గోడకి వెళ్ళాడుతున్న వెంకటరమణ ని పటానికి నమస్కరించి, "తండ్రి ! ఆవేశం లో నిన్ను దూషించి ఉండచ్చు. అవన్నీ క్షమించు. పాపని పెంచి పెద్దదాన్ని చేసే శక్తి, స్థైర్యం , నాలో కలుగజెయ్యి. వైవాహిక వాంఛ నాలో ప్రవేశించ నీయకు. పాపని ఆరోగ్య వంతురాలిగా చెయ్యి తండ్రీ" అని ప్రార్ద్ర్ధించాను.
ఆనాడే పాపకి సుశీల అని పేరు పెట్టాను.
సుశీల.
పాప సుశీల కావాలని వాంచించాను.
"------బాబయ్య గారూ, ఏవిటి కలవరిస్తున్నారు." అంటూ సుశీల నన్ను కుదిపింది. ఉలిక్కిపడ్డాను. మగత వదిలింది. లేచి కూర్చుంటూ, "కలవరించానా" అన్నాను.
'అవును, ఉన్నట్టుండి సుశీల అనరిచారు." అంది.
"ఏదో నీమీద పీడకల వచ్చిందమ్మా." అన్నాను.
"ఎప్పుడూ మీకు నన్ను గురించిన ఆలోచనే. పీడ కలలు రాకేం చేస్తాయి" అంటూ వో గ్లాసుడు మంచి నీళ్ళు ఇచ్చి, "త్రాగి పడుకోండి." అంది. మంచినీళ్ళు త్రాగి పక్క మీద వాలాను. సుశీల నా కాళ్ళ దగ్గర కూర్చుని, "అమ్మ గుర్తుకు వచ్చిందేమో అనుకున్నాను.' అంది.
"అవునమ్మా" అన్నాను.
"పడుకోండి" అంది సుశీల.
కళ్ళు మూసుకున్నాను. సుశీల నా పక్క మీద చాలాసేపు కూర్చుని, నేను నిద్ర పోయానని తల్చుకుని వెళ్లి పడుకుంది. నేను శారీరకంగా పడుకున్నా, విశ్రాంతి తీసుకున్నా, మానసికంగా విశ్రాంతి తీసుకోడమనేది జరగని పని........
"----ఎన్ని కష్టాలో పడి సుశీల ని పెంచాను. సుశీలని నా కప్పగించాక నేను మధుర వదిలేసి, విశాఖపట్టణం వెళ్ళిపోయాను. విశాఖపట్టణం లో అవధానులు గారు నన్ను చూసి పరమానంద పడ్డారు. "నా కూతురు సుశీల" అని చెప్పాను. అంత అబద్దం నా జీవితంలో ఎప్పుడూ చెప్పలేదను కుంటాను. అవధాన్లు గారు నమ్మినట్టు కనపడలేదు. ఆ రాత్రి అడిగారు. నేను నాకు తెలియకుండా నే మెత్తపడ్డాను. సుశీల కధంతా ఆయనతో టూకీగా చెప్పి, "సుశీల కి తల్లీ, తండ్రి అంతా నేనే" అన్నాను.
అయన కన్నీరు పెట్టుకున్నాడు.
"నువ్వు నిజంగా చాలా గొప్పవాడివి. నీ జీవితం ధన్య మయింది. ఇలాటి పని సాహసించి ఎవరూ చెయ్యలేరు." అన్నారు. నేను ఆనందంతో ఉప్పొంగి పోయాను. ఆ తరువాత అయన, నేను, సుశీల మా వూరు వెళ్ళాము. నాన్నగారితో నా గొప్ప లక్షణాలన్నీ అవధాన్లు గారు చెప్పారు. నాన్నగారు చాలా చెప్పాక నాతొ మాట్లాడడానికి అంగీకరించారు.
"జీవితాలు భగవన్నిర్ణయాలు . నీ జీవితం ఇలాటి మలుపు తిరగాలని సృష్టి కర్త నిర్ణయం అయితే ఎవరేం చేస్తారు? పోనీలే -- నీకూ ఒక బాధ్యత అప్పగించాడు. ఉద్యోగం వద్దు. ఏమీ వద్దు. ఇక్కడే ఉండు" అన్నారు.
"ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు. సుశీల నా కూతురు గానే పెరగాలి." అన్నాను నేను. నాన్నగారు కన్నీరు తుడుచుకుని "అలాగే" అన్నారు.
నా భార్య చనిపోయినట్టు మా వూరంతా సానుభూతి చూపించారు. కొంతమంది మళ్ళీ పెళ్లి చేసుకోమని సలహా చెప్పి చూశారు.
