Previous Page Next Page 
పారిజాతం పేజి 9


    ఇంతలో భద్రీ ప్రసాద్- "అమ్మన్నులూ! ఏదీ! పాటా? డాన్సా? ఏమీ లేదే!" అన్నాడు.        సత్య నవ్వి, "సంగీతా! ఒక పాట పాడు" అని అంది. సంగీత పారిజాతం చెల్లెలని అక్కడున్న కొత్త వారందరికీ ఇందాకే తెలిసింది. అంతా ఉత్సుకతతో ఆ పిల్లవైపు చూశారు.
    సంగీత బెట్టు చెయ్యకుండా, అనవసరంగా సిగ్గు పడకుండా, "మనసంతా మానవులం, మన దంతా ఒకే కులం!" అంటూ చక్కగా పాడింది. పాట పూర్తి కాగానే అంతా చప్పట్లు కొట్టారు. భద్రీ ప్రసాద్ ఎంతో సంబరపడిపోయాడు. కృష్ణ మోహన్ మెచ్చుకోలుగా సంగీత వైపు చూసి, "అక్కగారూ! మన చెల్లాయి చాలా బాగా పాడుతుందండీ!" అని అన్నాడు.
    సత్య తమాషాగా - "చెల్లెలికంటే కూడా అక్క గారు చాలా చక్కగా పాడగలరు. అంతేకాదు, ఆమె పాడేది ఆమె వ్రాసిన పాటలే! కావలిస్తే అడగండి" అని కృష్ణ మోహన్ తో నవ్వుతూ అని తన చొరవకు తానే విస్తుపోయింది.
    "థాంక్స్, సత్యవతి గారూ! ఈ పరమ రహస్యం చెప్పినందుకు చాలా థాంక్స్. ఇట్లాగే మీకు తెలిసిన రహస్యాలన్నీ నాతో చెబుతూ ఉండండి" అన్నాడు నవ్వుతూ కృష్ణమోహన్.
    సత్యవతికి కృష్ణ మోహన్ కొత్తగానీ, కృష్ణ మోహన్ కు సత్యవతి కొత్తకాదు. రామనాథం, లలితల మూలంగా సత్య సంగతి తెలుసు. అన్నా వదినలకు దాసోహమ్మనక స్వతంత్రంగా తండ్రి బాధ్యత నెత్తిన వేసుకొన్న ఆత్మాభిమానం కల సత్యవతి అంటే కృష్ణకు ఎప్పటినుండో అభిమానం. అయితే సత్యవతిని ప్రత్యక్షంగా చూడడం మాత్రం ఇదే ప్రథమం.
    అతని చొరవకు సిగ్గుపడిన సత్య చూపు మరలించింది.
    "కానీయండి, అక్కగారూ! ఇక వేచి ఉండలేను! త్వరగా మీ కవిత్వాన్ని వినిపించండి!" అన్నాడు కృష్ణమోహన్ పారిజాతంతో.
    పారిజాతం హడావిడిగా- "తోటలో బందోబస్త్ అంతా బాగుందా?" అని అడిగింది.
    "ఎందుకట?" అర్ధం కాలేదు కృష్ణమోహన్ కు.
    "గాడిదలు లోపలికి రాకుండా, తమ్ముడూ!" పిల్లల నవ్వులతో తోటంతా ప్రతిధ్వనించింది.
    "అబ్బ! మాటలతో దాటేయకూడదు! త్వరగా కానీయండి, అక్కగారూ! పిల్లల డాన్స్ కూడా చూడాలి కదా ఇంకా!" అన్నాడు కృష్ణ.
    పారిజాతం పాడటం ఇంతవరకు పిల్ల లెవరూ వినలేదు. అంతా కుతూహలంగా చూస్తున్నారు.
    పాట ప్రారంభించింది పారిజాతం.
