ముద్ద మందార
---భూపతి

"బాబూ!"
వెనక్కు తిరిగినవాడినల్లా ఉలిక్కిపడ్డాను.
"ఆ పువ్వు నాది బాబూ" అందామె.
ఇంత బతుకు బతికి చివరికి పూవు దొంగగా ఒక ఆడపిల్ల చేతులో పట్టుబడి పోయాను. సిగ్గు వేసింది. అయినా "నీదా" అన్నాను బింకంగా. "అవును బాబూ మా మావిచ్చాడు. జారిపడిపోయినట్లుంది." అంది. అవును, కళింగం మీద కూర్చుని, పావుగంట సేపటి నుంచీ చూస్తూనే ఉన్నాను. వాళ్ళిద్దరూ గేదెలను కడిగి పాటలు పాడుకుని, కబుర్లు చెప్పుకుని, ఆనందంతో కేరింతలు కొడుతూ వెళ్ళిపోయారు. ఇహ ఫరవాలేదని నెమ్మదిగా కళింగం దిగి, ఆ పువ్వు తీసుకున్నాను. నా ఖర్మ. ఆ పిల్ల వెనక్కు తిరిగి వచ్చింది. చేతిలో పువ్వు నుంచి దృష్టి ఆమె మీదకు మళ్ళించి "ఏడీ, మీ మావ నిల పిలు" అన్నాను. ఆ పిల్ల పదడుగులు నడిచి చప్పట్లు చరిచి "మావా, బాబుగారు పిలుస్తున్నారు." అనరిచింది. వాడు పరుగున వచ్చి "దండాలు బాబూ" అంటూ నిలబడ్డ్డాడు.
"నీ పేరేమిట్రా" అన్నాను.
"రాములనండి బాబూ"
"నీ పేరు"
సివాచలం"
కొరడాతో వీపున చరిచినట్టయింది. ఉలిక్కిపడ్డాను. వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయి ముఖముఖాలు చూసుకున్నారు. చేతిలో పువ్వు వణికింది. "ఈ మందారపువ్వు నాక్కావాలి. ఈ పది రూపాయలు తీసుకో' అంటూ జేబులోంచి పది రూపాయలు తీసి, వాడికి యిస్తూ "తోటపని చేస్తూ మా తోటలో మీరిద్దరూ ఉండకూడదు. చక్కగా పాక వోటి వేయిస్తాను." అన్నాను. వాళ్ళ ముఖంలో ఆనందం స్పష్టంగా కనుపించింది. రాములు చేతులు కట్టుకుని, "చిత్తం బాబూ, అంతకన్నా అదృష్టం ఏవుంది?" అన్నాడు. నేను నవ్వి, "జీతం యిద్దరికీ చేర్చి వంద యిస్తాను. పాకలో ఉండచ్చు. భోజనం గూడా మాదే.... ఎవంటావే' అన్నాను.
"వందే!'అంది సింహాచలం గుండెల మీద చై వేసుకుంటూ.
"ఏం ? చాలవా?" అన్నాను. సింహాచలం గమ్మున లెంపలు వేసుకుంటూ, "ఎక్కువ బాబూ" అంది. "రేపోద్దున్నే తమ దర్శనం చేసుకుంటాను." అంటూ రాములు చేతులు జోడించి "శలవు తీసుకుంటాం" అన్నాడు. "మంచిది" అన్నాను. పువ్వు వంక చూస్తూ. ఇద్దరూ వెళ్ళిపోయారు.
చేతిలో ,ముద్డ్డ మందారం పువ్వు కేసి చూశాను.
నాలో ఏదో చెప్పలేనంత తృప్తి కలిగింది. సింహాచలం పేరున్న వారందరికీ వెయ్యేసి రూపాయలు బహుమతి యివ్వాలని పించింది. నా వూహని నేనే మెచ్చుకుంటూ తిరిగి కళింగం మీదకు చేరాను. మనస్సులోకి నీ వూహా, రాకుండా, రానివ్వకుండా వో పావుగంట అలా పువ్వు కేసి ఏకాగ్రతతో చూచి అనక నిట్టూర్చి , "ఏకాగ్రత చాలా కష్ట సాధ్యం" అనుకుంటూ కళింగం దిగి, కారు కేసి నడిచాను. కారు దగ్గర నిలబడ్డడో కుర్రాడు "బాబూ! కారు కాపలా చేశాను. వో పైసా యిప్పించండి" అన్నాడు. నాకు వళ్ళు మండింది. ఛీ....వెధవా. పైసా లేదు. పాడూ లేదు." పో అనరిచాను. వాడు భయపడి, పోయాడు.
మందార పువ్వు పది రూపాయలు పెట్టి కొనాడానికి మనసోప్పింది కానీ, వాడికి పైసా అయినా యివ్వడానికి మనసొప్పలేదు. అది మానవత్వం కాబోలు. అయి ఉంటుంది.
కారు రాక చూసి, రామయ్య గేటు తెరిచాడు. మందారపువ్వు ను పట్టుకుని దిగుతుంటే రామయ్య నాకేసి వింతగా చూశాడు. తిన్నగా నా గదిలోకి వెళ్ళి, టేబుల్ మీద పెట్టాను. మందారపువ్వు నాకేసి దీనంగా చూసింది.
చూసింది పువ్వు కాదు.
సింహాచలం.
అది గతం -- అనవసరం దాని జోలనుకున్నాను.
స్నానం చేసి, భోజనాదులు ముగించి, భగవద్గీత చదువుతూ కూర్చున్నాను. భగవద్గీత వో ముక్క చదివినా, గంగాజలం వో గుక్కెడు తాగినా.... ఆ వ్యక్తికీ చనిపోయాక స్వర్గం దక్కుతుందని వో సంస్కృతపద్యం అర్ధం చెప్పింది. స్వర్గం లభించడం అంత తేలికా!!
కుర్చీలో వెనక్కు వాలాను మడత కుర్చీలో వెనక్కు వాలకుండా కూర్చునే వాళ్ళు బహు తక్కువ.
మళ్ళీ తల భగవద్గీతలో ముంచాను. వెంటనే ఆవులింతలు ప్రారంబించాయి. భాగుపడడానికి ఆవులింతలో అడ్డంకు అనే వారు నాన్నగారు. అనడానికిప్పుడాయన లేరు. అయన వయస్సు లో యిప్పుడు ఉన్న నన్ను అనడానికి నాకు ఎవ్వరూ లేరు. భగవద్గీత మూసి పక్క మీద చేరాను.
ముద్దమందారం!!
టేబులు మీది పువ్వులోంచి సింహాచలం నాకేసి జాలిగా చూసింది. మగతగా పట్టే నిద్రను గతం చేరువుతోంది. నివారించడానికి నా శక్తి చాల్లేదు.
"--రోజులానే ఆరోజు పొద్దున్నే సింహాచలం పనిలోకి వచ్చింది. గిన్నెలు తోమింది. ఇల్లు వూడ్చింది. కాఫీ కాచి నాకో గ్లాసిచ్చి, తనో గ్లాసు తీసుకుంది. కాఫీ వో చుక్క తాగి "చాలా బాగుంది అన్నాను." సింహాచలం కళ్ళు ఆనందంతో వెలిగాయి. "మీ పెళ్ళి ఎప్పుడు బాబూ" అంది నవ్వుతూ. "నీపేళ్ళప్పుడే " అన్నాను. అంటూ దానికేసి చూశాను. సింహాచలం చూడ ముచ్చటగా సిగ్గుపడింది. దాని తల్లోంచి పువ్వు.... ముద్ద మందారం పువ్వు జారి క్రింద పడింది. నేను గమ్మున కుర్చీలోంచి లేచి, ఆ పువ్వు తీసుకున్నాను. సింహాచలం కుడిచేతి చూపుడు వేలు గడ్డం క్రింద నొక్కిపెట్టి నోరు జాపి, "హ్యేయ్! అది తల్లో పెట్టుకున్న పువ్వు. ఛీ.... మీ కేందుకది?" అంది.
నేను మాట్లాడకుండా పువ్వు కేసి చూస్తూ, "కావాలి. అందుకనే కావాలి." అన్నాను. సింహాచలం చీత్కారం చేసి "కావాల్సోస్తే మంచి పూతెస్తా. అదిట్టా ఇవ్వండి" అంది. నేను సింహాచలం కేసి జాలిగా చూశాను. అది దాని తలలోంచి పడిన పువ్వు గనుకే నా కంత యిష్టం అయ్యింది. ఆ సంగతి దానికేం తెలుసు!
"నీ తల్లోంచి పడ్డ పూవు గనుకే నాక్కావాలి. కొత్తది నా కెందుకు" అన్నాను. పువ్వు వాసన చూస్తూ. మందార పువ్వు వాసన రాదు. అధవా వచ్చినా, అది వాసన క్రింద జమ రాదు. నా మాటలకు సింహాచలం సిగ్గుపడి, "పొండి బాబూ, మీకంతా ఎలాకోలమే" అంది. పువ్వు బల్ల మీద పెట్టి సింహాచలం చుట్టూ నా రెండు చేతులు వేస్ పొదివి పట్టుకుని "నీ అందం నీకు తెలీదు, మందారపువ్వు అందం నీ తల్లో చూసేవరకూ నాకు తెలీదు." అన్నాను. సింహాచలానికి నా మాటల్లో భావం బోధపడక పోయినా నవ్వేసి , "బాగుంది బాబూ" అంది. ఆపైన ఆమెను మాట్లాడనివ్వకుండా నా పెదిమలు ఆమె పెదిమలను మూసేసినాయి.