అక్కడ ఒక సంవత్సరం గడిపాను. నాన్నగారి అనారోగ్యం వయస్సుని ఆధారంగా తీసుకుని విజ్రుభించింది. జబ్బుతో తీసుకుని రెండు నెలలు తిరగక ముందే చనిపోయారు.
ఈసారి నేను ఏకాకిని కాను.
నన్ను "నాన్నా' అని పిలిచే సుశీల ఉంది. నాన్నగారూ పోతూ తన ఆస్తి అంతా సుశీల పేర పెట్టారు. సుశీల తండ్రిగా నేను ఆ ఆస్తిని అనుభవించేలా చేశారు.
నాన్నగారు పోయాక, ఇక ఆ వూళ్ళో ఉండబుద్ది కాలేదు. రమ ఎలా ఉందొ! ఎక్కడ ఉందొ!! ఒక్కసారి బొంబాయి వెళ్లి వెతికితెనో అనిపించింది. బొంబాయి వెళ్లి గాలించాను. బో,బొంబాయి లోనే ఒక ఉద్యోగం సంపాదించాను. ఒక సంవత్సరం పాటు అక్కడ ఉన్నాను. నా కంటికి రమ గాని, జాఫర్ గాని కనబడలేదు. మరో సంవత్సరం ఉండే సరికి బొంబాయి జీవితం మీద ఆశక్తి చచ్చింది. హైదరాబాద్ వెళ్లాను. మామయ్యా నన్ను చూసి చాలా ఆనందించాడు. "రమ ఉనికి తెలిసిందా' అని అడిగాను.
"దాని వూసేత్తక'" అన్నాడు తను.
నా భార్య చనిపోయిందని అత్తయ్య మామయ్య చాలా విచారించారు. "ఇంత చిన్న పిల్లని ఎలా పెంచుతావయ్యా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోరాదు" అన్నారు.
"చిన్నపిల్లల్నే గదా మనం పెంచేది. పెద్ద వాళ్ళను పెంచేదేముంది" అన్నాను. "అవును" అన్నాడు మామయ్య.
వాళ్ళింట్లో నాలుగు రోజులుండి హైదరాబాదు వదిలి విశాఖపట్టణం చేరాను. అక్కడ మరో ఉద్యోగం లో చేరాను. ఇక ఉద్యోగం మానకూడదని నిర్ణయించు కున్నాను. జీవితం కాస్త కుదుట పడింది అనుకోబోయే సరికి అవధానులు గారూ హటాత్తుగా చనిపోయారు.
ఆరుబైట మంచం మీద పడుకుని, దీపాల వేళ ప్రాణం వదిలేశారు. నాకున్న ఆ ఒక్క అండా కూడా పోయింది. ఇక నా జీవితం లో సంతృప్తి అనేది రాదా అని ఏడ్చాను. సుశీల ఆ భయంకర వాతావరణానికి భయపడి పోయింది.
నా రహస్యం ఎలాగో బయట పడింది. అయన రెండు నెలలు తిరక్కముందే సుశీల నా కూతురు కాదని ఇరుగు పొరుగులు అనేవరకు వచ్చింది. భయంతో నా శరీరం గజగజ లాడిపోయింది. ముద్దు ముద్దుగా సుశీల మాట్లాడే రోజుల్లోనే అనుమాన బీజాలు నాటారు. "నాన్నా! నువ్వు మా నాన్నని కాదుటగా" అంది సుశీల ఒకనాడు నా దగ్గరకు వచ్చి. నా శరీరం జీలర్చు కు పోయింది. ఇక ఆ వూళ్ళో ఉంటె చాలా ప్రమాదం అనిపించింది.
ఆరోజే ఎవరితో చెప్పకుండా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి మద్రాసు చేరాను. సుశీల నాన్నా అని పిలుస్తుంటే ఏదో బాధగా ఉండేది. సుశీలకు అన్యాయం చేస్తున్నాననిపించేది. నెమ్మదిగా "బాబాయి" అని పిలవడం చెప్పాను. మనని గురించిన విశేషాలు ఎవరికి తెలియ కూడదనుకుంటే ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకు" అనేవారు నాన్నగారు. ఆ పద్దతి అవలంబించాను. ఒక్క నెల్లాళ్ళు కష్టపడి ఒక కంపెనీ లో ఉద్యోగం సంపాదించాను.
జీవితంలో ఈసారి పూర్తిగా స్థిర పడినట్లే అనుకున్నాను. ఒక అరవ వంట మనిషిని పెట్టాను. సుశీల ని కాన్వెంటు లో చేర్చాను.