    "హేమంత నిశీథిలో,
    నీలి నీలి మబ్బులలో,
    అందమైన చందమామ
    తొంగి చూచు వేళ,
    చల్లగ జగతిని పవనుడు
    మెల్లగ జోకొట్టు వేళ,
    ఆకాశపు కౌగిలిలో
    అవని పరవశించు వేళ,
    ఈ ప్రకృతి సౌందర్యము
    నా గుండెలో నిండు వేళ,
    మధుర భావలహరిలోన
    మనసు తేలిపోవు వేళ,
    నా స్వప్న జగత్తులోన
    నీ రూపమె తోచువేళ,
    నా ఊహల పందిరిలో
    నన్ను నేను మరచు వేళ,
    ఇంకేమీ వలదు నాకు!
    ఈ క్షణమే శాశ్వతముగ
    ఇలపై ఇక నిలిచిపోనీ!"
    రెండు క్షణాలు సర్వ జగతి స్తంభించినట్లయింది. ఆ వెన్నెల వెల్లువలో మెల్లగా, హాయిగా, మధురంగా వచ్చే ఈ గానస్రవంతి అందరి మనసులనూ ప్రక్షాళితం చేసింది!
    అందరికంటే ముందు తెప్పరిల్లింది భద్రీ ప్రసాద్. ఏమీ పలకకుండా లేచి వచ్చి, నెమ్మదిగా పారిజాతం తలను ఎంతో వాత్సల్యంగా నిమిరాడు. సత్య కనులు చెమ్మగిలినాయి.
    సతీదేవి కన్నులలో నీరు ధారగా ప్రవహిస్తున్నది.
    పిల్లలు ఇంకా తేరుకోలేదు. తమ పారిజాతం టీచర్ ఇంత గొప్పగా పాడుతుందా?
    కృష్ణ మోహన్ అన్నాడు: "ఎంత చక్కని పాట! 'ఇంకేమీ వలదు నాకు, ఈ క్షణమే శాశ్వతముగ, ఇలపై ఇక నిలిచిపోనీ!' చక్కని కవిత్వం అల్లడమే కాకుండా, అంతకంటే చక్కని స్వరకల్పన చేశావు! నీ లాంటి అక్క లభించడం నా పూర్వజన్మ సుకృతం!" ఆ నిమిషంలో అతడు పారిజాతం తనకు కొత్త అనీ, "అక్కగారూ....మీరూ..." అంటూ మాట్లాడాలనీ మరిచిపోయినాడు.
    పారిజాతం చెవులకు "అక్కా!" అన్న కృష్ణ పిలుపు ఎంతో హాయిగా వినిపించింది. అందుకే-"ఇక నిన్ను 'తమ్ముడూ' అని పిలువనోయి! 'కృష్ణా' అని పిలుస్తాను. నువ్వు 'అక్కా' అని పిలు. ఈ అగ్రిమెంట్ ఇష్టమేనా?" అని అంది నవ్వుతూ.
    "అంతకంటేనా! మన ఈ ఒప్పందానికి సాక్షులు ఇటు మా అమ్మా, నాన్నా, అటు నీ స్నేహితురాలు సత్యవతిగారూ! ఏ మంటారండీ?" అంటూ సత్యను పలకరించాడు కృష్ణ.
    సత్య నవ్వింది. కాని జవాబేమీ ఇవ్వలేదు.
    పారిజాతం - "పిల్లలూ! ఇక మీ విద్య ప్రదర్శించండి. గురువును మించిన శిష్యులనిపించు కోవాలి!" అని అంది పిల్లలవైపు చూసి.
    సత్య అందుకొని, "తెలిసి పాడకపోయినా, వచ్చి డాన్స్ చెయ్యకపోయినా తల వేయి ముక్కలవుతుంది అని అంటుంది మీ పారిజాతం టీచర్! కాబట్టి వచ్చిన వాళ్ళంతా గబగబా కానివ్వండి" అని అంది.
    అంతా నవ్వారు. లలిత - "మా సత్యవతికి మాటలు రావేమో అని అనుకొన్నాము. మేలే! బాగానే మాటలు వస్తాయే!" అని అంది.
    "మన అమ్మణ్ణి నెమ్మదైన పిల్ల. బుద్దిమంతురాలు, చెల్లెమ్మా!" అన్నాడు భద్రీ ప్రసాద్.
