Previous Page Next Page 
సాఫల్యం -1 పేజి 10

                      
    సాయంత్రం యింటికి వెళ్లేసరికి సుశీల కాఫీ చేసి సిద్దంగా పెట్టింది. కాఫీ తాగాక "ఇవాళ ఉద్యోగం కావాలని ఒక వెంకట రమణుడు వచ్చాడమ్మా. బాగా అబద్దాలు మాట్లాడాడు. నీకు నా దగ్గరి కెళితే ఉద్యోగం దొరుకుతుందని ఎవరు చెప్పారు" అనడిగాను. భయపడిపోయాడు. అతనేదో చెప్పడానికి భయపడుతున్నాడనిపించింది" అన్నాను. సుశీల ముఖం నల్లబడింది.
    "అతనికి ఉద్యోగం యివ్వదల్చుకోలేదమ్మా" అన్నాను. సుశీల ముఖంలో మార్పు గమనిస్తూ. సుశీల తల వంచుకుని . తన పాదాలు చూసుకుంటూ కూర్చుంది.
    భోజనాల దగ్గర సుశీల మౌనంగానే ఉంది. తలఎత్తి నా ముఖం కేసి కూడా చూడలేకపోయింది. నాలో కొంత సంతృప్తి కలిగింది.

                                           *    *    *    *
    మర్నాడు ఆఫీసుకు వెళ్ళడం తోనే అతని అప్లికేషన్ ను తీసి, ఎడ్రసు రాసుకున్నాను. వాళ్ళ యింటికి వెళ్లి, అతన్ని కొంచెం భయపెట్టి వాళ్ళ వాళ్ళ చేత కూడా నాలుగు చివాట్లు వేయిస్తే సుశీల ని నేను చీవాట్లు వెయ్యవలసిన అవసరం ఉండదని తోచింది.
    అదోరకం స్వార్ధం.
    అయినా బయల్దేరాను.
    ఎకౌంటెంట్ ని పిలిచి, "ఓ గంట లో వస్తాను" అని చెప్పి, టాక్సీ లో బయల్దేరి, ఆ వీధి మొదట్లో టాక్సీ ఆపించి దిగాను. ఇంటి నంబరు దొరికింది. తలుపు వొర వాకిలిగా తీసుంది. తలుపు దగ్గర నిలబడి, "ఏమండీ" అని పిల్చాను.
    "ఎవరు?" అందో అడ కంఠం.
    "వెంకటరమణ లేడా" అన్నాను.
    "బజారు వెళ్ళాడు. వస్తాడు. కూర్చోండి" అంటూ అతని తల్లి బయటికి వచ్చింది.
    నేను ఉలిక్కిపడ్డాను. ఆశ్చర్యంతో అలా ఉండిపోయాను.
    రమ! ! !
    "బావా" అంది నన్ను వెంటనే గుర్తు పట్టి.
    "అలా నిలబడి పోయావేం? రా! కూర్చో" అంటూ కుర్చీ నా వైపు వేసింది. కూర్చున్నాను. నా మనస్సు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యింది. రమ కళ్ళ వెంట ఆనంద భాష్పాలు రాలాయి. "బావా! నువ్వు దేముడివి. ఎప్పుడు తల్చుకుంటే అప్పుడు నీ దర్శనం అవుతుంది" అంది.
    ఆనందంతో నా నోట మాట రాలేదు.
    "బావా! భగవంతుడు ఉన్నాడనడానికి ఇంత కన్నా నిదర్శనం కావాలా? ఆనాడు అన్న మాటలు గుర్తున్నాయా? చచ్చిపోయే లోగా నీ దర్శనం చేసుకుంటానని అన్నాం-- అయితే అయన లేరు. నేను మిగిలాను" అంది. రమ కళ్ళ వెంట నీళ్ళు జలజల రాలాయి. తన చరిత్ర అంతా చెప్పింది.
    "నాలుగేళ్ల క్రితం వారు పోయారు. అప్పటి నుంచి కష్టాలు ప్రారంభ మయ్యాయి. వాడిని  బీకాం చదివించే సరికి నా ప్రాణం పోయినంత పనయ్యింది. అయితే నేం , వాడు ప్యాసయ్యాడు. కానీ ఉద్యోగం -- అది మాత్రం తేలికా! ఏదో కంపెనీ లో దరఖాస్తు పెట్టాడుట. వస్తుందని గంతులు వేస్తున్నాడు. అవును, అన్నట్టు వాడు నీకెలా తెలుసు?" అంది.
    "వాడు నీ కొడుకని నాకు తెలియదు. కానీ మా కంపెనీ లోనే వాడు అప్లికేషన్ పెట్టాడు." అన్నాను.
    "చూశావా! అన్నీ ఎలా కలిసోచ్చాయో! వాడి వల్లే మనం కలిశామన్న మాట. ఆ ! అన్నట్టు నా మతి మండా! నీ సంగతి అడగలేదు. నీకెంత మంది పిల్లలు? ఏమిటి కధ" అంది.
    "పెళ్లి చేసుకోలేదు రమా!" అన్నాను.
    రమ నిట్టూర్చింది.
    "బావా! ఆ పాపం నేను కట్టుకున్నాను కదూ" అంది.
    "పాపం కాదు. పుణ్యం అను" అంటూ సుశీల ని నేను పెంచడం, ఆ పరిస్థితులు, వివాహం మానడం అన్నీ చెప్పి, "మా సుశీలని మీవాడు ప్రేమించాడు. అది ఏమిటో తెలుసుకుందామని, నాలుగు చీవాట్లు వేద్దామని వచ్చాను" అన్నాను.
    రమ నవ్వింది.