ఆ రోజునుంచి సింహాచలం రోజూ నాకోసం వో మందారపువ్వు తెచ్చి యిచ్చేది. నేనా మందార పువ్వు తీసి టేబులు మీద పెట్టుకునే వాణ్ణి.
ఆరోజు నుంచి నాకు ముద్ద మందార ఆరాధ్య దైవం.
* * * *
మంచం మీద అటూ యిటూ కదిలాను. కళ్ళు మంటలేక్కాయి. సూదులతో కళ్ళ మీద గుచ్చినట్లు అనిపించింది. కళ్ళు నులుపుకుని, తెరిచి చూశాను.
తెల్లవారింది. భళ్ళున తెల్లవారింది.
ఒళ్ళు విరుచుకుంటూ బల్ల కేసి చూశాను. ఉలిక్కిపడ్డాను. రాత్రి టేబిలు మీద పెట్టిన పువ్వు లేదు. నా శరీరం కోపంతో, వణికిపోయింది. రామయ్యను పిలిచి, పువ్వేదని గద్దించి అడిగాను. అతను నిలువునా వణికిపోతూ "వోడిలిపోతే ....పారే....."
"నోర్మూయ్ " అనరిచి, "ఎక్కడ పారేశావో పోయి పట్రా." అన్నాను. రామయ్య పరుగున వెళ్ళి, పువ్వుతో తిరిగి వచ్చాడు. పువ్వు బల్ల మీద పెడుతూ, "బాబూ తప్పయిపోయింది." అన్నాడు చేతులు జోడించి. నా హృదయం ద్రవించింది. నా తొందర పాటుకు సిగ్గు కలిగింది. పదిహేనేళ్ళ నుంచీ నమ్మకంగా, ఒక్క మాట కూడా పడకుండా నడుచుకుంటున్నాడు పాపం!!
"పోన్లే రామయ్యా! బాధపడకు. మందారపువ్వు నేను పారేయ్యమంటే గాని ఎన్నడూ పారేయ్యకు....ఎక్కడైనా నీకు కనిపిస్తే తెచ్చి బల్ల మీద పెట్టు" అన్నాను. నాలో ఆవేశం వచ్చినట్టయింది. కళ్ళ వెంట నీరు ధారగా కారింది.
రామయ్య భారంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. నేను నిట్టూర్చి బాత్ రూమ్ వైపు వెళ్ళాను. స్నానం చేసి, టిఫిను తిని, కాఫీ తాగి బయటకు వచ్చేసరికి రాములు, సింహాచలం వచ్చి వాకిట్లో నిలబడి ఉన్నారు. నన్ను చూస్తూనే దండాలు బాబూ" అన్నారు. మాటిచ్చిన ప్రకారం వాళ్ళ కన్ని సదుపాయాలూ చెప్పి, పాక వేయించుకోవాల్సిన ప్రదేశం చూపి, మేనేజరుతో ఆ విషయం చెప్పి, "ఈ మందార చెట్లను మాత్రం ప్రాణాల కన్నా ఎక్కువగా మీరు చూసుకోవాలి సుమా" అన్నాను.
"మీరూ చెప్పాలా బాబూ. మందారపూవంటే దానికి పంచ ప్రాణాలూను" అన్నాడు రాములు. నా కది గిట్టలేదు. "మందార పువ్వు ఒక్కటయినా కోయడానికి వీల్లేదు. రాలినవి రాలినట్టే రామయ్యకు యివ్వాలి." అన్నాను. వాళ్ళు అయోమయంగా నాకేసి చూసి ఒకళ్ళ నొకళ్ళు చూసుకుంటూ, "అలాగే బాబూ! చిత్తం అన్నారు.
* * * *
రోజంతా గడిచింది. జీవితంలో "మధ్యాహ్న కాలం ' దాటాక అస్తమిస్తున్న విషయం గ్రహించి, గతం గురించి కాలక్షేపం చేస్తే వచ్చే తృప్తి ....లేక వ్యధా.... మరొకప్పుడు రాదన్నాడు ఒక జ్ఞాని.
రోజంతా గడిచి, అర్ధరాత్రి సమీపించింది. మెలకువ వచ్చింది. కనుక పన్నెండయి ఉండాలి. నాలుక పిడచకట్టుక పోయింది. లేచి, మంచినీళ్ళు తాగాను. దాహం తీరనేలేదు.
నా దాహాగ్ని నీటికి చల్లారేది కాదు. సిగరెట్టు వెలిగించాను. మనస్సు గతంలోకి లాగ నారంభించింది. అదుపులో పెట్టుకుంటే బాగుణ్ణు. పెట్టుకోడం మన చేతులో లేదు. కాకపోయినా, గతంలో ఆలోచిస్తే వచ్చేనష్టం లేదు. దోమతెరలో దూరి, తలగడ క్రింద మంచంలో ఉన్న అరలో దాగిన అల్భం తీసుకుని కూర్చున్నాను.
మొదటి పేజీ.
నేను .... బొమ్మ గుర్రం మీద ఎక్కి కూర్చున్నాను. పాపం.... మోసం తెలియని వయస్సు.... ఆ వయస్సులో మిగిలి ఉండిపోతే.... కాని అది జరగదు. రెండో పేజీ తిప్పాను. బియ్యస్సీ పాసయిన కొత్తలో సూటు వేసుకుని తీయించుకున్న ఫోటో.... మూడో పేజీ..... నేనూ రాధా.... నాలుగో పేజీలో నేనూ రామం.... అయిదో పేజీలో నేనూ సుశీలా, రామం.
ఆరో పేజీ!
తిప్పబోతున్న నా చేతి వేళ్ళు వణికాయి. వణికే చేతిని వణికే చేత్తో పట్టుకుని పేజీ తిరగేశాను.
సింహాచలం.
నా కళ్ళు నిశ్చలంగా ఆమెకేసి చూశాయి.
నుదుట పట్టిన చమట తుడుచుకున్నాను.
నోట్లో గడ్డి పరక పెట్టుకొని, నిష్కల్మషమైన చక్కని ఆనందంతో కిలకిల్లాడుతున్న సింహాచలం --- మిలమిల మెరిసే ఆమె కళ్ళు..... నవయవ్వనం!
అదే నా కొంప తీసింది.
మరో సిగరెట్టు వెలిగించి గతంలోకి వాలిపోయాను వద్దనుకుంటూనే....
అది నా జీవితాన్ని మార్చిన విచిత్ర చరిత్ర.
"-- అవి నేను గోపాలపురం ఉద్యోగంలో చేరిన కొత్త రోజులు. నేను చేసేది ప్రభుత్వ ఉద్యోగం. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడకు వెళ్ళాలి. వైజాగ్ నుంచి నన్ను గోపాలపురం బదిలీ చేశారు. సముద్రపు వొడ్డు ఎక్కడుంటే అక్కడి కల్లా వెళ్ళడమే నా ఉద్యోగం.
గోపాలపురం లోనే ఉన్నది వో సంవత్సరం కన్నా తక్కువే అయినా ఆ వూరు మాత్రం నా జీవితంలో చెరగని ముద్ర వేసుకుపోయింది.
విశాఖపట్టణం కన్నా గోపాల్ పూర్ చాలా బాగుంటుందని మిత్రులు , నా తోటి ఉద్యోగులు నన్ను అభినందించి, అదృష్టవంతుణ్ణి అన్నారు. వంట చేసుకుని తినే అలవాతుండడం వల్ల వంటసామానుతో సహా గోపాల్ పూర్ చేరాను. పాతిక రూపాయలకు లంకంత కొంప వచ్చింది. కొండెక్కినంత ఆనందించాను. నిజంగా అదృష్టవంతుడ్నే అనిపించింది. ఆ వూళ్ళో పెద్ద ప్రభుత్వ ఉద్యోగిని నేనే అవడం వల్ల హైస్కూలు హెడ్మాస్టారు ఇంటికి వచ్చి నన్ను పరామర్శించి వెళ్ళారు. పోస్టు మాస్టరు రోడ్డు మీద కలిసి, తనను తాను పరిచయం చేసుకుని నా స్నేహాన్ని గాడంగా వాంచించినట్టు తెలియజేశాడు.
ఒక్క వారం తిరిగేసరికి వూళ్ళో ఉన్న వాళ్ళంతా నాకు చాలా పరిచయస్తులైపోయారు. ఇరుగుపొరుగు పిల్లలు అస్తమానూ నా చుట్టూ చేరి "వాసు గారూ చేపలు పట్టి మీరేం చేస్తారు?" అదేం ఉద్యోగం? దాని వల్ల మీకేం తెలుస్తుంది?" అని కుతుహలమైన ప్రశ్నలు వేసేవాళ్ళు. నాకు పిల్లలతో కలయిక చాలా సరదా అవడం మూలాన్న తీరికయినపుడల్లా చుట్టుపక్కల వాళ్ళను చేరదీసి అవీ యివీ కొనిపెట్టి, ఆకట్టుకుని, కబుర్లు చెప్పి, చెప్పించుకునేవాణ్ణి.
