Previous Page Next Page 
సాఫల్యం -1 పేజి 9


    కడుపులో దేవినట్టయ్యింది. ఏ పాపం చేశానో యీ ఫలితం అనుభవించాను. ఇప్పుడు తల్లీ, కూతుళ్ళ మధ్య నిలబడితే --- మళ్ళీ ఈ పాపానికి శిక్ష ఎంతో అనిపించింది. శరీరం జలదరించింది.
    కానీ, జయ జీవితకధ సుశీలతో చెబితే సుశీల మన్నిస్తుందా! అలాటి వ్యక్తిని తల్లిగా అంగీకరించు తుందా? అంగీకరించక పోడమే గాకుండా నేను తన తండ్రిని కాదని తెలియడం వల్ల నా మీద కూడా మనస్సు విరిగి, తన జీవితాన్ని తలుచుకుని, ఏ అఘాయిత్యానికో పాల్పడితే!!
    నా శరీరం గగుర్పొడిచింది.
    వీల్లేదు. సుశీలకు ఎలాటి హానీ జరగడానికి వీల్లేదు. జయ విషయం సుశీలకి తెలియనివ్వ కూడదని కఠినంగా నిర్ణయించు కున్నాను. జయతో చర్చించాను. జయ కన్నీరు తుడుచుకుని నిట్టూర్చి, "అవును. చేసిన పాపా ఫలం అనుభవించక తప్పదు. నేను తిరునాల్వేలి వెళ్తాను. వచ్చేటప్పుడు మళ్ళీ ఒక్కసారి చూస్తాను పాపని. అంతే ఆ తరువాత మళ్ళీ దానికి కనుపించను. ఆ ఒక్క వరం యివ్వండి" అంది.
    నా మనస్సు ఆమె మాటలతో నగిలిపోయింది.
    "జయా! నువ్వు పరిస్థితుల్ని అర్ధం చేసుకో. ఆపైన నీ యిష్టం." అన్నాను. ఆపూటే జయ వెళ్ళిపోయింది. ఏమిటో -- సమస్య తీరేసరికి మరొక సమస్య తయారవుతుంది. నా జీవితమే యింతేమో అసలు.

                             *    *    *    *
    ఆ మర్నాడు ఆఫీసుకు వెళ్ళగానే నాకోసం ఎవరో కుర్రాడు వచ్చాడని ఫ్యూను చెప్పాడు. జాఫర్ అయి ఉంటాడనుకుని "రమ్మను" అన్నాను. అతను వచ్చాడు. వస్తూనే నమస్కారం అంటూ రెండు చేతులూ కలిపాడు. జాఫర్ కాదు.
    "కూర్చోండి" అన్నాను.
    అతను కాస్త ,మొహమాటపడి కూర్చున్నాడు.
    ఓ క్షణం ఆగి ప్రారంభించి తను వచ్చిన పని మామూలే!! బీకాం చదివాడుట. ఉద్యోగం కావాలట. తండ్రి చనిపోయాడని, తన తల్లి కష్టపడి చదివించిందని, ఇక తల్లిని కష్టపెట్టడం భావ్యం కాదని ఉద్యోగం చేయాలని ప్రయత్నిస్తే ఎక్కడా దొరకలేదని -- కన్నీటితో చెప్పాడు.
    ఇలాంటి గాధలు వినడం అలవాటే!! నిజం చెప్పారో, లేక ఉద్యోగం కోసం చెప్తారో తెలియదు. అతనికేసి తేరిపార చూశాను. మనిషి దబ్బపండు రంగులో చక్కగా ఉన్నాడు. మిలమిలా మెరిసే కళ్ళతో అమాయకంగా ఉన్నాడు.
    "అప్లికేషను యివ్వండి. ప్రయత్నిస్తాను." అన్నాను.
    "తీసుకు వచ్చానండి" అంటూ చేతులో పెట్టాడు. ఆ రకంగా ప్రయత్నించే వాళ్ళందరూ అప్లికేషనూ, సిఫారసు కాగితాలు కూడా పట్టుకుని తిరిగుతారు. అదే వాళ్ళ రివాజు.
    "శలవు తీసుకుంటాను" అంటూ లేచి నిలబడ్డాడు. "మంచిది" అనడంతో నే వెళ్ళిపోయాడు. నేను టేబిలు మీదున్న అతని అప్లికేషన్ చూస్తూ కూర్చున్నాను.
    ఇంతలో ఫోను మోగింది.
    సినిమా కు స్నేహితురాళ్ళ తో వెళ్తున్నానని, రాత్రికి ఆలస్యంగా వస్తానని , వెళ్ళమంటారా సినిమాకి?" అని సుశీల గొంతును ఫోను నా చెవిలో వేసింది.
    "వెళ్ళమ్మా ! జాగ్రత్త సుమా" అన్నాను.
    ఫోను క్లిక్ మంది. పెట్టేశాను. సుశీల ని ఎంత శాసించాలను కున్నా అది నా వల్ల కాదు. ఆ గొంతు వినడం తోనే నాలో కోసం చప్పున చల్లారి పోతుంది.