    అప్రయత్నంగా కృష్ణవైపు చూసింది సత్య. అదే క్షణంలో అతడూ ఆమె వైపు చూచాడు. సత్య ముఖం సిగ్గుతో ఎర్రబడింది. అతని ముఖంలో చిరునవ్వు వెలిగింది. మరుక్షణంలో వారి చూపులు విడిపోయినవి. ఈ విషయం సతీదేవి మినహా మరెవ్వరూ గమనించలేదు. వారిద్దరినీ పరీక్షగా చూసిన సతీదేవి కన్నులలో తృప్తి కనుపించింది.
    "ఇక కానివ్వండి. కబుర్లతో తెల్లారేటట్లున్నది! ఊఁ! త్వరగా" అని పిల్లలను తొందరపెట్టింది పారిజాతం.
    పిల్లలు విద్యాప్రదర్శన ప్రారంభించారు. వాళ్ళు సరదాగా గ్రామ ఫోన్ రికార్డులు వెంట తెచ్చుకొన్నారు. కొంతమంది పిల్లలు రికార్డ్ పెట్టి డాన్స్ చేశారు. వాళ్ళలో ఎమిలీకూడా ఉంది. చక్కగా డాన్స్ చేసింది. మిగతా పిల్లలు పాటలు పాడారు.
    కోలాహలమంతా ముగిసేటప్పటికి దాదాపు పన్నెండున్నర దాటింది. తిరిగి, తిరిగి అలిసి ఉన్న పిల్లల కండ్లు మూతలు పడుతున్నాయి. సతీదేవి లేచి, "చాలా అలిసిపోయారమ్మా! ఇక మేడ మీదకు పోయి హాయిగా నిద్రపోండి" అని అంది. మాట రావడమే ఆలస్యంగా పిల్లలు బిలబిల్లాడుతూ పైకి పోయినారు.
    ఆ సందడిలో ఎప్పుడు వచ్చాడో ఏమో, రామనాథం-"సత్యా! రేపు నీవూ, నీ స్నేహితురాలూ మన ఇంటికి భోజనానికి రండి. తప్పించుకోవటానికి వీలులేదు. ఏం, లలితా! అసలు ఈ పిలుపు డ్యూటీ నీది! ఆ ఇద్దరినీ పిలు" అన్నాడు.
    అంతమందిలో తమ ఇద్దరినీ వేరుచేసి, భోజనానికి పిలుస్తున్న ఈ 'సంస్కారానికి' సత్య విస్తుపోయింది. వదినగారి కా మర్యాద కూడా తెలియలేదు! అందరినీ ఆహ్వానిస్తే కొండలాగా పేరుకు పోయిన ఆస్తి తరిగిపోతుందేమో! వేష భాషల్లో ఇద్దరూ పాశ్చాత్యులను తలదన్నేట్లున్నారు. 'పైన పటారం, లోన లొటారం!' అన్న సామెత గుర్తుకొచ్చి అసహ్యం లాంటి భావమేదో కలిగింది సత్యకు. కోపంకూడా వచ్చింది.
    తమాయించుకొని, "అన్నా! పదిమందితో కలిసి వచ్చాము గదా! మే మిద్దరమూ విడిగా వస్తే ఏం బాగుంటుంది! మరోసారి చూద్దాంలే!" అని అంది.
    "నువ్వంటే ఎప్పుడంటే అప్పుడు రావచ్చు కాని, మీ స్నేహితురాలు మళ్ళీ కనపడుతుందా? అదేం వీలుకాదు!" అన్నాడు.
    కోపంతో లలిత కళ్ళు ఎర్రబడ్డాయి. సిగ్గుతో సత్య కళ్ళు కిందికి వాలాయి. పారిజాతం కళ్ళలో హేళనతో కూడిన నవ్వు కనిపిస్తున్నది.
    "మళ్ళీ కనపకడ ఏమౌతాను, అన్నగారూ! మీ కోసం కాదనుకోండి. కానీ, మా తమ్ముడు... అపురూపంగా సంపాదించిన మా తమ్ముడు కృష్ణ కోసం రాక ఎక్కడికి పోతాను? ఇందాకనే బెదిరించాడుగా చాలా అల్లరివాడ'నని" అని అంది రామనాథంతో.
    "అన్నగారూ!", "మీ కోసం కాదనుకోండి" అన్న మాటలకు రామనాథం ముఖం నల్లగా మాడి పోయింది. లలిత ముఖం విప్పారింది. 'నీలాంటి వాళ్ళు నలుగురుంటే చాలు, ఈయన లాంటి వాళ్ళకు బుద్ది వస్తుంది!' అని మనస్సులో అనుకొంది.
    "సరే! మీ ఇష్టం!" అంటూ రామనాథం అడుగు ముందుకి వేశాడు. అతని వెంట లలితకూడా బయలుదేరింది.
    మరికొన్ని క్షణాల్లో ఆ ప్రదేశం ఖాళీ అయింది.
    ఆలోచనలతో నిద్ర పట్టక అటు ఇటు కదులుతున్న పారిజాతానికి ఎవరో మెల్లగా ఏడుస్తున్న ధ్వని వినిపించింది. జాగ్రత్తగా వింది. ఆ ఏడుపు అనంతలక్ష్మిది! నిద్రలో ఏడుస్తున్నదని ఊహించుకొని, పారిజాతం లేచి, "ఏమండీ, అనంతలక్ష్మి గారూ! లేవండి. నిద్రలో కలవరిస్తున్నారు!" అని కదిపింది. అనంతలక్ష్మి కళ్ళు తుడుచుకోవడంతో నిద్రలో కాదు, మేలుకొనే ఏడ్చుతున్నదన్న సంగతి గ్రహించి, ఏమీ పలకకుండా తన పక్కమీదకు పోయి పడుకొంది.

                                                  *    *    *

                 

    పారిజాతం, కృష్ణమోహన్ నవ్వుకొంటూ, ఏదో మాట్లాడుకొంటూ వస్తున్నారు. చుట్టూ అడవి. అడవి గులాబీలు గుత్తులు గుత్తులుగా విరబూచి ఉన్నాయి. ఏదో తీగ అడవిలో చెట్లకొమ్మ లన్నింటినీ చుట్టుతున్నది. దానినిండా ఎర్ర పూలగుత్తులు. మరో పక్క పెద్ద కొండ. కొండమీదనుండి ఎవరో ఇద్దరు కిందికి దిగుతున్నారు. వాళ్ళు రామనాథం, అనంతలక్ష్మి అని లీలగా తోచింది. చూస్తూ ఉండగానే రామనాథం చెయ్యి తాకి, అనంతలక్ష్మి ముందుకు తూలి, కాలు జారి, కిందకు దొర్లుకొంటూ వస్తున్నది. ఆపటానికి కూడా ప్రయత్నించకుండా రామనాథం తాపీగా సిగరెట్ తాగుతూ అలాగే నిలుచుండినాడు. భయంతో, కోపంతో కంపించిపోతూ సత్య-"ఛీ! దుర్మార్గుడా! రాక్షసుడా! ఆ అమ్మాయిని పడగొట్టావు! నీకు పుట్టగతులు ఉండవు! నీ లాంటి పశువు అన్నగా కావటానికి ఎంత పాపం చేసుకొన్నావో!" అని కేకలు వేస్తూ ముందుకు పరుగెత్తింది. తన కేకలు విని కృష్ణా, పారిజాతం కూడా అటువైపే పరుగెత్తారు. ఆ పరుగెత్తటంలో పారిజాతం కాలికి రాయి తగిలి ముందుకు పడింది. తలమీద గాయమై రక్తం స్రవిస్తున్నది. "పారిజాతం!" అని తానూ, "అక్కా!" అంటూ కృష్ణా, "నా తల్లీ! ఎంత పని జరిగిందమ్మా!" అని రోదిస్తూ సతీదేవి పరుగెత్తుకు వచ్చారు. "మీ రెవరూ రావద్దు నాకు పిచ్చెక్కుతున్నది. నేను పోతున్నాను!" అంటూ పారిజాతం దూరంగా పరుగెత్తింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS