ఆరాధన
యలమంచిలి ఝాన్సీ లక్ష్మీ
'కస్తూరి తిలకం లలాటఫలకే నాసాగ్రే నవమౌక్తికమ్
వక్షస్థలే కౌస్తుభ,మ్ -- కరతలే వేణుమ్ కరే కంకణమ్
సర్వాంగే హరిచందనంచ కలయమ్
గోపస్త్రీ పరివేష్టి తో విజయతే గోపాల చూడమణీ!"
మృదుమధురమైన స్వరం. వీణియ నిలువెల్ల పులకించి ఝల్లుమన్నది. మనసుల నిండుగా తీయని వూహలు మల్లెలై , మాలలై ఊగసాగాయి.
ప్రార్ధనా గీతన పరువు లెత్తిన మధురిమ కు పరవశించిన అవనిక ప్రక్కకు జరిగింది మెల్లగా.
'రాధా కృష్ణులు' అన్న నృత్య నాటిక ప్రదర్శింపబడుతోంది' అన్నదో సన్నని కంఠం కోయిలమ్మ ననుకరించుతూ.
శారద పూర్ణిమ. యమునా తీరం. పున్నమి వెన్నెలలో పుడమి కాంత వన్నెలు దిద్దుకుంటోంది.
దూరాన మ్రోగింది మురళి మృదుమధురంగా
యమునా ఎడద లో కోటి వీణియలు ఝల్లుమన్నాయి.
తీరానా నిలిచినా రాధ హృదయాన అనురాగ వీణియ పులకించి, పొంగిపోయి నింగి వంటిది . మెరుపు తళుక్కుమన్నదా ప్రేమ మయి.
సన్నని నడుము. నుదుట తిన్నని కుంకుమ రేఖ, కన్నుల నిండుగా వెన్నెల వెలుగు కురిసిన వెన్నెల రేఖలా మెరిసిపోతున్నది రాధ.

మారోమారు మ్రోగింది మురళి మధురంగా.
రాధ హృదయాన సందడి అలలా లేచింది. అందాల కలలో అల్లుకు పోతోంది. ఆ మధుర గానాని కామె హృది తూలిపోతోంది.
క్షణానికో వూహ. ఊహకో వూయల. ఊయలకో స్వామి. మనస్సు విరిసిన మందారమై మధురోహలమందిరమై వూగి పోతోంది.
నల్లని సామి , ఆరేయి చల్లని కబురంపించి అదృశ్యమై పోయాడా క్షణం లోనే --
'యమునా తీరాన-- ఎవరూ లేని ఏకాంతాన ఎడద లో నిలుపు కుందు -- మురళి తో కలుపు కొందు విని -- రాధా !' రమ్మని.
వత్తునన్న సామి రానే లేదు. వచ్చుచున్న జాడా లేదు. వేణు గానమూ లేదు. ప్రణయ పూర్ణ సందేశామూ లేదు.
క్షణాలు గడిచి పోతున్నాయి. నిమిషాలు గడిచి పోతున్నాయి. నిరీక్షణ పెరిగి పోతున్నది.
వెన్నెల నవ్వుతోంది నిర్మలంగా. మాలతీ లత ఫక్కుమన్నది. చల్లని గాలి చిలిపి తనం రువ్వి పోయింది రివ్వున. తెల్లబోయింది రాధ. నిరాశ తో మూగ పోయిందా ప్రేమ మయి హృదయం.
'రాడేమో! ఆ అందాల రేడు!' అన్న వూహకే వణికి పోయిందామె.
ఆశలన్నీ కరిగి పోతున్నాయి. అనురాగ మంతా విరిగిపోతోంది. కనుల నిండుగా అశ్రు కణాలు తళుక్కు మంటున్నాయి. నిరీక్షణ నిలువెల్లా నిండి వూపివేస్తోంది. నలువైపులా కలయ జూచినది.
ఆశా రేఖ మెరిసిందా కనులలో. దూరాన వూ పోదమాటున నెమలి పించం కదిలింది. లేచి నిలబడిందామే. మురళి మ్రోగింది. ఆనందంతో ముందడుగు వేసింది. చిత్రమైన మధురను భూతి మనస్సు ను వూపి వేస్తోంది.