    ఏమిటో మనిషికి ఒక్కొక్క బలహీనత!!
    నాకు సుశీల పై కోప్పడం అంటే చేతగాని పని.
    నా బలహీనత అది.
    ఏం చేస్తాం??
    నవ్వుకున్నాను-- నా అసమర్ధత కేమో!

                                              *    *    *    *
    సాయంత్రం ఇంటికి వెళ్లి స్నానం చేసి , ఆరుబయట కుర్చీ వేసుకుని కూర్చున్నాను. మళ్లీ శరీరం విశ్రమించడం వల్ల బుర్ర లో ఆలోచనలు విజ్రుంభించాయి.
    మళ్ళీ జయ వస్తుంది. తనని అమ్మా అని సుశీల పిలవాలని, ఆ పిలుపు వినాలనీ జయకి కోర్కె ఉంది. అది తప్పు కాదు. ఏనాటి కయినా వాళ్ళిద్దర్నీ కలిపితేనే నా శ్రమ కి ఫలితం ఉంటుందేమో ననిపించింది.
    కానీ సుశీల నన్ను పరాయి వాణ్ణి గా చూస్తె భరించ గలనా!
    లేను.
    సుశీల కి తల్లిని, తండ్రిని నేనే!
    కుర్చీలోంచి లేచాను. లేచి ఏం చేయాలో తోచక కూర్చున్నాను. వంటమనిషి వంటచేసి వెళ్లి పోయింది.
    పాపం వంటావిడ పెద్దేనిమిదేళ్ళ నుంచి పని చేస్తోంది. ఇంట్లో ఒక వ్యక్తిగా అయ్యింది.
    నా జీవితంలో -- రంగం లోకి జొరబడి ఏ తేడా లేక, అలా నిలిచిపోయింది ఒక్క వంటావిడనెమో అనిపించింది. అవును. వంటావిడ తప్ప నాకు తెలిసిన ఎవ్వరూ అంత స్థిరంగా లేరు.
    గడియారం ఎనిమిది కొట్టింది. కొంచెం కునుకు పట్టినట్లయింది. లేచి అటూ యిటూ తిరిగాను.
    సుశీలకి వివాహం చెయ్యాలనే సమస్య ఒకటి ఉండనే ఉంది. సంబంధాలు ఎలా చూడాలో నాకు తెలియదు. నాకు సహాయం చేసేవారెవరూ లేరు. నా అన్నవాళ్లు లేని నాకు సహాయం చేసేదెవరు?
    పోనీ సుశీల ప్రేమించి నతన్నే పెళ్లి చేసేస్తే!!
    "వీల్లేదు" అంది నా మనస్సు.
    వీల్లేదు అనుకున్నాను, ప్రేమ మంచిది కాదన్న నిర్ణయంతో.
    నాకు కొన్ని ఆలోచనలు చస్తే తెగవు. 'ఆలోచించిన కొద్దీ అసలు తేలదు. అలాటప్పుడు ఆలోచన మానేయ్యడమే మంచిది.' అని అలోచించి తెల్చుకునేసరికి తొమ్మిది దాటింది.
    రేడియో పెట్టాను. దడదడ ఎవరో బాకీ తీరుస్తున్నట్టు ఇంగ్లీషు లో ఏదో చెప్పేస్తున్నారు. వార్తలయ్యుంటాయి . నాకు వాటితో పని లేదు. రేడియో ఆపేశాను. చొక్కా తొడుక్కుని ఇంటికి తాళం వేశాను. కాస్సేపు గుమ్మం దగ్గర నిలబడి నిలబడి, రోడ్డు చివరికి వెళ్లి, సోడా ఒక తీ తాగి , అక్కడ నిలబడ్డాను. నా పక్క నుంచి టాక్సీ ఒకటి వెళ్లి కొంచెం దూరంలో ఆగింది. నాకోసం ఎవరైనా వస్తున్నారేమో, నన్ను చూసి ఆగి ఉంటారని అటు చూశాను. టాక్సీ లోంచి సుశీల దిగింది. ఆమె వెనక ఒక యువకుడు దిగాడు.
    నా శరీరం కోపంతో వణికింది. ప్రయత్నం మీద నిగ్రహించు కుని, అలాగే నిలబడ్డాను. అతను సుశీలతో ఏదో మాట్లాడుతూ, తరువాత టాక్సీ లో ఎక్కి వెళ్ళిపోయాడు. నేను సుశీల వెనక ఇంటికి బయల్దేరాను. నన్ను చూసి సుశీల "ఎక్కడికి వెళ్ళారు బాబయ్య గారూ" అంది.
    'అలా సోడా తాగడానికి వెళ్లానమ్మా" అన్నాను.
    "ఎటు వెళ్ళారు" అంది.
    'అదే యిటు రోడ్డు చివరకు" అన్నాను. సుశీల గతుక్కుమంది. భోజనం దగ్గర కూడా నాతొ తలెత్తి మాట్లాడలేక పోయింది. సినిమా ఎలా ఉంది అని అడిగితె పొడిగా చెప్పింది. ఇదివరలా కధంతా చెప్పలేక పోయింది. భోజనం అయ్యాక పక్క మీద చేరి కళ్ళు మూసుకుని నిద్ర కుపక్రమించింది.