నా జీవితం దశ తిరిగింది.
ఉద్యోగం లో స్థిర పడడమే కాకుండా జీవితంలో కూడా స్థిర పడ్డాను. అదిగాకుండా సంవత్సరం తిరిగెలోగా ఉద్యోగం లో కొంత ప్రమోషను వచ్చింది.
సుశీలకి ప్రయివేటు మేష్టర్ని పెట్టి సంస్కృతం నేర్పించడం ప్రారంభించాను.
ఆ తరువాత ఆలోచించు కోవలసిన గుర్తుంచుకొదగిన విశేషాలు న జీవితంలో లేవు -- ఇప్పుడు సుశీల పుస్తకం లో ప్రేమలేఖ చూసేసరికి పది హేనేళ్ళ నుంచి స్థిమితంగా ఉన్న మనస్సు కలత పడింది.
మళ్ళా నాకు శని పట్టిందేమోననుకున్నాను.
ఈ పదిహేనేళ్ళ కూ మళ్ళీ ఈ నాడు నా మనస్సు కలత బారింది. జాఫర్ పేరు గుర్తుకు వచ్చింది. పెళ్లి బాజాలతో ఆరంభమయిన గతం -- గతమంతా చుట్ట చుట్టేసి, భవిష్యత్తు దగ్గర ఆగింది.

తెల్లవారింది. సుశీల మా యజమాని కొడుకు పుట్టిన రోజు పార్టీ సంగతి గుర్తు చేసి, "నా మహా బలిపురం ప్రోగ్రాం పోయింది" అంది.
సాయంత్రం ఇద్దరం వెళ్ళాము. అయన, ఆవిడ చాలా ఆప్యాయంగా పలకరించారు. నన్ను అయన తన చుట్టాలకు పరిచయం చేశారు. సుశీల వచ్చేవరకు ఆవిడ వెనకాలే ఉంది. రాత్రి పదిన్నర కు ఇంటికి వచ్చాము." "ఆవిడ చాలా మంచిదండి." అంది సుశీల. "అవునమ్మా" అన్నాను నేను.
* * * *
సుశీలకి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలి. వంట మనిషిని పిలిచి, "నేను మా వూరు వెళ్ళాలి. అమ్మాయిని జాగ్రత్త గా చూసుకో" అన్నాను. 'అలాగే బాబూ" అంది. సుశీల చిన్నతనం నుంచీ వంటమనిషి పని చేస్తోంది. చాలా మంచి మనిషి, నమ్మకస్తురాలు కూడా. సుశీలతో కూడా నా ప్రయాణం సంగతి చెప్పి విశాఖ పట్టణం వెళ్లాను సంబంధాలు చూడడం కోసం . నా విషయం తెలిసిన వాళ్ళు తెలియని వాళ్లకి చెప్పారు.
"వాళ్ళమ్మ లేచి పోయిందట! తండ్రి ఉరిపోసుకున్నాడట!! ఇతను బ్రహ్మచారిట!! అయన మేనమామ కూతురు సాయబు తో లేచి పోయిందట!!! అన్నమాటలు నా చెవికి సోకాయి. ఆనాడు పడ్డంత బాధ నేను ఎన్నడూ పడలేదు. వెధవ లోకం . ఎందుకలా ఆరాలు తీసి మనిషిని హింసించందే వూర్కోదు? వీళ్ళకేం వస్తుంది?
సుశీలకు సంబంధాలు చూడడం నా చేతకాని పనేమో అనిపించింది. భయం వేసింది. ఆ విషయం ఆలోచించుకుంటూ బీచ్ కి వెళ్లి కూర్చున్నాను. ఆలోచిస్తే తేలే విషయం కాకపోవడం వల్ల తెగ లేదు. ఏడున్నర వరకు బీచ్ లోనే ఉన్నాను. జనం పల్చబడ్డారు. నెమ్మదిగా లేచి, నడక ప్రారంబించాను.
ఒకచోట ఒకావిడ కూర్చుని ఉంది. ఆవిడ చాలా సేపటి నుంచి నాకేసి చూడడం చూశాను. ఆవిడ పక్కగా నడిచినపుడు ఆవిడ లేచి నిలబడి, "మీరు" అంది. వెంటనే నేనూ గుర్తు పట్టాను.
జయ!!
జయ నన్ను చూసి బ్రహ్మ నంద పడింది. "భగవంతుడు నాలో ఉన్నాడు. పాప ఏది? కులాసాగా ఉందా! ఎలా ఉంది? ఏం చేస్తోంది" అంటూ వెయ్యి ప్రశ్నలు వేసింది. అన్నిటికి సమాధానం చెప్పాను. తన కధ చెప్పింది.
'అయిపోయిందండి. ఇక చివరి దశ. అయన నన్ను వదిలేశారు. రెండేళ్ళ య్యింది. మళ్ళీ నాకు బిడ్డా పాపా లేరు. ఈ రెండేళ్ళూ మీకోసం తిరగని వూరు లేదు. చచ్చిపోయేలోగా మిమ్మల్ని కలుసుకోవాలి. పాపని చూడాలి అని నాలో ఆత్రం హెచ్చింది. ఎప్పుడో మీరు విశాఖపట్టణం , అవధాన్లు గారు అని ఏదో సందర్భం లో చెప్పారు. అది గుర్తుంచుకుని ఈ వూరు వచ్చాను. వాళ్ళింటి గుర్తులు యూనివర్శిటీ లో తెలుసుకుని ఇంటికి వెళ్లాను. వాళ్ళు సింహాచలం వెళ్లారట. తెల్లారి వస్తారని చెప్పారు. ఇంతలోకి మీరే కనుపించారు" అంది.
"అయితే సుశీల ని తీసుకు వెళ్లి పోతావన్న మాట నువ్వు. ఇంతకాలం దానికి తల్లిని, తండ్రిని కూడా నేనే అయ్యాను." అన్నాను. జయ తల అడ్డంగా వూపి, "లేదు. ఒక్కసారి చూస్తె చాలు. ఇక నాకు జీవితం లో ఏ ఆశా లేదు" అంది.
"మరొక విషయం -- సుశీల నా కూతురు గానే చలామణీ అవుతోంది . నేనే దానికి తండ్రిని" అన్నాను. నా కళ్ళ వెంట నీరు తిరిగింది. అంతమాట స్వార్ధమేమో అనిపించింది. జయ బాధ పడుతుందనుకున్నాను. కానీ "నేను తల్లినయినట్టు దానికి కలలో కూడా తెలియనివ్వను. ఒక్కసారి దానిని చూస్తె ఇక నేనీ తనువూ చాలించ వచ్చు" అంది కన్నీరు తుడుచుకుంటూ.
"ఛీ. అలాంటి మాటలనకు. నువ్వు కూడా మాతోనే ఉండవచ్చు. నీకు ఏ అడ్డూ లేదు" అన్నాను.
ఆ మర్నాడు ఇద్దరం మద్రాసు చేరాము.
జయని సుశీలకు పరిచయం చేస్తూ, "మన చుట్టాలు వీళ్ళు." అని చెప్పాను. నా మనస్సు అంతకు మించి చెప్పనివ్వ లేదు. జయ సుశీలని గమ్మున కౌగలించుకుంది. సుశీల అనుకోని ఆ సంఘటనకు ఉక్కిరిబిక్కిరి అయిపొయింది.
జయ ఇక్కడ ఉండడం మంచిది కాదని నా మనస్సు ఘోషించింది. సుశీల నా కూతురు . ఇన్నాళ్ళు పెంచి , ఇవాళ పరాయి వాడిగా అయిపోడానికి నా మనస్సు అంగీకరించలేదు.
ఆపూట వంట జయే చేసింది. తనని తను అదుపులో పెట్టుకుంటూ "నన్ను పిన్నీ అని పిలువమ్మా . పిన్ని వరస నేను" అంది. సుశీల "అలాగేనండి" అంది. "అండి అనకూడదు" అంది జయ. సుశీలకు కావలసినవి ఇష్టమైనవి అన్నీ వండింది.
"బాబయ్య గారూ! ఇన్ని రోజులకు మనం రుచైన వంట తింటున్నాం కదూ. వంట మనిషి చేసినా కూడా ఎన్నడూ రుచిగా లేదు. అందుకనే ఆప్యాయత, అనురాగం ఉండాలంటారు.' అంది సుశీల.
జయ కొంగుతో కన్నీరు వత్తుకుంది.
నాకు కంట నీరు తిరిగింది.
ఆ మర్నాడు జయ తను వెళ్ళిపోతానని చెప్పింది.
"దానిచేత అమ్మా అని పిలిపించు కోవాలని నాకు కోర్కె ఉంది. కానీ అది తీరదు. నాకా అదృష్టం వద్దు. నాలాటిది దానికి తల్లి అని లోకానికి తెలియకూడదు. దానికి కూడా తెలియకూడదు. తెలిసినా క్షమిస్తుందనే నమ్మకం నాకు లేదు.