అడుగులు తడబడుతున్నాయి. అంత రంగం తొందర పెడుతోంది. ఆనందం పూరి విప్పింది. అనురాగం అందాల మయూరమే అయ్యింది.
కల నిజమై నిలిచింది కన్నుల యెదుట. పరవశత పాకిపోతోంది-- అణువణువునా. పరువున చేరిందా మధుర మురళీ గాన లోలుని చెంతకు.
ఊహ తారు మారైంది. బంగారు కల కరిగిపోయింది క్షణం లోనే.
అది యమునా తీరమే! కానీ ఎవ్వరూ లేని ఏకాంతం గాదది. ఎదుట నిలిచినది మాధవుడే! కానీ కాంతలెందరో వున్నారాయన చుట్టూరా. రాధ కదంతా పద్మవ్యూహం లా వుంది.
మనస్సు నే మల్లెల పానుపుగా మలచి, అనురాగ మధువు నందించి ఆనందంతో తూలి సోలి పోవాలని ఊహించిందా మధురాను రాగమయి.
కానీ కన్న కలలన్నీ చెరిగి పోయాయి. మనస్సున ఆందోళన చెలరేగింది.మాట తప్పిన మాధవుడు చిలిపిగా కను సైగ జేశాడామే వంక జూచి.
రాధ నివ్వెర బోయింది . ఆశ్చర్యంతో నిలిచిపోయింది.
చుట్టూరా వున్న గోపికలను చూసింది. ఎవ్వరూ చూడనేలేదామె వంక. మైమరచి ఆడుతున్నారందరూ . పరవశంతో పాడుతున్నారందంగా. చిన్న బోయిందామె . చిత్తరువులా నిల్చిపోయింది.
మురళి మ్రోగుతుంది. గజ్జెలు ఘల్లు ఘల్లు మంటున్నాయి. కానీ రాధకేమీ విన్పించడం లేదు. ఎవ్వరూ కన్పించడం లే దొక్క నీల మేఘ శ్యాముడు తప్ప.
కనుల ముందో చిత్రం కదిలి పోతోంది. ఆమె హృదయాన అసూయ లేదిపుడు. ఆనందమూ లేదక్కడ.
వేణు గోపాలుడు మందహాసం చేశాడు. బంగారు పెదవుల్ని కదిలించాడు. అందాల మురళి నందుకున్నాడు. 'రాధా!' అన్నాడు నీల మేఘం లా నడిచి వచ్చాడు. కనులలో కనులుంచి , మురళి పై పెదవి కదిలించాడు మృదు మధురంగా.
జగమంతటా ఆ జగన్మోహానుడే! విశ్వ మెల్లా ఆ ప్రేమ మూర్తి మధుర గానమే!
రాధ కదంతా యింద్రజాలం లా వుంది. తానా మధుర మురళీ గానలోలునితో లీనమై పోతున్నట్లనోపించుతోంది.
రాధాకృష్ణు లు వేరుగా లేరు. ఏకమై వున్నారు. అనురాగాల ఆలయాన వెలసిన రసమయమూర్తి రాధికా లోలుడు. అ సత్యాన్ని గుర్తించిందా రాగమయి. ఆ పవిత్ర ప్రణయై క జీవులు తన్మయతతో నృత్య మారంభించారు.
కాలిగజ్జెలు ఘల్లుఘల్లు మంటున్నాయి మనోహరంగా మ్రోగుతోంది. మురళి. మనస్సుల నిండుగా తీయని తలపులు జల్లులై వెల్లువలా పొంగి పోతున్నాయి.
మాధవుని పాద పద్మాల పై వాలి పోయింది రాధ.