    ఇన్నాళ్ళూ కష్టపడి పెంచాను. పెద్ద చేశాను. ఇప్పుడు పెళ్లి చేసి, నా బాధ్యత తీర్చుకుందామనుకునే లోగా యీ అవాంతరం వచ్చి పడింది. నా బాధ్యత సరిగా నెరవేర్చక పొతే --నా ఆశయమే దెబ్బతింటుంది.
    పైగా జయ వచ్చింది. ఏదైనా తేడా వస్తే నా కూతుర్ని యింత చక్కగా పెంచారన్న మాట అన్నా అనవచ్చు. పరాయి బాధ్యతలు తీసుకున్నాక, సరిగా నెరవేరిస్తే సరేసరి, లేకపోతె నిందపడి తీరాలి. నేను సుశీల ని ఎంత ప్రేమానురాగాలతో పెంచినా, నిజం బయటికి వస్తే సుశీల నా కూతురు కాదు. నాకూ, సుశీల కూ ఆ అఘాతం ఎప్పుడూ ఉంది. కనీసం దూరపు చుట్టాన్ని కూడా కాదు నేను.
    ఒక దాది నన్నమాట.
    నాలో పిచ్చి ఆవేశం పుట్టింది.
    మొక్కగా వంగనిది మానుగా విరగక, వంగుతుందా ఏమిటి అన్నారు. ఆనాడు ప్రేమ లేఖ చూసినపుడే అడగవలసింది . నేను పనికి మాలిన వాడిని అనుకున్నాను. సుశీలని నిద్రలేపి, ఆ చెంపా, యీ చెంపా వాయించి "ఎవడు వాడు? ఇంత సాహసం నీకెలా వచ్చింది?' అని నిలదీసి అడగాలని పించింది.
    కానీ, ప్రధమ కోపంలో విచక్షణ ఉండదన్నారు.
    నిగ్రహించుకుని , మరో పద్దతి అవలంబించడం మంచిదని నిర్ణయించు కున్నాను. మంచం మీద నుండి లేచాను. సుశీల కూడా నిద్ర పోనట్లుంది. "మంచినీళ్ళు కావాలా" అంటూ లేచింది.
    'అవునమ్మా" అన్నాను. సుశీల గొంతు వినడం తోనే చప్పున నా ఆవేశం, కోపం చల్లారి పోయింది.
    మంచినీళ్ళు తాగి నిద్ర కుపక్ర మించాను.

                         *    *    *    *
    ఆఫీసులో కూర్చున్నా నన్నమాటే గాని, నెత్తిమీద ఫ్యాను లా బుర్ర కూడా తిరుగుతోంది. జాఫర్ వచ్చాడు. "విశాఖపట్టణం లో ఉద్యోగం యిస్తే వెళతావా" అన్నాను.
    "వెళ్తానంది" అన్నాడు.
    "అయితే రేపురా!" అన్నాను. అతనికి విశాఖ పట్టణం బ్రాంచి లో ఉద్యోగం యివ్వాలని నిర్ణయించు కున్నాను. కారణం అతని పేరేనేమో!
    ఇక రెండో అప్లికెంటు.
    వెంకట రమణ!!
    మా యిలవేల్పు . నా ఆరాధ్య దైవం.
    మధ్యాహ్నానికి అతను వచ్చాడు. అతన్ని చూడ్డం తోనే నా కళ్ళు మెరిశాయి. తర్వాత కోపంతో ఎర్రబడ్డాయి. రాత్రి సుశీలతో టాక్సీ దిగింది వీడే!! గమ్మున యెగిరి కాలరు పట్టుకుని, వీపు మీద చాకిరేవు పెట్టేద్దామనుకున్నాను.
    అతి కష్టం మీద నిగ్రహించు కున్నాను. నాలో తేడా చూసి, అతను భయపడి పోయాడు. "కూర్చోండి." అన్నాను. అతను కూర్చున్నాడు. వూపిరి బిగపట్టాడు.
    "ఇక్కడ ప్రయత్నిస్తే మీకు ఉద్యోగం దొరుకుతుందని ఎవరు చెప్పారు?" అన్నాను. అతను గతుక్కుమన్నాడు.
    "ఏం? మాట్లాడరేం" అన్నాను.
    సుశీల చెప్పి ఉంటుందని నా నమ్మకం.
    అతను నీళ్ళు నమిలాడు. "సరే! రేపు ఈ పాటికి రండి" అన్నాను చిన్నగా నవ్వుతూ. నా ముఖం మీద నవ్వు చూసి, అతను కూడా నవ్వు ముఖం పెట్టి "శలవు తీసుకుంటాను." అంటూ శలవు తీసుకున్నాడు . నేను ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకున్నాను.
    ఈవేంకట రమణునికి సుశీలే చెప్పి వుంటుందనిపించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS