సంఘటన కి. మనస్సు ఝల్లుమంది. తల ఎత్తింది. కానీ, సూటిగా అతని వంక చూడలేకపోయింది. అతడు నవ్వి వెళ్ళిపోయాడు.
"ఎందుకిలా పరవశం నిన్దిపోతున్నది మనస్సున? వారించలేక పోయాను! శ్యామ్! ... ఈ బిందు నీదేనని నీకెలా తెలిసింది? హృదయాన ఈ పులకింత నన్ను నిలువనీయడం లేదే! అణువణువు నీ ఊహే కదులుతుంది. నా మనస్సునిమంత్రించి వేస్తున్నావు! దాచుకున్న మధుర భావాల్ని దోచుకుంటుంది నీ అనురాగం నాకు తెలియకుండానే! శ్యామ్!.....మనః స్పూర్తిగా అంగీకరించు తున్నాను . నిన్ను కాదని దూరంగా ఉండలేదీ బిందు. చెబుతాను, మనస్సు విప్పి! ఇక దాచుకోలేను. ఎవరున్నారిక ఇంత మధురమైన మనస్సున్న స్నేహితులు నాకు! ! కరుణ వెళ్ళిపోయిందిగా!'
అలిసిన ఆమె మనస్సు ఆ ఊహలతోనే నిదురలోకి జారిపోయింది.
* * * *
ఏలూరు వెళ్ళిన తరవాత హిమబిందు మళ్ళీ ఎప్పటిలా ఏకాకి అయింది. శ్యామసుందర్ తో ఎంతో అవసరం ఉంటేనే తప్ప మట్లాడదు. ఆ మాటలైనా 'ఆ, ఊ' లే! పోరాపాటునైనా అతని వంక కనులెత్తి చూడదు. ఎప్పటిలా రాత్రి పొద్దుపోయే వరకు లైట్లు వెలగడం లేదామే గదిలో. పది కాగానే స్విచ్ నొక్కేసి పడుకుంటుంది. ఓసారి శ్యామ్ హోటల్లో భోజనం చేశాడు కావాలనే. కానీ, అసలా సంగతే గమనించనట్లు తన పనిలో లీనమై పోయింది.
సాయంత్రం ఆరింటికి వచ్చేది కాలేజీ నుంచి. ఉదయాన ఎనిమిది గంటలకే వెళ్ళిపోయేది.
"మళ్ళీ ఏమైంది ఆమెకి? శ్యామ్ అన్న మనిషే లేనట్లు ప్రవర్తించు తున్నది! ఎవరేమన్నారు? గుంటూరు లో ఇంటి దగ్గర అంత సన్నిహితంగా ఉంది! ఇప్పుడింత దూరంగా పారిపోతున్నదేమిటి? నా మాటలేమైనా గాయపరిచాయా తన హృదయాన్ని? ! తన కళ్ళలో మెరుస్తున్నది నా పైన అనురాగం కాదేమో! పొరపాటేమో నా ఊహ? మరి ఎందుకలా ఏడ్చింది నామీద వాలిపోయి!'
ఎంత వెదికినా అతనికి సరి అయిన సమాధానం లభించనే లేదు. ఆ సాయంత్రం రాగానే అడిగాడు.
"బిందూ, ఎందుకలా ముభావంగా ఉంటున్నావు? కోపమా నామీద?"
"ఎందుకు? మీరేం చేశారని కోపం రావడానికి?"
"మరి నన్ను చూస్తేనే పాపం అన్నట్లు పారి పోతున్నావేమిటి? ఏం చేశావో చెప్పు? పోనీ, ఎక్కడైనా , ఎప్పుడైనా పొరపాటు న నీ మనస్సు ని నొప్పించ లేదు గద?"
"అదేమీ కాదని చెప్పానుగా!...." అని లేచిందామె వెళ్ళడానికి.
మృదువుగా చెయ్యి పట్టుకుని కూర్చో బెట్టాడతడు.
"ఒక్కమాట! బిందూ! నువ్వు నమ్ముతావో లేదో, మరి! నా మనస్సున నువ్వు తప్ప ఎవరూ లేరు. ఉండరు. అమ్మ మాట విని ఇలా అంటున్నావా ఏమిటి?"
అదేమిటన్నట్లు చూసిందామె.
"అదే! వచ్చే ముందు అమ్మ అన్నదిగా -- 'శ్యామ్ కి కూడా త్వరలోనే పెళ్లి చేస్తే నాక్కాస్త హాయిగా ఉంటుందమ్మా! మా అన్నయ్య గారి అమ్మాయి వనజ ని చూశావుగా! ఈడూ, జోడూ బాగుంటుంది. వాళ్ళూ ఇస్తామంటున్నారు' అని. అది నిజం కాదు. అమ్మకు ఉందేమో ఆ ఊహ! కానీ, నేను ఇక్కడికి వచ్చిన తరవాత లెటరు వ్రాద్దామని అక్కడ మాట్లాడకుండా ఉండిపోయాను. వ్రాయమంటావా అమ్మకి?"
"వద్దు!"
"నిజంగానా?"
"ఆ!"
"బిందూ! నా కెందుకో నీ మాట నమ్మ బుద్ది కావడం లేదు. ఎందుకిలా కాదంటూన్నావు? నీ మనస్సులో ఈ శ్యామ్ పైన ప్రేమ ఉంది! నాకు తెలుసు. చెప్పు! ఏం, ఉంది కదూ?"
"లేదు!"
"ఏదీ నా మీద ఒట్టు వేసి చెప్పు 'లేదు' అని?" చెయ్యి జాచాడతడు.
ఎంతసేపటికి ఆమె నుంచి జవాబే రాలేదు.
"చెప్పు, బిందూ! ఉన్న నిజాన్ని చెప్పడానికి భయమెందుకు!"
"చెబితే మీనుంచి సానుభూతి తప్ప మరో భావం వినిపించదు నాకు. ఆ సానుభూతి తో నాకు నీడగా ఉండి పోతానన్నా నేను ఒప్పుకోలేను. నా మనస్సులో ఏ బాధ ఉందొ ఎవరికీ తెలియపరచలేను. అది నా బలహీనతే కావచ్చు. కాని, అదే నన్ను నన్నుగా బ్రతకనిస్తున్నది."
"సరే! చెప్పకు. అమ్మకు వ్రాస్తాను రేపే, బిందు ఇష్టపడిందని!"
"రెండు రోజు లాగండి! నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వండి!" అన్నదామె లేచి లోపలికి వెళ్ళిపోతూ.
ఆమె మనస్తత్వం తనకి అర్ధం కాలేదు. వెళ్ళిన వైపే చూస్తుండి పోయాడు ఆశ్చర్యం నిండిన కన్నులతో.
మరునాడు సాయంత్రం 'కొల్లేరు' చూడడానికి వెళ్ళిపోయింది అతనికి చెప్పకుండానే. "ఎక్స్ కర్షన్ కి వెళ్లుతున్నారు మా కాలేజీ వాళ్లు" అన్నది క్రితం రోజు. కానీ, తాను వెళ్లానన్నది . సాయంత్రం శ్యామసుందర్ ఇంటికి వచ్చేసరికి తాళం వేసి ఉంది.
అతడు రాలేదేమా అని చూస్తుండగా పక్క ఇంటి వారబ్బాయి వచ్చి , హిమబిందక్కయ్య ఎక్స్ కర్షన్ కి వెళ్ళింది. నాలుగు రోజులకి వస్తుందట!" అన్నాడు. అతని కామె మనస్సులో ఎమున్నదీ అర్ధం కాకుండా పోయింది.
"చెప్పి వెళ్ళగూడదా? ఇదంతా నా నుంచి పారిపోవడానికే! లోలోన ప్రేమిస్తూనే పైకి మాత్రం పరిచయమే మన మధ్య, మరేమీ కాదు సుమా! అన్నట్లు ప్రవర్తిస్తుందేమిటి?' కొంచెం కోపం వచ్చిందతనికి.
ఆ నాలుగు రోజులూ అతడు ఎన్నో ఊహలతో విసిగిపోయాడు.