నృత్యం ముగిసింది. కానీ శ్రోతలింకా రసమయి జగత్తు లోనే మునిగి వున్నారు. అధ్యక్షుని చప్పట్ల తో ఈ లోకానికి వచ్చారు నృత్యం పూర్తీ కాగానే అధ్యక్షుడు లేచి వచ్చి అభినందన అందించాడు. రాధ వేషంలో జీవించిన 'అనూరాధ' అన్న అమ్మాయికి నృత్యం లో ఎంతో ప్రావీణ్యం వుందని ప్రశంసించాడు. స్వయంగా ఆమెకు బహుమతి నందించాడు. అనూరాధ వేదిక పై కాలు మోపగానే చప్పట్లు మిన్నంటాయి. ఆమె తేర వెనుకకు వెళ్ళే వరకూ ప్రేక్షకుల అభిమానం సందడి చేస్తూనే వుంది.
ముఖాన వున్న రంగులు తుడుచుకుంటుండగా విరుచుకు పడ్డారు అభిమానులు. ఆనందం అభిమానం పోటీ పాడుతున్నాయి--
'అనూరాధ! అందమంటే నీదే! ఎంత చిలిపిగా నవ్వావని ! అబ్బ!'
'మరే! రంజనీ! నాక్కూడా రాధ నవ్వు యింకా గుర్తు కోస్తోంది. నిజంగా మన అనురాధ కళ్ళనిండుగా వెన్నెల పువ్వులై పూసిందనుకో!'
'నీ ముఖం! వెన్నెలే అనూరాధ గా వన్నెలు చిలికింది!'
'అవునే! వెన్నెల రేఖలా ఆ మందర గిరి దారితో పాటు లోకాన్ని ఆనందం లో ముంచి వేసింది.
ఆ అభిమాన పూర్ణ ప్రశంసల కామే మౌనంగా చిరునవ్వు నవ్వింది. ప్రిన్సిపాల్ కూడా ఎంతగానో ప్రశంసించింది.
'మన యానివర్సరీ నీ డాన్సు మూలాన ఎంతో ఘనంగా వుందమ్మా! రేపు వాళ్ళ కాలేజీ లో నీ డాన్సు ఏర్పాటు చేస్తామని -- నిరాకరించవద్దనీ, రెడ్డి కాలేజీ ప్రిన్సిపాల్ చెప్పారు' అంటూ.
అనూరాధ ఏదో అనబోయింది కాని ప్రక్కనున్న అభిమాన సంఘం పెదవి కదప నీయలేదు.
'అలాగే మేడమ్! మన అనురాధ మూలాన మన కాలేజీ పెరులోకి వస్తుంది!' అనంరిద్దరూ ముగ్గురు.
అందరి దగ్గరా సెలవు దీసికొనేసరికి సరిగ్గా పన్నెండయింది. తోడుగా తమ్ముడు, రాజు వున్నాడు. ఇంటికి వెళ్ళేసరికి తల్లి ఎదురుగా వచ్చింది అంత ప్రొద్దు బోయినా. తల్లి ఎంత రాత్రి అయినా తనకోసం మేల్కొనే వుంటుందని తెలుసు అనూరాధ కు. అందుకే అభినందనలు కూడా పూర్తిగా మనసున దూరి సందడి చేయక మునుపే బయల్దేరింది.
'ఇంకా నిదురేపోలేదామ్మా! తోడుగా తమ్ముడున్నాడుగా!' అన్నది తలగడ, దుప్పటే అందుకుంటూ.
'మన యింటి గలవారి తాలూకు బంధువులు వచ్చారమ్మా! వాళ్ళు ఏవో మాట్లాడు కుంటుంటే వింటున్నాను . సరే! ముందు నువ్వు కాస్త కన్ను మూయి తల్లీ! బాబూ! రాజూ! దుప్పటి తీసికోరా!' అంటూ కొడుక్కి దుప్పటి అందించింది.
'అన్నపూర్ణ తల్లీ! అమ్మాయి వచ్చిందా!' అన్నారా యింటి లోని తాతగారు.
'అవును బాబాయ్! ఇపుడే వచ్చింది!' అంటూ వంట యింటి తలుపులు మూసి వరండా లోకి వస్తుండగా అనూరాధ వచ్చింది.
'మళ్ళా లేచావెందుకమ్మా!' అన్నదామే.
'ఇదిగోనమ్మా!' అంటూ డబ్బు చేతిలో వుంచింది.
'ఎక్కడిదమ్మ!'
'ఈరోజున బహుమతిగా యిచ్చారు మా కాలేజీ లో . అయన మంచి కళాభిమాని . ఒక్కసారే యిందు వందలు బహూకరించారు.
'అలాగా! మంచిదే! సరే!-- ఆ ! నువ్వు పడుకో యిక -" ఆ తల్లి గొంతు లో ఏదో భావం క్రిందికి పైకీ దిగసాగింది. కనుల నిండుగా అశ్రు బిందువులు తళుక్కు మన్నాయి. కానీ కూతురి కంట పడనీయ లేదామె.
దీపం వత్తిని తగ్గించుతూ గోడ నున్న 'ఫోటో', వంక చూసిందో క్షణం.
'మన బంగారు తల్లికి బహుమతీ! మీ చేతులతో ఎందరికేన్ని బహుమతు లిచ్చారో! కానీ...ఈనాడు-- రాధ బహుమతి తో జీవితం వెళ్ళదీయవలసి వచ్చింది. ఏం చేయగలను? పెట్టిన చేయి క్రిందైపోయింది. బిడ్డల భవిష్యత్తు దారే లేకుండా పోయింది....' సన్నగా గొణుగుతోందా అనురాగమయి లోలోన.
ఎంత అణుచుకున్నా గతం లోని వైభవం కన్నుల ముందర చక్రం లా తిరుగుతూనే వుంది. లోనుంచి బాధ, జ్వాలలా రగుల్తూనే వుంది. కళ్ళు అవిరామంగా వర్షించుతూనే వున్నాయి.
* * * *
విజయవాడ లో పేరు మోసిన డాక్టర్ల లో మొదటి కోవకు చెందిన వారు నాగభూషణం గారు. మొదటి నుంచీ సిరి సంపదలతో తులతూగేది వారి కుటుంబం. అష్టైశ్వర్యాలు అనుభవించారాయన. అన్నిటిని మించి అయన సహృదయులు. కళాభిమానులు. కళా పోషకులు కూడా. వైద్యం కన్నా ఆయనకు కళ పైన అభిమానం మెండు.
అందుకే కన్న కూతురు అనూరాధ కు అరవ ఏట నుంచే నృత్యం నేర్పించారు. ఆ నగరంలో ఎక్కడ కళా ప్రదర్శన జరిగినా ఆహ్వానించబడేవారు . ఎందరకో ఎన్నో బహుమతుల్ని అందజేశారు. స్వయంగా 'కవిత' అన్న పత్రికను కూడా కొన్నాళ్ళు నడిపారు.
దాగి వున్న కవితా రత్నాల నెన్నింటినో వెలికి దెచ్చారాయన. ప్రతి సంవత్సరమూ వో రచయితనో, కవినో, నటులనో, సత్కరించేవారు ఘనంగా....అందుకే అయన కెందరో మిత్రులయ్యారు.
కళాభిమానమే గాని సంపాదన తరిగి పోతోందన్న వూహే రాలేదాయనలో ఎన్నెళ్ళయినా. దానికి తోడు అగ్నికి ఆజ్యం సాయం వచ్చినట్లు బట్టల మిల్లులు రెండూ నష్టం తో మూసి వెయబడ్డాయి. పంటలు పూర్తిగా నాశన మయ్యాయి. తమ్ముడు రాఘవరావు తో కలిసి చేస్తున్న పొగాకు వ్యాపారం లో లక్ష రూపాయల నష్టం వచ్చిందని తేలింది.
అన్నీ కలిసి ఆస్థిని కర్పూరం లా హారతి పట్టాయి. వెనుదిరిగి చూడక మునుపే వున్నదంతా శూన్యమై పోయింది. మిగిలిందల్లా అయన కున్న వైద్య వృత్తీ, అనురాధా, రాజు, అన్నపూర్ణమ్మలే.
వయసుతో బాటు, మనో వ్యధ కూడా కావలసినంత పెరిగి కూర్చుంది . ఆ వ్యధ తోనే బ్యాంకు లో ఒక్క వేయి రూపాయలుండగా కన్ను మూశారాయన.
అనూరాధ యింటరులో వుందప్పుడు. రాజు హైస్కూల్లో జాయినయ్యాడు. అన్నపూర్ణమ్మ గారి కంతా అంధకారమే మిగిలినట్లనిపించింది. భర్త జీవించి వున్నన్నాళ్ళూ ఆత్మీయుల్లా, మెలిగిన వారంతా మంత్రించినట్లు మాయమయ్యారు. ఎవరి ముందు ఏమడిగినా లాభం లేదని గ్రహించిందా బాధామయి.
దుఃఖాన్ని అణుచుకుని కర్మకాండలు ముగించి ఏలూరు చేరుకుంది. ఉన్న డాబా అమ్మితే అయిదు వేలు రాగా తనఖా వదిలేసరికి అయిదు వందలు మాత్రమే మిగిలాయి. బ్యాంకు లో డబ్బూ యిదీ చేత బట్టుకుని వరసకు అన్నగారైనా 'మోహనరావు ' గారి ఇల్లు చేరింది పిల్లలతో.
అయన దూరపు బంధువు. నాగభూషణం గారి సాయం తోనే అఫీసరై లక్షలర్జించుతున్నాడు. కాని అయన చేసిన మేలు కతడేమీ నోరు మెదపలేదు. వాళ్ళు తల దాచుకోడానికి మాత్రం అద్దె పుచ్చుకుని వో రెండు గదులిచ్చాడు . అదే పదివేలనుకుందా యిల్లాలు.
రాత్రిళ్ళు విస్తళ్ళు కుట్టి ఆ యింటికి వస్తూన్న పనిమనిషి రాజయ్యతో అమ్మించేది అన్నపూర్ణమ్మ గారు. అదీ అతి రహాస్యంగా, పై వారి కేవరికీ తెలియనీయకుండా చేస్తోంది. ఆ తల్లి ఆ విధంగా కన్న బిడ్డలా కోసం అహర్నిశలూ కష్టపడుతోందని ఆ యింటి వారికే తెలియదు. ఉంటున్న యిల్లు కూడా వేరుగా వుండడం మూలాన ఆ పని ఎవరి కంటా బడకుండా పరువును మిగుల్చుకొంటున్నదామే.
కొన్నాళ్ళు పోయిన తరవాత ప్రక్క వాటాలో వుంటున్న పంతులమ్మ సాయముతో 'మిషన్' మీద జాకెట్టు లూ, లంగాలూ కుట్టడం నేర్చుకుంది. ఆ వయస్సున అది కష్టమనిపించింది. కానీ బాధ్యతలా బరువును మోయించాయి.
మిషన్ మీద వచ్చే డబ్బుతో బియ్యం, కూరగాయలు తెప్పించేదామె. పిల్లల చదువుకు బ్యాంకు లో నుంచి అయిదు వందలు తీసింది.
కానీ ఎంత పొదుపుగా వాడినా డబ్బు చాలడం లేదు. రాజుకు యస్.యస్.యల్.సి.. పరీక్ష ఫీజు, రాధకు బట్టలూ కావలసి వచ్చాయి. ఏం చేయాలో ఆ యిల్లాలికి తోచకుండా పోయింది.
బ్యాంకు లో చిల్లి గవ్వ లేడిక. ఎలాగా అని వ్యధతో వూగి పోతున్న ఆమె హృదయానికి వూరట లభించిందీ బహుమతి చూడగానే. కానీ లోలోన బాధ కలుక్కు మంటూనే వుంది. బాధ్యతల బరువు తెలియ కుండా బిడ్డల్ని పెంచాలని కలలు కన్నదా బాధా మయి. ఒక్క కల కూడా ఫలించలేదు.
మరొక్క సంవత్సరం చదివితే అనూరాధ బి.యస్. సి పూర్తవుతుంది. ఏదైనా వుద్యోగం దొరుకుతుంది. రాజు బాధ్యత రాధదే అనుకున్నదామె. కానీ ఆ ఒక్క సంవత్సరానికి కావాల్సిన డబ్బు ఎలా అందుతుందో ఆ భగవంతుడి కే తెలియాలి అని నిట్టూర్చిందామె.