    "చూశావా! ఇప్పుడెలాగ వాడిని చీవాట్లు వేస్తావు? ఎలా వేస్తావో చూస్తాను, వాడు వస్తాడుగా యిప్పుడే" అంది. "అది సరే! వెంకట రమణ అని పేరు పెట్టావెం" అన్నాను.
    రమ నిట్టూర్చింది.
    "వారికి వెంకట రమణు డంటే ఎంతో భక్తీ, రోజూ దండం పెట్టుకునేవారు. నన్ను రమ అని, రజియా అని కూడా పిలిచేవారు. కొడుక్కి మాత్రం వెంకట రమణ అని పేరు పెట్టారు." అంది. ఆమె కళ్ళు నీళ్ళతో మెరిశాయి.
    ఇంతలో రమణ వచ్చాడు. వస్తూనే నన్ను చూసి, కొయ్యబారి పోయాడు.
    "అలా చూస్తావేరా! ఎవరను కుంటున్నావు? ,మీ పెదనాన్న గారురా" అంది రమ. అతను మరింత హడలి పోయాడు.
    "ఎరా అలా చూస్తావు" అన్నాను నేను.
    అతను కాస్త తమాయించు కున్నాడు.
    "కూర్చో. నీకోసమే వచ్చాను" అన్నాను.
    అతను కూర్చున్నాడు.
    "మా కంపెనీ లో దరఖాస్తు పెడితే ఉద్యోగం వస్తుందని ఎవరు నీకు చెప్పింది?" అన్నాను. అతను నీళ్ళు నమిలాడు.
    "ఇంకెవరు? చెప్పరా భయమెందుకు?' అంది రమ నవ్వుతూ. రమణ సిగ్గుపడ్డాడు. "వెధవా" అంది రమ.
    నేను ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాను.
    "రమా! మళ్లా నిన్ను కలుసుకోగల ననుకోలేదు. అందులో మన బంధుత్వాలు యిలా కలుస్తాయనుకోలేదు. నిజంగా భగవంతుని లీల విచిత్రం సుమా! ఆ రోజుల్లో మిమ్మల్ని చూడాలని బొంబాయి వచ్చి రెండు సంవత్సరాలు ఉన్నాను. నేనే చూడలేక పోయాను" అంటూ చెప్పాను.
    "పోనీలే , కావాల్సిన వేళకి కలుసుకున్నాం. సుశీల ఎలా ఉంటుంది? దాన్ని కూడా తీసుకురాక పోయావా?" అంది రమ. 'భలేదానివి . ఈ ప్రబుద్దుడు నీ కొడుకని నాకు తెలుసా ఏమిటి? సరేలే! రేపు మీరిద్దరూ మా యింటికి రండి. ఈలోగా సుశీల ని కాస్సేపు ఏడిపించి , నిజం చెప్తాను. కాఫీల వేళకి వచ్చేయండి." అన్నాను. రమ తలూపింది.
    కాఫీ, టిఫిన్ల య్యాక , ఇంటికి చేరాను. ఇంటికి వెళ్లేసరికి సుశీల నిద్రపోతోంది. నా రాకకి లేచింది. "ఏవమ్మా, పడుకున్నా వేమిటి? కాలేజీ కి వెళ్ళలేదూ! వంట్లో బాగుండలేదా" అన్నాను.
    "కొంచెం తలనొప్పి గా ఉందండి" అంది.
    నుదురు మీద చేయి వేసి చూశాను. జ్వరం లేదు. వంటావిడ ని కాఫీ పెట్టమని చెప్పి, ఆఫీసుకు ఫోను చేసి , "యివాల్టి కి రాను. అర్జంటు కాగితాలుంటే పంపండి." అని ఎకౌంటెంట్ కు చెప్పాను.
    సుశీల కుర్చీలో కూర్చుంటూ, "బాబయ్య గారూ! మీరు వచ్చేశారేం" అంది.
    "నీతో ఒక ముఖ్యమయిన విషయం చెప్పాలనమ్మా" అన్నాను. సుశీల నాకేసి భయపడుతూ చూసింది.
    "ఆ రమణ అనే అతని యింటికి వెళ్లాను. తల వాచేటట్టు నాలుగు చీవాట్లు పెట్టాలని." అన్నాను.
    సుశీల తల దించేసుకుంది.
    సుశీల మాట్లాడలేదు.
    "సుశీలా! యిలాటి పనులు చెయ్యొచ్చా. ఇలాటి పని చేసేకన్నా నన్ను కత్తితో పొడిచి చంపినా ఆనందించే వాడిని కదా" అన్నాను. సుశీల వెక్కివెక్కి ఏడవడం ప్రారంభించింది. నాలో పట్టు సన్నగిల్లింది.
    "ఇంకెప్పుడూ యిలాటి పనులు చెయ్యను. ఈ తప్పు క్షమించండి. జీవితంలో మళ్లీ యిలాటి పొరబాటు చేయను" అంది వెక్కి వెక్కి ఏడుస్తూ. నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. మంచం మీంచి లేచి, సుశీల దగ్గరకు వెళ్లి తల నిమురుతూ , "పిచ్చి తల్లీ, ఏమన్నానని? అతను కూడా మనకి కావాల్సినవాడె! వాళ్ళింటికి వెళ్ళాక తెలిసింది. మీకు సమ్మతమైతే నా కభ్యంతరం లేదమ్మా" అన్నాను.
    సుశీల ఆశ్చర్యంగా నాకేసి చూసింది.
    "అవునమ్మా! మనకి చాలా దగ్గర బంధువులు వాళ్ళు" అన్నాను. సుశీల ఆనందానికి అవధులు లేవు.

                              *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS